telangana statement
-
తెలుగువారికి చిదంబరం కొత్త ‘చిచ్చు’
ఇటీవల చిదంబరం తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు ఒక విలేకరి– 2009 డిసెంబర్ 9న అర్ధరాత్రి ‘ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేస్తున్నట్టు చారిత్రాత్మక ప్రకటన చేయడానికి సరిగ్గా 12 గంటల ముందు తలుపులు మూసి ప్రకటించడం వెనుక అసలు జరిగిన కథేమిటో వెల్లడించగలరా?’ అన్న ప్రశ్నకు ఆయన ఓ చిరునవ్వు నవ్వి ‘అదిప్పుడు చెప్పను, ఆ రహస్యాన్ని నేను రాయబోయే స్మృతుల గ్రంథానికి భద్రపరచుకోనివ్వండి’ అని ప్రకటించాడు. నాడు కేంద్ర, రాష్ట్ర నాయకులు తెలుగు ప్రజలపై తమ పట్టు కోసం ఆడిన ప్రజా వ్యతిరేక నాటకం పూర్తిగా వెల్లడి కావటం భావి తరాలకి కూడా చాలా అవసరం. ఒక వైపున ఇల్లు కాలుతుంటే మరొకవైపున ఆ కాలి కూలిపోతున్న ఇళ్లవద్ద బొగ్గులేరుకునే వాళ్లు ఉంటారన్నది తెలుగువారి సామెత. నిప్పంటించిన వాడే నీతులు వల్లించడం లోకవిదితమే. స్వతంత్ర భారత దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించిన ఆంధ్రదేశం ఉమ్మడి మద్రాసు రాష్ట్రం (పరాయి పాలనలో) నుంచి విడివడి స్వపరి పాలన కొనసాగిస్తూ వచ్చింది. పరాయిపాలనలో చెట్టుకొకరు, పుట్టకొకరుగా చారిత్రక కారణాల వల్ల రెండు ప్రాంతాలుగా చెల్లాచెదరుగా ఉన్న ఆంధ్ర–తెలంగాణలను ఏకీకృత ఉమ్మడి తెలుగు రాష్ట్రంగా ఏర్పరుచుకోవాలన్న ఇరుప్రాంతాల చిరకాల వాంఛ చివరికి సువిశాల ఆంధ్రప్రదేశ్‌గా 1956లో అవతరించి మనుగడ సాగిస్తూ వచ్చింది. రాజకీయ పార్టీలు, వాటి నాయకుల స్వార్థప్రయోజనాల ఫలితంగా తెలుగుప్రజలకు ఎలాంటి కష్టనష్టాలు ఎదురవుతాయో ఉద్యమ నాయకుడు, ప్రజా కవి కాళోజీ ఏనాడో హెచ్చరించాడు. నాయకులు అమాయక ప్రజల్ని ‘గొర్రెలుగా భావించుతున్నార’ని చెప్పాడు. ముందుగానే హెచ్చరిం చాడు. ‘ఉపేక్షా భావం’ చాలా ప్రమాదకరం అని కూడా ముందస్తు దండోరా వేశాడు! ఈ గొర్రె మనస్తత్వం ఎలాంటిదో వివరిస్తూ కాళోజీ తన తరానికే కాకుండా, భావితరాలకూ ఇలా వివరించాడు: ‘గొర్రె మనస్తత్వాన్ని ప్రజలు ఉపేక్షాభావం వల్ల ఎంతగా నమ్ము తున్నారంటే– కాడిని చేతబట్టంగానే ఎద్దు తనంతట తానే వచ్చి దాని కింద తలపెట్టుతది. అట్ల బానిసత్వానికి స్వయంగా ప్రజలు లొంగుతు న్నారు. ఇదెలాంటిదంటే గొర్రె మందల బడి మురుస్తాంది. ఆ మురిపెంతో తెగ బలుస్తాంది. కనుకనే బయళ్ల గడ్డి గొల్లన్నే మొలిపిస్తాండను కుంటాంది గొర్రె. సెలయేళ్ల నీళ్లన్నీ గొల్లన్నే ఒలికిస్తాండనుకుంటాంది గొర్రె. గొల్లన్న గొంగడిబొచ్చే తన పెయి (శరీరం) నిండా మొలిపిస్తాడనుకుంటాంది గొర్రె. కాని ఈ పరిస్థితి ఇక మారాలి!’ కానీ అలా మారకపోబట్టే కేంద్ర పాలకుల నుంచి రాష్ట్రాల పాలకుల దాకా ఆంధ్ర–తెలంగాణలు రెండింటా పాలకుల మోసపూరిత ప్రకటనల వల్లా, అక్కరకోసం ఇస్తున్న పెక్కు హామీల వల్ల 70 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా ప్రజలు దఫదఫాలుగా వంచనకు గురవుతున్నారు. తెలుగుప్రాంతంలో ఈ మోసపూరిత హామీల పరంపరను కనిపెట్టిన స్వీడిష్ ప్రధాని, స్వీడన్ ఆర్థిక మంత్రి ఆనాటి తమ ఏపీæ పర్యటనలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనలు, హామీలు విన్న తర్వాత (హైదరాబాద్ పత్రికా గోష్టిలో) మాట్లాడుతూ ‘‘మా స్వీడన్లో ఇలాంటి హామీలను ఎన్నికల ఉపన్యాసాలలో ప్రకటిస్తే, ఆ నాయకులు జైలుకు వెళతారు లేదా వారిని పిచ్చాసుపత్రికన్నా పంపుతాం’’ అని ప్రకటించాల్సి వచ్చింది! ఈ మోసాన్ని ఇప్పటికీ మన నాయకులు మానుకోలేకపోతున్నారంటే కారణం– వాళ్లు ‘ప్రజల్ని గొర్రెలుగా’ భావించబట్టేనని మర్చిపోరాదు. ఇందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తమ స్వార్థ ప్రయోజనాల కోసం నిట్టనిలువునా విభజించి, తెలుగు ప్రజల్ని కేంద్రపాలకుల నుంచి, రాష్ట్ర పాలకుల దాకా చీల్చడమే నిదర్శనం కాగా, అది రాజకీయులు ఆడిన నాటకీయమైన వంచన. ఉమ్మడి ఏపీ విభజనకు బీజాలు నాటి పెంచిన కేంద్రం దానితో పాటు ఉభయ ప్రాంతాల నాయకులు తిరిగి మరో సరికొత్త ‘డ్రామా’కు తెరలేపుతున్నారనిపిస్తోంది! ఏ కారణం వల్లనైతేనేమి విభజించిన వారు ఆ విభజన పట్ల ఇప్పుడు ఎన్నికల సందర్భంగా తాపీగా ఆలోచించి, నిన్నటి విభజనకు ఎవరు దోహదం చేశారన్న కొత్త మీమాంసకు కేంద్ర మాజీమంత్రి చిదంబరం తెరలేపే ప్రమాద సూచన కనిపిస్తోంది. 2009 డిసెంబర్ 9 అర్ధరాత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను చీల్చి రెండు తెలుగు రాష్ట్రాలుగా (ఆంధ్ర–తెలంగాణ) విభజిస్తున్నట్లు కేంద్రంలోని కాంగ్రెస్ పాలకుల తరఫున చిదంబరం ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు. 70 ఏళ్లు పైబడిన స్వతంత్ర భారత చరిత్రలో సర్వరంగాలనూ కార్పొరేట్ రంగ స్వేచ్ఛా దోపిడీకోసం పాలకులు ఆర్థిక వ్యవస్థ ద్వారా లను బాహాటంగా తెరిచారు. ఇందులో భాగంగానే భాషాప్రయుక్త రాష్ట్రాల స్ఫూర్తిని చెల్లాచెదురు చేసి, ప్రజల మధ్య చీలికలు పెట్టే తంపుల మారి రాజకీయ వ్యవస్థను పెంచి పోషించారు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం మరొక తగాదాకు తెరలేపబోతున్నారా అన్న అనుమానానికి చిదంబరం దోహదపడు తున్నారనిపిస్తుంది. ఇటీవల చిదంబరం తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు ఒక విలేకరి– 2009 డిసెంబర్ 9న అర్ధరాత్రి ‘ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేస్తున్నట్టు చారిత్రాత్మక ప్రకటన చేయడానికి సరిగ్గా 12 గంటల మందు తలుపులు మూసి ప్రకటించడం వెనుక అసలు జరిగిన కథేమిటో వెల్లడించగలరా?’ అన్న ప్రశ్నకు ఆయన (చిదంబరం) ఓ చిరునవ్వు నవ్వి ‘అదిప్పుడు చెప్పను, ఆ రహస్యాన్ని నేను రాయబోయే స్మృతుల గ్రంథానికి భద్రపరచుకోనివ్వండి’ అని ప్రకటించాడు (బయటపెట్టని కథ– December 9th story remains untold: ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వార్త: 23–11–2018) నిజానికి సోనియా–చిదంబరం పెట్టిన చిచ్చును ఆనాడు ద్రవిడ నాయకుడు కరుణానిధి ఖండిస్తూ, ‘నీకు మతిపోయిందా? ఇక్కడ దక్షిణ తమిళనాడు రాష్ట్రం నుంచి విడిపోవాలంటూ ఛాందసుల ఉద్యమం సాగుతున్న దశలో తెలుగు వారి విభజనను సమర్థించడం తగునా’ అని ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిననాటి సన్నివేశం అది. ఆనాటి దీక్ష వెనుక గాథకు సంబంధించిన ఆ రహస్య మేదో చిదంబరం చెబితేగానీ మనకు తెలియదు. అంటే కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు తెలుగు ప్రజలపై తమ పట్టు కోసం ఆడిన ప్రజా వ్యతిరేక నాటకం పూర్తిగా వెల్లడికావటం భావి తరాలకి కూడా చాలా అవసరం. ‘తెలుగుదేశం’ పార్టీ వ్యవస్థాపకుడు, ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా కుట్రపన్ని పదవినుంచి కృత్రిమంగా తప్పించి, అధికారం చేపట్టిన చంద్రబాబు తన పరిపాలన కూడా ముగిసిపోయి అవకాశం కోసం చుక్కలు లెక్కించుకుంటూ కుట్రలతో కాలక్షేపం చేస్తున్న సమయంలో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారం చేపట్టారు. రెండోసారి గెలిచిన కొన్ని నెలల్లోపే ఆయన హెలికాప్టర్ దుర్ఘటనలో అనుమానాస్పదంగా చనిపోయారు. దీంతో తమ జీవితాలను వెలిగించిన వైఎస్సార్ ప్రజాహిత, సంక్షేమ పథకాలు ఇక తమకు దక్కవని భావించి, బెంగటిల్లిన ఆంధ్ర–తెలంగాణలలోని వందలాది ప్రజలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పుడు వైఎస్ జగన్ లబ్ధిదారుల కుటుంబాలను ఓదార్చడం కోసం తలపెట్టిన ‘ఓదార్పుయాత్ర’కు సోనియా అడ్డుకట్ట వేయడమే కాకుండా, జగన్ భవిష్యత్ ప్రగతి మార్గాన్ని నిరోధించేందుకు రుజువుల్లేని కేసులలో ఇరికించి జైలుపాలు చేసింది. అయినా, తన కుట్ర జీవితాన్ని చంద్రబాబు కాంగ్రెస్‌తోనే ప్రారంభించి, మధ్యలో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి తిరిగి ఇప్పుడు అకస్మాత్తుగా బయల్దేరిన చోటునే (కాంగ్రెస్‌తో) చేరి చేతులు కలిపి, తన అవి నీతికి తెరగా జగన్‌పై కక్షతో పొత్తులు పెట్టుకున్నాడు. ఈమధ్య కాలంలో నాలుగున్నరేళ్లు నీతి నియమాలకు తిలోదకాలు వదిలి ఆపద్ధర్మంగా బీజేపీ–ఎన్డీఏతో అంటకాగి, ఏపీ భవిష్యత్తును తన పదవీ కాంక్షతో అంధకారంలోకి నెట్టాడు బాబు. పదవికి దూరమై ఉన్న చంద్రబాబు అయోమయ విభజనలో ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్న ఆబ కొద్దీ ప్రత్యేక ప్రతిపత్తి షరతును వదులుకుని, విభజనకు సోనియా, చిదంబరంలు ఎక్కడ పెట్టమంటే అక్కడ బేషరతుగా సంతకం చేసి వచ్చాడు. ఇదే అదనుగా పార్లమెంట్ తలుపులు మూసేసి బలవంతంగా కాంగ్రెస్–బీజేపీలు కుమ్మక్కయి తెలుగు ప్రజలను చీల్చేశారు. ఆ తరువాత బీజేపీ.. ‘మేం వస్తున్నాం. ఆ ప్రత్యేక ప్రతిపత్తిని కొత్త ఆంధ్రప్రదేశ్‌కు మేం ప్రకటిస్తామ’ని చెప్పినా తీరా మొండిచేయి చూపి, ‘ప్రత్యేక ప్యాకేజీ’ ఇస్తాంలెద్దూ అని నమ్మించి మోసగించారు. ‘ప్రత్యేక ప్రతిపత్తి’ హోదా అన్నది వెనుకబడిన కొండ ప్రాంతాలు, గిరిజన ఏరియాలకు తప్ప మరెవరికీ కల్పించరాదన్నది జాతీయాభివృద్ధి కౌన్సిల్ (ఎన్.డి.సి.) నిర్ణయం. అసలు ఈ ఎన్డీసీ సమావేశం జరపా లని కూడా చంద్రబాబు కోరలేదు. తీరా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తరువాత జరిగిన పని ఏమిటంటే, ‘ప్రతిపత్తి’ని కాస్తా బాబు విస్మరించి బీజేపీ పాలనలో భాగస్వామి అయి అరకొర ప్యాకేజీ ‘క్యాబేజీ’తో సరిపెట్టుకున్నాడు. ఇక ఎప్పుడైతే వైఎస్ జగన్ పార్టీ ఏపీలో చంద్రబాబు పాలనకు బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా దూసుకుపోతూ ప్రజా సంకల్పయాత్రతో ప్రభుత్వాన్ని ఏర్పరచబోతున్న వాతావరణాన్ని రాష్ట్ర వ్యాపితంగా నిరూపించే దశకు చేరుకోవడంతో బాబు ఉన్నట్లుండి మోదీ ప్రభుత్వం నుంచి వైదొలగినట్టు కొత్త నటన మొదలెట్టేశాడు. ‘ఇటలీ దయ్యం’, ‘తక్షణం ఇటలీకి పంపించేయాలం’టూ సోనియాగాంధీని గతంలో దూషిస్తూ వచ్చిన చంద్రబాబు తాజా ‘ఊసరవెల్లి’ వేషంలో అదే సోనియా–రాహుల్ కాంగ్రెస్‌తో పొత్తు కలిసి ఎన్నికల బరిలోకి నిస్సిగ్గుగా దిగబోతున్నాడు! ఓటమిని చవిచూడబోతున్నాడు! - ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఏడాదంతా సందడే
ఎమ్మెల్సీ ఎన్నికలతో మొదలైన రాజకీయ సందడి ఈ ఏడాదంతా కొనసాగింది. సహకార, పంచాయతీ ఎన్నికలు, తెలంగాణ ప్రకటనకు ముందూ వెనకా కొనసాగిన ఆందోళనలు, మారిన పార్టీల సమీకరణాలు జిల్లా రాజకీయాలను ఆసక్తికరంగా మార్చాయి. ప్రధాన పార్టీల ముఖ్యనేతల పర్యటనలు, సమావేశాలు ఆయా పార్టీల శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. అధికార పార్టీ ఆధిక్యాన్ని నిలబెట్టుకోగా తెలంగాణ ఉద్యమం, నేతల వలసలతో టీఆర్ఎస్ సత్తా చాటింది. తెలుగుదేశం పార్టీ బాగా దెబ్బ తినగా, ఉద్యమంలో క్రియాశీల భాగస్వామ్యం, నరేంద్రమోడీ ప్రభావంతో కమలం వికసించింది. - సాక్షి, కరీంనగర్ ఈ ఏడాది భారతీయ జనతా పార్టీకి బాగా కలిసివచ్చింది. తెలంగాణ జేఏసీలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్న బీజేపీ టీఆర్ఎస్కు దీటుగా జనంలోకి వెళ్లింది. జేఏసీ కార్యక్రమాలతోపాటు సొంతంగా కూడా కార్యక్రమాలు చేపడుతోంది. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయినుంచి కార్యాచరణ తీసుకుంది. హైదరాబాద్‌లో మోడీ సభకు జిల్లానుంచి భారీగా యువతను తరలించింది. నరేంద్రమోడీ పట్ల పెరుగుతున్న సానుకూలతతో పార్టీలోకి వలసలు కూడా పెరిగాయి. ఇంకా పలువురు కీలక నేతలను చేర్చుకునేందుకు మంతనాలు సాగిస్తున్నారు. ఈ ఏడాదిలోనే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా జిల్లాకు చెందిన పి. మురళీధరరావును నియమించారు. ఆయన జిల్లాలో వివిధ వర్గాలను ఆకర్షించేలా సదస్సులు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సైతం పలుమార్లు జిల్లాలో పర్యటించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు వెంకయ్యనాయుడు సైతం జిల్లాలో పర్యటించారు. రైతు సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ ఎదుట దీక్ష చేశారు. పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా కార్యకర్తలు భారీగా తరలివస్తుండడం నేతను ఉత్తేజపరుస్తోంది. పార్టీ బలోపేతంపై వైఎస్సార్సీపీ దృష్టి సారించింది. సహకార, పంచాయతీ ఎన్నికలను ఎదుర్కొంది. పలు పంచాయతీలను కైవసం చేసుకుని సత్తా చాటింది. పంచాయతీ ఎన్నికలకు ముందుకు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జిల్లాలో పర్యటించారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేశారు. అంతకుముందు అదే నెలలో నేత కార్మికుల్లో భరోసా నింపేందుకు సిరిసిల్లలో పర్యటించారు. విజయమ్మ పర్యటనలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి. తెలుగుదేశం పార్టీకి ఈ ఏడాది కలిసిరాలేదనే చెప్పాలి. ఆ పార్టీ చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. గతేడాది చివర్లో జిల్లాలో పాదయాత్ర చేసిన చంద్రబాబు ఇక్కడి నుంచే అఖిలపక్షానికి లేఖ పంపారు. తమ వల్లనే తెలంగాణ ప్రక్రియ ముందుకు వెళ్తోందని చెబుతూ వచ్చిన టీడీపీ నేతలు తాజా పరిణామాలపై మౌనం వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు సమన్యాయమని, విభజన ఆపాలని ప్రకటించడం... జిల్లా నాయకులకు ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెడుతోంది. చంద్రబాబు ఈ ఏడాది కనీసం జిల్లాకు కూడా రాలేదు. ఆయన జిల్లాలో అడుగుపెట్టే పరిస్థితులు కూడా లేకపోవడం ఆ పార్టీ పరిస్థితి చెప్పకనే చెబుతోంది. పార్టీ తీరు మీద నేతల్లో అసహనం పెరుగుతోంది. ఇందులో భాగంగానే గంగుల కమలాకర్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ అధిష్టానం మీద క్యాడర్‌లోనూ అసంతృప్తి ఉన్నా బయట పడడం లేదు. దీనికి నేతల మధ్య సమన్వయం లోపమే కారణం. గంగుల రాజీనామా చేసి ఇంతకాలమైనా కరీంనగర్‌కు ఇన్చార్జీని నియమించలేకపోయారు. మరికొన్ని నియోజకవర్గాలకు కనీసం ఇన్చార్జి ఎవరూ దొరకని పరిస్థితి. ఇటీవల నాలుగు చోట్ల ఇన్చార్జీలను నియమించినా వివాదాస్పదమయ్యాయి. రామగుండం ఇన్‌చార్జీగా వ్యవహరించిన గోపు అయిలయ్య యాదవ్ పార్టీని వీడారు. పార్టీ వైఖరి, అధినేత తీరుైపై పెరుగుతున్న వ్యతిరేకత పార్టీ నేతలను కలవరపెడుతోంది. నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసే పెద్ద నాయకుడే జిల్లాకు కరువై పోయారు. బాబ్లీ ప్రాజెక్టుపై నిర్వహించిన ఆందోళనకు టీటీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరయ్యారు. జిల్లాలో టీడీపీ తరఫున అదే పెద్ద కార్యక్రమంగా నిలిచింది. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తున్నా ఆ మేరకు రాజకీయంగా లబ్ధి పొందడంలో ఆ పార్టీ జిల్లా నాయకత్వం ఆశించిన ఫలితాలను పొందలేకపోయింది. శాసనసభకు బిల్లు వచ్చిన సందర్భంలో జిల్లా మంత్రి శ్రీధర్‌బాబు, సీమాంధ్ర నేతల తీరును ఎండగట్టడంలో ఎంపీ పొన్నం ప్రభాకర్ గట్టిగా వ్యవహరించినా జిల్లాలో పార్టీ పరంగా ఎలాంటి లబ్ధి చేకూరలేదు. అంతర్గత విభేదాలు నియోజకవర్గస్థాయికి చేరడం పార్టీని వేధిస్తోంది. ఫిబ్రవరిలో జరిగిన సహకార ఎన్నికల్లోనూ జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కొంత కష్టం మీదే ఆధిక్యాన్ని నిలబెట్టుకోగలిగింది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలను దక్కించుకుంది. శాసనసభ కోటాలో సంతోష్‌కుమార్‌కు శాసనమండలి సభ్యత్వం లభించింది. ఫిబ్రవరిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ రికార్డు విజయాలతో దూకుడు ప్రారంభించింది. పట్టభద్రుల స్థానం నుంచి స్వామిగౌడ్, ఉపాధ్యాయ స్థానం నుంచి సుధాకరరెడ్డి విజయం సాధించారు. తెలుగుదేశం నుంచి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కాంగ్రెస్ నుంచి పెద్దపల్లి ఎంపీ వివేకానంద రెండు నెలల వ్యవధిలోనే టీఆర్ఎస్లో చేరడంతో పార్టీ బలోపేతమైంది. సహకార, పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు దీటుగా విజయాలు సాధించింది. సీడబ్ల్యూసీ ప్రకటన తరువాత తెలంగాణ ఏర్పాటు ఘనత చేజారకుండా టీఆర్ఎస్ తాపత్రయపడుతోంది. ఆంక్షలు లేని తెలంగాణే కావాలంటూ కాంగ్రెస్‌ను ఇరుకున పెడుతోంది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ జిల్లాలో పలు సభలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో జోష్ కలిగిస్తున్నారు. -
'తెలంగాణ' ప్రకటనకు నేను బాధ్యుడిని కాదు: చిదంబరం
ఢిల్లీ: తెలంగాణాపై డిసెంబర్ 9, 2009లో తాను చేసిన ప్రకటనకి సంబంధించిన పరిణామాలు, విపరిణామాలు వేటికైనా కేంద్ర యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలదే పూర్తి బాధ్యత అని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. సదరు ప్రకటన తన సొంతమైనట్లు ప్రముఖ పాత్రికేయుడు ఎంజె అక్బర్ రాసిన ఒక కాలమ్‌లో వ్యాఖ్యానించడాన్ని ఒక జాతీయ ఆంగ్ల దినపత్రికకి రాసిన లేఖలో చిదంబరం ఖండించారు. "అటు ప్రధానీ, ఇటు పార్టీ నాయకత్వం అనుమతి లేకుండా హోమ్ మంత్రి అటువంటి విధానపరమైన కీలక ప్రకటన చేయగలరా?" అని చిదంబరం ఎదురు ప్రశ్నించారు. అయితే, అక్బర్ తన వ్యాసంలో పేర్కొన్న ప్రధానాంశం గురించి చిదంబరం మాట మాత్రం కూడా ప్రస్తావించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర విభజన అంశాన్ని అక్బర్ తన కాలమ్‌లో ప్రముఖంగా చర్చించారు. రాష్ట్రాల విభజన అనే విషయాన్ని మూలాల్లోంచి ఆయన చర్చకి పెట్టారు. ముఖ్యంగా తెలంగాణపై మాట్లాడుతూ, ఒక ఆర్థిక అంశాన్ని రాజకీయాంశంగా చూసి, కలగాపులగం చేయకూడదని గ్రహించిన ఏకైక ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమేనని ఆంటారు అక్బర్. "ఆంధ్రప్రదేశ్‌ని పాలించిన ముఖ్యమంత్రులు ఎందరో ఉన్నారు. కొందరు హీరోలు, మరికొందరు జీరోలు కూడా. కానీ, వారందరిలో తెలంగాణ సమస్య మూలాల్ని అర్థం చేసుకున్నది రాజశేఖర రెడ్డి ఒక్కరే. ఆయన ఆరేళ్ల హయాంలో తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర డిమాండు తలెత్తనే లేదు. ఎందుకంటే, ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు," అన్నారు అక్బర్. రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ దుర్ఘటనలో కన్నుమూశాక, రాష్ట్రం అరాచకమైపోయిందన్నారు. ఆరిన కుంపటిని అప్పటి కేంద్ర హోమ్‌మంత్రి చిదంబరం మళ్లీ రాజేశారని, దాని వల్ల ఆత్మహత్యలకి ఆంధ్రప్రదేశ్ ఆలవాలమైపోయింద న్నారు. ఆ ప్రకటన వల్ల చిదంబరం బాగానే ఉన్నారని, రాష్ట్రమే రావణ కాష్ఠమయ్యిందని అక్బర్ తన వ్యాసంలో విమర్శించారు. రాష్ట్రం తగలబడిపోతుంటే, ప్రజలు రోడ్డెక్కి నినదిస్తున్నా కూడా యూపీఏ ప్రభుత్వం, సోనియా, రాహుల్ ..నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నారన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా దిగ్విజయ సింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ మరొక గ్రహం అన్నట్టు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారని అక్బర్ వ్యాఖ్యానించారు. చిదంబరం చేసిన ఆ తప్పిదానికి రాష్ట్రం నాలుగేళ్లుగా ఎంతో నష్టపోతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్తమానం మీద అక్బర్ చేసిన వ్యాఖ్యల గురించి విభేదించని చిదంబరం, దానికి తనని బాధ్యుడ్ని చేయడాన్ని మాత్రం ఖండించారు. తద్వారా, ఈ సంక్షోభ స్థితికి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాలే కారణమని అక్బర్ చేసిన విమర్శని చిదంబరం పరోక్షంగా అంగీకరించారు. -
క్యాంపు ఆఫీస్‌కు పరిమితమైన కిరణ్
ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారు. అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. రవీంద్రభారతిలో గురుపూజోత్సవం కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నా వెళ్లలేదు. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ ప్రకటన నేపథ్యంలో సీఎం కిరణ్ పలుమార్లు ఢిల్లీ వెళ్లారు. తెలంగాణ హైకమాండ్ నిర్ణయాన్ని మార్చేందుకు ప్రయత్నించారు. సీమాంధ్ర ప్రాంతంతో పెద్ద ఎత్తున జరుగుతున్న సమైక్య ఉద్యమం గురించి అధిష్టానికి వివరించారు. రాష్ట్ర విడిపోతే ఎదురయ్యే సమస్యల గురించి కోర్ కమిటీ, ఆంటోనీ కమిటీ, అధిష్టాన పెద్దల ముందు ఏకరువు పెట్టారు. అయితే విభజనకు నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని, వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదని హైకమాండ్ స్పష్టం చేయడంతో ఆయన అధికార కార్యక్రమాలకు అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పోటాపోటీ ఆందోళనలు చేస్తుండడంతో సచివాలయానికి రావడం బాగా తగ్గించేశారు. కాగా, ప్రధాన కార్యదర్శి పీకే మహంతి, డీజీపీ దినేష్ రెడ్డి ఇవాళ సీఎం కిరణ్‌ను కలిశారు. 7న హైదరాబాద్‌లో జరిగే ఏపీఎన్జీవో సభపై చర్చించారు. అంతకుముందు మంత్రులు పితాని సత్యనారాయణ, విశ్వరూప్ కూడా కిరణ్‌తో సమావేశమయి ఢిల్లీ పర్యటనలో చర్చించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. -
కిరణ్ వ్యాఖ్యల్లో నిజం లేదు: శంకర్రావు
కిరణ్.. సీమాంధ్ర సీఎంలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి శంకర్రావు విమర్శించారు. అధిష్టానం నిర్ణయానికి కాంగ్రెస్ నేతలంతా కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సెలవిస్తారన్న సీఎం వ్యాఖ్యల్లో నిజం లేదని అన్నారు. 1955 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ ఓటు శాతం 30శాతం పైనే ఉందని తెలిపారు. చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో వ్యవహిస్తున్నారని శంకర్రావు దుయ్యబట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించిన చంద్రబాబు.. ఇప్పుడు సీమాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకే మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) మద్దతు ఇస్తుందని శంకర్రావు అంతకుముందు చెప్పారు. బీజేపీ నేతలకు తెలంగాణపై మాట్లాడే హక్కు లేదని అన్నారు. -
ప్రత్యేక తెలంగాణతోనే అభివృద్ధి
మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమని మంచిర్యాల ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్రం తెలంగాణ ప్రకటన చేసిన తర్వాత సీమాంధ్ర నాయకులు అడ్డుకోలేరన్నారు. తెలంగాణ ఏర్పాటుతో ప్రధానంగా తూర్పు ప్రాంతంలోని మంచిర్యాల మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. శ్రీరాంపూర్, మందమర్రి సింగరేణి ఏరియా పరిధిలో దాదాపు 15 నూతన గనులు త్వరలోనే ఏర్పాటవుతాయని, వీటితో ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. 5 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదక కేంద్రం కూడా ఏర్పాటు కానుందని చెప్పారు. కొమురం భీం జిల్లాగా మంచిర్యాల.. తెలంగాణ ఏర్పాటుతో మంచిర్యాల జిల్లా ఏర్పడుతుందని, దీనికి కొమురం భీం జిల్లాగా నామకరణం చేసేలా చూస్తామని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లాలో వర్షాపాతం కూడా అధికంగా ఉన్నందున గిరిజన ప్రాంతాల్లో సాగు నీరు, తాగు నీరు పుష్కలంగా అందుతుందన్నారు. మంచిర్యాల కేంద్రంగా 80 కిలో మీటర్ల పరిధిలో దాదాపు 2.50 లక్షల జనాభా ఉందని, కార్పొరేషన్‌గా ఏర్పాటైతే మంచిర్యాల తెలంగాణలో ఆదర్శవంతమైన జిల్లా అవుతుందన్నారు. అలాగే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయానికి సీమాంధ్ర నేతలు కట్టుబడి ఉండాలన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని అన్నదమ్మల్లా వీడిపోయేలా సహకరించాలని కోరారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ కృష్ణారావు, పట్టణ అధ్యక్షుడు కల్వల జగన్మోహన్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్లు సుదమల్ల హరికృష్ణ, బొలిశెట్టి కిషన్, మాదంశెట్టి సత్యనారాయణ, నాయకులు సుంకరి రమేశ్, మంచాల రఘువీర్, పూదరి ప్రభాకర్, మహేశ్, సయ్యద్ తన్హర్‌అలీ పాల్గొన్నారు.