క్యాంపు ఆఫీస్కు పరిమితమైన కిరణ్
ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారు. అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. రవీంద్రభారతిలో గురుపూజోత్సవం కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నా వెళ్లలేదు. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ ప్రకటన నేపథ్యంలో సీఎం కిరణ్ పలుమార్లు ఢిల్లీ వెళ్లారు. తెలంగాణ హైకమాండ్ నిర్ణయాన్ని మార్చేందుకు ప్రయత్నించారు.
సీమాంధ్ర ప్రాంతంతో పెద్ద ఎత్తున జరుగుతున్న సమైక్య ఉద్యమం గురించి అధిష్టానికి వివరించారు. రాష్ట్ర విడిపోతే ఎదురయ్యే సమస్యల గురించి కోర్ కమిటీ, ఆంటోనీ కమిటీ, అధిష్టాన పెద్దల ముందు ఏకరువు పెట్టారు. అయితే విభజనకు నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని, వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదని హైకమాండ్ స్పష్టం చేయడంతో ఆయన అధికార కార్యక్రమాలకు అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పోటాపోటీ ఆందోళనలు చేస్తుండడంతో సచివాలయానికి రావడం బాగా తగ్గించేశారు. కాగా, ప్రధాన కార్యదర్శి పీకే మహంతి, డీజీపీ దినేష్ రెడ్డి ఇవాళ సీఎం కిరణ్ను కలిశారు. 7న హైదరాబాద్లో జరిగే ఏపీఎన్జీవో సభపై చర్చించారు. అంతకుముందు మంత్రులు పితాని సత్యనారాయణ, విశ్వరూప్ కూడా కిరణ్తో సమావేశమయి ఢిల్లీ పర్యటనలో చర్చించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు.