ఏమిటీ.. ఎప్పుడు.. ఎలా?
* రాజకీయ భవిష్యత్‌పై సీఎం మల్లగుల్లాలు
* రాజీనామా, సొంతపార్టీ ఏర్పాటుపై సన్నిహిత నేతలతో సంప్రదింపులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై ఇప్పటివరకు పార్టీ అధిష్టానం ఆదేశాల ప్రకారమే నడుచుకుంటూ వచ్చిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు తన భవిష్యత్ కార్యాచరణపై మల్లగుల్లాలు పడుతున్నారు. పార్టీ సూచనల మేరకు రాజ్యసభ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థిని రంగం నుంచి తప్పించి పార్టీ అధికారిక అభ్యర్ధులు గెలిచేలా చేసిన ఆయన.. తన రాజకీయ భవితవ్యంపై సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ ఎలాంటి నిర్ణయానికి రాలేకపోతున్నారు. విభజన బిల్లు పార్లమెంట్ ముందుకు రాకముందే రాజీనామా చేయాలా? సమైక్యవాదంతో కొత్త పార్టీని స్థాపిస్తే ఎలా ఉంటుంది? వంటి అంశాల్లో ఎటూ తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది.
కేంద్రం విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే సమయాన్ని అనుసరించి తుదినిర్ణయాన్ని తీసుకోవాలన్న ఆలోచనలో సీఎం ఉన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. తాను సీఎంగా ఉండగా విభజన జరగదని చెప్పుకుంటూ వచ్చిన కిరణ్ ఆ ప్రక్రియ చివరి దశలో పదవికి రాజీనామా చేస్తారన్న ప్రచారం కాంగ్రెస్‌లో నెలకొంది. టీ-బిల్లును 12న రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశముందంటున్నారు.
అంతకు ఒకరోజు ముందు అంటే 11న రాజీనామా చేస్తే ఎలా ఉంటుందని సీఎం తన సన్నిహితులతో సంప్రదింపులు జరిపారు. అయితే రాజీనామా చేశాక ఏం చేయాలన్న దానిపై సన్నిహితుల నుంచి భిన్నాభిప్రాయాలు రావడంతో ఆయన ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్టు సమాచారం. త్వరలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉన్నందున ఆయన నిర్ణయం ఎలా ఉంటుందన్న అంశంపై పార్టీలో రకరకాల చర్చ సాగుతోంది.