Kiran New Party
-
ఇంకా ఊగిసలాటే..!
-
ఇంకా ఊగిసలాటే..!
* కొత్తపార్టీపై కిరణ్ ఎడతెరిపిలేని చర్చలు * ప్రజల్లో స్పందన లేదన్న సన్నిహితులు.. సందిగ్ధంలోనే మాజీ సీఎం సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటుపై ఇంకా ఊగిసలాటలోనే ఉన్నారు. గత కొద్దిరోజులుగా ఆయన తన అనుచర నేతలతో చర్చోపచర్చలు సాగిస్తున్నా పార్టీ ఏర్పాటుపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. కిరణ్ తన మనసులోని అభిప్రాయాలను బయటపెట్టకుండానే నేతలతో చర్చలు కొనసాగిస్తుండడంతో వారు కూడా ఇదమిత్థంగా ఏమీ చెప్పలేకపోతున్నారు. ప్రజల్లో మరింతగా అప్రతిష్ట పాలవుతామంటూ ఒకరిద్దరు నేతలు పార్టీ ఏర్పాటు దిశగా ఒత్తిడి పెంచుతున్నా ప్రజల్లో స్పందన మాట అటుంచి తనతో కలసి వచ్చేవారెంత మంది ఉంటారో అర్థంకాక కిరణ్ ముందుకు వెళ్లాలా? లేదా? అన్న సందిగ్థంలో కొట్టుమిట్టాడుతున్నట్టు సమాచారం. ఎప్పటిలాగానే ఈ అంశంపై ఒకటీ రెండురోజుల్లో స్పష్టత ఇచ్చే అవకాశముందని కిరణ్ సన్నిహిత నేతలు పేర్కొంటున్నారు. మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, సాకే శైలజానాధ్, తోట నరసింహం, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కందుల రాజమోహన్‌రెడ్డి, రేపాల శ్రీనివాస్, ఎమ్మెల్సీ రెడ్డపరెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు అమాసరాజశేఖర్ చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు బుధవారం కిరణ్‌తో సమావేశమయ్యూరు. లోక్‌సభ, శాసనసభ సాధారణ ఎన్నికలకు షెడ్యూల్, తదితర అంశాలపై చర్చించారు. షెడ్యూల్ వచ్చేసినందున ఇక కొత్త పార్టీ ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు సమయం లేదన్న అభిప్రాయానికి నేతలు వచ్చారని తెలుస్తోంది. సమైక్యవాదం విన్పించినప్పటికీ.. తాజాగా పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో కూడా ప్రజల్లో స్పందన వ్యక్తం కాలేదని, ఈ పరిస్థితుల్లో కొత్త పార్టీ ఏర్పాటుచేసినా ఫలితం ఉండదని నేతలు కిరణ్‌కు తెలిపారు. అంతిమంగా పార్టీ పెట్టాలా? వద్దా? అనే అంశంపై ఎలాంటి తుది నిర్ణయానికి రాకుండానే కిరణ్ ఈ భేటీని ముగించారు. గురువారం కూడా మరికొందరు నేతలతో సమావేశమైన తర్వాత నిర్ణయం వెలువడే అవకాశముందని కిరణ్ సన్నిహితుడొకరు తెలిపారు. -
ఒంగోలు రాజధానికై ప్రధానికి లేఖ రాసా: మాగుంట
-
' కిరణ్ లాస్ట్ బౌలర్‌గా మిగిలి పోతారు'
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర ప్రజలను నిలువునా ముంచారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లాస్ట్ బాల్ అంటూ ప్రజలను ఆయన మభ్యపెట్టారని వీహెచ్ సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. కిరణ్ బెస్ట్ బ్యాట్‌మెన్ అని అయితే లాస్ట్ బౌలర్‌గా మిగిలి పోతారని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టినా అది నిలబడదని ఆయన జోస్యం చెప్పారు. కిరణ్ కొత్తపార్టీలోకి ఎవరూ వెళ్లరని అన్నారు. సొంత జిల్లా చిత్తూరు నుంచి ఒక్క నేత కూడా సీఎం వెంట లేకపోవడమే కొత్త పార్టీ నిలబడదనడానికి నిదర్శనమని వీహెచ్ చెప్పుకొచ్చారు. -
'పార్టీ పెట్టడం శ్రేయస్కరం కాదని కిరణ్‌కు చెప్పా'
ఒంగోలు : ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టడం శ్రేయస్కరం కాదని కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పినట్లు ఒంగోలు కాంగ్రెస్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఒంగోలును సీమాంధ్రకు రాజధాని చేయాల్సింగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు లేఖ ఇచ్చినట్లు ఆయన సోమవారమిక్కడ చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాను కాంగ్రెస్‌కు చేసిన రాజీనామాను ఇంకా ఆమోదించలేదని మాగుంట తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను ఏ పార్టీ తరపున పోటీ చేసేది త్వరలో వెల్లడిస్తాననని ఆయన చెప్పారు. మరోవైపు కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. దానిపై బుధవారం తిరుపతిలో ప్రకటన చేయవచ్చని తెలిసింది. సమైక్యాంధ్ర పేరుతో ఇప్పటికే రిజిస్టరైన ఒక రాజకీయ పార్టీని తీసుకుని, దానితో ముందుకు వెళ్లాలని యోచిస్తున్నారు. పార్టీ జెండా, ఎజెండా రూపకల్పనకు కసరత్తు చేస్తున్నారు. సీఎం పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణపై నిన్న కాంగ్రెస్ బహిష్కత ఎంపీలు, కొందరు మంత్రులతో భేటీ అయ్యారు. -
కిరణ్ కొత్త పార్టీ పెట్టినా ఓడిస్తాం
తెలగ, బలిజ, కాపు ఐకాస హెచ్చరిక, రెండో రోజూ ధర్నా సాక్షి , న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించిన కిరణ్‌కుమార్ రెడ్డి కొత్తపార్టీ పెట్టినా ఆయనను ఓడించి తీరుతామని తెలగ,బలిజ, కాపు ఐక్యకార్యచరణ వేదిక ఉద్ఘాటించింది. కిరణ్ కాపు వర్గం ద్రోహి అని తీవ్రస్థాయిలో దుయ్యబట్టింది. తెలగ, బలిజ, కాపు రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆయా కులాల సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా గురువారానికి రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వేదిక కన్వీనర్ దాసరి రాము మాట్లాడుతూ, కిరణ్ కుమార్‌ను ఓడిస్తామన్నారు. మంత్రిరామచంద్రయ్య మాట్లాడుతూ.. కాపుల ఆర్థిక, సామాజిక సర్వే నిమిత్తం బీసీ సంక్షేమ శాఖకు రూ.69 లక్షలు కేటాయించాలని కిరణ్ కు అనేకసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. కాపు నేతలు అన్నిపార్టీలపై ఒత్తిడి పెంచాలన్నారు. ధర్నా అనంతరం కాపు నేతలు ఏఐసీసీ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజు, మేనిఫెస్టో కమిటీ పెద్దలను కలిసి ఎన్నికల హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. -
ఏమిటీ.. ఎప్పుడు.. ఎలా?
* రాజకీయ భవిష్యత్‌పై సీఎం మల్లగుల్లాలు * రాజీనామా, సొంతపార్టీ ఏర్పాటుపై సన్నిహిత నేతలతో సంప్రదింపులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై ఇప్పటివరకు పార్టీ అధిష్టానం ఆదేశాల ప్రకారమే నడుచుకుంటూ వచ్చిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు తన భవిష్యత్ కార్యాచరణపై మల్లగుల్లాలు పడుతున్నారు. పార్టీ సూచనల మేరకు రాజ్యసభ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థిని రంగం నుంచి తప్పించి పార్టీ అధికారిక అభ్యర్ధులు గెలిచేలా చేసిన ఆయన.. తన రాజకీయ భవితవ్యంపై సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ ఎలాంటి నిర్ణయానికి రాలేకపోతున్నారు. విభజన బిల్లు పార్లమెంట్ ముందుకు రాకముందే రాజీనామా చేయాలా? సమైక్యవాదంతో కొత్త పార్టీని స్థాపిస్తే ఎలా ఉంటుంది? వంటి అంశాల్లో ఎటూ తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది. కేంద్రం విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే సమయాన్ని అనుసరించి తుదినిర్ణయాన్ని తీసుకోవాలన్న ఆలోచనలో సీఎం ఉన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. తాను సీఎంగా ఉండగా విభజన జరగదని చెప్పుకుంటూ వచ్చిన కిరణ్ ఆ ప్రక్రియ చివరి దశలో పదవికి రాజీనామా చేస్తారన్న ప్రచారం కాంగ్రెస్‌లో నెలకొంది. టీ-బిల్లును 12న రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశముందంటున్నారు. అంతకు ఒకరోజు ముందు అంటే 11న రాజీనామా చేస్తే ఎలా ఉంటుందని సీఎం తన సన్నిహితులతో సంప్రదింపులు జరిపారు. అయితే రాజీనామా చేశాక ఏం చేయాలన్న దానిపై సన్నిహితుల నుంచి భిన్నాభిప్రాయాలు రావడంతో ఆయన ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్టు సమాచారం. త్వరలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉన్నందున ఆయన నిర్ణయం ఎలా ఉంటుందన్న అంశంపై పార్టీలో రకరకాల చర్చ సాగుతోంది.