ఇంకా ఊగిసలాటే..!
ప్రజల్లో మరింతగా అప్రతిష్ట పాలవుతామంటూ ఒకరిద్దరు నేతలు పార్టీ ఏర్పాటు దిశగా ఒత్తిడి పెంచుతున్నా ప్రజల్లో స్పందన మాట అటుంచి తనతో కలసి వచ్చేవారెంత మంది ఉంటారో అర్థంకాక కిరణ్ ముందుకు వెళ్లాలా? లేదా? అన్న సందిగ్థంలో కొట్టుమిట్టాడుతున్నట్టు సమాచారం. ఎప్పటిలాగానే ఈ అంశంపై ఒకటీ రెండురోజుల్లో స్పష్టత ఇచ్చే అవకాశముందని కిరణ్ సన్నిహిత నేతలు పేర్కొంటున్నారు.
మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, సాకే శైలజానాధ్, తోట నరసింహం, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కందుల రాజమోహన్‌రెడ్డి, రేపాల శ్రీనివాస్, ఎమ్మెల్సీ రెడ్డపరెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు అమాసరాజశేఖర్ చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు బుధవారం కిరణ్‌తో సమావేశమయ్యూరు. లోక్‌సభ, శాసనసభ సాధారణ ఎన్నికలకు షెడ్యూల్, తదితర అంశాలపై చర్చించారు. షెడ్యూల్ వచ్చేసినందున ఇక కొత్త పార్టీ ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు సమయం లేదన్న అభిప్రాయానికి నేతలు వచ్చారని తెలుస్తోంది.
సమైక్యవాదం విన్పించినప్పటికీ.. తాజాగా పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో కూడా ప్రజల్లో స్పందన వ్యక్తం కాలేదని, ఈ పరిస్థితుల్లో కొత్త పార్టీ ఏర్పాటుచేసినా ఫలితం ఉండదని నేతలు కిరణ్‌కు తెలిపారు. అంతిమంగా పార్టీ పెట్టాలా? వద్దా? అనే అంశంపై ఎలాంటి తుది నిర్ణయానికి రాకుండానే కిరణ్ ఈ భేటీని ముగించారు. గురువారం కూడా మరికొందరు నేతలతో సమావేశమైన తర్వాత నిర్ణయం వెలువడే అవకాశముందని కిరణ్ సన్నిహితుడొకరు తెలిపారు.