Ugra Narasimha Reddy
-
పింఛన్ల లబ్ధిదారులపై అక్కసు వెళ్లగక్కుతున్న టీడీపీ నేతలు
-
ఇదేంటయ్యా..? ఇన్‌చార్జ్‌లే దొరకడం లేదు..
సాక్షి, చిత్తూరు : ‘ఇదేమిటయ్యా.. మనం అధికారంలో ఉన్నపుడు పదవుల కోసం పాకులాడారు. వార్డు ఇన్చార్జ్ కోసం పోటీపడ్డారు. ఇప్పుడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను నియమించడానికి మనుషులు దొరకడంలేదా..? సిగ్గుగా ఉంది.. వెంటనే ఎవర్నో ఒకర్ని చూసి పెట్టండి. లేకుంటే మానం పోతాది..’ అంటూ టీడీపీ నేతలు పెదవి విరిచారు. గురువారం చిత్తూరులో తెలుగుదేశం పార్టీ జిల్లా సమ న్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షుల స్థానంలో పార్లమెంటరీ అధ్యక్షుడిగా ఒకర్ని, సమన్వయకర్తగా మరొకర్ని ఇటీవల పార్టీ అధిష్టానం నియమించింది. (లోకేశ్‌కు చుక్కెదురు) ప్రకాశంకు చెందిన ఉగ్రనరసింహారెడ్డిని సమన్వయకర్తగా, చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడిగా నానిని నియమించగా.. తొలిసారి పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌ల నియామకానికి నాయకులు దొరకడంలేదని పలువురు నేతల ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికారంలో ఉన్నపుడు రూ.కోట్లు కూడబెట్టుకున్నవాళ్లు.. ఇప్పుడు బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రావడంలేదని ఏకరువుపెట్టినట్లు తెలుస్తోంది. (ఆగని టీడీపీ దాష్టీకాలు) చిత్తూరులో ఏఎస్.మనోహర్ పార్టీకి రాజీనామా చేయగా.. పూతలపట్టులో లలితకుమారి, గంగాధరనెల్లూరులో కుతూహలమ్మ కుమారుడు హరికృష్ణ పార్టీలో చురుగ్గాలేరని పలువురు నేతలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై నేతలు స్పందిస్తూ.. ‘ఈ విషయాలు బయటచెబితే పరువుపోతుంది. ఎవరో ఒక రి పేరు పంపండి. అధిష్టానానికి చెప్పి వాళ్లను ఇన్‌చార్జ్‌లుగా ప్రకటిస్తాం..’ అని నేతలు సర్దిచెప్పినట్లు సమాచారం. మ రోవైపు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభతోపాటు పలువురు సీనియర్ నాయకులు ఈ సమావేశానికి హాజరుకాలేదు. -
బుర్రాది సాయం చేసే మనసు.. ఉగ్రది జిమ్మిక్కుల రాజకీయం
సాక్షి, కనిగిరి (ప్రకాశం): కనిగిరి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బుర్రా మధుసూదన్ యాదవ్, టీడీపీ అభ్యర్థిగా ఉగ్ర నరసింహారెడ్డిలు పోటీ చేస్తున్నారు. వీరితో పాటు వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మరో 10 మంది వరకు పోటీలో ఉన్నారు. మనసున్న నేత ♦ బుర్రా మధుసూదన్ యాదవ్‌కు తొలి నుంచి సౌమ్యుడిగా పేరుంది. ♦ చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలుకరించేతత్వం ఆయన సొంతం. ♦ భోళా శంకరుడు. కల్మషం లేని వ్యక్తి ♦ ఐదేళ్ల నుంచి కనిగిరిలో ఉంటూ అందరి మనిషిగా పేరొందారు. ♦ పేద, ధనిక తేడా లేదు. గర్వం అనేది ఉండదు. ♦ అడిగిన వారికి ఎంతో కొంత సాయం చేయాలనే నైజం. ♦ ముందు ఎదుటి వారి మాట పూర్తిగా విన్న తర్వాత చిరునవ్యుతో స్పందిస్తూ అతనికి సమాధానం చెప్పడం బుర్రా గొప్పతనం. ♦ ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టడం బుర్రా నైజం. ♦ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యవుతారు. ♦ దివ్యాంగ, అనాధ పిల్లలను దత్తత తీసుకుని వారి ఆలనా పాలన చూస్తూ మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. ♦ రాజకీయ జిమ్మిక్కులు తెలియవు ఉగ్రకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం .. ♦ గిట్టని వ్యక్తిపై కక్ష సాధిస్తాడన్న పేరు ♦ మంచితనంగా ఉంటూనే ఇబ్బంది పెడతాడు ♦ రాజకీయ ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తాడు ♦ మాటల్లో ఆప్యాయత, పలకరింపు తక్కువ ♦ బెదిరింపు ధోరణి ఎక్కువగా కన్పిస్తుంది. ♦ కుల రాజకీయాలు చేస్తాడని పేరు ♦ అవసరాలకు అనుగుణంగా వ్యవహరించడం ♦ ఎంతటి వారినైనా సమయానుగుణంగా తనవైపు తిప్పు కోవడం ♦ రాజకీయ రంగులు మరుస్తాడన్న పేరు ఉగ్ర నరసింహారెడ్డికి ఉంది. -
వదల బొమ్మాళీ.. వదల..!
సాక్షి, కనిగిరి (ప్రకాశం): కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావుకు కనిగిరి సీటు విషయంలో సీఎం చంద్రబాబునాయుడు చేదు అనుభవం మిగిల్చారు. దీంతో కనిగిరిలో కదిరితో పాటు ఆయన వర్గీయులు కొద్ది రోజులుగా నిరసన జ్వాలలతో రగిలిపోతున్నారు. ఇప్పటికే పలుమార్లు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత కనిగిరి టీడీపీ అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డిపై పరోక్షంగా అనేక వేదికలపై కదిరి బాబూరావు విమర్శలు గుప్పించిన సంగతి విధితమే. ఒకానొక దశలో తనను కాదని వేరేవారికి టికెట్ ఇవ్వాలంటే పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడి పనిచేస్తున్న రెడ్డి, కమ్మ, యాదవ, బీసీ కులాల వారు ఉన్నారని, వారిలో ఎవరో ఒకరికి టికెట్ ఇస్తే తాను గెలిపించుకుని వస్తానని కూడా అధిష్టానానికి ఆయన అల్టిమేటం జారీ చేశారు. కానీ, కదిరి మాటను అధిష్టానం పట్టించుకోకుండా పెడచెవిన పెట్టడంతో పాటు సర్వేల పేరుతో కదిరికి టికెట్ ఇవ్వకుండా తిరస్కరించింది. ఆయన ఎవరినైతే ఘాటుగా విమర్శించి పార్టీలో చేర్చుకోవడానికి వీలులేదంటూ అడ్డుపడ్డారో అతనికే కనిగిరి టీడీపీ టికెట్ ఇవ్వడంపై కదిరి బాబూరావు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఒకదశలో తన స్నేహితుడైన నందమూరి బాలకృష్ణతో సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించిన కదిరిని చివరకు దర్శికి కేటాయించారు. పార్టీ కోసం ఐదేళ్లుగా ఎంతో కష్టపడిన తనకు అన్యాయం చేశారంటూ అధిష్టానంపై ఆయన ఆవేదన వెళ్లగక్కుతున్నారు. చంద్రబాబుకు వయసు మీదపడటంతో మతిభ్రమించి తనకు కనిగిరి సీటు లేకుండా చేశారంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. కదిరి బాబూరావు పాతగాయాలు మానలేదని మండిపాటు... కనిగిరి టీడీపీ టికెట్‌ను ఉగ్ర నరసింహారెడ్డికి ఇవ్వడంతో ఇప్పటి వరకు కదిరి బాబూరావుపైనే అశలు పెట్టుకున్న ఆ పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. ద్వితీయ, తృతీయ స్థాయి నాయకులు, కార్యకర్తలు సైతం ఉగ్ర వద్దకు తాము వెళ్లలేమంటూ ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో తేల్చి చెప్పారు. రోడ్డెక్కి నిరసనలు కూడా తెలిపారు. మరికొందరు టీడీపీ నాయకులైతే.. ఇక కనిగిరిలో టీడీపీ ఔట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. గతంలో ఉగ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు టీడీపీ క్యాడర్‌ను ఇబ్బంది పెట్టినట్టు వారు వాఖ్యానిస్తున్నారు. ఆ పాత గాయాలు తమకు ఇంకా మానలేదంటూ పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు బహిరంగంగా వాఖ్యానిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ ఉగ్రను తీవ్రంగా వ్యతిరేకిస్తోందనేది బహిరంగ రహస్యం. ఏది ఏమైనా కనిగిరిని వదిలి కదిరి వెళ్తారా.. లేకుంటే కనిగిరిలోనే పోటీలో ఉంటారా అనేది నామినేషన్ల చివరి రోజు వరకూ ఉత్కంఠకు దారితీయనుంది. కనిగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసే యోచనలో కదిరి..? కదిరి బాబూరావు స్వగ్రామమైన శీలంవారిపల్లిలో మంగళవారం నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో కదిరి ఘాటైన విమర్శలు చేశారు. ‘ఉగ్ర నా సీటును లాక్కున్నాడు. ఇంకా ఏం చేస్తాడోనని టీడీపీ కార్యకర్తలంతా భయపడుతున్నారు. అవేంటో నాకు తెలుసు’ అంటూ భావోద్వేగ ప్రసంగం చేశారు. తాను కార్యకర్తలను వదిలిపోనని.. దర్శిలో తనకు సీటు ఇవ్వడంతో అక్కడ నామినేషన్ వేయడంతో పాటు కనిగిరిలోనూ ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేస్తానని ప్రకటించారు. చివరి రోజు వరకూ కనిగిరి స్థానం కోసం పోరాడతానంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఒక దశలో తాను దర్శిలో నిలబడినా ఓడిపోతానని, అదే కనిగిరిలో ఇండిపెండెంట్‌గా వేసినా కనీసం 30 వేల ఓట్లయినా వస్తాయని, అలా చేస్తే ఎలా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఉగ్ర దగ్గరికి వెళ్లడానికి కార్యకర్తలు భయపడుతున్నారని, ఆ విషయం తనకు తెలుసని, ఏం చేద్దాం.. పార్టీ మనకు అన్యాయం చేసిందని తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. కదిరి చేసిన ప్రసంగం, అంతర్గత చర్చలు టీడీపీని, ఆ పార్టీ శ్రేణులను ఆలోచనలో పడేశాయి. -
సీటు నాకే.. కాదు నాకే!
సాక్షి ప్రతినిధి,ఒంగోలు: కనిగిరి టీడీపీ రాజకీయం రోడ్డెక్కింది. ఆ పార్టీలో సీటు పోట్లాట రచ్చకెక్కింది. రాబోయే ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ తనకేనంటూ మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి సంకేతాలు ఇస్తుండగా తనకు సీటు రాకపోయినా పరవాలేదు పార్టీలో సభ్యత్వం లేని ఉగ్రకు మాత్రం సీటు దక్కనివ్వనంటూ ఎమ్మెల్యే కదిరి బాబూరావు తేల్చిచెబుతున్నారు. దీంతో కనిగిరి టీడీపీ నేతలు, కార్యకర్తలలో గందరగోళం నెలకొంది. కొంతకాలంగా కనిగిరి టీడీపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డికి ఇస్తారని టీడీపీలో ప్రచారం సాగుతోంది. టీడీపీ జిల్లా నేతలతోపాటు కొందరు రాష్ట్ర నేతలు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కనిగిరిలో తిరుగులేని శక్తిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యాదవ సామాజిక వర్గానికి చెందిన బుర్రా మధుసూదన్‌ను ఇక్కడి నుంచి బరిలోకి దించింది. దీంతో రెడ్డి సామాజికవర్గాన్ని ఆకర్శించేందుకు ఆ సామాజికవర్గానికి టీడీపీ టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎత్తుగడగా ప్రచారం సాగింది. టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సైతం కనిగిరి నుంచి ఉగ్రనరసింహారెడ్డికి టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రికి సూచించినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగింది. మొత్తంగా కనిగిరి నుంచి ఉగ్రకే టీడీపీ టికెట్ అభిస్తుందని జోరుగా ప్రచారం సాగుతోంది. సిటింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఆది నుంచి ఉగ్ర అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. తనకు సన్నిహితుడైన నందమూరి బాలకృష్ణ ద్వారా తానే టికెట్ తెచ్చుకుంటానని ఆయన ఆది నుంచి అనుచరులకు భరోసా ఇస్తున్నారు. అయితే సామాజిక వర్గ సమీకరణల్లో భాగంగా కనిగిరి నుంచి ఉగ్రకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించిన సీఎం ఎమ్మెల్యే కదిరి బాబూరావును ఒప్పించేందుకు సిద్దమైనట్లు ప్రచారం సాగుతోంది. నేడో రేపో ఆ తంతూ ముగియనున్నట్లు సమాచారం. ఈ సమయంలో కనిగిరిలో ఉగ్రసేన కార్యకర్తలు, అభిమానులతో బుధవారం ఉగ్ర సమావేశం నిర్వహించారు. తనకు టీడీపీ నుంచి ఆహ్వానం ఉందని, ఆ పార్టీ నుంచి పోటీ చేసేఅవకాశముందని చెప్పకనే చెప్పారు. దీంతో ఉగ్రకు టికెట్ ఖాయమైందన్న ప్రచారం జిల్లా వ్యాప్తంగా సాగింది. దీంతో ఉలిక్కి పడిన ఎమ్మెల్యే కదిరి బాబూరావు మర్నాడే పార్టీ కార్యకర్తలతో కనిగిరిలో పోటీ సమావేశం పెట్టారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు తనకు తప్ప ఇక్కడ కొత్త వ్యక్తులకు అవకాశం లేదన్నారు. ముఖ్యమంత్రి ఒక వేళ తనను కాదంటే పార్టీకి చెందిన పాత వ్యక్తులకు ఎమ్మెల్యే అభ్యర్ధిగా అవకాశం కల్పిస్తాను తప్ప పార్టీలో సభ్యత్వం లేని ఉగ్రను అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ‘కొందరు నాకు టికెట్ వచ్చింది. నాకు అయిపోయిందని ప్రచారం చేస్తున్నారు వాటిని నమ్మొద్దు’ అని చెప్పారు. నియోజకవర్గంలో తాను కోట్ల రూపాయల అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఈ రోజు కొత్త నాయకులు వస్తామంటే తను, తన కార్యకర్తలు ఒప్పుకోబోరనన్నారు. చంద్రబాబుకు ఏ కులం వారు కావాలన్నా తన దగ్గరున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. కనిగిరిలో మార్పులుండవన్నారు. మళ్లీ తానే ఎమ్మెల్యే అభ్యర్థినని కదిరి బాబూరావు తేల్చి చెప్పారు. అటు ఉగ్ర ఇటు కదిరి వ్యాఖ్యలతో కనిగిరి టీడీపీలో గందరగోళం నెలకొంది. చివరకు అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందో తెలియని పరిస్థితి. టీడీపీ పోట్లాటలు వైఎస్సార్సీపీకి లాభిస్తాయని టీడీపీ వర్గాలే పేర్కొంటుండం గమనార్హం. మొత్తంగా కనిగిరి టీడీపీలో విభేదాలు రోడ్డున పడ్డాయి. -
సీఎంను కలసిన ఉగ్రనరసింహారెడ్డి
సాక్షి, అమరావతి: కాంగ్రెస్ పార్టీకి చెందిన కోండ్రు మురళి, ఉగ్రనరసింహారెడ్డి తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబును కలిశారు. ఇప్పటికే ఉగ్రనరసింహారెడ్డి పార్టీ మారతారన్న ప్రచారం ఉండటంతో సీఎంతో భేటీ అనంతరం ఆయన టీడీపీలో చేరబోతున్నారని విషయం స్పష్టమవుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీలో చేరాలని సీఎం కూడా కోరినట్లు చెబుతున్నారు. అయితే తన భార్య ప్రమోషన్ విషయమై సీఎంతో మాట్లాడేందుకే ఆయన్ని కలశానని ఉగ్ర చెబుతున్నారు. అయితే ఆయన పార్టీ మారినా కాంగ్రెస్‌కు నష్టంలేదని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసినపుడు ఉగ్రకు కేవలం 2,663 ఓట్లు మాత్రమే వచ్చాయని, అలాంటి నేత పార్టీ మారడం వల్ల జిల్లాలో ఎటువంటి ప్రభావం ఉండదని ప్రకాశం జిల్లా నేతలు చెబుతున్నారు. మంత్రి కళాతో కోండ్రు మంతనాలు మరోవైపు ఉత్తరాంధ్రకు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కోండ్రు మురళి కూడా టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయన మంత్రి కిమిడి కళావెంకటరావును కలసి మంతనాలు సాగించడంతో ఆ ప్రచారం నిజమేనని చెబుతున్నారు. రాజాం నియోజకవర్గంలో పోటీ చేసిన కోండ్రుకు కేవలం 4,790 ఓట్లు మాత్రమే వచ్చాయని, ఆయన పార్టీని వీడినా నష్టంలేదని కార్యకర్తలే పేర్కొంటున్నారు. -
కనిగిరిలో హైడ్రామా
కనిగిరి : కనిగిరిలో శుక్రవారం హైడ్రామా నడిచింది. టీడీపీ- కాంగ్రెస్ నేతల వ్యవహరించిన తీరుతో ప్రజలు నవ్వుకున్నారు. వివరాలు.. టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్లు విసురుకున్నారు. గురువారం ముహూర్తం కూడా పెట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి కార్యకర్తలతో ర్యాలీగా బయల్దేరి వస్తుండగా అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకు పోలీసులు వారిని అడ్డగించి అరెస్టు చేశారు. దీంతో బహిరంగ చర్చకు తెర పడింది. బహిరంగ చర్చకు వచ్చే నాయకుడు ఐదుగురు లేదా పది మంది కార్యకర్తలతో వస్తారని, ఇలా అధిక సంఖ్యలో కార్యకర్తలతో రావడం కేవలం ప్రచారం కోసమేనన్న విమర్శలూ మాజీ ఎమ్మెల్యేపై వెల్లువెత్తాయి. ఈ మొత్తం ఘటనతో ఇరుపార్టీల నేతల తీరు ప్రజలకు వినోదాన్ని పంచింది. నగర పంచాయతీ కార్యాలయం వద్దకు ర్యాలీగా వస్తున్న మాజీ ఎమ్మెల్యే ఉగ్రతో పాటు మరి కొందరు కార్యకర్తలను స్థానిక సుగుణావతమ్మ సెంటర్లో పోలీసులు అరెస్తు చేశారు. తమ నాయకులను విడిచి పెట్టాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసుస్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు వారిని చెదర గొట్టారు. మళ్లీ కొద్ది సేపటికి కాంగ్రెస్ కార్యకర్తలు బస్సులు ఆపే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకుని గుంపులను చెదర గొట్టారు. ముందస్తు చర్యగా మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో పాటు మరో 29 మందిని అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై వదిలినట్లు సీఐ సుధాకర్‌రావు తెలిపారు. అనంతరం ఉగ్ర నరసింహారెడ్డి గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందచేశారు. శాంతియుతంగా వెళ్తున్న తమను పోలీసులు ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేశారని ఉగ్ర ఆరోపించారు. నగర పంచాయతీ కార్యాలయంలో టీడీపీ నాయకులు చైర్మన్ మస్తాన్ ఆధ్వర్యంలో విలేకరులతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యేపై తాము చేసిన అవినీతి ఆరోపణలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. -
14న రాష్ట్రానికి దిగ్విజయ్‌సింగ్ రాక
ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక, టీఆర్ఎస్ పొత్తుపై చర్చించే అవకాశం సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ ఈ నెల 14న హైదరాబాద్ రానున్నారు. పీసీసీ వర్గాల సమాచారం మేరకు... 14, 15 తేదీల్లో ఆయన హైదరాబాద్‌లోనే ఉంటారు. ఈలోపే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పీసీసీ అధ్యక్షులను, ప్రచార, మేనిఫెస్టో, ఎన్నికల కమిటీల నియామక ప్రక్రియ పూర్తిచేస్తారు. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తారు. టీఆర్ఎస్తో పొత్తుకు సంబంధించి ఆ పార్టీ ముఖ్య నేతలతోనూ దిగ్విజయ్‌సింగ్ భేటీ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దిగ్విజయ్‌సింగ్ పర్యటన అనంతరమే టీఆర్ఎస్తో పొత్తుపై స్పష్టత వస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడిగా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి నియమితులయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.... జర్మనీ ప్రజలు సమైక్యంగా కొనసాగేందుకు అడ్డుగా ఉన్న బెర్లిన్ గోడ పగలగొట్టారని పేర్కొంటూ కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియాకు ఒక రాయి చూపిన విషయాన్ని బొత్స వద్ద విలేకరులు ప్రస్తావించగా ‘‘ఆ రాయి నిజంగా ఎక్కడిది..? బెర్లిన్దా... లేక ఇక్కడిదేనా..?’’అని అనుమానం వ్యక్తం చేశారు. -
ఇంకా ఊగిసలాటే..!
-
ఇంకా ఊగిసలాటే..!
* కొత్తపార్టీపై కిరణ్ ఎడతెరిపిలేని చర్చలు * ప్రజల్లో స్పందన లేదన్న సన్నిహితులు.. సందిగ్ధంలోనే మాజీ సీఎం సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటుపై ఇంకా ఊగిసలాటలోనే ఉన్నారు. గత కొద్దిరోజులుగా ఆయన తన అనుచర నేతలతో చర్చోపచర్చలు సాగిస్తున్నా పార్టీ ఏర్పాటుపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. కిరణ్ తన మనసులోని అభిప్రాయాలను బయటపెట్టకుండానే నేతలతో చర్చలు కొనసాగిస్తుండడంతో వారు కూడా ఇదమిత్థంగా ఏమీ చెప్పలేకపోతున్నారు. ప్రజల్లో మరింతగా అప్రతిష్ట పాలవుతామంటూ ఒకరిద్దరు నేతలు పార్టీ ఏర్పాటు దిశగా ఒత్తిడి పెంచుతున్నా ప్రజల్లో స్పందన మాట అటుంచి తనతో కలసి వచ్చేవారెంత మంది ఉంటారో అర్థంకాక కిరణ్ ముందుకు వెళ్లాలా? లేదా? అన్న సందిగ్థంలో కొట్టుమిట్టాడుతున్నట్టు సమాచారం. ఎప్పటిలాగానే ఈ అంశంపై ఒకటీ రెండురోజుల్లో స్పష్టత ఇచ్చే అవకాశముందని కిరణ్ సన్నిహిత నేతలు పేర్కొంటున్నారు. మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, సాకే శైలజానాధ్, తోట నరసింహం, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కందుల రాజమోహన్‌రెడ్డి, రేపాల శ్రీనివాస్, ఎమ్మెల్సీ రెడ్డపరెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు అమాసరాజశేఖర్ చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు బుధవారం కిరణ్‌తో సమావేశమయ్యూరు. లోక్‌సభ, శాసనసభ సాధారణ ఎన్నికలకు షెడ్యూల్, తదితర అంశాలపై చర్చించారు. షెడ్యూల్ వచ్చేసినందున ఇక కొత్త పార్టీ ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు సమయం లేదన్న అభిప్రాయానికి నేతలు వచ్చారని తెలుస్తోంది. సమైక్యవాదం విన్పించినప్పటికీ.. తాజాగా పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో కూడా ప్రజల్లో స్పందన వ్యక్తం కాలేదని, ఈ పరిస్థితుల్లో కొత్త పార్టీ ఏర్పాటుచేసినా ఫలితం ఉండదని నేతలు కిరణ్‌కు తెలిపారు. అంతిమంగా పార్టీ పెట్టాలా? వద్దా? అనే అంశంపై ఎలాంటి తుది నిర్ణయానికి రాకుండానే కిరణ్ ఈ భేటీని ముగించారు. గురువారం కూడా మరికొందరు నేతలతో సమావేశమైన తర్వాత నిర్ణయం వెలువడే అవకాశముందని కిరణ్ సన్నిహితుడొకరు తెలిపారు.