కనిగిరిలో హైడ్రామా
కనిగిరి : కనిగిరిలో శుక్రవారం హైడ్రామా నడిచింది. టీడీపీ- కాంగ్రెస్ నేతల వ్యవహరించిన తీరుతో ప్రజలు నవ్వుకున్నారు. వివరాలు.. టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్‌లు విసురుకున్నారు. గురువారం ముహూర్తం కూడా పెట్టుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి కార్యకర్తలతో ర్యాలీగా బయల్దేరి వస్తుండగా అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకు పోలీసులు వారిని అడ్డగించి అరెస్టు చేశారు. దీంతో బహిరంగ చర్చకు తెర పడింది. బహిరంగ చర్చకు వచ్చే నాయకుడు ఐదుగురు లేదా పది మంది కార్యకర్తలతో వస్తారని, ఇలా అధిక సంఖ్యలో కార్యకర్తలతో రావడం కేవలం ప్రచారం కోసమేనన్న విమర్శలూ మాజీ ఎమ్మెల్యేపై వెల్లువెత్తాయి.
ఈ మొత్తం ఘటనతో ఇరుపార్టీల నేతల తీరు ప్రజలకు వినోదాన్ని పంచింది. నగర పంచాయతీ కార్యాలయం వద్దకు ర్యాలీగా వస్తున్న మాజీ ఎమ్మెల్యే ఉగ్రతో పాటు మరి కొందరు కార్యకర్తలను స్థానిక సుగుణావతమ్మ సెంటర్‌లో పోలీసులు అరెస్తు చేశారు. తమ నాయకులను విడిచి పెట్టాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసుస్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు వారిని చెదర గొట్టారు. మళ్లీ కొద్ది సేపటికి కాంగ్రెస్ కార్యకర్తలు బస్సులు ఆపే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకుని గుంపులను చెదర గొట్టారు.
ముందస్తు చర్యగా మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో పాటు మరో 29 మందిని అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై వదిలినట్లు సీఐ సుధాకర్‌రావు తెలిపారు. అనంతరం ఉగ్ర నరసింహారెడ్డి గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందచేశారు. శాంతియుతంగా వెళ్తున్న తమను పోలీసులు ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేశారని ఉగ్ర ఆరోపించారు. నగర పంచాయతీ కార్యాలయంలో టీడీపీ నాయకులు చైర్మన్ మస్తాన్ ఆధ్వర్యంలో విలేకరులతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యేపై తాము చేసిన అవినీతి ఆరోపణలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని ప్రకటించారు.