సాక్షి, కనిగిరి (ప్రకాశం): కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావుకు కనిగిరి సీటు విషయంలో సీఎం చంద్రబాబునాయుడు చేదు అనుభవం మిగిల్చారు. దీంతో కనిగిరిలో కదిరితో పాటు ఆయన వర్గీయులు కొద్ది రోజులుగా నిరసన జ్వాలలతో రగిలిపోతున్నారు. ఇప్పటికే పలుమార్లు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత కనిగిరి టీడీపీ అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డిపై పరోక్షంగా అనేక వేదికలపై కదిరి బాబూరావు విమర్శలు గుప్పించిన సంగతి విధితమే. ఒకానొక దశలో తనను కాదని వేరేవారికి టికెట్ ఇవ్వాలంటే పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడి పనిచేస్తున్న రెడ్డి, కమ్మ, యాదవ, బీసీ కులాల వారు ఉన్నారని, వారిలో ఎవరో ఒకరికి టికెట్ ఇస్తే తాను గెలిపించుకుని వస్తానని కూడా అధిష్టానానికి ఆయన అల్టిమేటం జారీ చేశారు.
కానీ, కదిరి మాటను అధిష్టానం పట్టించుకోకుండా పెడచెవిన పెట్టడంతో పాటు సర్వేల పేరుతో కదిరికి టికెట్ ఇవ్వకుండా తిరస్కరించింది. ఆయన ఎవరినైతే ఘాటుగా విమర్శించి పార్టీలో చేర్చుకోవడానికి వీలులేదంటూ అడ్డుపడ్డారో అతనికే కనిగిరి టీడీపీ టికెట్ ఇవ్వడంపై కదిరి బాబూరావు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఒకదశలో తన స్నేహితుడైన నందమూరి బాలకృష్ణతో సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించిన కదిరిని చివరకు దర్శికి కేటాయించారు. పార్టీ కోసం ఐదేళ్లుగా ఎంతో కష్టపడిన తనకు అన్యాయం చేశారంటూ అధిష్టానంపై ఆయన ఆవేదన వెళ్లగక్కుతున్నారు. చంద్రబాబుకు వయసు మీదపడటంతో మతిభ్రమించి తనకు కనిగిరి సీటు లేకుండా చేశారంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు.
కదిరి బాబూరావు
పాతగాయాలు మానలేదని మండిపాటు...
కనిగిరి టీడీపీ టికెట్‌ను ఉగ్ర నరసింహారెడ్డికి ఇవ్వడంతో ఇప్పటి వరకు కదిరి బాబూరావుపైనే అశలు పెట్టుకున్న ఆ పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. ద్వితీయ, తృతీయ స్థాయి నాయకులు, కార్యకర్తలు సైతం ఉగ్ర వద్దకు తాము వెళ్లలేమంటూ ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో తేల్చి చెప్పారు. రోడ్డెక్కి నిరసనలు కూడా తెలిపారు. మరికొందరు టీడీపీ నాయకులైతే.. ఇక కనిగిరిలో టీడీపీ ఔట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. గతంలో ఉగ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు టీడీపీ క్యాడర్‌ను ఇబ్బంది పెట్టినట్టు వారు వాఖ్యానిస్తున్నారు. ఆ పాత గాయాలు తమకు ఇంకా మానలేదంటూ పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు బహిరంగంగా వాఖ్యానిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ ఉగ్రను తీవ్రంగా వ్యతిరేకిస్తోందనేది బహిరంగ రహస్యం. ఏది ఏమైనా కనిగిరిని వదిలి కదిరి వెళ్తారా.. లేకుంటే కనిగిరిలోనే పోటీలో ఉంటారా అనేది నామినేషన్ల చివరి రోజు వరకూ ఉత్కంఠకు దారితీయనుంది.
కనిగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసే యోచనలో కదిరి..?
కదిరి బాబూరావు స్వగ్రామమైన శీలంవారిపల్లిలో మంగళవారం నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో కదిరి ఘాటైన విమర్శలు చేశారు. ‘ఉగ్ర నా సీటును లాక్కున్నాడు. ఇంకా ఏం చేస్తాడోనని టీడీపీ కార్యకర్తలంతా భయపడుతున్నారు. అవేంటో నాకు తెలుసు’ అంటూ భావోద్వేగ ప్రసంగం చేశారు. తాను కార్యకర్తలను వదిలిపోనని.. దర్శిలో తనకు సీటు ఇవ్వడంతో అక్కడ నామినేషన్ వేయడంతో పాటు కనిగిరిలోనూ ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేస్తానని ప్రకటించారు. చివరి రోజు వరకూ కనిగిరి స్థానం కోసం పోరాడతానంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఒక దశలో తాను దర్శిలో నిలబడినా ఓడిపోతానని, అదే కనిగిరిలో ఇండిపెండెంట్‌గా వేసినా కనీసం 30 వేల ఓట్లయినా వస్తాయని, అలా చేస్తే ఎలా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఉగ్ర దగ్గరికి వెళ్లడానికి కార్యకర్తలు భయపడుతున్నారని, ఆ విషయం తనకు తెలుసని, ఏం చేద్దాం.. పార్టీ మనకు అన్యాయం చేసిందని తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. కదిరి చేసిన ప్రసంగం, అంతర్గత చర్చలు టీడీపీని, ఆ పార్టీ శ్రేణులను ఆలోచనలో పడేశాయి.
Comments
Please login to add a commentAdd a comment