14న రాష్ట్రానికి దిగ్విజయ్‌సింగ్ రాక
ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక, టీఆర్‌ఎస్ పొత్తుపై చర్చించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ ఈ నెల 14న హైదరాబాద్ రానున్నారు. పీసీసీ వర్గాల సమాచారం మేరకు... 14, 15 తేదీల్లో ఆయన హైదరాబాద్‌లోనే ఉంటారు. ఈలోపే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పీసీసీ అధ్యక్షులను, ప్రచార, మేనిఫెస్టో, ఎన్నికల కమిటీల నియామక ప్రక్రియ పూర్తిచేస్తారు. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తారు. టీఆర్‌ఎస్‌తో పొత్తుకు సంబంధించి ఆ పార్టీ ముఖ్య నేతలతోనూ దిగ్విజయ్‌సింగ్ భేటీ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దిగ్విజయ్‌సింగ్ పర్యటన అనంతరమే టీఆర్‌ఎస్‌తో పొత్తుపై స్పష్టత వస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడిగా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి నియమితులయ్యారు.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.... జర్మనీ ప్రజలు సమైక్యంగా కొనసాగేందుకు అడ్డుగా ఉన్న బెర్లిన్ గోడ పగలగొట్టారని పేర్కొంటూ కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియాకు ఒక రాయి చూపిన విషయాన్ని బొత్స వద్ద విలేకరులు ప్రస్తావించగా ‘‘ఆ రాయి నిజంగా ఎక్కడిది..? బెర్లిన్‌దా... లేక ఇక్కడిదేనా..?’’అని అనుమానం వ్యక్తం చేశారు.