సాక్షి ప్రతినిధి,ఒంగోలు: కనిగిరి టీడీపీ రాజకీయం రోడ్డెక్కింది. ఆ పార్టీలో సీటు పోట్లాట రచ్చకెక్కింది. రాబోయే ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ తనకేనంటూ మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి సంకేతాలు ఇస్తుండగా తనకు సీటు రాకపోయినా పరవాలేదు పార్టీలో సభ్యత్వం లేని ఉగ్రకు మాత్రం సీటు దక్కనివ్వనంటూ ఎమ్మెల్యే కదిరి బాబూరావు తేల్చిచెబుతున్నారు. దీంతో కనిగిరి టీడీపీ నేతలు, కార్యకర్తలలో గందరగోళం నెలకొంది.
కొంతకాలంగా కనిగిరి టీడీపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డికి ఇస్తారని టీడీపీలో ప్రచారం సాగుతోంది. టీడీపీ జిల్లా నేతలతోపాటు కొందరు రాష్ట్ర నేతలు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కనిగిరిలో తిరుగులేని శక్తిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యాదవ సామాజిక వర్గానికి చెందిన బుర్రా మధుసూదన్‌ను ఇక్కడి నుంచి బరిలోకి దించింది. దీంతో రెడ్డి సామాజికవర్గాన్ని ఆకర్శించేందుకు ఆ సామాజికవర్గానికి టీడీపీ టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎత్తుగడగా ప్రచారం సాగింది. టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సైతం కనిగిరి నుంచి ఉగ్రనరసింహారెడ్డికి టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రికి సూచించినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగింది. మొత్తంగా కనిగిరి నుంచి ఉగ్రకే టీడీపీ టికెట్ అభిస్తుందని జోరుగా ప్రచారం సాగుతోంది. సిటింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఆది నుంచి ఉగ్ర అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. తనకు సన్నిహితుడైన నందమూరి బాలకృష్ణ ద్వారా తానే టికెట్ తెచ్చుకుంటానని ఆయన ఆది నుంచి అనుచరులకు భరోసా ఇస్తున్నారు. అయితే సామాజిక వర్గ సమీకరణల్లో భాగంగా కనిగిరి నుంచి ఉగ్రకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించిన సీఎం ఎమ్మెల్యే కదిరి బాబూరావును ఒప్పించేందుకు సిద్దమైనట్లు ప్రచారం సాగుతోంది.
నేడో రేపో ఆ తంతూ ముగియనున్నట్లు సమాచారం. ఈ సమయంలో కనిగిరిలో ఉగ్రసేన కార్యకర్తలు, అభిమానులతో బుధవారం ఉగ్ర సమావేశం నిర్వహించారు. తనకు టీడీపీ నుంచి ఆహ్వానం ఉందని, ఆ పార్టీ నుంచి పోటీ చేసేఅవకాశముందని చెప్పకనే చెప్పారు. దీంతో ఉగ్రకు టికెట్ ఖాయమైందన్న ప్రచారం జిల్లా వ్యాప్తంగా సాగింది. దీంతో ఉలిక్కి పడిన ఎమ్మెల్యే కదిరి బాబూరావు మర్నాడే పార్టీ కార్యకర్తలతో కనిగిరిలో పోటీ సమావేశం పెట్టారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు తనకు తప్ప ఇక్కడ కొత్త వ్యక్తులకు అవకాశం లేదన్నారు. ముఖ్యమంత్రి ఒక వేళ తనను కాదంటే పార్టీకి చెందిన పాత వ్యక్తులకు ఎమ్మెల్యే అభ్యర్ధిగా అవకాశం కల్పిస్తాను తప్ప పార్టీలో సభ్యత్వం లేని ఉగ్రను అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
‘కొందరు నాకు టికెట్ వచ్చింది. నాకు అయిపోయిందని ప్రచారం చేస్తున్నారు వాటిని నమ్మొద్దు’ అని చెప్పారు. నియోజకవర్గంలో తాను కోట్ల రూపాయల అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఈ రోజు కొత్త నాయకులు వస్తామంటే తను, తన కార్యకర్తలు ఒప్పుకోబోరనన్నారు. చంద్రబాబుకు ఏ కులం వారు కావాలన్నా తన దగ్గరున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. కనిగిరిలో మార్పులుండవన్నారు. మళ్లీ తానే ఎమ్మెల్యే అభ్యర్థినని కదిరి బాబూరావు తేల్చి చెప్పారు. అటు ఉగ్ర ఇటు కదిరి వ్యాఖ్యలతో కనిగిరి టీడీపీలో గందరగోళం నెలకొంది. చివరకు అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందో తెలియని పరిస్థితి. టీడీపీ పోట్లాటలు వైఎస్సార్‌సీపీకి లాభిస్తాయని టీడీపీ వర్గాలే పేర్కొంటుండం గమనార్హం. మొత్తంగా కనిగిరి టీడీపీలో విభేదాలు రోడ్డున పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment