ఫ్యాను గాలికి సైకిల్‌ తలకిందులు | YSRCP Campaigning In kanigiri, Prakasam District | Sakshi
Sakshi News home page

ఫ్యాను గాలికి సైకిల్‌ తలకిందులు

Apr 8 2019 11:45 AM | Updated on Apr 8 2019 11:45 AM

YSRCP Campaigning In kanigiri, Prakasam District - Sakshi

సాక్షి, కనిగిరి (ప్రకాశం): నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ జోష్‌ మరింత పెరిగింది. ఫ్యాను గాలికి సైకిల్‌ తల కిందులవుతోంది. ఏ వీధి చూసినా.. ఏ వాడ చూసినా.. వైఎస్సార్‌ సీపీ గాలి వేగంగా వీస్తోంది. ప్రత్యర్థి టీడీపీ నేతలు చతికల పడ్డారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు అధిక సంఖ్యలో చేరుతున్నారు. వైఎస్‌ జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ వైఎస్సార్‌సీపీ వైపు అడుగేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరాత్నాలు ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేశాయి. అకట్టుకున్నాయి. జగన్‌ ప్రకటించిన నవరత్నాలు క్షేత్రస్థాయిలో అన్ని వర్గాలకు చేర్చడంలో ఆ పార్టీ అభ్యర్థి బుర్రా మధు సఫలీకృతులయ్యారు.

కుటుంబం అంతా ప్రచారంలోనే.. 
వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ అభ్యర్థి బుర్రా మధు ప్రజాసమస్యలపై ఇప్పటికే అనేక పోరాటాలు చేశారు. పట్టణంతో పాటు, ఆరు మండలాల్లో ఎక్కడ ప్రజా సమస్య వచ్చినా అధికార పార్టీ నేతలు ఆగడాలు చేసినా వెంటనే అక్కడికి చేరి న్యాయ పోరాటం చేసి ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారు. నియోజకవర్గంలో బుర్రాకు విపరీతమైన అభిమానం, ఆదరణ పెరిగింది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా కుటుంబంతో కలిసి ప్రతి గల్లీ, ప్రతి ఇంటికి బుర్రా కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు. అమ్మా, అయ్యా, అక్క, చెల్లి, అవ్వా, తాతా అంటూ ప్రతి ఒటరను కలిసి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండంటూ కోరుతున్నారు. ఫ్యాను గుర్తుకు ఓటేయండి.. ఎమ్మెల్యేగా తనను ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డిని గెలిపించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయండి.. అంటూ ప్రతి ఒక్కరినీ ఓటు అడుగుతున్నారు. బుర్రా మధు, లక్ష్మి దంపతులతో పాటు కుటుంబలోని పిల్లలంతా తలా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని రోజూ రాత్రి వరకు ప్రచారం చేస్తున్నారు.

రెట్టించ్చిన ఉత్సాహం 
బుర్రా నామినేషన్‌ రోజు వచ్చిన జన ప్రవాహంతో ప్రత్యార్థి పార్టీ సైతం ఆలోచనలో పడింది. పట్టణంలోని వీధులన్నీ జన సంద్రమయ్యాయి. వైఎస్సార్‌ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ఎన్నికల ప్రచార సభకు జనం పోటెత్తారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. నియోజకవర్గంలో వార్‌ వన్‌సైడ్‌గా మారింది. నిఘా వర్గాలు సైతం కనిగిరి కొండపై వైఎస్సార్‌ సీపీ జెండా ఎగుర వేయడం ఖాయమంటూ నివేదికలిచ్చాయి. వైఎస్సార్‌ ప్రభంజనంతో ప్రత్యార్థి పార్టీ అభ్యర్థి  ఉక్కిరిబిక్కిరి అయ్యారంటే అతిశయోక్తి కాదు. వైఎస్సార్‌ సీపీలో టీడీపీ, ఇతర పార్టీలకు చెందిన వారు వందల సంఖ్యలో వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నారు. పార్టీ నియోజకవర్గ అభ్యర్థి బుర్రా మధు వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి నమ్మకం కల్పిస్తూ తానున్నానంటూ భరోసా కల్పిస్తూ అందరి మన్ననలు బుర్రా పొందుతున్నారు.

నిరుత్సాహంలో టీడీపీ అభ్యర్థి 
టీడీపీలో ఒకరిద్దరు చేరినా వైఎస్సార్‌ సీపీలోకి టీడీపీ సీనియర్‌ నాయకులు వందల సంఖ్యలో చేరుతుండటంతో టీడీపీ అభ్యర్థి తీవ్ర నిరుత్సాహంలో కొట్టు మిట్టాడుతున్నాడు. టీడీపీ పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్న సీనియర్‌ నాయకులు అన్ని సామాజికవర్గాలకు చెందిన వారు టీడీపీకి గుడ్‌బై చెప్తున్నారు. టీడీపీ అభ్యర్థి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ప్రతి సభకు, కార్యక్రమానికి జనం పొటెత్తడం.. ఇంటిలిజెన్స్, నిఘా వర్గాలకు సైతం కనిగిరిలో వార్‌ వన్‌సైడ్‌ అంటూ నివేదికలు ఇవ్వడంతో టీడీపీ నేతలు క్షేత్రస్థాయిలో సైతం డీలా పడిపోతున్నారు.

భగ్గుమంటున్న కదిరి వర్గీయులు
మరోవైపు టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కదిరి వర్గీయులు టీడీపీ అభ్యర్థిపై కస్సు బుస్సు మంటున్నారు. కొందరు ఇప్పటికే కనిగిరి వదిలి దర్శి వెళ్లారు. మరికొందరు పార్టీ వదిలి బయటకు వెళ్ల లేక అక్కడే ఉంటూ తీవ్రంగా రగిలిపోతున్నారు. కదిరి టిక్కెట్టును ఉగ్ర లాక్కున్నాడనే ఆక్రోశంతో రగులుతూ కసితో ఉన్నారు. ఇటీవల ఎన్నికల  ప్రచార కార్యక్రమంలో భాగంగా కనిగిరిలో జరిగిన సీఎం సభలో కనీసం కదిరి బాబూరావు పేరును కూడా ఆయన పలకరించలేదు. కాపు సామాజికవర్గ నేతలు తీవ్రంగా రగిలిపోతున్నారు. టీడీపీకి కాపు సత్తా చూపిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. కదిరికి టిక్కట్టు కనిగిరిలో ఇవ్వక పోవడంతో ఇప్పటికే ఆ సామాజికవర్గం వారు నిరసనలు తెలిపిన సంగతి విదితమే. కనిగిరి టిక్కెట్టు కోసం చివరి వరకు పోరాడిన కదిరి తన టిక్కెట్టును ఉగ్ర లాక్కున్నాడంటూ కార్యకర్తల సమావేశంలో కన్నీటి పర్యాంతమైన విషయాన్ని కదిరి వర్గీయులు మరవలేక పోతున్నారు.

కనిగిరి ప్రజలతో బుర్రా మమేకం 
గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓటమి చెందిన బుర్రా మధు.. ఐదేళ్ల నుంచి కనిగిరిలోనే  నివాసం ఉంటూ అందరి మన్ననలు పొందారు. ఐదేళ్ల నుంచి బుర్రా మధు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలతో పాటు, సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరినీ స్వయంగా పలుకరించారు. గడపగడపకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కార్యక్రమంలో గ్రామాల్లోని ప్రతి గడప తిరిగి అందరి ఆశీస్సులు బుర్రా పొందారు. అన్ని సామాజికవర్గాల మద్దతు పొంది గెలుపు దశలో దూసుకెళ్తున్నారు. ఇతర పార్టీల వారు సైతం బుర్రా ఎంత కష్టపడుతున్నారు. ఒక్క అవకాశం ఇద్దాం.. అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

సైకిల్‌కు పంక్చర్‌
నియోజకవర్గంలో టీడీపీ రోజురోజుకూ డీలా పడుతోంది. అసమ్మతి నాయకులను మచ్చిక చేసుకోవడంలోనే టీడీపీ నేతలకు సమయం సరిపోవడం లేదు. మరోవైపు వైఎస్సార్‌ సీపీలో రోజూ వందల సంఖ్యలో టీడీపీ, ఇతర పార్టీల వారు చేరుతున్నారు. ఇప్పటికి టీడీపీకి చెందిన పట్టణంలోని కౌన్సిలర్లు చింతం శ్రీను, కోప్షన్‌ సభ్యుడు పీర్ల మస్తాన్‌వలి, షీప్‌ యార్డ్‌ డైరక్టర్‌ దేవర వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు కాసుల గురవయ్య, సీనియర్‌ నాయకులు రహిమాన్‌తో పాటు అనేక మంది ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు వైఎస్సార్‌ సీపీ కండువా కప్పుకున్నారు. పీసీపల్లిలో టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ ప్రజాప్రతినిధి పులి వెంకటేశ్వరరెడ్డి వైఎస్సార్‌ సీపీలో చేరారు.

అతనితో పాటు వందలాది మంది పార్టీలో చేరారు. సీఎస్‌పురం మండలంలోని టీడీపీ సినియర్‌ నాయకులు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు గుంటయ్య, చిట్టిబోయిన వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు ఆలా తిరుపతయ్య, కె.రత్తమ్మ, సర్పంచ్‌లు పులిమి ఆదినారాయణ, సాయమ్మ, కాపు చెంగలయ్యలతో వందలాది మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. వెలిగండ్ల మండలంలో మండల ప్రధాన కార్యదర్శి మల్లెబోయి మీరాకుమారి, గజ్జల నాగేశ్వరరెడ్డి మరికొందరు పార్టీలో చేరారు. పామూరులో తిరుపతయ్య, ఆకుపాటి రమణయ్య, గుంటుపల్లి సుబ్బరాయుడు, మాలకొండయ్య, ఉప్పలపాటి రామాంజనేయులు, ఊసా మధు, చల్లా సుబ్బారావు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు వైఎస్సార్‌ సీపీలో చేరారు. హెచ్‌ఎంపాడు మండలంలో పాశం పిచ్చయ్య, తాతపుడి బుజ్జి, కాశమ్మ రమణయ్య, నాలి వెంకటేశ్వర్లుతోపాటు వందలాది మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement