మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమని మంచిర్యాల ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్రం తెలంగాణ ప్రకటన చేసిన తర్వాత సీమాంధ్ర నాయకులు అడ్డుకోలేరన్నారు. తెలంగాణ ఏర్పాటుతో ప్రధానంగా తూర్పు ప్రాంతంలోని మంచిర్యాల మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. శ్రీరాంపూర్, మందమర్రి సింగరేణి ఏరియా పరిధిలో దాదాపు 15 నూతన గనులు త్వరలోనే ఏర్పాటవుతాయని, వీటితో ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. 5 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదక కేంద్రం కూడా ఏర్పాటు కానుందని చెప్పారు.
కొమురం భీం జిల్లాగా మంచిర్యాల..
తెలంగాణ ఏర్పాటుతో మంచిర్యాల జిల్లా ఏర్పడుతుందని, దీనికి కొమురం భీం జిల్లాగా నామకరణం చేసేలా చూస్తామని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లాలో వర్షాపాతం కూడా అధికంగా ఉన్నందున గిరిజన ప్రాంతాల్లో సాగు నీరు, తాగు నీరు పుష్కలంగా అందుతుందన్నారు. మంచిర్యాల కేంద్రంగా 80 కిలో మీటర్ల పరిధిలో దాదాపు 2.50 లక్షల జనాభా ఉందని, కార్పొరేషన్‌గా ఏర్పాటైతే మంచిర్యాల తెలంగాణలో ఆదర్శవంతమైన జిల్లా అవుతుందన్నారు. అలాగే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయానికి సీమాంధ్ర నేతలు కట్టుబడి ఉండాలన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని అన్నదమ్మల్లా వీడిపోయేలా సహకరించాలని కోరారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ కృష్ణారావు, పట్టణ అధ్యక్షుడు కల్వల జగన్‌మోహన్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్లు సుదమల్ల హరికృష్ణ, బొలిశెట్టి కిషన్, మాదంశెట్టి సత్యనారాయణ, నాయకులు సుంకరి రమేశ్, మంచాల రఘువీర్, పూదరి ప్రభాకర్, మహేశ్, సయ్యద్ తన్హర్‌అలీ పాల్గొన్నారు.
ప్రత్యేక తెలంగాణతోనే అభివృద్ధి
Published Mon, Aug 12 2013 12:32 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM
Advertisement
Advertisement