తెలంగాణ ఆగదు: ఈటెల రాజేందర్ | Telangana state won't be stopped, says Etela rajender | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఆగదు: ఈటెల రాజేందర్

Published Fri, Nov 22 2013 7:06 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

Telangana state won't be stopped, says Etela rajender

గజ్వేల్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదని.. అయినా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం గజ్వేల్‌కు వచ్చిన సందర్భంగా స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం తీరుపై ధ్వజమెత్తారు.  విభజన విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి సీమాంధ్ర పక్షపాతిగా ప్రవర్తించడం సిగ్గుచేటని అన్నారు. జీఓఎంకు సీఎం ఇచ్చిన నివేదికలో ఉన్న అంశాలన్నీ అవాస్తవలేనని ఆరోపించారు. నిజాం హయాంలోనే హైదరాబాద్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. సీమాంధ్రకు చెందిన పెట్టుబడిదారుల పారిశ్రామిక అవసరాలకు జిల్లాలోని మంజీర నీటిని తరలించడంవల్ల జిల్లాలోని ఆయకట్టు బీడుగా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
 
 పాశమైలారం, ఐడీపీఎల్ లాంటి ప్రాంతాల్లో కాలుష్య జలాల కారణంగా స్థానిక ప్రజలు రోగాలబారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజలకు పరిశ్రమల్లోనూ ఉపాధి కరువై అడ్డామీది కూలీలుగా మారుతున్నారని వాపోయారు. జీఓఎంకు తప్పుడు నివేదికలిస్తున్నా తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు జైత్రయాత్రలు నిర్వహించడం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి హైదరాబాద్‌పై ఆంక్షలు పెట్టడానికి కుట్రలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం ఉండబోదని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, టీఆర్‌ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంటేరు నారాయణరెడ్డి, జిల్లా నాయకులు దేవేందర్, తెలంగాణ జాగృతి యువజన విభాగం అధ్యక్షుడు రమేశ్, టీఆర్‌ఎస్వీ నాయకులు లింగం, ఆహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
 
 100 ఏళ్ల కిందటే ఉద్యమం పుట్టింది
 తొగుట: తెలంగాణ  ఉద్యమం 100 ఏళ్ళ కిందటే పుటిందని, కానీ నేడు కేసీఆర్ నాయకత్వంలో పూర్తి స్థాయిలో బలపడటం వల్లే ప్రత్యేక రాష్ట్రం సిద్ధిస్తున్నదని టీఆర్‌ఎస్ ఎల్పీ నేత ఈటెల రాజేందర్ వెల్లడించారు. తొగుట మండలం రాంపూర్ కోటిలింగాల దేవాలయంలో గురువారం మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ వాదులకు నిర్వహించిన రాజకీయ శిక్షణ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఓట్లు, సీట్ల కోసం తెలంగాణ  ఉద్యమం పుట్టిందంటూ కొందరు  కాంగ్రెస్ నాయకులు మాట్లాతుండటం సిగ్గుచేటన్నారు. ఉద్యమకారులకు పదవులు లెక్కకాదన్నారు. నల్లగొండ జిల్లాలో ఉన్న  నాగార్జునసాగర్ నీటి వాటాలో సీమాంధ్ర ప్రాంతానికి సుమారు 15 లక్షల ఎకరాలకు నీరుపోతుంటే సొంత జిల్లాకు కేవలం 5 లక్షల ఎకరాలకు నీరు వస్తుందన్నారు. ఒకప్పుడు  మెతుకు సీమ(మెదక్ జిల్లా) దేశానికి పట్టెడు అన్నం పెట్టే స్థితిలో ఉండేదని రానూ రానూ సీమాంధ్రుల పాలనలో అన్నమో రామచంద్రా అనే దుస్థితికి కారణమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆపార్టీ జిల్లా ఇన్‌చార్జి రాజయ్యయాదవ్, రాష్ట్ర నాయకులు కొత్త ప్రభాకర్‌రెడ్డి, నందిని సిధారెడ్డి, బూమలింగంగౌడ్, పార్టీ మండల సర్పంచుల పోరం అధ్యక్షుడు తోయేటి ఎల్లం,మండల అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement