టీ జేఏసీ, నిపుణుల ప్రతిపాదన కేంద్రంపై ఒత్తిడికి నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగిన మొదటిరోజునే రెండు రాష్ట్రాలకు హైకోర్టులు విడివిడిగా ఏర్పాటు కావాలని, దీనికోసం కేంద్రంపై అవసరమైన ఒత్తిడి తేవాలని తెలంగాణ జేఏసీ, ఈ ప్రాంతానికి చెందిన వివిధ రంగాల నిపుణులు ప్రతిపాదించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వివిధ రంగాల నిపుణులు, విశ్రాంత అధికారులు, మేధావులతో టీ జేఏసీ, టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు సోమవారం రాత్రి హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్ నేత కె.విశ్వేశ్వర్‌రెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం, టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, శాసనసభాపక్ష నాయకులు ఈటెల రాజేందర్, రిటైర్డు ఐజీ నందన్, రిటైర్డు చీఫ్ ఇంజనీర్ ఆర్.విద్యాసాగర్‌రావు, ప్రొఫెసర్లు గౌతం, రమా మెల్కొటే, న్యాయవాదులు ప్రకాశ్‌రెడ్డి, డి.పి.రెడ్డి (టీడీఎఫ్), పెంటారెడ్డి, టి.వివేక్, అద్దంకి దయాకర్, సి.విఠల్, రఘు, రాధాకృష్ణ, బిక్షం వంటి నిపుణులు దాదాపు 20 మందికి పైగా పాల్గొన్నారు.
ముసారుుదా బిల్లులోని.. హైకోర్టు, హైదరాబాద్‌లో శాంతిభద్రతలు, నదీ జలాల పంపకం, ఉద్యోగులు-సర్వీసులు, విద్యుత్ సంబంధిత అంశాలపై ఆయా రంగాల నిపుణులతో ఈ సందర్భంగా అధ్యయనం చేశారు. బిల్లుకు చేయూల్సిన సవరణలపై చర్చించారు. రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో అన్ని అంశాల్లోని అభ్యంతరాలపై దృష్టి పెట్టకుండా రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే ప్రధానమైన రంగాలపై కేంద్రీకరించాలని అనుకున్నారు. అన్ని వివాదాలను పరిష్కరించాల్సిన హైకోర్టు వివాదంలో ఉండకూడదంటే విభజన జరిగిన నాటినుండే రెండు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టులుండాలని అభిప్రాయపడ్డారు. ముసాయిదాలోని పదజాలం, సాంకేతిక అంశాలపై అనుమానాలు, వివరణలు, అవసరమైన సవరణలు వంటివాటిపై మంగళవారం కూడా సమావేశమై ఓ అభిప్రాయూనికి రావాలని అనుకున్నారు. బుధవారం జరిగే జేఏసీ విస్తృతస్థాయి సమావేశంలో వీటిని చర్చకు పెట్టాలని నిర్ణయించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి నివేదించి సవరణల కోసం అన్ని రకాల ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు.
విభజన తొలిరోజే హైకోర్టు వేరుపడాలి
Published Tue, Dec 10 2013 2:42 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
Advertisement