
సూర్యాపేట టౌన్: రాష్ట్రంలోనే రెండవ అతిపెద్దదైన చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర దిష్టిపూజ మహోత్సవం ఆదివారం అర్ధరాత్రి అంగరంగా వైభవంగా నిర్వహించారు

ఫిబ్రవ్రరి 16 నుంచి 20 వరకు జరుగనున్న జాతరకు పదిహేను రోజుల ముందు మాఘ మాసంలో అమావాస్య ఆదివారం దిష్టిపూజ నిర్వహించడం ఆనవాయితీ

దీంట్లో భాగంగా శనివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం చీకటాయపాలెం నుంచి మహాయాత్రగా సూర్యాపేట మండలం కేసారం గ్రామానికి తీసుకొచ్చిన దేవరపెట్టేకు ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన మెంతబోయిన, మున్న, గోర్ల, బైకాను వంశస్తులు ప్రత్యేక పూజలు చేశారు

అనంతరం శ్రీలింగమంతులస్వామి, గంగమ్మ, ఆకుమంచమ్మ, యలమంచమ్మ, చౌడమ్మలతో ఉన్న దేవరపెట్టెతో పాటు బియ్యం, పాలు, పెరుగు, నెయ్యి, కుంకుమ, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, గుగ్గిలం, మైశాచి, తల్లి, పిల్ల గొర్రెను ఊరేగింపుగా పెద్దగట్టుకు తీసుకొచ్చారు

గ్రామం నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దగట్టుకు అర్ధరాత్రి వందలాది మంది భక్తులు ఓ లింగా.. నామస్మరణతో తరలి రావడంతో గొల్లగట్టు మార్మోగింది

ఈ సందర్భంగా డప్పు, భేరీల శబ్దంతో గజ్జెల లాగుల సవ్వడితో పడమర వైపు ఉన్న మెట్లపై నుంచి గట్టుపైకి దేవరపెట్టెను చేర్చి ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేశారు

దిష్టిపూజకు అవసరమైన రెండు బోనాలను మున్న, మెంతబోయిన వారు తీసుకొచ్చి శ్రీలింగమంతులస్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు




















