వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ :
సీమాంధ్ర పాలకుల ఆధిపత్యాన్ని సహించేది లేదని... ఆత్మగౌరవం కోసం దేనికైనా తెగిస్తామని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తేల్చిచెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఇంత వరకు వచ్చిన తాము.. రాష్ట్రాన్ని సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. హన్మకొండ కాళోజీ సెంటర్‌లో గురువారం తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన శాంతి మహాదీక్షకు ఆయన హాజరై మాట్లాడారు. వలస పాలనలో హైదరాబాద్ నగరం నాశనమైందని, వరంగల్‌ను ఎందుకు ఐటీగా తీర్చిదిద్దలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆజంజాహి మిల్లును మూసివేశారని... యంత్రాలను తరలించారని, చివరకు భూములు కూడా అమ్ముకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు హైదరాబాద్‌పై సీమాంధ్ర నాయకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం తన ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టే యత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వమే ఘర్షణలను సృష్టిస్తోందని, ఈ సమయంలో శాంతియుతంగా తెలంగాణ సాధన కోసం కలిసికట్టుగా సాగాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ నేత ఈటెల రాజేందర్, టీజేఏసీ కో చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, టీఎన్జీవో అధ్యక్షకార్యదర్శులు దేవిశ్రీప్రసాద్, కారం రవీందర్‌రెడ్డి, టీజేఏసీ జిల్లా చైర్మన్ పాపిరెడ్డి, ఎమ్మెల్యే వినయ్, టీఆర్‌ఎస్ నాయకులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మర్రి యాదవరెడ్డి, బీజేపీ నాయకుడు వేణుగోపాల్‌రెడ్డి, ప్రొఫెసర్ సీతారాంనాయక్, ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు రాజేష్, కార్యదర్శి రత్నవీరాచారి, లెక్చర్లు, విద్యార్థి, యువజన, మహిళా, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
దేనికైనా తెగిస్తం
Published Fri, Sep 6 2013 5:08 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
Advertisement
Advertisement