తాండూరు, న్యూస్‌లైన్:
తెలంగాణను దోచుకుంటున్న సీమాంధ్ర దోపిడీ సామాజ్య్రాన్ని కూకటివేళ్లతో కూల్చివేసేందుకు తెలంగాణ బిడ్డలు చీమలదండులా ఏకమై మరో మహోద్యమానికి సిద్ధం కావాలని కవి, గాయకుడు, మంజీరా రచయితల సంఘం అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం తాండూరు జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక భద్రేశ్వర చౌక్‌లో నిర్వహించిన ‘ముల్కీ అమరవీరుల సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాష్ మాట్లాడుతూ.. సీమాంధ్రుల సినిమాల మత్తులోంచి తెలంగాణ బిడ్డలు ఇప్పటికైనా బయటపడాలన్నారు. సమైక్య పేరుతో 1956లో దెబ్బకొట్టి తెలంగాణ ఉద్యోగాలను అన్యాయంగా పొందిన సీమాం ధ్రుల ఆధిపత్యానికి అడ్డుకట్టు వేయాలన్నారు. తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్‌లో బిల్లు పెట్టే వరకూ సీమాంధ్రుల దుర్మార్గాలను అడ్డుకునేందుకు పోరాడాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వమే సమైక్య ఉద్యమాన్ని నడుపుతోందని ఆయన ధ్వజమెత్తారు. సీఎం కిరణ్‌మార్‌రెడ్డి బోగస్ ఉద్యమాన్ని నడుపుతున్నారని దుయ్యబట్టారు. సోనియాగాంధీకి తెలంగాణ భయం ఉంది.
చిరంజీవి, లగడపాటి ఎవరెన్ని చెప్పినా ప్రత్యేక రాష్ట్రాన్ని ఆపలేరన్నారు. ఉద్యోగాల కోసం ప్రాణాలర్పించాల్సిన దయనీయ పరిస్థితి తెలంగాణలో మినహా దేశంలో మరెక్కడా లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రక్తం, చెమటతో నిర్మించిన హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని సీమాంధ్రులు చేస్తున్న కుట్రలను సాగనివ్వబోమన్నారు. నిజ మైన ముల్కీ (ప్రాంతీయులు)లు తెలంగాణ వారేనని, సీమాంధ్రులు గెయిరీ ముల్కీ (ప్రాం తీయేతరులు)లన్నారు. మూసీ నదిని మురికికూపంగా మార్చిన పాపం సీమాంధ్రులకు చుట్టుకుట్టుందని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చూసి మూసీనది సైతం సీఎం కిరణ్, చంద్రబాబులపై పగతీర్చుకోవాలనుకుంటోందని అన్నారు.
చిచ్చుపెట్టిందే చంద్రబాబు
తెలుగుజాతి పేరుతో చిచ్చుపెట్టిందే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడని విమర్శించారు. సకల జనుల సమ్మె జరుగుతున్నప్పుడు చంద్రబాబూ ఎక్కడున్నావు. సమైక్య ఉద్యమం కోసం ఇప్పుడు సీమాంధ్రలో యాత్ర చేపట్టడాన్ని ఆయన దుయ్యబట్టారు. దుబాయ్‌లో తెలంగాణ ప్రజలు చనిపోతే తెలుగుజాతి కనబడలేదా బాబూ! నక్సలైట్‌లు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందితే నీకు దుఃఖం ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఎంతోమందికి ఉద్యోగాలు రాకపోతే బాబు ఎందుకు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. తెలుగుజాతి పేరు చెప్పి తెలంగాణ ప్రజలను బొందపెడతారా? మీది ఒక ఉద్యమేనా? అని దేశపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా మిగులు జలాల పేరుతో నికర జలాల తరలింపు, ఉద్యోగాలు, భూదోపిడీకి అడ్డుకట్ట పడుతుందనే కుట్రతోనే తెలంగాణ రాకుండా సీమాంధ్రులు సమైక్య ఉద్యమం చేస్తున్నారని మండిపడ్డారు.
భూములు అడ్డగోలుగా కొల్లగొట్టారు..
కర్ణాటక ఆహారపు అలవాటు, సంప్రదాయాలతో కన్నడ కస్తూరీలా తాండూరు ప్రజలు కలిసి జీవిస్తున్నప్పుడు సీమాంధ్రులు వీడిపోయి తెలంగాణ కలిసి ఉండటానికి అభ్యం తరం ఏమిటని దేశిపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. తెలంగాణ తేట... కన్నడ కస్తూరీ.. ఆంధ్రా అధ్వానం అని విమర్శించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల చుట్టూతా సినిమా హీరోలు అడ్డగోలుగా భూములను కొల్లగొడుతున్నారన్నారు. తాండూరుకు కృష్ణా జలాలు వస్తే ఇక్కడి నుంచే నిర్మాతలు, హీరోలు అవుతారని ఆయన పేర్కొన్నారు. డైలాగ్‌లు సరిగా చెప్పలేని సీమాంధ్ర హీరోలు... నవరసాలు పండించే తెలంగాణ భాషను అవహేళన చేయడంపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ సాధనతో సీమాంధ్ర దోపిడీ ఆగుతుందని, మన ఉద్యోగాలు, వనరులు, నీళ్లు దక్కుతాయని, ఇందుకు హీరోల్లా తెలంగాణ బిడ్డలు ఉద్యమిం చాలన్నారు. అంతకుముందు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుంచి కళాశాలల విద్యార్థులు ప్రధాన వీధుల్లో శాంతి ర్యాలీ నిర్వహిస్తూ భద్రేశ్వర చౌక్ చేరుకున్నారు. తెలంగాణ నినాదాలతో పట్టణం మార్మోగింది. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ సోమశేఖర్, టీవీవీ రాష్ట్ర కార్యదర్శి విజయ్‌కుమార్, జేఏసీ సలహాదారు రంగారావు, బీజేపీ నాయకులు కృష్ణ, శాంత్‌కుమార్, భద్రేశ్వర్, టీఆర్‌ఎస్‌కేవీ నాయకుడు విజయ్, టీఆర్‌ఎస్ నాయకుడు రోహిత్‌రెడ్డి, కమల్ అక్తర్, సోమనాథ్, రమేష్, అనసూయ, వెంకటేష్‌చారి, నబీ, సంగమేశ్వర్ పాల్గొన్నారు.
సమైక్య ఉద్యమం నడుపుతున్నది సీఎం కిరణే
Published Fri, Sep 6 2013 1:45 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
Advertisement
Advertisement