అనన్య బిర్లాకు చెందిన సూక్ష్మరుణ కంపెనీ (ఎంఎఫ్‌ఐ) స్వతంత్ర మైక్రోఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ దేశంలో రెండో అతి పెద్ద ‘ఎంఎఫ్‌ఐ’గా గుర్తింపు పొందనుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా గెలుపు జెండా ఎగరేసిన అనన్య బిర్లా సింగర్, రైటర్, యాక్టర్, సోషల్ యాక్టివిస్ట్...
ఏకంగా అయిదు సింగిల్స్‌లో డబుల్ ప్లాటినమ్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. అనన్య గానప్రతిభ గురించి చెప్పుకోవడానికి ఇదొక మచ్చుతునక మాత్రమే. ‘లెట్ దేర్ బి లవ్’ ‘ఎవ్రీ బడీ లాస్ట్’ పాటలతో అమెరికన్ నేషనల్ టాప్ 40 పాప్ రేడియో షో జాబితాలో చోటు సాధించిన ఫస్ట్ ఇండియన్ ఆర్టిస్ట్‌గా ఘనత సాధించింది.
అనన్యకు చిన్నవయసు నుంచే సంగీతం అంటే ఇష్టం. పదకొండు సంవత్సరాల వయసులో సంతూర్ ప్లే చేయడం నేర్చుకుంది. ఎకనామిక్స్ అండ్ మేనేజ్‌మెంట్ కోసం ‘యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్’లో చేరిన అనన్య డిగ్రీ పూర్తి కాకుండానే చదువు మానేసింది.
యూనివర్శిటీలో చదువు సంగతి ఎలా ఉన్నా సంగీతంలో మాత్రం ఎటు చూసినా అనన్య పేరు వినిపించేది. పాడడంతో పాటు కవితలు, పాటలు కూడా రాసేది. గిటార్ ప్లే చేయడం నేర్చుకుంది. ‘లివిన్ ది లైఫ్’ తన డెబ్యూ సింగిల్. యూట్యూబ్‌లో 14 మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్‌లో నిలిచింది.
కునాల్ కోహ్లీ స్పై థ్రిల్లర్ ‘శ్లోక్’లో నటిగా ఆకట్టుకుంది.
ఇంగ్లాండ్‌లో ఉన్నప్పుడు సంగీత, సాహిత్య కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేది అనన్య. ఆందోళన, కుంగుబాటుతో సతమతం అవుతున్న యువత కోసం స్టూడెంట్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చిన తరువాత మానసిక సమస్యలతో బాధపడే వారికి సహాయం అందించడానికి ‘ఎంపవర్’ అనే సంస్థను ఏర్పాటు చేసింది. కోవిడ్ సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి 24“7 ఫ్రీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఈ హెల్ప్‌లైన్ ద్వారా వేలాది మంది ప్రజలకు మేలు జరిగింది.
అమెరికాకు చెందిన ప్రసిద్ధ మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ ‘నేషనల్ అలయెన్స్ ఆన్ మెంటల్ ఇల్‌నెస్’ అంబాసిడర్‌గా నియమితురాలైంది.
‘అనన్య బిర్లా ఫౌండేషన్’తో సేవాకార్యక్రమా లను విస్తృతం చేసింది.
సంగీతం అంటే అపారమైన అనురక్తి ఉన్న అనన్య వ్యాపారరంగంలో తొలి అడుగు వేసినప్పుడు...
‘అనన్య లోకం వేరు. ఆమె ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించడం కష్టం’ అనే గుసగుసలు వినిపించాయి.
అప్పటి వరకు అనన్య పేరు పక్కన సంగీతానికి సంబంధించిన విశేషణాలు కనిపించేవి. తరువాత స్వతంత్ర మైక్రోఫిన్, ఫౌండర్ అనేది ఆమె పేరు పక్కన కనిపించడం మొదలైంది. గ్రామీణ ప్రాంతాలలో మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడానికి ‘స్వతంత్ర’ను ఏర్పాటు చేశారు.
తన నాయకత్వ లక్షణాలతో ‘స్వతంత్ర’ను అగ్రగామిగా నిలిపింది అనన్య. బెస్ట్ స్టార్టప్‌లకు ఇచ్చే ‘గోల్డ్ అవార్డ్’ను గెలుచుకుంది. 2016లో గ్లోబల్ లగ్జరీ ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్ ఇకై ఏషియాకు సీయీవోగా బాధ్యతలు చేపట్టింది. ఫోర్బ్స్ ఆసియాస్ ఉమెన్ జాబితాలో అనన్య పేరు చోటు చేసుకుంది.
‘స్వతంత్ర’ వ్యవస్థాకురాలిగా అనన్య ఆఫీస్ గదికే పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలో పర్యటించేది. ఇండోర్‌లో ఒక పేదింటి మహిళ ‘స్వతంత్ర’ సహకారంతో ఇల్లు కట్టుకోగలిగింది. ఆమెతో మాట్లాడినప్పుడు అనన్యకు ఎంతో సంతోషంగా అనిపించింది.
అనన్య అపురూప విజయాలు చూసినప్పుడు ‘ఏ పని చేసే వాళ్లు ఆ పని చేస్తే మంచిది’ ‘రెండు పడవల మీద కాలు వద్దు’ లాంటి మాటలు, సామెతలు బిత్తర పోతాయి. పనిమీద అనురక్తి, అంకితభావం ఉంటే ఒక రంగానికి చెందిన వారు మరో రంగంలో విజయం సాధించవచ్చు అని చెప్పడానికి అనన్య బిర్లాలాంటి వాళ్లు పెద్ద ఉదాహరణ.
పెద్దింటి అమ్మాయి
పారిశ్రామిక దిగ్గజం కుమార మంగళం బిర్లా కూతురు అయిన అనన్య బిర్లా బాల్యం నియమ నిబంధనలు, రక్షణ వలయాల మ«ధ్య గడిచింది. చిన్నప్పుడే అనన్యకు బాడీగార్డ్ ఉండేవాడు. మిగతా అమ్మాయిల్లాగా ఎక్కడ పడితే అక్కడ ఆడుకోవడానికి లేదు. ఈ రూల్స్‌తో తనకు ఊపిరి ఆడేది కాదు. ఒత్తిడికి గురయ్యేది. ఇంత ఒత్తిడిలోనూ తనదైన కలలు కనేది. ‘అసలు నేనేమిటి?’ అనే ప్రశ్నకు ఆమెకు సంగీతంలో జవాబు దొరికింది.
సంగీతం తనలోని ఒంటరితనాన్ని పోగొట్టడమే కాదు ఆత్మబలాన్ని ఇచ్చింది. ‘పెద్దింటి అమ్మాయి’ అనే పేరు కంటే స్వేచ్ఛాప్రపంచాన్నే అనన్య ఇష్టపడేది.
‘పెద్ద యూనివర్శిటీలో పెద్ద చదువు చదవాలి. పెద్దింటి కుటుంబానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి... ఇలా నా గురించి అనుకునేవారు. అయితే నా ఆలోచనలు దీనికి భిన్నంగా ఉండేవి. ఇది చాలామందిని ఆశ్చర్యపరిచేది. అయితే తల్లిదండ్రులు మాత్రం నాకు ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉన్నారు. నా అభిప్రాయాలకు విలువ ఇచ్చారు’ అంటుంది అనన్య.
Comments
Please login to add a commentAdd a comment