MFI
-
సూక్ష్మ రుణాల్లో ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్‌ఐల ప్రధాన పాత్ర
కోల్‌కతా: దేశంలో సూక్ష్మ రుణాల పంపిణీలో ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు గణనీయమైన పాత్ర పోషిస్తున్నట్టు సూక్ష్మ రుణ సంస్థల నెట్వర్క్ (ఎంఫిన్) ప్రకటించింది. 2022–23 సంవత్సరానికి సూక్ష్మ రుణ పరిశ్రమకు (ఎంఎఫ్ఐలు) సంబంధించి నివేదికను రూపొందించి విడుదల చేసింది. 2023 మార్చి 31 నాటికి రూ.1,38,310 కోట్ల రుణాలను ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు అందించాయి. మొత్తం సూక్ష్మ రుణాల్లో ఇది 39.7 శాతానికి సమానం. సూక్ష్మ రుణాల్లో బ్యాంక్‌ల వాటా 34.2 శాతంగా ఉంది. ఇవి రూ.1,19,133 కోట్ల రుణాలను సమకూర్చాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు అందించిన సూక్ష్మ రుణాలు రూ.57,828 కోట్లుగా (16.6 శాతం వాటా) ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి ఎంఎఫ్‌ఐల మొత్తం పోర్ట్‌ఫోలియో (రుణాలు) రూ.3,48,339 కోట్లుగా ఉంది. ఎంఎఫ్ఐ రంగానికి అపార వృద్ధి అవకాశాలు ఉన్నాయని, 2024 మార్చి నాటికి సూక్ష్మ రుణ పరిశ్రమ పరిమాణం రూ.13 లక్షల కోట్లుగా ఉంటుందని పేర్కొంది. నూతన నియంత్రణలు సూక్ష్మ రుణ సంస్థల కార్యకలాపాలను బలోపేతం చేస్తాయని అభిప్రాయపడింది. కరోనా తర్వాత నిధుల వితరణ, పోర్ట్‌ఫోలియో నాణ్యత, క్లయింట్ల చేరికలో ఎంఎఫ్ఐ పరిశ్రమ బలంగా పుంజుకున్నట్టు తెలిపింది. -
బ్యాంకులకు ఝలక్ ఇచ్చిన ఎంఎఫ్ఐలు.. లోన్లలో ఇవే టాప్!
ముంబై: సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐలు) తమ మార్కెట్ వాటాను మరింత పెంచుకున్నాయి. సూక్ష్మ రుణాల్లో బ్యాంకులను దాటుకుని నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ మొదటి స్థానానికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా సూక్ష్మ రుణాల్లో ఎంఎఫ్‌ఐల వాటా 2022–23లో 40 శాతానికి చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 35 శాతం కంటే పెరిగింది. కరోనా లాక్డౌన్లతో ఎంఎఫ్ఐ పరిశ్రమ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవడం గమనార్హం. కలెక్షన్లు, కొత్త రుణాల మంజూరు గణనీయంగా పడిపోయింది. దీంతో 2020 మార్చి నాటికి సూక్ష్మ రుణాల్లో ఎంఫ్ఐల వాటా 32 శాతంగా ఉంటే, 2021 మార్చి నాటికి 31 శాతానికి తగ్గింది. 2022 మార్చి నాటికి తిరిగి 35 శాతానికి పుంజుకున్నది. ఇక ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం సూక్ష్మ రుణాల్లో తమ వాటాను 40 శాతానికి పెంచుకున్నాయి. గత ఆర్థిక సంవత్సంలో సూక్ష్మ రుణాల్లో బ్యాంక్‌లు 24 శాతం వృద్ధిని నమోదు చేయగా, ఎంఎఫ్ఐలు 37 శాతం వృద్ధి చెందాయి. ప్రాధాన్య రంగాలకు రుణ వితరణ కింద దాదాపు అన్ని బ్యాంకులు ఎంఎఫ్ఐ రుణ పుస్తకాన్ని నిర్వహించడం తప్పనిసరి. సూక్ష్మ రుణాల్లో బ్యాంక్‌ల వాటా 2023 మార్చి నాటికి 34 శాతానికి తగ్గింది. ఈ రంగంలో బ్యాంక్‌ల వాటా 2020, 2022 మార్చి నాటికి 40 శాతంగా ఉంటే, మధ్యలో 2021 మార్చి నాటికి 44 శాతానికి పెరిగింది. కరోనా సవాళ్లను ఎంఎఫ్ఐ పరిశ్రమ అధిగమించడంతో, సూక్ష్మ రుణాల్లో అవి మరింత దూకుడుగా వాటాను పెంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ వివరాలను కేర్ విడుదల చేసింది. వృద్ధి తగ్గొచ్చు సూక్ష్మ రుణ పరిశ్రమలో వృద్ధి ఇక ముందూ కొనసాగుతుందని, అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 28 శాతానికి పరిమితం కావచ్చని కేర్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. సగటు రుణ టికెట్ సైజు పెరగడం, జాయింట్ రుణాలకు బదులు, విడిగా వ్యక్తులకు రుణాలు ఇవ్వడం అనేవి రిస్క్‌లుగా కేర్ రేటింగ్స్ పేర్కొంది. రాజకీయ, భౌగోళిక అనిశ్చితుల వల్ల కుదుపులకు లోనయ్యే తత్వం వీటికి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. రుణ రేటుపై పరిమితులను ఆర్బీఐ ఎత్తివేయడంతో, రిస్క్ ఆధారంగా రేటు విషయంలో ఎంఎఫ్ఐలు స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నట్టు పేర్కొంది. ఇది వాటి నికర వడ్డీ మార్జిన్లను (నిమ్) పెంచుతున్నట్టు వివరించింది. 2020–21లో గరిష్ట స్థాయికి వెళ్లిన రుణ వ్యయాలు సైతం అక్కడి నుంచి తగ్గాయని, అయినప్పటికీ కరోనా ముందున్న నాటితో పోలిస్తే అధిక స్థాయిలోనే ఉన్నట్టు తెలిపింది. పునరుద్ధరించిన కొన్ని రుణాలు ఎన్పీఏలుగా మారడాన్ని ప్రస్తావించింది. నిమ్ 2023–24లో 3.8 శాతానికి మెరుగుపడొచ్చని అంచనా వేసింది. -
అనన్య సామాన్య స్వతంత్రం
అనన్య బిర్లాకు చెందిన సూక్ష్మరుణ కంపెనీ (ఎంఎఫ్ఐ) స్వతంత్ర మైక్రోఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ దేశంలో రెండో అతి పెద్ద ‘ఎంఎఫ్ఐ’గా గుర్తింపు పొందనుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా గెలుపు జెండా ఎగరేసిన అనన్య బిర్లా సింగర్, రైటర్, యాక్టర్, సోషల్ యాక్టివిస్ట్... ఏకంగా అయిదు సింగిల్స్‌లో డబుల్ ప్లాటినమ్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. అనన్య గానప్రతిభ గురించి చెప్పుకోవడానికి ఇదొక మచ్చుతునక మాత్రమే. ‘లెట్ దేర్ బి లవ్’ ‘ఎవ్రీ బడీ లాస్ట్’ పాటలతో అమెరికన్ నేషనల్ టాప్ 40 పాప్ రేడియో షో జాబితాలో చోటు సాధించిన ఫస్ట్ ఇండియన్ ఆర్టిస్ట్‌గా ఘనత సాధించింది. అనన్యకు చిన్నవయసు నుంచే సంగీతం అంటే ఇష్టం. పదకొండు సంవత్సరాల వయసులో సంతూర్ ప్లే చేయడం నేర్చుకుంది. ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్ కోసం ‘యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్’లో చేరిన అనన్య డిగ్రీ పూర్తి కాకుండానే చదువు మానేసింది. యూనివర్శిటీలో చదువు సంగతి ఎలా ఉన్నా సంగీతంలో మాత్రం ఎటు చూసినా అనన్య పేరు వినిపించేది. పాడడంతో పాటు కవితలు, పాటలు కూడా రాసేది. గిటార్ ప్లే చేయడం నేర్చుకుంది. ‘లివిన్ ది లైఫ్’ తన డెబ్యూ సింగిల్. యూట్యూబ్‌లో 14 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్‌లో నిలిచింది. కునాల్ కోహ్లీ స్పై థ్రిల్లర్ ‘శ్లోక్’లో నటిగా ఆకట్టుకుంది. ఇంగ్లాండ్‌లో ఉన్నప్పుడు సంగీత, సాహిత్య కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేది అనన్య. ఆందోళన, కుంగుబాటుతో సతమతం అవుతున్న యువత కోసం స్టూడెంట్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చిన తరువాత మానసిక సమస్యలతో బాధపడే వారికి సహాయం అందించడానికి ‘ఎంపవర్’ అనే సంస్థను ఏర్పాటు చేసింది. కోవిడ్ సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి 24“7 ఫ్రీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఈ హెల్ప్‌లైన్ ద్వారా వేలాది మంది ప్రజలకు మేలు జరిగింది. అమెరికాకు చెందిన ప్రసిద్ధ మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ ‘నేషనల్ అలయెన్స్ ఆన్ మెంటల్ ఇల్నెస్’ అంబాసిడర్‌గా నియమితురాలైంది. ‘అనన్య బిర్లా ఫౌండేషన్’తో సేవాకార్యక్రమా లను విస్తృతం చేసింది. సంగీతం అంటే అపారమైన అనురక్తి ఉన్న అనన్య వ్యాపారరంగంలో తొలి అడుగు వేసినప్పుడు... ‘అనన్య లోకం వేరు. ఆమె ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించడం కష్టం’ అనే గుసగుసలు వినిపించాయి. అప్పటి వరకు అనన్య పేరు పక్కన సంగీతానికి సంబంధించిన విశేషణాలు కనిపించేవి. తరువాత స్వతంత్ర మైక్రోఫిన్, ఫౌండర్ అనేది ఆమె పేరు పక్కన కనిపించడం మొదలైంది. గ్రామీణ ప్రాంతాలలో మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడానికి ‘స్వతంత్ర’ను ఏర్పాటు చేశారు. తన నాయకత్వ లక్షణాలతో ‘స్వతంత్ర’ను అగ్రగామిగా నిలిపింది అనన్య. బెస్ట్ స్టార్టప్‌లకు ఇచ్చే ‘గోల్డ్ అవార్డ్’ను గెలుచుకుంది. 2016లో గ్లోబల్ లగ్జరీ ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్ ఇకై ఏషియాకు సీయీవోగా బాధ్యతలు చేపట్టింది. ఫోర్బ్స్ ఆసియాస్ ఉమెన్ జాబితాలో అనన్య పేరు చోటు చేసుకుంది. ‘స్వతంత్ర’ వ్యవస్థాకురాలిగా అనన్య ఆఫీస్ గదికే పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలో పర్యటించేది. ఇండోర్‌లో ఒక పేదింటి మహిళ ‘స్వతంత్ర’ సహకారంతో ఇల్లు కట్టుకోగలిగింది. ఆమెతో మాట్లాడినప్పుడు అనన్యకు ఎంతో సంతోషంగా అనిపించింది. అనన్య అపురూప విజయాలు చూసినప్పుడు ‘ఏ పని చేసే వాళ్లు ఆ పని చేస్తే మంచిది’ ‘రెండు పడవల మీద కాలు వద్దు’ లాంటి మాటలు, సామెతలు బిత్తర పోతాయి. పనిమీద అనురక్తి, అంకితభావం ఉంటే ఒక రంగానికి చెందిన వారు మరో రంగంలో విజయం సాధించవచ్చు అని చెప్పడానికి అనన్య బిర్లాలాంటి వాళ్లు పెద్ద ఉదాహరణ. పెద్దింటి అమ్మాయి పారిశ్రామిక దిగ్గజం కుమార మంగళం బిర్లా కూతురు అయిన అనన్య బిర్లా బాల్యం నియమ నిబంధనలు, రక్షణ వలయాల మ«ధ్య గడిచింది. చిన్నప్పుడే అనన్యకు బాడీగార్డ్ ఉండేవాడు. మిగతా అమ్మాయిల్లాగా ఎక్కడ పడితే అక్కడ ఆడుకోవడానికి లేదు. ఈ రూల్స్‌తో తనకు ఊపిరి ఆడేది కాదు. ఒత్తిడికి గురయ్యేది. ఇంత ఒత్తిడిలోనూ తనదైన కలలు కనేది. ‘అసలు నేనేమిటి?’ అనే ప్రశ్నకు ఆమెకు సంగీతంలో జవాబు దొరికింది. సంగీతం తనలోని ఒంటరితనాన్ని పోగొట్టడమే కాదు ఆత్మబలాన్ని ఇచ్చింది. ‘పెద్దింటి అమ్మాయి’ అనే పేరు కంటే స్వేచ్ఛాప్రపంచాన్నే అనన్య ఇష్టపడేది. ‘పెద్ద యూనివర్శిటీలో పెద్ద చదువు చదవాలి. పెద్దింటి కుటుంబానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి... ఇలా నా గురించి అనుకునేవారు. అయితే నా ఆలోచనలు దీనికి భిన్నంగా ఉండేవి. ఇది చాలామందిని ఆశ్చర్యపరిచేది. అయితే తల్లిదండ్రులు మాత్రం నాకు ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉన్నారు. నా అభిప్రాయాలకు విలువ ఇచ్చారు’ అంటుంది అనన్య. -
సూక్ష్మ రుణ సంస్థల పోర్ట్‌ఫోలియోలో వృద్ధి
న్యూఢిల్లీ: సూక్ష్మ రుణ సంస్థల నిర్వహణలోని (ఎంఎఫ్ఐ) రుణ ఆస్తులు గత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 22 శాతం పెరిగి రూ.3.48 లక్షల కోట్లకు చేరాయి. ఎంఎఫ్‌ఐల స్థూల రుణాల పోర్ట్‌ఫోలియో 2022 మార్చి నాటికి రూ.2.85 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. ఇక 2022–23లో మంజూరు చేసిన మొత్తం రుణాల విలువ 23 శాతం పెరిగి రూ.2,96,423 కోట్లకు చేరింది. ఇది 2022 మార్చి నాటికి రూ.2,39,433 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో 7.17 కోట్ల రుణాలు పంపిణీ అయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో మంజూరైన 6.30 కోట్ల రుణాలతో పోలిస్తే మెరుగైన వృద్ధి కనిపించింది. మైక్రోఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ నెట్వర్క్ (ఎంఫిన్) ఈ వివరాలను వెల్లడించింది. సూక్ష్మ రుణాలకు సంబంధించిన యాక్టివ్ రుణ ఖాతాలు 14.6 శాతం పెరిగి 2023 మార్చి నాటికి 13 కోట్లుగా ఉన్నాయి. స్థూల రుణాల మంజూరులో తూర్పు, ఈశాన్యం, దక్షిణాది రాష్ట్రాల వాటాయే 63 శాతంగా ఉంది. సూక్ష్మ రుణాల్లో బీహార్ అత్యధిక వాటా కలిగి ఉండగా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తర్వాతి స్థానల్లో ఉన్నాయి. -
రూ.3.51 లక్షల కోట్లకు ఎంఎఫ్ఐ పరిశ్రమ
కోల్‌కతా: సూక్ష్మరుణ సంస్థల పోర్ట్‌ఫోలియో (రుణాల విలువ) గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) 21.3 శాతం వృద్ధి చెంది రూ.3.51 లక్షల కోట్లకు చేరుకుంది. 2021–22 చివరికి సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్ఐ) నిర్వహణలోని పోర్ట్‌ఫోలియో విలువ రూ.2.89 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. మొత్తం రుణ ఖాతాలు ఈ పరిశ్రమలో 2022 మార్చి నాటికి 1,239 లక్షలుగా ఉంటే, 2023 మార్చి నాటికి 1,363 లక్షలకు చేరినట్టు పరిశ్రమ స్వీయ నియంత్రణ మండలి ‘సాధాన్’ ఈడీ, సీఈవో జిజి మామెన్ తెలిపారు. ఈ గణాంకాలు కరోనా ప్రభావం నుంచి పరిశ్రమ బయటపడినట్టు తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. పరిశ్రమ ఇప్పుడు వృద్ధి బాటలో నడుస్తున్నట్టు చెప్పారు. నూతన నియంత్రణ నిబంధనలు సూక్ష్మ రుణ సంస్థలు సైతం మార్కెట్లో పోటీ పడే అవకాశాలు కల్పించినట్టు తెలిపారు. ఇది ఎన్బీఎఫ్సీ, ఎంఎఫ్‌ఐల పోర్ట్‌ఫోలియోలో ప్రతిఫలిస్తోందన్నారు. ‘‘గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎంఎఫ్ఐ రంగం మొత్తం రుణ వితరణలు రూ. 3,19,948 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు సంవత్సరంలో ఉన్న రూ.2,53,966 కోట్లతో పోలిస్తే 26 శాతం పెరిగింది. ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు రూ.1,24,063 కోట్లను పంపిణీ చేయగా, బ్యాంకు లు రూ.1,16,402 కోట్లను మంజూరు చేశాయి’’ అని మామెన్ వెల్లడించారు. రుణ ఆస్తుల నాణ్యత గణనీయంగా మెరుగుపడినట్టు చెప్పారు. -
సూక్ష్మ రుణ సంస్థల రుణాలు రూ.3.25 లక్షల కోట్లు
కోల్‌కతా: సూక్ష్మ రుణ సంస్థలకు (ఎంఎఫ్ఐ) సంబంధించి వసూలు కావాల్సిన రుణాల పోర్ట్‌ఫోలియో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి రూ.3.25 లక్షల కోట్లకు పెరిగింది. 2022 మార్చి నాటికి ఇది రూ.2.7 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. 20 శాతం పెరిగినట్టు సూక్ష్మ రుణ సంస్థల నెట్వర్క్ (ఎంఫిన్) ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ రంగం 1.32 లక్షల మందికి ఉపాధి కల్పించినట్టు ఎంఫిన్ సీఈవో అలోక్ మిశ్రా తెలిపారు. సూక్ష్మ రుణ రంగానికి స్వీయ నియంత్రణ మండలిగా ఎంఫిన్‌కు ఆర్బీఐ గుర్తింపు ఉంది. కరోనా కారణంగా 2021, 2022లో రుణ వసూళ్ల సామర్థ్యంపై ప్రభావం పడిందని, ప్రస్తుతం వసూళ్లు 97 శాతానికి మెరుగుపడ్డాయని మిశ్రా చెప్పారు. ఇది కరోనా సమయంలో 70 శాతంగా ఉందన్నారు. ఎంఎఫ్ఐ సంస్థల పరిధిలో మొత్తం 6.2 కోట్ల మంది రుణ లబ్ధిదారులుగా ఉన్నారని.. దేశ జీడీపీకి ఎంఎఫ్ఐ రంగం 2.7 శాతం సమకూరుస్తున్నట్టు చెప్పారు. ఎంఎఫ్‌ఐల మొత్తం రుణాల్లో రూ.38,000 కోట్లు (17 శాతం) పశ్చిమబెంగాల్ రాష్ట్రం నుంచి ఉన్నట్టు తెలిపారు. 2022 మార్చిలో ఆర్బీఐ ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐ రంగానికి ప్రకటించిన మార్గదర్శకాలపై మిశ్రా స్పందిస్తూ.. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ–ఎంఫిన్‌లు, ఎన్బీఎఫ్సీ మధ్య తగిన పోటీకి అవకాశాలు కల్పించినట్టు చెప్పారు. ఎన్బీఎఫ్సీ–ఎంఫిన్ సంస్థలు వసూలు చేసే సగటు వడ్డీ రేటు రుణంపై ప్రస్తుతం 24 శాతంగా ఉంటుందని తెలిపారు. గతంలో ఇది 22.5 శాతమే ఉండేదంటూ, ఆర్బీఐ రెపో రేటు పెంచినందున ఎంఫిన్‌లు వసూలు చేసే వడ్డీ రేటు కూడా పెరిగినట్టు వివరించారు. ఎంఫిన్ పరిధిలో 47 సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. -
ఎన్‌బీఎఫ్‌సీలకు సెక్యూరిటైజేషన్ దన్ను
న్యూఢిల్లీ: నిధుల లభ్యత కష్టంగా మారినప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ), సూక్ష్మ రుణాల సంస్థలు (ఎంఎఫ్ఐ) రుణాల పోర్ట్‌ఫోలియోను విక్రయించడం ద్వారా (సెక్యూరిటైజేషన్) దాదాపు రూ. 26,200 కోట్లు సమీకరించాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ మార్గంలో సమీకరించిన నిధులతో పోలిస్తే ఇది 170 శాతం అధికం. 2017–18లో సెక్యూరిటైజేషన్ ద్వారా ఎన్బీఎఫ్సీ, ఎంఎఫ్ఐలు రూ. 9,700 కోట్లు సమీకరించాయి. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్) పలు రుణాల చెల్లింపులో డిఫాల్ట్ అయిన దరిమిలా గత ఆర్థిక సంవత్సరం ఎన్బీఎఫ్సీలు, సూక్ష్మ రుణాల సంస్థలకు నిధులు లభ్యత కష్టసాధ్యంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో అవి ఫండ్స్ సమీకరణ లక్ష్యాల సాధన కోసం ప్రధానంగా సెక్యూరిటైజేషన్‌పై ఆధారపడినట్లు ఇక్రా పేర్కొంది. ‘2018 ఆర్థిక సంవత్సరంలో, 2019 ప్రథమార్ధంలో మొత్తం నిధుల సమీకరణలో సెక్యూరిటైజేషన్ వాటా 18–20 శాతమే ఉంది. కానీ మూడో త్రైమాసికంలో ఇది 37 శాతానికి, నాలుగో త్రైమాసికంలో 50 శాతానికి పెరిగింది‘ అని ఇక్రా గ్రూప్ హెడ్ (స్ట్రక్చర్డ్ ఫైనాన్స్ రేటింగ్స్ విభాగం) విభోర్ మిట్టల్ తెలిపారు. 2017–18లో సెక్యూరిటైజేషన్ ద్వారా నిధులు సమీకరించిన సంస్థల సంఖ్య 24గా ఉండగా.. 2018–19లో 43కి చేరిందని ఆయన పేర్కొన్నారు. -
చిన్న బ్యాంకులకు తగినంత సమయం ఇవ్వాలి
మైక్రో ఫైనాన్స్, ఎన్‌బీఎఫ్‌సీలకు అనుకూలంగా ఆర్బీఐ ప్యానల్ సూచనలు ముంబై: చిన్న ఆర్థిక బ్యాంకుల ఏర్పాటుకు అనుమతి పొందిన సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐ), బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ)కు అనుకూలంగా ఆర్బీఐ ప్యానల్ గురువారం పలు సూచనలు చేసింది. ఎంఎఫ్ఐలు, ఎన్బీఎఫ్సీ సంస్థలు ప్రస్తుత కార్యాలయాలను బ్యాంకు శాఖలుగా మార్పు చేసేందుకు మూడేళ్ల సమయం ఇవ్వాలని సూచించింది. ఆర్బీఐ చిన్న ఆర్థిక బ్యాంకుల ఏర్పాటుకు పది సంస్థలకు ఇటీవలి కాలంలో సూత్రప్రాయ అనుమతులు జారీ చేసింది. వీటిలో ఎనిమిది సూక్ష్మరుణ సంస్థలు కాగా, ఒకటి ఎన్బీఎఫ్సీ సంస్థ ఉంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఆర్బీఐ అంతర్గత కార్యచరణ బృందం(ఐడబ్ల్యూజీ) ఎన్బీఎఫ్సీ, ఎంఎఫ్ఐ సంస్థల అభిప్రాయాలను తీసుకుని ఆర్బీఐకి ఓ నివేదిక సమర్పించింది. దీన్ని ఆర్బీఐ తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ప్యానల్ సిఫారసులు ♦ సూక్ష్మరుణ సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉన్న శాఖలను బ్యాంకు శాఖలుగా మార్చేందుకు తగినంత సమయం అవసరమని ఐడబ్ల్యూజీ అభిప్రాయపడింది. రిస్క్‌ను పరిమితం చేసుకునేందుకు వీలుగా వాటి శాఖలన్నింటినీ ఒకే సారి కాకుండా క్రమానుగతంగా చిన్న బ్యాంకు శాఖలుగా మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలి. ♦ ఈ సంస్థలు లెసైన్స్ పొందే నాటికి తమ ప్రస్తుత వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాల్సి ఉంది. అయితే, సూక్ష్మ రుణ సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు తమ ప్రస్తుత కార్యకలాపాలను మూసివేయడానికి లేదా వాటిని బ్యాంకు శాఖలుగా మార్చేందుకు మూడేళ్ల సమయం ఇవ్వాలి. అప్పటి వరకు ప్రస్తుత శాఖలనే బ్యాంకింగ్ ఔట్లెట్స్గా పరిగణించాలి. ♦ {పస్తుత నిబంధనల ప్రకారం మొత్తం శాఖల్లో 25 శాతం శాఖలను బ్యాంకుల్లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే, దీన్ని కూడా వెంటనే అమలు చేయరాదు. ఎలక్ట్రానిక్ కియోస్క్, ఏటీఎంలు/సీడీఎం/బీఎన్ఏలను సైతం బ్యాంకింగ్ ఔట్లెట్లుగా ఈ నిబంధనల కింద పరిగణనలోకి తీసుకోవాలి.