కోల్‌కతా: సూక్ష్మరుణ సంస్థల పోర్ట్‌ఫోలియో (రుణాల విలువ) గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) 21.3 శాతం వృద్ధి చెంది రూ.3.51 లక్షల కోట్లకు చేరుకుంది. 2021–22 చివరికి సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్‌ఐ) నిర్వహణలోని పోర్ట్‌ఫోలియో విలువ రూ.2.89 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం.
మొత్తం రుణ ఖాతాలు ఈ పరిశ్రమలో 2022 మార్చి నాటికి 1,239 లక్షలుగా ఉంటే, 2023 మార్చి నాటికి 1,363 లక్షలకు చేరినట్టు పరిశ్రమ స్వీయ నియంత్రణ మండలి ‘సాధాన్’ ఈడీ, సీఈవో జిజి మామెన్ తెలిపారు. ఈ గణాంకాలు కరోనా ప్రభావం నుంచి పరిశ్రమ బయటపడినట్టు తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. పరిశ్రమ ఇప్పుడు వృద్ధి బాటలో నడుస్తున్నట్టు చెప్పారు. నూతన నియంత్రణ నిబంధనలు సూక్ష్మ రుణ సంస్థలు సైతం మార్కెట్లో పోటీ పడే అవకాశాలు కల్పించినట్టు తెలిపారు.
ఇది ఎన్‌బీఎఫ్‌సీ, ఎంఎఫ్‌ఐల పోర్ట్‌ఫోలియోలో ప్రతిఫలిస్తోందన్నారు. ‘‘గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎంఎఫ్‌ఐ రంగం మొత్తం రుణ వితరణలు రూ. 3,19,948 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు సంవత్సరంలో ఉన్న రూ.2,53,966 కోట్లతో పోలిస్తే 26 శాతం పెరిగింది. ఎన్‌బీఎఫ్‌సీ–ఎంఎఫ్‌ఐలు రూ.1,24,063 కోట్లను పంపిణీ చేయగా, బ్యాంకు లు రూ.1,16,402 కోట్లను మంజూరు చేశాయి’’ అని మామెన్ వెల్లడించారు. రుణ ఆస్తుల నాణ్యత గణనీయంగా మెరుగుపడినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment