Industry Body
-
DelhiFloods: మూడు రోజుల్లో రూ.200కోట్లు నష్టం, ఇండస్ట్రీ కీలకహెచ్చరికలు
ఎడతెగని వర్షాలు, వరద పరిస్థితి దేశ రాజధాని నగరం ఢిల్లీని అతలాకుతలం చేసింది. యమునా నది నీటి మట్టం ఊహించిన దాని కంటే 18 గంటల ముందుగానే ప్రమాద స్థాయి 208.46 మీటర్లకు చేరింది. గతంలో ఎన్నడూ లేని చాలా ప్రాధాన్య ప్రాంతాలు కూడా నీట మునిగాయి. ముఖ్యంగా సుప్రీంకోర్టు, రాజ్ ఘాట్‌ని వరదనీరు ముంచెత్తింది. అంతేకాదు ఎర్రకోట చుట్టూ వరదనీరు చేరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం కూడా నీటి మునిగింది. అటు మంచినీటికోసం ప్రజల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ఇక నిత్యావసరాల కోసం జనం అల్లాడి పోతున్నారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఢిల్లీని ముంచెత్తిన వరదలతొ వ్యాపార పరంగా అపార నష్టానికి దారి తీశాయి. యమునా నదిలో నీటిమట్టం పెరగడం ఢిల్లీ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యమునా బాజార్ నుంచి ఎర్రకోట దాకా దుకాణాలు, ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. గత 3-4 రోజుల్లో దాదాపు 200 కోట్ల రూపాయల వ్యాపారం దెబ్బతిందని ఇండస్ట్రీ బాడీ తెలిపింది. అలాగే యమునా నది నీటిమట్టం పెరుగుతున్న దృష్ట్యా రాబోయే కొద్ది రోజుల పాటు ఇతర నగరాల నుండి వస్తువుల తరలింపును నిలిపి వేయాలని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ ఢిల్లీలోని వ్యాపారులకు విజ్ఞప్తి చేయడం గమనార్హం. #WATCH | Delhi: Water level in Yamuna river rises after incessant rainfall & release of water from Hathnikund barrage. The water level of Yamuna River at Old Railway Bridge (ORB) has crossed the danger mark and is at 208.40 meters, recorded around 9 am. (Drone Visuals from… pic.twitter.com/yT1X0rXz5g — ANI (@ANI) July 14, 2023 పాత ఢిల్లీ, కాశ్మీరీ గేట్, మోరీ గేట్, మానెస్ట్రీ మార్కెట్, చాందినీ చౌక్, జామా మసీదు, భగీరథ్ ప్లేస్, లజ్‌పత్ రాయ్ మార్కెట్, కినారీ బజార్, ఫతేపురి, ఖరీ బావోలి, నయా బజార్ మార్కెట్లు వర్షం కారణంగా దెబ్బ తిన్నాయని ట్రేడర్స్ బాడీ తెలిపింది. అలాగే కాశ్మీరీ గేట్ మార్కెట్ ప్రెసిడెంట్ వినయ్ నారంగ్ మాట్లాడుతూ, 3-4 రోజుల వర్షం కారణంగా రూ. 50 కోట్లకు పైగా నష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రతిరోజు రేవారీ, గుర్గావ్, ఘజియాబాద్, ఫరీదాబాద్, మీరట్, సోనిపట్, పానిపట్, పాల్వాల్, బాగ్పట్, బరౌత్, ముజఫర్‌నగర్ వంటి ప్రాంతాల నుండి రోజువారీ 2 లక్షలకు పైగా కస్టమర్ల తాకిడి ఉంటుంది. ఇదే పరిస్థితి మరిన్ని రోజులు కొనసాగితో మరింత భారీ నష్టం తప్పదని వ్యాపారులు వణికి పోతున్నారు. సమీప నగరాల నుంచి వచ్చే కస్టమర్లు కూడా తమ ప్లాన్‌ను వాయిదా వేసుకున్నారు.అటు రైళ్ల రాకపోకలను రైల్వే నిలిపిసింది. రోడ్డు, ఇతర రవాణా మార్గాల మూతతో వ్యాపారం మరింత స్థంభించింది. దీంతో వ్యాపారులు కొనుగోలు దారులు ఢిల్లీకి రావడం లేదని గోయల్‌ని ఉటంకిస్తూ పిటిఐ పేర్కొంది. కాగా వరద పీడిత ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఢిల్లీ సర్కారు తగిన చర్యలు చేపడుతోంది. పాఠశాలలు, కళాశాలలకు ఆదివారం వరకు సెలవు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, అవసరమైన సేవలను అందించేవి తప్ప, మిగిలిన ఉద్యోగులు ఇంటి నుండి పనిచేయాలని ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ సమయంలో అవసరమైన సేవలు అందించే వాహనాలు మినహా భారీ వాహనాల ప్రవేశంపై నిషేధం విధించినట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. -
రూ.3.51 లక్షల కోట్లకు ఎంఎఫ్ఐ పరిశ్రమ
కోల్‌కతా: సూక్ష్మరుణ సంస్థల పోర్ట్‌ఫోలియో (రుణాల విలువ) గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) 21.3 శాతం వృద్ధి చెంది రూ.3.51 లక్షల కోట్లకు చేరుకుంది. 2021–22 చివరికి సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్ఐ) నిర్వహణలోని పోర్ట్‌ఫోలియో విలువ రూ.2.89 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. మొత్తం రుణ ఖాతాలు ఈ పరిశ్రమలో 2022 మార్చి నాటికి 1,239 లక్షలుగా ఉంటే, 2023 మార్చి నాటికి 1,363 లక్షలకు చేరినట్టు పరిశ్రమ స్వీయ నియంత్రణ మండలి ‘సాధాన్’ ఈడీ, సీఈవో జిజి మామెన్ తెలిపారు. ఈ గణాంకాలు కరోనా ప్రభావం నుంచి పరిశ్రమ బయటపడినట్టు తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. పరిశ్రమ ఇప్పుడు వృద్ధి బాటలో నడుస్తున్నట్టు చెప్పారు. నూతన నియంత్రణ నిబంధనలు సూక్ష్మ రుణ సంస్థలు సైతం మార్కెట్లో పోటీ పడే అవకాశాలు కల్పించినట్టు తెలిపారు. ఇది ఎన్బీఎఫ్సీ, ఎంఎఫ్‌ఐల పోర్ట్‌ఫోలియోలో ప్రతిఫలిస్తోందన్నారు. ‘‘గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎంఎఫ్ఐ రంగం మొత్తం రుణ వితరణలు రూ. 3,19,948 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు సంవత్సరంలో ఉన్న రూ.2,53,966 కోట్లతో పోలిస్తే 26 శాతం పెరిగింది. ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు రూ.1,24,063 కోట్లను పంపిణీ చేయగా, బ్యాంకు లు రూ.1,16,402 కోట్లను మంజూరు చేశాయి’’ అని మామెన్ వెల్లడించారు. రుణ ఆస్తుల నాణ్యత గణనీయంగా మెరుగుపడినట్టు చెప్పారు. -
షాకింగ్: సగం ఏటీఎంలు మూత
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి నాటికి సగానికి సగం ఏటీఎంలు మూత పడనున్నాయనే షాకింగ్ న్యూస్ సంచలనంగా మారింది. స్వయంగా ట్రీ ఆఫ్ కాన్ఫెడరేషన్ ఏటీఎం ఇండస్ట్రీ (CATMi) బుధవారం (21 నవంబరు) నివేదించింది. దేశవ్యాప్తంగా దాదాపు 1.13 లక్షలఏటీఎంలు మూతపడే అవకాశం ఉందని హెచ్చరించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (సీఏటీఎంఐ) అంచనా ప్రకారం దేశంలో ప్రస్తుతం 2.38 లక్షల ఏటీఎంలు అందుబాటులో ఉండగా, అందులో సగానికి పైగా అంటే దాదాపు 1.13 లక్షల ఏటీఎంలు 2019 మార్చి కల్లా మూతపడే అవకాశాలున్నాయి. ఈ మేరకు సర్వీస్ ప్రొవైడర్లు ఒత్తిడి చేయనున్నారని పేర్కొంది. వీటిల్లో సుమారు లక్ష ఆఫ్ సైట్ ఎటిఎంలు, 15వేల వైట్ లేబుల్ ఏటీఎంలు ఉన్నాయని తెలిపింది. తాజా నియంత్రణలు, మార్పులు కారణంగా ఈ మూత తప్పకపోవచ్చని వెల్లడించింది. వీటిలో మెజారిటీ ఏటీఎంలు పట్టణేతర ప్రాంతాల్లో ఉండొచ్చని, ప్రభుత్వ సబ్సిడీ లబ్ధిదారులు మెషీన్ల ద్వారా తీసుకునేందుకు వీలు కల్పించే చర్యలకు ఏటీఎంల మూత విఘాతం కావచ్చని తెలిపింది. ముఖ్యంగా ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పిఎంజెడివై) పథకం కింద మిలియన్లమంది లబ్దిదారులు తీవ్రంగా ప్రభావితం కానున్నారని పేర్కొంది. ఇటీవల చేపట్టిన హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ అప్‌గ్రేడేషన్, ఇతర నియంత్రణ చర్యల్లో మార్పులు, క్యాష్ లోడింగ్‌కు అనుసరిస్తున్న క్యాసెట్ స్వాపింగ్ పద్ధతి వల్ల ఎటీఎం ఆపరేషన్లు ఆచరణ సాధ్యం కాకపోవచ్చని, ఫలితంగా ఏటీఎంలు మూతపడొచ్చని పేర్కొంది. సాంకేతిక పద్ధతుల్లో మార్పు, క్యాసెట్ క్యాష్ స్వాప్ విధానానికే కేవలం రూ.3,000 కోట్లు ఖర్చవుతుందని సీఏటీఎంఐ అంచనా వేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏటీఎం ఇండస్ట్రీ ఎదుర్కొన్న పరిస్థితికి అదనపు సాంకేతిక పరిజ్ఞానం తోడై పరిస్థితి మరింత దిగజారవచ్చని, సర్వీస్ ప్రొవైడర్ల నెత్తిన మోయలేని భారం పడుతుందని తెలిపింది. ఇది ఏటీఏంల మూతకు దారితీస్తుందని సీఏటీఎంఐ ప్రకటించింది. ఏటీఎంల మూత కారణంగా వేలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయని సీఏటీఎంఐ పేర్కొంది. అంతేకాదు నగదు కొరత వస్తే ఏటీఎంల దగ్గర భారీ క్యూలు, గందరగోళం తప్పదని కూడా వ్యాఖ్యానించింది. -
ఆ నిషేధం 5వేల ఉద్యోగాలకు గండికొట్టింది
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతంలో(ఎన్ సీఆర్ రీజియన్) డీజిల్ కార్ల, 2000 సీసీ ఇంజన్ సామర్థ్య ఎస్ యూవీల రాకపోకలపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం వల్ల ఆటో పరిశ్రమలోని ఉద్యోగులకు గండిపడింది. ఆటో సెక్టార్ లో 5వేల ఉద్యోగాలపై ప్రభావం చూపిందని ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల సంస్థ(సియామ్) తెలిపింది. నిషేధం అమలులోకి వచ్చిన డిసెంబర్ 16 నుంచి ఆగష్టు 30 వరకు దాదాపు 11వేల యూనిట్ల ఉత్పత్తిని ఆటోమొబైల్ పరిశ్రమ నష్టపోయిందని పేర్కొంది. నిషేధం వల్ల ఏర్పడిన నష్టాన్ని తెలుపుతూ సుప్రీంకోర్టుకు సియామ్ రిపోర్టు నివేదించింది. సుప్రీంకోర్టు ఆంక్షల ప్రభావాన్ని గ్రౌండ్ లెవల్ గానే పేర్కొన్నామని, ఒకవేళ ఈ నిషేధాన్ని దేశమంతటా అమలుచేసి ఉంటే, లక్ష వాహనాల ఉత్పత్తిని నష్టపోయేవారని.. ఇదే సమయంలో 47వేల ఉద్యోగాలకు కూడా కోత పడేదని రిపోర్టులో పేర్కొంది. దేశ రాజధాని ప్రాంతంలో నిషేధానికి గురైన వాహనాలను నాన్-ఎన్ సీఆర్ ప్రాంతాల డీలర్లకు తరలించారని తెలిపింది. డీజిల్ వాహనాలపై పర్యావరణ నష్టపరిహార చార్జీల(ఈసీసీ) లెవీని వ్యతిరేకిస్తే, ఈ నిషేధం దేశంలో మిగతా ప్రాంతాలకు కూడా వర్తింపజేస్తారని, దానివల్ల ఈ పరిశ్రమలో ఉద్యోగులు శాశ్వతంగా ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ఆటో మొబైల్ పరిశ్రమ సంస్థ వెల్లడించింది. ఇప్పుడే కాక, భవిష్యత్తులోనూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలను నష్టపోతారని సియామ్ రిపోర్టులో తెలిపింది. ఇప్పటికే ఈ నాలుగు చక్రాల వాహనాల నిషేధంపై చాలా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు హైకోర్టులో దాఖలు అయ్యాయి.