ఆ నిషేధం 5వేల ఉద్యోగాలకు గండికొట్టింది
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతంలో(ఎన్ సీఆర్ రీజియన్) డీజిల్ కార్ల, 2000 సీసీ ఇంజన్ సామర్థ్య ఎస్ యూవీల రాకపోకలపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం వల్ల ఆటో పరిశ్రమలోని ఉద్యోగులకు గండిపడింది. ఆటో సెక్టార్ లో 5వేల ఉద్యోగాలపై ప్రభావం చూపిందని ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల సంస్థ(సియామ్) తెలిపింది. నిషేధం అమలులోకి వచ్చిన డిసెంబర్ 16 నుంచి ఆగష్టు 30 వరకు దాదాపు 11వేల యూనిట్ల ఉత్పత్తిని ఆటోమొబైల్ పరిశ్రమ నష్టపోయిందని పేర్కొంది. నిషేధం వల్ల ఏర్పడిన నష్టాన్ని తెలుపుతూ సుప్రీంకోర్టుకు సియామ్ రిపోర్టు నివేదించింది. సుప్రీంకోర్టు ఆంక్షల ప్రభావాన్ని గ్రౌండ్ లెవల్ గానే పేర్కొన్నామని, ఒకవేళ ఈ నిషేధాన్ని దేశమంతటా అమలుచేసి ఉంటే, లక్ష వాహనాల ఉత్పత్తిని నష్టపోయేవారని.. ఇదే సమయంలో 47వేల ఉద్యోగాలకు కూడా కోత పడేదని రిపోర్టులో పేర్కొంది.
దేశ రాజధాని ప్రాంతంలో నిషేధానికి గురైన వాహనాలను నాన్-ఎన్ సీఆర్ ప్రాంతాల డీలర్లకు తరలించారని తెలిపింది. డీజిల్ వాహనాలపై పర్యావరణ నష్టపరిహార చార్జీల(ఈసీసీ) లెవీని వ్యతిరేకిస్తే, ఈ నిషేధం దేశంలో మిగతా ప్రాంతాలకు కూడా వర్తింపజేస్తారని, దానివల్ల ఈ పరిశ్రమలో ఉద్యోగులు శాశ్వతంగా ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ఆటో మొబైల్ పరిశ్రమ సంస్థ వెల్లడించింది. ఇప్పుడే కాక, భవిష్యత్తులోనూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలను నష్టపోతారని సియామ్ రిపోర్టులో తెలిపింది. ఇప్పటికే ఈ నాలుగు చక్రాల వాహనాల నిషేధంపై చాలా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు హైకోర్టులో దాఖలు అయ్యాయి.