200 crore business affected in 3-4 days, says trader's body - Sakshi
Sakshi News home page

DelhiFloods: మూడు రోజుల్లో రూ.200కోట్లు నష్టం, ఇండస్ట్రీ కీలక హెచ్చరికలు

Published Fri, Jul 14 2023 4:57 PM | Last Updated on Fri, Jul 14 2023 8:17 PM

Delhi Floods huge affecton business what trader body says check - Sakshi

ఎడతెగని వర్షాలు, వరద పరిస్థితి  దేశ రాజధాని నగరం ఢిల్లీని అతలాకుతలం చేసింది. యమునా నది నీటి మట్టం ఊహించిన దాని కంటే 18 గంటల ముందుగానే ప్రమాద స్థాయి 208.46 మీటర్లకు చేరింది. గతంలో ఎన్నడూ లేని చాలా ప్రాధాన్య ప్రాంతాలు కూడా  నీట మునిగాయి.

ముఖ్యంగా సుప్రీంకోర్టు, రాజ్ ఘాట్‌ని వరదనీరు ముంచెత్తింది. అంతేకాదు ఎర్రకోట చుట్టూ వరదనీరు చేరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసం  కూడా నీటి మునిగింది. అటు మంచినీటికోసం ప్రజల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు.  ఇక నిత్యావసరాల కోసం జనం అల్లాడి పోతున్నారు 

ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఢిల్లీని ముంచెత్తిన వరదలతొ  వ్యాపార పరంగా అపార నష్టానికి  దారి తీశాయి. యమునా నదిలో నీటిమట్టం పెరగడం ఢిల్లీ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యమునా బాజార్‌ నుంచి ఎర్రకోట దాకా దుకాణాలు, ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. గత 3-4 రోజుల్లో దాదాపు 200 కోట్ల రూపాయల వ్యాపారం దెబ్బతిందని ఇండస్ట్రీ బాడీ తెలిపింది. అలాగే యమునా నది నీటిమట్టం పెరుగుతున్న దృష్ట్యా రాబోయే కొద్ది రోజుల పాటు ఇతర నగరాల నుండి వస్తువుల తరలింపును నిలిపి వేయాలని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఛైర్మన్ బ్రిజేష్ గోయల్‌ ఢిల్లీలోని వ్యాపారులకు విజ్ఞప్తి చేయడం గమనార్హం. 

పాత ఢిల్లీ, కాశ్మీరీ గేట్, మోరీ గేట్, మానెస్ట్రీ మార్కెట్, చాందినీ చౌక్, జామా మసీదు, భగీరథ్ ప్లేస్, లజ్‌పత్ రాయ్ మార్కెట్, కినారీ బజార్, ఫతేపురి, ఖరీ బావోలి, నయా బజార్ మార్కెట్లు వర్షం కారణంగా దెబ్బ తిన్నాయని ట్రేడర్స్ బాడీ తెలిపింది. అలాగే కాశ్మీరీ గేట్ మార్కెట్ ప్రెసిడెంట్ వినయ్ నారంగ్ మాట్లాడుతూ, 3-4 రోజుల వర్షం కారణంగా రూ. 50 కోట్లకు పైగా నష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రతిరోజు రేవారీ, గుర్గావ్, ఘజియాబాద్, ఫరీదాబాద్, మీరట్, సోనిపట్, పానిపట్, పాల్వాల్, బాగ్‌పట్, బరౌత్, ముజఫర్‌నగర్ వంటి ప్రాంతాల నుండి రోజువారీ 2 లక్షలకు పైగా కస్టమర్‌ల తాకిడి ఉంటుంది.  ఇదే  పరిస్థితి మరిన్ని  రోజులు కొనసాగితో మరింత భారీ నష్టం  తప్పదని వ్యాపారులు వణికి పోతున్నారు.

సమీప నగరాల నుంచి వచ్చే కస్టమర్లు కూడా తమ ప్లాన్‌ను వాయిదా వేసుకున్నారు.అటు రైళ్ల రాకపోకలను రైల్వే నిలిపిసింది. రోడ్డు, ఇతర రవాణా మార్గాల మూతతో వ్యాపారం మరింత స్థంభించింది. దీంతో  వ్యాపారులు   కొనుగోలు దారులు ఢిల్లీకి రావడం లేదని గోయల్‌ని ఉటంకిస్తూ పిటిఐ పేర్కొంది. 

కాగా  వరద పీడిత ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఢిల్లీ సర్కారు తగిన చర్యలు చేపడుతోంది. పాఠశాలలు, కళాశాలలకు ఆదివారం  వరకు సెలవు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, అవసరమైన సేవలను అందించేవి తప్ప, మిగిలిన ఉద్యోగులు ఇంటి నుండి పనిచేయాలని ప్రభుత్వం గురువారం ప్రకటించింది.  ఈ సమయంలో అవసరమైన సేవలు అందించే వాహనాలు మినహా భారీ వాహనాల ప్రవేశంపై నిషేధం విధించినట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement