ముంబై: సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్‌ఐలు) తమ మార్కెట్ వాటాను మరింత పెంచుకున్నాయి. సూక్ష్మ రుణాల్లో బ్యాంకులను దాటుకుని నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ మొదటి స్థానానికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా సూక్ష్మ రుణాల్లో ఎంఎఫ్‌ఐల వాటా 2022–23లో 40 శాతానికి చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 35 శాతం కంటే పెరిగింది.
కరోనా లాక్‌డౌన్‌లతో ఎంఎఫ్‌ఐ పరిశ్రమ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవడం గమనార్హం. కలెక్షన్లు, కొత్త రుణాల మంజూరు గణనీయంగా పడిపోయింది. దీంతో 2020 మార్చి నాటికి సూక్ష్మ రుణాల్లో ఎంఫ్‌ఐల వాటా 32 శాతంగా ఉంటే, 2021 మార్చి నాటికి 31 శాతానికి తగ్గింది. 2022 మార్చి నాటికి తిరిగి 35 శాతానికి పుంజుకున్నది. ఇక ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం సూక్ష్మ రుణాల్లో తమ వాటాను 40 శాతానికి పెంచుకున్నాయి. గత ఆర్థిక సంవత్సంలో సూక్ష్మ రుణాల్లో బ్యాంక్‌లు 24 శాతం వృద్ధిని నమోదు చేయగా, ఎంఎఫ్‌ఐలు 37 శాతం వృద్ధి చెందాయి.
ప్రాధాన్య రంగాలకు రుణ వితరణ కింద దాదాపు అన్ని బ్యాంకులు ఎంఎఫ్‌ఐ రుణ పుస్తకాన్ని నిర్వహించడం తప్పనిసరి. సూక్ష్మ రుణాల్లో బ్యాంక్‌ల వాటా 2023 మార్చి నాటికి 34 శాతానికి తగ్గింది. ఈ రంగంలో బ్యాంక్‌ల వాటా 2020, 2022 మార్చి నాటికి 40 శాతంగా ఉంటే, మధ్యలో 2021 మార్చి నాటికి 44 శాతానికి పెరిగింది. కరోనా సవాళ్లను ఎంఎఫ్‌ఐ పరిశ్రమ అధిగమించడంతో, సూక్ష్మ రుణాల్లో అవి మరింత దూకుడుగా వాటాను పెంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ వివరాలను కేర్ విడుదల చేసింది.
వృద్ధి తగ్గొచ్చు
సూక్ష్మ రుణ పరిశ్రమలో వృద్ధి ఇక ముందూ కొనసాగుతుందని, అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 28 శాతానికి పరిమితం కావచ్చని కేర్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. సగటు రుణ టికెట్ సైజు పెరగడం, జాయింట్ రుణాలకు బదులు, విడిగా వ్యక్తులకు రుణాలు ఇవ్వడం అనేవి రిస్క్‌లుగా కేర్ రేటింగ్స్ పేర్కొంది. రాజకీయ, భౌగోళిక అనిశ్చితుల వల్ల కుదుపులకు లోనయ్యే తత్వం వీటికి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. రుణ రేటుపై పరిమితులను ఆర్‌బీఐ ఎత్తివేయడంతో, రిస్క్ ఆధారంగా రేటు విషయంలో ఎంఎఫ్‌ఐలు స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నట్టు పేర్కొంది.
ఇది వాటి నికర వడ్డీ మార్జిన్లను (నిమ్) పెంచుతున్నట్టు వివరించింది. 2020–21లో గరిష్ట స్థాయికి వెళ్లిన రుణ వ్యయాలు సైతం అక్కడి నుంచి తగ్గాయని, అయినప్పటికీ కరోనా ముందున్న నాటితో పోలిస్తే అధిక స్థాయిలోనే ఉన్నట్టు తెలిపింది. పునరుద్ధరించిన కొన్ని రుణాలు ఎన్‌పీఏలుగా మారడాన్ని ప్రస్తావించింది. నిమ్ 2023–24లో 3.8 శాతానికి మెరుగుపడొచ్చని అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment