Micro loans
-
బ్యాంకులకు ఝలక్ ఇచ్చిన ఎంఎఫ్ఐలు.. లోన్లలో ఇవే టాప్!
ముంబై: సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐలు) తమ మార్కెట్ వాటాను మరింత పెంచుకున్నాయి. సూక్ష్మ రుణాల్లో బ్యాంకులను దాటుకుని నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ మొదటి స్థానానికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా సూక్ష్మ రుణాల్లో ఎంఎఫ్‌ఐల వాటా 2022–23లో 40 శాతానికి చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 35 శాతం కంటే పెరిగింది. కరోనా లాక్డౌన్లతో ఎంఎఫ్ఐ పరిశ్రమ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవడం గమనార్హం. కలెక్షన్లు, కొత్త రుణాల మంజూరు గణనీయంగా పడిపోయింది. దీంతో 2020 మార్చి నాటికి సూక్ష్మ రుణాల్లో ఎంఫ్ఐల వాటా 32 శాతంగా ఉంటే, 2021 మార్చి నాటికి 31 శాతానికి తగ్గింది. 2022 మార్చి నాటికి తిరిగి 35 శాతానికి పుంజుకున్నది. ఇక ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం సూక్ష్మ రుణాల్లో తమ వాటాను 40 శాతానికి పెంచుకున్నాయి. గత ఆర్థిక సంవత్సంలో సూక్ష్మ రుణాల్లో బ్యాంక్‌లు 24 శాతం వృద్ధిని నమోదు చేయగా, ఎంఎఫ్ఐలు 37 శాతం వృద్ధి చెందాయి. ప్రాధాన్య రంగాలకు రుణ వితరణ కింద దాదాపు అన్ని బ్యాంకులు ఎంఎఫ్ఐ రుణ పుస్తకాన్ని నిర్వహించడం తప్పనిసరి. సూక్ష్మ రుణాల్లో బ్యాంక్‌ల వాటా 2023 మార్చి నాటికి 34 శాతానికి తగ్గింది. ఈ రంగంలో బ్యాంక్‌ల వాటా 2020, 2022 మార్చి నాటికి 40 శాతంగా ఉంటే, మధ్యలో 2021 మార్చి నాటికి 44 శాతానికి పెరిగింది. కరోనా సవాళ్లను ఎంఎఫ్ఐ పరిశ్రమ అధిగమించడంతో, సూక్ష్మ రుణాల్లో అవి మరింత దూకుడుగా వాటాను పెంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ వివరాలను కేర్ విడుదల చేసింది. వృద్ధి తగ్గొచ్చు సూక్ష్మ రుణ పరిశ్రమలో వృద్ధి ఇక ముందూ కొనసాగుతుందని, అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 28 శాతానికి పరిమితం కావచ్చని కేర్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. సగటు రుణ టికెట్ సైజు పెరగడం, జాయింట్ రుణాలకు బదులు, విడిగా వ్యక్తులకు రుణాలు ఇవ్వడం అనేవి రిస్క్‌లుగా కేర్ రేటింగ్స్ పేర్కొంది. రాజకీయ, భౌగోళిక అనిశ్చితుల వల్ల కుదుపులకు లోనయ్యే తత్వం వీటికి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. రుణ రేటుపై పరిమితులను ఆర్బీఐ ఎత్తివేయడంతో, రిస్క్ ఆధారంగా రేటు విషయంలో ఎంఎఫ్ఐలు స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నట్టు పేర్కొంది. ఇది వాటి నికర వడ్డీ మార్జిన్లను (నిమ్) పెంచుతున్నట్టు వివరించింది. 2020–21లో గరిష్ట స్థాయికి వెళ్లిన రుణ వ్యయాలు సైతం అక్కడి నుంచి తగ్గాయని, అయినప్పటికీ కరోనా ముందున్న నాటితో పోలిస్తే అధిక స్థాయిలోనే ఉన్నట్టు తెలిపింది. పునరుద్ధరించిన కొన్ని రుణాలు ఎన్పీఏలుగా మారడాన్ని ప్రస్తావించింది. నిమ్ 2023–24లో 3.8 శాతానికి మెరుగుపడొచ్చని అంచనా వేసింది. -
అమెజాన్‌లో విక్రేతలకు సూక్ష్మ రుణాలు
బ్యాంక్ ఆఫ్ బరోడాతో టైఅప్ ► రూ. లక్ష నుంచి 25 లక్షల దాకా ముంబై: ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ తమ ప్లాట్‌ఫాంపై ఉత్పత్తులు విక్రయించే విక్రేతలకు సూక్ష్మ రుణాల సహకారం అందించే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇన్వైట్ ఓన్లీ (ఆహ్వానం) ప్రాతిపదికన మాత్రమే విక్రేతలకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ తోడ్పాటుతో జులైలోనే అమెజాన్ ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించింది. వార్షికంగా 10.45–11.5 శాతం దాకా వార్షిక వడ్డీ రేటుపై రూ. 1 లక్ష నుంచి రూ. 25 లక్షల దాకా రుణ లభ్యత ఉండగలదని అమెజాన్ తెలిపింది. చిన్న, మధ్య తరహా సంస్థల వ్యాపార అవసరాలపై మంచి అవగాహన ఉన్నందున, అమెజాన్ ఇండియాలోని 2 లక్షల మంది పైగా విక్రేతలకు సమగ్రమైన బ్యాంకింగ్ సేవలు అందించే దిశగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండీ పీఎస్ జయకుమార్ తెలిపారు. వచ్చే ఏడాది వ్యవధిలోగా 15–20 శాతం మంది అమెజాన్ సెల్లర్లు ఈ సదుపాయం ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు వివరించారు. అమెజాన్ పోర్టల్‌లో అమ్మకాల ట్రాక్ రికార్డు, కస్టమర్స్ ఫీడ్ బ్యాక్, నిబంధనలను పాటించడం మొదలైన అంశాల ప్రాతిపదికగా విక్రేతలకు ఈ పథకం కింద రుణ అర్హత వివరాలతో ప్రీ–అప్రూవ్డ్ ఆఫర్ బ్యాంకు నుంచి అందుతుంది. కార్యకలాపాలు విస్తరించే క్రమంలో వ్యాపార సంస్థలు ఎదుర్కొనే నిధుల కొరత సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో ఈ పథకం అందుబాటులోకి తెచ్చినట్లు అమెజాన్ ఇండియా డైరెక్టర్ గోపాల్ పిళ్లై తెలిపారు. -
మళ్లీ మైక్రో పడగ
మైక్రో ఫైనాన్స కంపెనీలు మళ్లీ గ్రామాల్లోకి అడుగుపెడుతున్నాయి. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో కొన్నాళ్లపాటు వెనక్కితగ్గిన పలు సంస్థలు అధిక వడ్డీల వసూళ్ల పర్వానికి మరోమారు తెరలేపాయి. గతంలో పేదలను పీల్చిపిప్పిచేసిన మైక్రో సంస్థల నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు.. కంపెనీల చర్యలను ఏమాత్రం అడ్డుకోలేకపోతున్నాయి. రుణమాఫీ విషయంలో నెలకొన్న సందిగ్ధాన్ని ఆసరా చేసుకుంటున్న మైక్రో సంస్థలు.. గతంలో తీసుకున్న అప్పును వడ్డీతోసహా చెల్లిస్తే అంతకు రెట్టింపు రుణమిస్తామని ఊరిస్తున్నాయి. దీంతో రైతులు, మహిళలు మళ్లీ మైక్రో సంస్థలవైపు చూస్తున్నారు. ఇక అప్పులు చెల్లించే స్థోమతలేదని, ఇప్పుడు బకాయి చెల్లించలేమని చెబుతున్న వారికి ఏకంగా నోటీసులు జారీ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నాయి. ⇒ వేధింపులు ప్రారంభించిన ఫైనాన్స కంపెనీలు ⇒ బకాయిదారులకు లీగల్ నోటీసులు ⇒ చెల్లించండి.. లేదంటే కోర్టుకేనంటూ బెదిరింపులు ⇒ ఇష్టారాజ్యంగా వడ్డీల వసూళ్లు ఫలితమివ్వని ప్రభుత్వ కమిటీలు ⇒ ఒక్క పరిగి నియోజకవర్గం పరిధిలోనే రూ.20 కోట్ల మైక్రో రుణాలు పరిగి: జిల్లాలో మైక్రో కంపెనీలు తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్నాయి. మహిళలకు అప్పులిచ్చి అధిక వడ్డీలను వసూలు చేస్తున్న పలు కంపెనీల వేధింపులు అధికం కావడంతో గతంలో విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం గ్రామాల్లో కొన్ని కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కొన్నాళ్లపాటు వెనక్కితగ్గినట్టు ఉన్న కంపెనీలు ఇప్పుడు మళ్లీ గ్రామాల్లోకి వస్తున్నాయి. ప్రస్తుతం రుణమాఫీ విషయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న సంస్థలు పాత అప్పులు చెల్లిస్తే అంతకంటే ఎక్కువ రుణాలిస్తామని నమ్మబలుకుతున్నాయి. ఇచ్చిన వారి నుంచి డబ్బులు తీసుకోవడం, ఇవ్వనివారికి లీగల్ నోటీసులు జారీ చేయడం వంటి చర్యలు ప్రారంభించాయి. ఇందులో భాగంగానే ఇటీవల పరిగి మండలం సోండేపూర్ తండాకు చెందిన కొందరికి నోటీసులు ఇవ్వడంతోపాటు ఓ వ్యక్తిపై కేసు కూడా నమోదు చేశారు. తాజాగా పరిగి మండల పరిధిలోని పలువురికి కోర్టు నోటీసులు పంపించారు. కోర్టుకీడుస్తామంటూ బెదిరింపులు.. తీసుకున్న డబ్బులను వడ్డీలతోసహా వెంటనే చెల్లించాలని ైరె తులు, మహిళలకు మైక్రో సంస్థలు కోర్టు నోటీసులు పంపుతున్నాయి. డబ్బులు చెల్లించకుంటే కోర్టుకు హాజరుకావాల్సి వస్తుందని ఆయా కంపెనీల సిబ్బంది బెదిరిస్తున్నారు. మైక్రో సంస్థలు వసూలు చేస్తున్న వడ్డీల ప్రకారం.. ఇచ్చిన అసలు రెండేళ్లలోనే డబుల్ అవుతోందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిగి మండలంలోని నస్కల్ గ్రామానికి చెందిన బేగరి అంజయ్య మూడేళ్ల క్రితం ఓ మైక్రో ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.10 వేలు అప్పుతీసుకున్నాడు. ఆ వెంటనే రూ. రెండు వేలు చెల్లించాడు. మిగిలిన రూ.8 వేలకు వడ్డీతో ఇప్పుడది రెట్టింపు అయిందని, వెంటనే చె ల్లించాలని నోటీసులు పంపారు. అదే గ్రామానికి చెందిన బేగరి నారాయణ, బైండ్ల నర్సింహులు తదితరులకు సైతం ఇలాగే నోటీసులు అందాయి. ఒక్క నియోజకవర్గంలోనే రూ.20 కోట్ల రుణాలు.. పరిగి నియోజకవర్గ పరిధిలోని పూడూరు, పరిగి, దోమ, కుల్కచర్ల, గండేడ్ మండలాల్లో ఎల్అండ్టీ, ఎస్కేఎస్, స్పందన తదితర సంస్థలు సుమారు రూ.20 కోట్ల మేర రుణాలిచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు 9 నుంచి 11 శాతం వడ్డీ వసూలు చేస్తుండగా మైక్రో సంస్థలు 24 శాతం వడ్డీ అని చెబుతూ 45 నుంచి 55 శాతం వడ్డీ వసూలు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఆదుకోని ఆర్థిక చేకూర్పు.. మహిళల అవసరాలు పూర్తిస్థాయిలో తీర్చి ఇతర ప్రైవేటు అప్పుల నుంచి విముక్తి కలిగించడంలో భాగంగా గతంలో ప్రభుత్వం ఐకేపీ ద్వారా ప్రారంభించిన సంపూర్ణ ఆర్థిక చేకూర్పు పథకం మహిళలన్ని ఆదుకోవడంలో విఫలమైంది. 10 నుంచి 15 మంది ఉన్న ఒక్కో సంఘానికి, విడివిడిగా ఒక్కో మహిళాకు ఏఏ అవసరాలున్నాయన్న దానిపై అధ్యయనం చేసి అవసరమైన మేరకు రుణాలివ్వాలని సంపూర్ణ ఆర్థిక చేకూర్పు పథకాన్ని తీసుకువచ్చారు. ఇందులో భాగంగా ఐకేపీ సిబ్బందితో ప్రణాళిక తయారు చేసింది. కానీ ఆ ప్రణాళికను ఇప్పటివరకు సమర్థవంతంగా అమలు చేయకపోవడంతో మహిళా సంఘాలు మైక్రో సంస్థల్ని ఆశ్రయించక తప్పడం లేదు. -
మహిళా.. భవిత నీదే!
ఇది దివంగత నేత వైఎస్ ఆశయం.. స్త్రీల పట్ల ఆయనకున్న గౌరవానికి నిదర్శనం. అప్పటి దాకా మైక్రో రుణాల పేరుతో స్త్రీలు పడుతున్న అగచాట్లకు ఫుల్స్టాప్ పెట్టాలనుకున్నారు. వారి స్వయం సమృద్ధికోసం పావల వడ్డీకే రుణాలు అనే సరికొత్త పథకానికి 2004 సెప్టెంబర్‌లో రూపక ల్పన చేశారు. ఆయన హయాంలో ఎంతో మంది అభ్యున్నతి సాధించారు. కానీ వైఎస్ అకాల మరణం తర్వాత పొదుపు గ్రూపుల సభ్యులపై బ్యాంకర్ల వేధింపులెక్కువయ్యాయి. పాలకుల చిన్నచూపు మహిళలను అప్పుల్లోకి నెట్టింది. ‘అక్కల్లారా.. చెల్లెళ్లారా.. ఇక మీ కష్టాలు ఎంతో కాలం ఉండవు.. రుణాలు తీసుకున్న నేరానికి కుమిలిపోవాల్సిన అవసరం లేదు. మీరు తీసుకున్న రుణాలన్నీ నేను అధికారంలోకి రాగానే రద్దు చేస్తా.. మీ కన్నీటిని తుడుస్తా’.. అంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. సీఎంగా తన నాలుగో సంతకాన్ని ఇదే ఫైలుపై పెడతానని స్పష్టం చేశారు. 55,541 జిల్లాలోని పొదుపు గ్రూపులు జిల్లాలో ఐకేపీ, మెప్నా ఆధ్వర్యంలో స్వయం సహాయ గ్రూపులు పని చేస్తున్నాయి. ఐకేపీ గ్రామీణ ప్రాంతాల్లో 47150 గ్రూపులతో పనిచేస్తుండగా.. మెప్నా పట్టణ ప్రాంతాల్లో 8391గ్రూపులు కలిగి ఉంది. ఒక్క ఐకేపీలోనే గ్రూపునకు 9 నుంచి 11 మంది చొప్పున 4,80,000 మంది స్వయం సభ్యులు లబ్ధిదారులుగా ఉన్నారు. అలాగే మెప్నాలో కూడా సుమారు 20 వేల మంది సభ్యులుంటారు. ఒక్కో గ్రూపునకు రూ50 వేల నుంచి రూ5 లక్షల వరకు బ్యాంకు లింకేజీ రుణాలు లభిస్తాయి. రూ.622 కోట్లు ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ)లోని 47,150 గ్రూపులు ప్రస్తుతం రూ622 కోట్ల మేర బ్యాంకు లింకే జీ రుణాలు పొంది ఉన్నాయి. రూ.92.96 కోట్లు స్త్రీనిధి అనే పథకం మరోటి ఉంది.. దీని ద్వారా గ్రూపు సభ్యుల వ్యక్తిగత అవసరాలకు రుణాలు అందిస్తారు. అంటే వారి కుటుంబ సభ్యుల చదువు, వివాహం, ఆరోగ్యం మొదలైన వాటి కోసం. అయితే వీటిని 24 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి రుణాలు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐకేపీ, మెప్నా సభ్యులు ఇప్పటికి రూ 92.96 కోట్లు తీసుకున్నారు. రూ.70 కోట్లు మెప్నా ఆధ్వర్యంలో పట్టణాలల్లోని మురికి వాడల్లో పని చేస్తున్న దాదాపు 8391 గ్రూపులు ప్రస్తుతానికి బ్యాంకుల నుంచి రూ70 కోట్ల రుణాలు తీసుకున్నాయి. రూ.785.46 కోట్లు సుమారు 5 లక్షల గ్రూపులకు జగన్ మాఫీ చేయనున్న రుణం గ్రూపు వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో ఆయా సంఘాలు రూ785.46 కోట్లు బ్యాంకర్లకు చెల్లించాల్సి ఉంది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే ఈ మొత్తాన్ని రద్దు చేయనున్నారు. దీనివల్ల సుమారు 5 లక్షల మంది మహిళలు తమ రుణాల నుంచి విముక్తి పొందనున్నారు. రూ.15.50 కోట్లు పాలప్రగతి కేంద్రాలు, జీవప్రగతి కేంద్రాలు, నిరుపేదల వ్యూహం పథకాల కింది ఇప్పటి వరకు జిల్లాలోని వివిధ గ్రూపులకు రూ15.50 కోట్లు చెల్లించారు.