ఎమ్మెల్సీ ఎన్నికలతో మొదలైన రాజకీయ సందడి ఈ ఏడాదంతా కొనసాగింది. సహకార, పంచాయతీ ఎన్నికలు, తెలంగాణ ప్రకటనకు ముందూ వెనకా కొనసాగిన ఆందోళనలు, మారిన పార్టీల సమీకరణాలు జిల్లా రాజకీయాలను ఆసక్తికరంగా మార్చాయి. ప్రధాన పార్టీల ముఖ్యనేతల పర్యటనలు, సమావేశాలు ఆయా పార్టీల శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. అధికార పార్టీ ఆధిక్యాన్ని నిలబెట్టుకోగా తెలంగాణ ఉద్యమం, నేతల వలసలతో టీఆర్‌ఎస్ సత్తా చాటింది. తెలుగుదేశం పార్టీ బాగా దెబ్బ తినగా, ఉద్యమంలో క్రియాశీల భాగస్వామ్యం, నరేంద్రమోడీ ప్రభావంతో కమలం వికసించింది.
- సాక్షి, కరీంనగర్
ఈ ఏడాది భారతీయ జనతా పార్టీకి బాగా కలిసివచ్చింది. తెలంగాణ జేఏసీలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్న బీజేపీ టీఆర్‌ఎస్‌కు దీటుగా జనంలోకి వెళ్లింది. జేఏసీ కార్యక్రమాలతోపాటు సొంతంగా కూడా కార్యక్రమాలు చేపడుతోంది. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయినుంచి కార్యాచరణ తీసుకుంది. హైదరాబాద్‌లో మోడీ సభకు జిల్లానుంచి భారీగా యువతను తరలించింది. నరేంద్రమోడీ పట్ల పెరుగుతున్న సానుకూలతతో పార్టీలోకి వలసలు కూడా పెరిగాయి.
ఇంకా పలువురు కీలక నేతలను చేర్చుకునేందుకు మంతనాలు సాగిస్తున్నారు. ఈ ఏడాదిలోనే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా జిల్లాకు చెందిన పి. మురళీధరరావును నియమించారు. ఆయన జిల్లాలో వివిధ వర్గాలను ఆకర్షించేలా సదస్సులు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సైతం పలుమార్లు జిల్లాలో పర్యటించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు వెంకయ్యనాయుడు సైతం జిల్లాలో పర్యటించారు. రైతు సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ ఎదుట దీక్ష చేశారు. పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా కార్యకర్తలు భారీగా తరలివస్తుండడం నేతను ఉత్తేజపరుస్తోంది.
పార్టీ బలోపేతంపై వైఎస్సార్‌సీపీ దృష్టి సారించింది. సహకార, పంచాయతీ ఎన్నికలను ఎదుర్కొంది. పలు పంచాయతీలను కైవసం చేసుకుని సత్తా చాటింది. పంచాయతీ ఎన్నికలకు ముందుకు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జిల్లాలో పర్యటించారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేశారు. అంతకుముందు అదే నెలలో నేత కార్మికుల్లో భరోసా నింపేందుకు సిరిసిల్లలో పర్యటించారు. విజయమ్మ పర్యటనలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి.
తెలుగుదేశం పార్టీకి ఈ ఏడాది కలిసిరాలేదనే చెప్పాలి. ఆ పార్టీ చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. గతేడాది చివర్లో జిల్లాలో పాదయాత్ర చేసిన చంద్రబాబు ఇక్కడి నుంచే అఖిలపక్షానికి లేఖ పంపారు. తమ వల్లనే తెలంగాణ ప్రక్రియ ముందుకు వెళ్తోందని చెబుతూ వచ్చిన టీడీపీ నేతలు తాజా పరిణామాలపై మౌనం వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు సమన్యాయమని, విభజన ఆపాలని ప్రకటించడం... జిల్లా నాయకులకు ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెడుతోంది.
చంద్రబాబు ఈ ఏడాది కనీసం జిల్లాకు కూడా రాలేదు. ఆయన జిల్లాలో అడుగుపెట్టే పరిస్థితులు కూడా లేకపోవడం ఆ పార్టీ పరిస్థితి చెప్పకనే చెబుతోంది. పార్టీ తీరు మీద నేతల్లో అసహనం పెరుగుతోంది. ఇందులో భాగంగానే గంగుల కమలాకర్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ అధిష్టానం మీద క్యాడర్‌లోనూ అసంతృప్తి ఉన్నా బయట పడడం లేదు. దీనికి నేతల మధ్య సమన్వయం లోపమే కారణం. గంగుల రాజీనామా చేసి ఇంతకాలమైనా కరీంనగర్‌కు ఇన్‌చార్జీని నియమించలేకపోయారు.
మరికొన్ని నియోజకవర్గాలకు కనీసం ఇన్‌చార్జి ఎవరూ దొరకని పరిస్థితి. ఇటీవల నాలుగు చోట్ల ఇన్‌చార్జీలను నియమించినా వివాదాస్పదమయ్యాయి. రామగుండం ఇన్‌చార్జీగా వ్యవహరించిన గోపు అయిలయ్య యాదవ్ పార్టీని వీడారు. పార్టీ వైఖరి, అధినేత తీరుైపై పెరుగుతున్న వ్యతిరేకత పార్టీ నేతలను కలవరపెడుతోంది. నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసే పెద్ద నాయకుడే జిల్లాకు కరువై పోయారు. బాబ్లీ ప్రాజెక్టుపై నిర్వహించిన ఆందోళనకు టీటీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరయ్యారు. జిల్లాలో టీడీపీ తరఫున అదే పెద్ద కార్యక్రమంగా నిలిచింది.
తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తున్నా ఆ మేరకు రాజకీయంగా లబ్ధి పొందడంలో ఆ పార్టీ జిల్లా నాయకత్వం ఆశించిన ఫలితాలను పొందలేకపోయింది. శాసనసభకు బిల్లు వచ్చిన సందర్భంలో జిల్లా మంత్రి శ్రీధర్‌బాబు, సీమాంధ్ర నేతల తీరును ఎండగట్టడంలో ఎంపీ పొన్నం ప్రభాకర్ గట్టిగా వ్యవహరించినా జిల్లాలో పార్టీ పరంగా ఎలాంటి లబ్ధి చేకూరలేదు. అంతర్గత విభేదాలు నియోజకవర్గస్థాయికి చేరడం పార్టీని వేధిస్తోంది. ఫిబ్రవరిలో జరిగిన సహకార ఎన్నికల్లోనూ జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కొంత కష్టం మీదే ఆధిక్యాన్ని నిలబెట్టుకోగలిగింది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలను దక్కించుకుంది. శాసనసభ కోటాలో సంతోష్‌కుమార్‌కు శాసనమండలి సభ్యత్వం లభించింది.
ఫిబ్రవరిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ రికార్డు విజయాలతో దూకుడు ప్రారంభించింది. పట్టభద్రుల స్థానం నుంచి స్వామిగౌడ్, ఉపాధ్యాయ స్థానం నుంచి సుధాకరరెడ్డి విజయం సాధించారు. తెలుగుదేశం నుంచి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కాంగ్రెస్ నుంచి పెద్దపల్లి ఎంపీ వివేకానంద రెండు నెలల వ్యవధిలోనే టీఆర్‌ఎస్‌లో చేరడంతో పార్టీ బలోపేతమైంది. సహకార, పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు దీటుగా విజయాలు సాధించింది. సీడబ్ల్యూసీ ప్రకటన తరువాత తెలంగాణ ఏర్పాటు ఘనత చేజారకుండా టీఆర్‌ఎస్ తాపత్రయపడుతోంది. ఆంక్షలు లేని తెలంగాణే కావాలంటూ కాంగ్రెస్‌ను ఇరుకున పెడుతోంది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ జిల్లాలో పలు సభలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో జోష్ కలిగిస్తున్నారు.
ఏడాదంతా సందడే (2013)
Published Sat, Dec 28 2013 3:20 AM | Last Updated on Thu, Dec 27 2018 4:17 PM
Advertisement
Advertisement