2018 సంవత్సరం భారత రాజకీయాల్లో పలు మార్పులకు నాంది పలికింది. సంవత్సర ఆరంభంలో బీజేపీ దేశవ్యాప్తంగా జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినా.. సంవత్సరాంతానికి వచ్చేసరికి మూడు రాష్ట్రాల్లో పరాజయంతో కుదేలైంది. అయితే.. బీజేపీకి జరిగిన నష్టాన్ని అందిపుచ్చుకోవడంలో మాత్రం కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీలు తమ సత్తాచాటుకోవడం దేశ రాజకీయాల్లో మరో మలుపునకు నాంది పలికింది. మరోవైపు ప్రధానిగా మోదీ జనాదరణ తగ్గకపోయినా.. వివిధ రాజకీయ పరిణామాల కారణంగా ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి భంగపాటు తప్పలేదు. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మార్చి నాటికి బీజేపీ, దాని మిత్రపక్షాలు 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా, సంవత్సరం చివరకు వాటి సంఖ్య 16కు పడిపోయింది. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత రాజకీయంగా ఎదురులేని స్థితి నుంచి బీజేపీ జోరు నెమ్మదించింది. ఒకప్పటి పాలకపక్షం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో కేవలం 44 సీట్లకు పరిమితమైనా.. ఇప్పుడిప్పుడే కాస్త పుంజుకుంటోంది. పదిహేనేళ్లుగా అధికారంలో లేని మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మళ్లీ ప్రభుత్వాలు ఏర్పాటుచేసింది. రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలులో ఎన్డీయే ప్రభుత్వానికి సుప్రీంకోర్టు క్లీన్‌చిట్ ఇవ్వడం వంటి పరిణామాలు బీజేపీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వచ్చే లోక్‌సభ ఎన్నికలపై పలు మీడియా సంస్థలు జరిపిన సర్వేల ప్రకారం.. మళ్లీ ఎన్డీఏకే అధికారం రావచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే.. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మారుతున్న రాజకీయ పరిణామాల వల్ల ఫలితాన్ని ఇప్పుడే ఊహించడం కష్టమేననే భావన వ్యక్తమవుతోంది.
మొదట బీజేపీ విజయ పరంపర
ఈ ఏడాది ఫిబ్రవరి చివర్లో.. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాలు సాధించింది. త్రిపురలో కమ్యూనిస్టుల బలమైన కోటను కూల్చి మరీ అధికారాన్ని కమలనాథులు కైవసం చేసుకున్నారు. త్రిపుర తొలి కాషాయపార్టీ సీఎంగా విప్లవ్ కుమార్ దేవ్ ప్రమాణం చేశారు. మేఘాలయాలో కాంగ్రెస్ పరాజయంపాలైంది. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), యునైటెడ్ డెమొక్రాటిక్ పార్టీ అధికారంలోకి వచ్చాయి. ఎన్పీపీకి చెందిన కన్రాడ్ సంగ్మా సీఎం అయ్యారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పక్షమైన నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) ఓడిపోయింది. బీజేపీతో కలిసి నేషనలిస్ట్ డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) మెజారిటీ సీట్లు సాధించింది. ముఖ్యమంత్రిగా ఎన్డీపీపీ నేత నెయిఫియూ రియో ప్రమాణం చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈశాన్య భారతంలో బీజేపీకి మొదలైన విజయాలు ఇలా ముందుకు కొనసాగాయి.
కర్ణాటకతో కథ మారింది
మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పక్షమైన కాంగ్రెస్ మళ్లీ మెజారిటీ సీట్లు సాధించలేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలు దక్కపోయినా.. బీజేపీ అసెంబ్లీలో అతిపెద్ద పక్షంగా అవతరించింది. గవర్నర్ ఆహ్వానంపై ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన బీజేపీ మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప శాసనసభలో మెజారిటీ నిరూపించుకోలేక వారం రోజుల వ్యవధిలోనే రాజీనామా చేశారు. జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామిని సీఎంగా చేసేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. దీంతో కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తమకు వచ్చిన సీట్లలో సగం కూడా గెలుచుకోని జేడీఎస్‌తో చేతులు కలిపేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సిద్ధమవడంతో.. కూటమి సర్కారు ఏర్పాటైంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరే సందర్భంగా.. బీజేపీ వ్యతిరేకపార్టీలు (జాతీయ, ప్రాంతీయ) బెంగళూరులో బలప్రదర్శన చేశాయి. సోనియా, రాహుల్‌లతోపాటుగా మమతా బెనర్జీ (తృణమూల్), కేజ్రీవాల్ (ఆప్), చంద్రబాబు (టీడీపీ) అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), మాయావతి (బీఎస్పీ) సహా సీపీఎం, సీపీఐ నాయకులు సహా అనేక మంది ప్రతిపక్షాల నేతలు కుమారస్వామి ప్రమాణానికి హాజరయ్యారు. ఇంత మంది ప్రతిపక్ష నేతలు ఒకే వేదిక మీద కనిపించడం 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇదే మొదటిసారి. దీంతో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అన్ని సీట్లలో బీజేపీపై ప్రతిపక్షాల తరఫున ఒకే అభ్యర్థి ఉండాలనే ప్రతిపాదన ముందుకొచ్చింది. అప్పటినుంచి ఈఅంశం ఆధారంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఒకే బీజేపీ వ్యతిరేక మహాఘట్ బంధన్ ఏర్పాటుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఐదు రాష్ట్రాల్లో ఎదురుదెబ్బ
నవంబర్, డిసెంబర్ నెలల్లో ఐదు రాష్ట్రాల్లో (మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరం) జరిగిన అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి వ్యతిరేక ఫలితాలు ఇచ్చాయి. పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఈ పార్టీ అధికారం కోల్పోయింది. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేష్ బాఘేల్ సీఎం అయ్యారు. మధ్యప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కన్నా బీజేపీ ఒక శాతం ఓట్లు ఎక్కువ సాధించినా.. కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వం ఏర్పాటుకు తగినన్ని సీట్లు రాకపోవడంతో బీఎస్పీ, ఎస్పీ, ఇండిపెండెంట్ల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ సీఎంగా ప్రమాణం చేశారు. బీజేపీకి 109 సీట్లు వచ్చాయి. సీఎం సీటుకోసం యువనేత జ్యోతిరాదిత్య సింధియా పోటీపడినప్పటికీ.. వయసు, అనుభవం, రానున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కమల్‌నాథ్‌కే ఈ పీఠం దక్కింది.
రాజేను తిరస్కరించిన రాజస్తాన్
రాజస్తాన్‌లో ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీకి ప్రజలు అధికారపీఠం నుంచి కిందకు దించారు. రాజేపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంటుందనుకున్నప్పటికీ.. బీజేపీకి చెప్పుకోదగ్గ సంఖ్యలో సీట్లు వచ్చాయిగానీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేకపోయింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 101 సీట్లు రాకున్నా చిన్న పార్టీలు, ఇతరుల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎం సీటును ఆశించిన పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్‌కు ఆశాభంగం తప్పలేదు. గతంలో రెండుసార్లు సీఎంగా పనిచేసిన సీనియర్ నేత అశోక్ గహ్లోత్‌కే అధిష్టానం సీఎల్పీ నాయకత్వం అప్పగించింది. డిప్యూటీ సీఎంగా ఉండేందుకు పైలట్ అంగీకరించడంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో నాయకత్వం కోసం రగిలిన వివాదం సమసిపోయింది. మొత్తంమీద కాంగ్రెస్ కన్నా ఒక శాతం తక్కువ ఓట్లు సంపాదించిన బీజేపీ 73 సీట్లతో సరిపెట్టుకుంది. ప్రతి ఐదేళ్లకూ పాలకపక్షాన్ని మార్చే ఆనవాయితీని ఈసారి కూడా రాజస్తాన్ కొనసాగించింది.
‘చే’జారిన ఈశాన్యం
ఐదేళ్లుగా ఈశాన్యంలో ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతున్న కాంగ్రెస్.. ఈ ప్రాంతంలో అధికారం ఉన్న ఏకైక రాష్ట్రం మిజోరంలోనూ ఓటమిపాలైంది. కాంగ్రెస్ సీఎం లాల్ థాన్‌వాలా పోటీచేసిన రెండు సీట్లలోనూ ఓటమిపాలయ్యారు. మెజారిటీ సీట్లు సాధించిన మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) నేత జోరంతంగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
అనంత లోకాలకు అటల్‌జీ...
ఆగస్టు 16న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి (93) కన్నుమూశారు. దేశ ప్రధానిగా ఐదేళ్ల పూర్తి కాలం పదవిలో కొనసాగిన మొదటి కాంగ్రెస్సేతర ప్రధానిగా వాజ్‌పేయి రికార్డు సృష్టించారు. 1996లో 13 రోజులు, 1998–99 మధ్య 13 నెలలపాటు ఆయన ప్రధానిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత 1999–2004 మధ్యలో మూడోసారి ప్రధానిగా (ఐదేళ్లపాటు) పని చేశారు. 1924, డిసెంబర్ 25న గ్వాలియర్లో జన్మించారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వాజ్‌పేయి తన వాక్చాతుర్యంతో పార్టీలకతీతంగా అభిమానం సంపాదించారు. అజాతశత్రువుగా అందరి మన్ననలు పొందారు. సంకీర్ణ ప్రభుత్వానికి అధినేతగా ఉంటూ భాగస్వాముల్లో ఎలాంటి అసంతృప్తి రేగకుండా వ్యవహరించడమే.. వాజ్‌పేయి రాజకీయ సమర్థతకు నిదర్శనం. ఇరుగుపొరుగు దేశాలతో సయోధ్యకు ప్రయత్నించడం ద్వారా ప్రపంచ దేశాల నేతలకు కూడా అభిమానపాత్రుడయ్యారు. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన అటల్.. ప్రధాని హోదాలో లాహోర్ బస్సుయాత్ర చేపట్టి ఇరు దేశాలమధ్య సత్సంబంధాలకు కృషి చేశారు.
కరుణానిధి అస్తమయం
తమిళనాడుకు దాదాపు రెండు దశాబ్దాలు సీఎంగా పని చేసిన డీఎంకే అధినేత కరుణానిధి ఆగస్టు 7న చెన్నైలో కన్నుమూశారు. తమిళనాడులో ద్రవిడ ఉద్యమం ప్రబలడంలో ఆయన ముఖ్య భూమిక పోషించారు. 1924, జూన్ 3న జన్మించిన కరుణానిధి రాజకీయాల్లోకి రాకముందు సినీ రచయితగా ఉన్నారు. 1969లో డీఎంకే తొలి సీఎం అన్నాదురై ఆకస్మిక మరణంతో కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. 1976లో అవినీతి తదితర ఆరోపణలపై కరుణానిధి సర్కారును అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బర్తరఫ్ చేశారు. 13 ఏళ్ల తర్వాత 1989లో మళ్లీ కరుణ అధికారంలోకి వచ్చారు. శ్రీలంక తమిళ ఉగ్రవాద సంస్థ ఎల్టీటీఈతో సంబంధాలున్నాయన్న ఆరోపణపై 1991లో ఆయన ప్రభుత్వాన్ని కేంద్రంలోని చంద్రశేఖర్ ప్రభుత్వం బర్తరఫ్ చేసింది.1989లో కేంద్రంలో కాంగ్రెస్సేతర ప్రభుత్వం ఏర్పాటులో కరుణానిధి కీలక పాత్ర పోషించారు. మళ్లీ 1996–98 మధ్య కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ పేరుతో కొనసాగిన సంకీర్ణ ప్రభుత్వంలో డీఎంకే భాగస్వామిగా ఉంది.
రఫేల్‌పై కాంగ్రెస్‌కు మొట్టికాయలు
ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయనున్న రఫేల్ యుద్ధ విమానాల విషయంలో భారత్–ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ విషయంలో ప్రధానిపై రాహుల్ గాంధీ పలు వేదికల ద్వారా తీవ్ర ఆరోపణలు చేశారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ సంస్థకు లబ్ధి చేకూర్చేలా మోదీ వ్యవహరించారని విమర్శించారు. అంతటితో ఆగకుండా ఈ ఒప్పందంలో అవినీతిపై విచారించాలంటూ సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే.. ఈ ఒప్పందంలో అవినీతి కనిపించడం లేదని.. లోపాలేమీ లేవని, దీనిపై న్యాయ విచారణ జరపాల్సిన అవసరం లేదని డిసెంబర్ 14న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రఫేల్ పేరుతో రెండు ఇంజన్లు కలిగిన యుద్ధవిమానాలను తయారు చేసే ఫ్రెంచి కంపెనీ డసో ఏవియేషన్ సంస్థ నుంచి 126 రఫేల్ విమానాలు కొనుగోలు చేయాలని 2007లో యూపీఏ ప్రభుత్వం భావించింది. కొన్నేళ్ల పాటు ఇరుపక్షాల మధ్య చర్చలు సాగాయి. చివరికి 18 విమానాలు ఫ్రాన్స్‌లో తయారు చేయాలని, మిగిలిన 108 విమానాలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) భాగస్వామ్యంతో భారతదేశంలో తయారు చేయాలని 2012లో యూపీఏ ప్రభుత్వం, డసో ఏవియేషన్ ఒక అంగీకారానికి వచ్చాయి. ధర విషయంలో చర్చలు ఒక కొలిక్కి రాకుండానే ఇరు దేశాల్లో ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు మారాయి. దీంతో ఒప్పందం ముందుకు సాగలేదు. అయితే ఒక్కో యుద్ధవిమానానికి రూ.526 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదర్చుకున్నామని కాంగ్రెస్ చెబుతోంది.
2014 ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మోదీ.. నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్‌తో చర్చలు జరిపారు. 126కి బదులుగా 36 రఫేల్ యుద్ధవిమానాలను కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నామని 2015లో ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఎన్ని కోట్లకు ఒప్పందం కుదుర్చుకుందో, ఒక్కో విమానాన్ని ఎన్ని కోట్లు పెట్టి కొనుగోలు చేస్తోందో అధికారికంగా వెల్లడించలేదు. 59 వేల కోట్లకు రఫేల్ ఒప్పందం కుదిరిందని, 2019 సెప్టెంబర్ నుంచి 2022 ఏప్రిల్ మధ్య 36 యుద్ధ విమానాలను ఇండియాకు సరఫరా చేయడానికి ఫ్రాన్స్ అంగీకరించిందని వార్తలు వచ్చాయి. రాఫెల్ ఒప్పందంలో అంశాలను రహస్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చిందో మోదీ తెలపాలని రాహుల్ ప్రశ్నించారు. ఈ ఒప్పందంపై న్యాయవిచారణ జరిపించాలని కాంగ్రెస్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. కేసు విచారణలో వైమానిక దళం అధికారులు సహా పలువురి వాదనలు విన్న సుప్రీం కోర్టు రఫేల్ ఒప్పందాన్ని సమర్థిస్తూ, కాంగ్రెస్ సహా పలువురు వేసిన పిటిషన్లను కొట్టివేసింది. ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు అఫిడవిట్ కారణంగా సుప్రీం తీర్పు వచ్చిందని, దీనిపై జేపీసీని నియమించాలని కోరుతూ విపక్షాలు పార్లమెంటులో రోజూ గొడవ చేస్తూనే ఉన్నాయి.
కౌగిలింత ఆపై కన్నుగీత..
జూలై 20న పార్లమెంటులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లి ఆయనను కౌగలించుకున్నారు. మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో ప్రసంగించిన తర్వాత రాహుల్ అనూహ్యంగా మోదీ దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. దాంతో మోదీ సహా పార్లమెంటు సభ్యులంతా క్షణకాలం అవాక్కయ్యారు. ఆ తరువాత తన సీటు వద్దకు తిరిగొచ్చిన రాహుల్.. సన్నిహితులవైపు చూసి కన్నుగీటారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment