పార్లమెంటులో చిదంబరం బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు విఫలయత్నం చేశారు.
నిరసనల హోరు.. ప్రసంగం జోరు!
Feb 18 2014 1:27 AM | Updated on Sep 27 2018 5:56 PM
సమైక్య నిరసనల మధ్యనే ఉభయసభల్లో చిదంబరం బడ్జెట్ ప్రసంగం
పార్లమెంటులో చిదంబరం బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు విఫలయత్నం చేశారు. సమైక్య నినాదాలతో ఉభయసభలను హోరెత్తించారు. సోమవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభమైన వెంటనే చిదంబరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవగా సీమాంధ్ర కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, దగ్గుబాటి పురందేశ్వరి, ఎంపీలు జీవీ హర్షకుమార్, కనుమూరి బాపిరాజు వెల్‌లోకి దూసుకొచ్చి సమైక్యాంధ్ర ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. తమతమ స్థానాల్లోకి వెళ్లాలని స్పీకర్ మీరాకుమార్ పదేపదే కోరినా వారు పట్టించుకోలేదు.
పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్, హోంమంత్రి షిండే నేరుగా సీమాంధ్ర మంత్రుల వద్దకు వెళ్లి ‘మంత్రులుగా ఉంటూ ఆందోళన చేయడం సరికాదు. వచ్చి కూర్చోండి’ అని కోరినా వినలేదు. చేసేదేమీ లేక కమల్‌నాథ్ సోనియాగాంధీ వద్దకు వెళ్లి పరిస్థితి వివరించారు. సోనియా సైతం వెనక్కు రావాలంటూ సైగలు చేసినా సీమాంధ్ర మంత్రులు పట్టించుకోలేదు. మరోవైపు ఎంపీ హర్షకుమార్ పోడియం వద్దకెళ్లి నినాదాలు చేస్తూ కంటతడి పెట్టుకోవడం కన్పించింది. ఆయన గొంతు ఎండిపోయిందని భావించిన మంత్రి జేడీ శీలం మంచినీళ్ల గ్లాసు అందివ్వబోయారు.
సోనియా ఆగ్రహంగా చూడటంతో గ్లాస్ ఇవ్వకుండానే వచ్చి తన సీట్లో కూర్చొన్నారు. మరోవైపు సహచరుల నిరసనను పట్టించుకోకుండానే శీలంతోపాటు మంత్రులు కిషోర్ చంద్రదేవ్, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి తమ సీట్లకే పరిమితమయ్యారు. కేంద్రమంత్రి పల్లంరాజు, ఎంపీ బొత్స ఝాన్సీ సోనియా ఉన్నంతసేపు తమ స్థానాలవద్ద నిల్చుని నిరసన తెలిపారు. ఆమె వెళ్లిపోగానే వెల్‌లోకి వెళ్లి ఇతర నేతలతో కలసి నినాదాలు చేశారు. తృణమూల్, అన్నాడీఎంకే, సమాజ్‌వాదీ సభ్యులూ ఇతరత్రా అంశాలపై నిరసన తెలుపుతూ వెల్‌లోకి వెళ్లారు. ఈ నిరసనల మధ్యే చిదంబరం బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తి చేశారు.
రాజ్యసభలోనూ అంతే: రాజ్యసభలోనూ ఇదే సీన్ కన్పించింది. రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన వెంటనే చిదంబరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవగా సీమాంధ్ర ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బరామిరెడ్డి, సీఎం రమేశ్, సుజనా చౌదరి తదితరులు పోడియం వద్ద నిలబడి సమైక్యాంధ్ర ప్రదేశ్ ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చిదంబరం బడ్జెట్ ప్రసంగ పాఠం పూర్తయిన వెంటనే సభ వాయిదా పడింది.
Advertisement
Advertisement