నిర్ణయం మారదు! ఊపందుకున్నవిభజన! | Decision on state bifurcation will not change, Telangana State formation process speeds up | Sakshi
Sakshi News home page

నిర్ణయం మారదు! ఊపందుకున్నవిభజన!

Published Tue, Aug 6 2013 2:02 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

నిర్ణయం మారదు! ఊపందుకున్నవిభజన! - Sakshi

నిర్ణయం మారదు! ఊపందుకున్నవిభజన!

సీమాంధ్ర ప్రాంత ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నప్పటికీ.. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయంలో మార్పు చేసే అవకాశమే లేదని దిగ్విజయ్ తేల్చిచెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. విభజనతో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని.. ఇందుకు పార్టీ అధిష్టానానికి సహకరించాలని తనను కలిసిన ఆ ప్రాంతాల కేంద్రమంత్రులకు ఆయన సూచించినట్లు సమాచారం. విభజన నిర్ణయంపై సీమాంధ్రలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న నేపధ్యంలో దిగ్విజయ్‌ను కలిసిన సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు.. తెలంగాణ ఏర్పాటుపై సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా కోరినపుడు ఆయన పై విధంగా స్పందించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
 
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ఒకవైపు కాంగ్రెస్ అధిష్టానం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేస్తున్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి కీలకమైన, విధానపరమైన అంశాలను పరిశీలించేందుకు ‘కేబినెట్ నోట్’ను సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంటులో ప్రకటించింది. ఈ నోట్‌ను కేబినెట్ ఆమోదించిన తర్వాత పార్లమెంటులో చర్చకు అవకాశం ఉంటుందని పేర్కొంది. మరోవైపు.. విభజనపై సీమాంధ్రలో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను చల్లార్చే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం ఆ ప్రాంత నేతలతో చర్చలు జరిపేందుకు రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఆంటోనీ ఇప్పటికే నాయకులతో చర్చలు ప్రారంభించారని కూడా కాంగ్రెస్ ప్రకటించింది. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం మారే అవకాశం లేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులకు తేల్చిచెప్పారు. సీమాంధ్ర ప్రాంత నేతలు లేవనెత్తుతున్న అభ్యంతరాలు, అభ్యర్థనలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ.. వాటిని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తుందని ఆయన మీడియాతో పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుపై రాజ్యాంగపరమైన ప్రక్రియను అనుసరిస్తామని.. బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే సమయానికి ఇరు ప్రాంతాల నేతల మధ్య రాజీ కుదురుస్తామని చెప్పారు.
 ‘టి-నోట్’ సిద్ధమవుతోంది...


 పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు సోమవారం నాడు ఉభయసభల్లోనూ తెలంగాణ అంశంపై తీవ్ర గందరగోళం చెలరేగింది. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన పలువురు సభా కార్యక్రమాలను స్తంభింపచేశారు. తెలంగాణ అంశంపై ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని, దీనిపై చర్చ చేపట్టాలని ఎంపీలు డిమాండ్ చేశారు. ఈమేరకు ప్రభుత్వం తరఫున ఆర్థికమంత్రి చిదంబరం మధ్యాహ్నం మూడు గంటలకు రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. ‘‘ప్రత్యేక తెలంగాణకు సంబంధించిన అంశంలో.. కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం భారత రాజ్యాంగం ఒక ప్రక్రియను నిర్దేశిస్తోంది. దానితోపాటు కొత్త రాష్ట్రం ఏర్పాటుతో అనేక కీలక అంశాలను పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది’’ అని   పేర్కొన్నారు.

తెలంగాణపై కేబినెట్ నిర్ణయం కోసం కీలకమైన, విధానపరమైన అంశాలతో కేంద్ర హోంశాఖ సమగ్రమైన నోట్ (నివేదిక)ను రూపొందిస్తుందని చిదంబరం చెప్పారు. ఇందులో నదీ జలాల పంపిణీ, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, మూడు ప్రాంతాల్లో నివసించే వారందరికీ భద్రత, రక్షణ, పౌరులందరికీ ప్రాధమిక హక్కుల హామీ తదితర అంశాలు ఉంటాయన్నారు. అయితే.. చర్చ తర్వాత ఇందులో చేర్చే, లేదా చేర్చే అవకాశం గల అంశాలేమిటో ఆయన చెప్పలేదు. ఈ అంశాలపై మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత.. దీనిపై సభలో నిర్మాణాత్మక చర్చ జరిపే అవకాశం ఉంటుందని చిదంబరం పేర్కొన్నారు. ప్రభుత్వం తగిన సమయంలో ఇలాంటి చర్చను ఆహ్వానిస్తుందన్న చిదంబరం.. ఆ తగిన సమయం ఎప్పుడు అనేది కూడా చెప్పలేదు.
 రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రాంత నేతలతో చర్చలు జరిపేందుకు.. వారి అభిప్రాయాలను, ఆందోళలను తెలుసుకునేందుకు రక్షణమంత్రి ఎ.కె.ఆంటోని నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సీమాంధ్ర సభ్యులను శాంతపరచే బాధ్యతను ఆంటోనికి, పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌కు అధిష్టానం అప్పగించినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మీమ్ అఫ్జల్ సోమవారం మీడియాకు తెలిపారు. తెలంగాణ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ఎంపీలందరితోనూ ఆంటోని మాట్లాడారని.. వారిని శాంతపరచేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
 
 అందరి అభిప్రాయాలనూ కేంద్రానికి నివేదిస్తాం...
 ఆంటోని నేతృత్వంలోని కమిటీ అన్ని ప్రాంతాల వారి అభిప్రాయాలను వింటుందని, వాటిని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తుందని దిగ్విజయ్‌సంగ్ చెప్పారు. సోమవారం రాత్రి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు దిగ్విజయ్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత దిగ్విజయ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై ఇరు ప్రాంత నేతలు సంయమనం పాటించాలని.. అన్ని ప్రాంతాల వారితో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలు తెసుకునేందుకు ఇప్పటికే పార్టీ అంతర్గంతంగా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ‘‘కమిటీ ఇరు ప్రాంతాల అభ్యంతరాలను వింటుంది. ఎవరి అభిప్రాయాలనైనా కమిటీ ముందు చెప్పుకోవచ్చు. అందరి వాదనలు వింటాం. ఇక్కడ వ్యక్తమైన అభిప్రాయలన్నింటీకీ కేంద్రానికి నివేదిస్తాం’’ అని వివరించారు. ఉద్యోగులు, విద్యార్థుల ఆందోళనలపై మాట్లాడుతూ.. ‘‘ఏపీఎన్‌జీఓల ఎలాంటి వివక్ష ఉండదు. విద్యార్థులకు సమాన అవకాశాలు ఉంటాయి. హైదరాబాద్‌లో సెటిలైన వారికి సమాన అవకాశం ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటాం’’ అని చెప్పారు. తెలంగాణకు అనుకూలమని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పార్లమెంట్‌లో ఆందోళనకు దిగటం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు.
 
 బిల్లు సమయానికి రాజీ కుదుర్చుతాం...
 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు ఎంత సమయం పడుతుందని ప్రశ్నించగా.. ‘‘తెలంగాణ ఏర్పాటుపై రాజ్యాంగ పరంగా అన్ని విధివిధానాలను అనుసరిస్తాం. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై మొదట కేంద్ర మంత్రివర్గం సమావేశమవుతుంది. రాష్ట్ర విభజనపై తీర్మానం చేయాలని రాష్ట్ర అసెంబ్లీకి సూచిస్తుంది. అసెంబ్లీ తీర్మానం అందాక కేంద్రం ఓ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ బృందం అన్ని అంశాలను పరిశీలిస్తుంది. ఓ వైపు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ అధికారికంగా కొనసాగుతూనే మరో పక్క సమాంతరంగా అందరి అభిప్రాయాలను సేకరిస్తుంది. బిల్లు తయారీ సమయానికి అన్ని ప్రాంతాల వారిని ఒప్పించి రాజీ కుదుర్చుతాం’’ అని పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనల్లో జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయటాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని ఇప్పటికే ముఖ్యమంత్రికి సూచించానని.. విగ్రహాల కూల్చివేతకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యహరించాలని కోరానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
 

చిదంబరం ప్రకటన పూర్తిపాఠమిదీ...

‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించినంతవరకూ.. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు రాజ్యాంగం నిర్దేశిస్తున్న ప్రక్రియ ఉంది. దానితో పాటు, కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటంలో అనేక కీలకాంశాలను పరిష్కరించాల్సి ఉంది. ఇవి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. మంత్రివర్గ నిర్ణయం కోసం కేంద్ర హోంశాఖ ఈ కీలకాంశాలు, రాజ్యాంగ ప్రక్రియకు సంబంధించిన అంశాలతో ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేస్తుంది. ఇందులో నదీజలాల పంపిణీ, విద్యుదుత్పత్తి, పంపిణీ, మూడు ప్రాంతాల ప్రజల భద్రత, ప్రజలందరి ప్రాధమిక హక్కులపై హామీ వంటి వాటితో పాటు ఇతర అంశాలు ఉంటాయి. వీటిపై కేంద్ర మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ అంశంపై సమగ్ర చర్చ జరిపేందుకు ఈ సభకు అవకాశం లభిస్తుంది. తగిన సమయంలో ప్రభుత్వం ఇలాంటి చర్చను ఆహ్వానిస్తుంది’’.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement