ఏపీ కాంగ్రెస్ నేతల సమీక్షలో వెల్లడి
సాక్షి, విజయవాడ: రాష్ట్ర విభజన, కీలక నేతల వలసలే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలయ్యాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ రాజకీయ చరిత్రలో ఘోర పరాజయాన్ని చవిచూడడం దురదృష్టకరమని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. విభజనకు వంత పాడిన దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేష్‌లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సహా రాయపాటి, లగడపాటి, పురందేశ్వరి, కావూరి సాంబశివరావు తదితరుల తీరుపై పలువురు మాజీ మంత్రులు ధ్వజమెత్తా రు. ఏపీ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల సమీక్షా సమావేశం మంగళవారం విజయవాడలో జరిగింది. ఉదయం 10 గంటలకు మొదలైన ఈ సమావేశం సాయంత్రం 5 వరకు కొనసాగింది. 13 జిల్లాల డీసీసీ అధ్యక్షులు, పీసీపీ సభ్యులు, ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు.
మొత్తం 52 మంది మాట్లాడారు. ఓటమికి గల కారణాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించుకోవాల్సిన అవసరముందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సూచించారు. అనుభవాలు, ఇబ్బందులతో రూపొందించిన నివేదికను ఈ నెల 23న ఏఐసీసీకి పంపనున్నట్టు చెప్పారు. మాజీ మంత్రుల కొండ్రు మురళి, సాకే శైలజానాథ్, కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జేడీ శీలం, మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణిలతో పాటు పలువురు మాజీ మంత్రులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
మీడియా కూడా దెబ్బతీసింది :బొత్స
కాంగ్రెస్‌పై టీడీపీ కుట్ర సాగిస్తోందని మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబుతోనే అభివృద్ధి అంటూ ఎల్లో మీడియా ఎన్నికల ముందు నుంచీ విస్తృతంగా ప్రచారం చేసి కాంగ్రెస్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. రుణాల మాఫీ పేరిట బాబు ప్రదర్శించిన విద్యలను ఆయా పత్రికలు బాగా ప్రచారం చేశాయన్నారు. బాబు అధికారంలోకి రాగానే రూ. 14 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందని చెబుతున్న ఓ వర్గం మీడియా 2004లో కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెట్టే నాటికి రూ. 21 వేల కోట్ల లోటుబడ్జెట్ ఉందన్న విషయాన్ని విస్మరిస్తున్నాయని ప్రశ్నించారు. ఈ కుట్రలను తిప్పి కొట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.
కిరణ్‌ది తీరని ద్రోహం: డొక్కా
కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీరని ద్రోహం చేశారని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శించారు. కిరణ్ చేసిన కుట్ర ప్రపంచంలో ఎక్కడా చూడలేదని, ఎంతో నమ్మకంగా నటించాడని, సీనియర్ మంత్రుల్ని సైతం న మ్మించాడని దుయ్యబట్టారు. విభజన ప్రకటన వెలువడగానే కిరణ్ రాజీనామా చే సి ఉంటే విభజన ప్రక్రియ కొంత మేరకు ఆగి ఉండేదన్నారు.
జైరాం తీరు బాగోలేదు: దేవినేని రాజశేఖర్
రాష్ట్ర విభజన సమయంలో కేంద్రమంత్రి జైరాం రమేష్ తీరు అస్సలు బాగోలేదని మాజీ ఎమ్మెల్యే దేవినేని రాజశేఖర్(నెహ్రూ) అన్నారు. విభజనకు అనుకూలంగా ఉన్న ఆయన వ్యవహార శైలితో సీమాంధ్ర ప్రజల్లో ఆవేశం కట్టలు తెంచుకుందన్నారు. రాయపాటి, లగడపాటి, పురందేశ్వరి, కావూరిల తీరుతో కార్యకర్తల్లో విశ్వాసం సన్నగిల్లిందని తెలిపారు.
అవమానకరం: ఆనం వివేకా
రాష్ట్ర విభజన అవమానకర ఘటనని మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి పేర్కొన్నారు. తెలుగు సంస్కృతి తెలియని దుర్మార్గులు రాష్ట్రాన్ని విడగొట్టారని దుయ్యబట్టారు. డిగ్గీలు, భగ్గీలందరూ(దిగ్విజయ్‌సింగ్) రోజుకో తీరున మాట్లాడుతుంటే సీమాంధ్ర రక్తం వేడెక్కిందన్నారు.
విభజన, వలసలే కాంగ్రెస్‌ను ముంచాయి
Published Wed, Jun 18 2014 1:16 AM | Last Updated on Sat, Aug 18 2018 6:14 PM
Advertisement
Advertisement