'చిదంబర' రహస్యం వల్లే విభజన?
ఎప్పుడూ తీవ్రస్థాయిలో ఉద్యమించే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ చాలా నిశ్శబ్దంగా ఉన్న ఒకానొక తరుణంలో, కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది పెద్దలు రహస్యంగా పావులు కదిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న కొంతమంది మంత్రులు, మరికొందరు సీనియర్ నాయకులు కలిసి హైదరాబాద్ నగరంలో ఓ పెద్ద బహిరంగ సభ పెట్టారు. తెలంగాణ రాష్ట్రం సాధించాల్సిందేనని, అదే సమయంలో పార్టీకి కూడా విధేయులుగా ఉంటామని ఆ వేదికపై చెప్పారు. అసలు ఏ హడావుడీ లేని సమయంలో వీళ్లు ఎందుకు ఈ సభ పెట్టారా అని అప్పట్లోనే చాలామందికి చాలా అనుమానాలు తలెత్తాయి.
ఆ చిక్కుముడులన్నీ క్రమంగా ఇప్పుడు వీడుతున్నాయి. సవాలక్ష అక్రమాలు, అవకతవకలకు కేంద్రంగా ఉన్నారంటూ ఇన్నాళ్లూ కేవలం ఆరోపణలు మాత్రమే ఎదుర్కొన్న కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం.. తాను జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతోనే తెలంగాణ మంత్రాన్ని జపించినట్లు సమాచారం. ఆయనే వెనకుండి సమావేశం పెట్టించారని కూడా అంటున్నారు. యూబీ గ్రూప్ అధినేత, చిక్కుల్లో చిక్కుకున్న కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యాకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి చిదంబరం ఏకంగా 300 కోట్ల రూపాయల రుణం ఇప్పించారట!! చిరు వ్యాపారులకు మాత్రమే రుణాలు ఇచ్చే ఈ బ్యాంకుతో విజయ మాల్యాకు భారీ రుణం మంజూరు చేయించింది చిదంబరమేనని ఆ బ్యాంకు సి.ఎం.డి. విచారణ సంస్థకు చెప్పేశారు. ఈ వ్యవహారంపై ఉద్యోగుల సంఘం చేసిన ఫిర్యాదుపై రిజర్వ్ బ్యాంకు విచారణ జరుపుతోంది. అయ్యగారి బండారం అక్కడ బయటపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావచ్చన్న ఊహాగానాలు వినిపిస్తుండటంతో చిదంబరానికి ఆందోళన మొదలైందట. మోడీ ప్రధాన మంత్రి పదవి చేపడితే తాను శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లక తప్పదని చిదంబరం ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.
తమిళనాట శివగంగ నియోజకవర్గంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖ ప్రారంభోత్సవం విషయంలో కూడా చిదంబరంపై దాదాపు 80 లక్షల రూపాయల మేర అక్రమాలు వెలుగుచూశాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వరకు ఈ విషయం వెళ్లడంతో చిదంబరం గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. 2009 లోక్ సభ ఎన్నికలలో చిదంబరం ఎలా గెలిచారన్నది బహిరంగ రహస్యమే. అప్పటి నుంచి ఆయనంటేనే జయలలిత మండిపడుతున్నారు.
అందువల్ల రాబోయే ఎన్నికల్లో తాను మళ్లీ శివగంగ నుంచి పోటీ చేయడం కష్టమని భయంతో ఉన్న చిదంబరం, మన రాష్ట్రంలోని మెదక్ నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారని, అందుకే ఇటీవల విజయశాంతితోనూ చర్చించారని విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగానే తెలంగాణ అంశం కూడా చిదంబరానికి కనిపించిందట. తెలంగాణపై తేల్చకపోతే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎంపీ స్థానం కూడా రాదని సోనియాగాంధీని చిదంబరం లాంటి వాళ్లు భయపెట్టారని, అప్పుడే విభజనకు రంగం సిద్ధమైందని అంటున్నారు!!