నెహ్రూ పెళ్లి... సోనియా విడాకులు.. రాజ్యసభలో హరికృష్ణ ఆగ్రహం
నెహ్రూ పెళ్లి... సోనియా విడాకులు.. రాజ్యసభలో హరికృష్ణ ఆగ్రహం
Published Tue, Aug 13 2013 3:26 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
తాంబూలాలిచ్చాం, తన్నుకు చావండి’ అన్న రీతిలో విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రకటించిందంటూ టీడీపీ ఎంపీ నందమూరి హరికృష్ణ దుయ్యబట్టారు. కాంగ్రెస్ నిర్ణయంతో రాష్ట్రం తగులబడుతోందన్నారు. ప్రజలను విడదీయొద్దని, ఎంతోమంది మహానుభావులు పుట్టిన పుణ్యభూమిని ముక్కలు చేయొద్దంటూ ఆవేశంతో ఊగిపోయారు. దాదాపు 60 ఏళ్ల పాటు కలిసున్న తెలుగు ప్రజలను విడదీసే హక్కు కాంగ్రెస్‌కు ఎవరిచ్చారంటూ తూర్పారబట్టారు.
తెలంగాణ అంశంపై సోమవారం రాజ్యసభలో 3 గంటలకు పైగా సాగిన చర్చలో హరికృష్ణ పాల్గొన్నారు. తరతరాలుగా కలిసున్న తెలుగు జాతిని విడగొట్టే సభలో మాట్లాడాల్సి రావడం తన దౌర్భాగ్యమంటూ తెలుగులో హరికృష్ణ తన ప్రసంగాన్ని ప్రారంభించగానే సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ ైచైర్మన్ పి.జి.కురియన్ అభ్యంతరం తెలిపారు. ప్రసంగాన్ని ఇంగ్లిష్, హిందీల్లోకి అనువదించే దుబాసీ అందుబాటులో లేరని చెబుతూ జాతీయ భాషల్లోనే మాట్లాడాలని ఆదే శించారు. దాంతో హరికృష్ణ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. దేశ భాషలందు తెలుగు లెస్స అనే పద్యం చదువుతూ, మాతృభాషలో మాట్లాడరాదని తనను శాసించడం తెలుగువారిని అవమానించడమేనంటూ మరో భాషలో మాట్లాడే సమస్యే లేదంటూ కూర్చుండిపోయారు. సభ యావత్తూ హరికృష్ణకు సంఘీభావంగా నిలిచింది. మాతృభాషలో మాట్లాడే హక్కు, స్వేచ్ఛ ప్రతి సభ్యునికీ ఉందంటూ అంతా హరికృష్ణకు అండగా నిలిచారు. చివరకు ఆయన తెలుగులోనే ప్రసంగాన్ని కొనసాగించేందుకు సభాపతి అవకాశం కల్పించారు.
ఓ కంట్లో కాటుక, మరో కంట్లో కారమా?
‘‘విభజనతో ముడివడి ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ఒక కంట్లో కాటుక, మరో కంట్లో కారం పెడతామంటే ఎలా? షష్టిపూర్తి వయసుకు చేరిన తెలుగు ప్రజల ఐక్యతను దెబ్బతీయడానికే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. 1956లో నెహ్రూ పెళ్లి చేస్తే ఇప్పుడు సోనియాగాంధీ విడాకులు ఇప్పిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలైన ప్రజలకు చెప్పకుండా, వారిని సంప్రదించకుండా రాష్ట్రాన్ని విడగొట్టాలనుకోవడం టీడీపీని దెబ్బ తీయడానికేనేమో! చంద్రబాబు లేఖ ఇచ్చినందువల్లే విభజన నిర్ణయం తీసుకున్నామని పదేపదే చెబుతుండటం కూడా మా మధ్య చిచ్చుపెట్టే యత్నమే’’ అన్నారు.
Advertisement