తెలంగాణ తథ్యం: రాజ్యసభలో చిదంబరం ప్రకటన | Times of India Telangana won't take too long: Chidambaram | Sakshi
Sakshi News home page

తెలంగాణ తథ్యం: రాజ్యసభలో చిదంబరం ప్రకటన

Published Tue, Aug 13 2013 2:22 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

తెలంగాణ తథ్యం: రాజ్యసభలో చిదంబరం ప్రకటన - Sakshi

తెలంగాణ తథ్యం: రాజ్యసభలో చిదంబరం ప్రకటన

టీడీపీ ఒక నిర్ణయం తీసుకుంటేనేమో అది ప్రజాస్వామికం. అదే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటేనేమో దాన్ని నిరంకుశత్వమంటారా? ఇదెక్కడి వైఖరి? నిర్ణయం తీసుకోకుంటే ఎందుకు తీసుకోవడం లేదని తిడతారు. తీసుకుంటేనేమో ఎందుకు తీసుకున్నారంటూ విమర్శిస్తారు!
 
తెలంగాణపై పలు పార్టీలు పదేపదే వైఖరి మార్చుకున్నాయి. బీజేపీ కూడా ఈ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అనుకూలంగా లేదంటూ కేంద్ర హోం మంత్రి హోదాలో అద్వానీ లేఖ రాశారు
 
హైదరాబాద్‌తో పాటు నదీజలాలు, విద్యుత్, విద్య, ఆరోగ్యం, అన్ని ప్రాంతాల వారి రక్షణ, ఆదాయ పంపిణీ తదితర అంశాలన్నింటిపై వ్యక్తమవుతున్న ఆందోళనలు, సందేహాలను పరిగణనలోకి తీసుకున్నాకే కేంద్రం ముందుకు సాగుతుంది. పార్టీల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటాం
 
తెలంగాణపై అధ్యయనం చేసే బాధ్యతను శ్రీకృష్ణ కమిటీకి అప్పగించడం మేం చేసిన హోంవర్క్ కాకపోతే మరేమిటి?
 
 రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై కేంద్రం ముందుకు సాగుతుంది. అయితే కాల పరిమితంటూ ఏమీ లేదు. నేను తేదీ చెప్పలేను
 
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియతో కేంద్రం ముందుకు సాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం తేల్చిచెప్పారు. తెలంగాణపై సోమవారం రాజ్యసభలో మూడు గంటలకు పైగా జరిగిన చర్చకు కేంద్ర హోం మంత్రి తరపున ఆయన సమాధానమిచ్చారు. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నారో లేదో స్పష్టం చేయాలని ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ డిమాండ్ చేయడంతో, ‘‘తెలంగాణ నిర్ణయం అమలు జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది’’ అంటూ చిదంబరం కుండబద్దలు కొట్టారు. అయితే తాను తేదీ చెప్పలేనన్నారు. రాష్ట్రాల ఏర్పాటుకు గతంలో అనుసరించిన విధానాలకు అనుగుణంగా ప్రకియ్రను ముందుకు తీసుకెళ్తామని బదులిచ్చారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తవడానికి దాదాపు రెండేళ్లు పట్టిందని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు మాత్రం అంత సమయం పట్టబోదన్నారు. అది ఎప్పట్లోగా పూర్తవుతుందో ఇప్పుడే చెప్పడం మాత్రం సాధ్యం కాదన్నారు. తెలంగాణ  అంశాన్ని తొమ్మిదేళ్లుగా నానబెట్టిన కాంగ్రెస్, ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసమే హడావుడిగా నిర్ణయం తీసుకుందన్న విపక్షాల ఆరోపణలను చిదంబరం తిప్పికొట్టారు. హైదరాబాద్‌తో పాటు నదీజలాల పంపిణీ, విద్యుత్, విద్య, ఆరోగ్యం, అన్ని ప్రాంతాల వారి రక్షణ, ఆదాయ పంపిణీ తదితర అంశాలన్నింటిపై వ్యక్తమవుతున్న ఆందోళనలు, సందేహాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఈ విషయంలో కేంద్రం ముందుకు సాగుతుందని హామీ ఇచ్చారు. కేంద్ర హోం శాఖ పలుమార్లు నిర్వహించిన అఖిలపక్ష సమావేశాల్లో రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ‘‘రాష్ట్ర ఏర్పాటు క్రమంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో పూర్తిస్థాయి చర్చ తొందరపాటు అవుతుంది’’ అన్నారు. తెలంగాణపై చివరగా నిర్ణయం తీసుకున్న పార్టీ కాంగ్రెసేనని అంగీకరించారు. అయితే, ‘కాంగ్రెస్ పార్టీని మీరెంతగా విమర్శిస్తే, దానిపై ఎంతగా ఆరోపణలు సంధిస్తే పార్టీ అంతగా పటిష్టమవుతుంది’ అని విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
 
టీడీపీపై విసుర్లు: ఈ సందర్భంగా టీడీపీపై చిదంబరం సునిశితమైన విమర్శలు చేశారు. ‘టీడీపీ నిర్ణయం తీసుకుంటేనేమో అది ప్రజాస్వామికం. అదే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటేనేమో దాన్ని నిరంకుశత్వమంటారా? ఇదెక్కడి వైఖరి?’ అంటూ తూర్పారబట్టారు. ‘నిర్ణయం తీసుకోకుంటేనేమో ఎందుకు తీసుకోవడం లేదని తిడతారు, తీసుకుంటే ఎందుకు తీసుకున్నారంటూ విమర్శిస్తారు’ అంటూ ఆక్షేపించారు. రాజకీయాల కంటే హేతుబద్ధత, తర్కాలదే పైచేయిగా మారే అంశాలు కొన్ని ఉంటాయంటూ హితవు పలికారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి ముందు ఎలాంటి అధ్యయనమూ చేయలేదన్న విపక్షాల ఆరోపణలను కూడా తోసిపుచ్చారు. ఆ బాధ్యతను శ్రీకృష్ణ కమిటీకి అప్పగించామని గుర్తు చేశారు. సమగ్ర అధ్యయనం ద్వారా ఒక నిర్ణయానికి రావడానికి కావాల్సిన పూర్తి సమాచారాన్ని కమిటీ తమకు అందజేసిందన్నారు. ఇదంతా తాము చేసిన హోంవర్క్ కాకపోతే మరేమిటంటూ ఎదురు ప్రశ్నించారు.
 
పార్టీలే వైఖరి మార్చుకున్నాయి 
తెలంగాణ అంశంపై పలు పార్టీలు పదేపదే వైఖరి మార్చుకున్నాయని చిదంబరం అన్నారు. ఈ విషయంలో కూడా బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబించిందని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అనుకూలంగా లేదని పేర్కొంటూ 2002 ఏప్రిల్ 1న కేంద్ర హోం మంత్రి హోదాలో ఆ పార్టీ అగ్రనేత అద్వానీ లేఖ రాశారని గుర్తు చేశారు. సరిగా సంప్రదింపులు జరపకుండానే నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలనూ కొట్టిపారేశారు. ‘‘నా అనుభవంలో మా పార్టీలోనూ, బయటా అత్యంత సుదీర్ఘంగా, విసృ్తతంగా సంప్రదింపులు జరిగిన అంశమేదైనా ఉందంటే అది తెలంగాణే’ అన్నారు. పూర్తిస్థాయి సంప్రదిపుల తర్వాతే నిర్ణయం తీసుకుంటే దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దాదాపు 80 మంది ఎందుకు వ్యతిరేకించారని, ఆ మేరకు తమ సంతకాలతో కాంగ్రెస్ అధ్యక్షురాలికి వినతిపత్రం ఎందుకు పంపారని బీజేపీ నేత వెంకయ్యనాయుడు నిలదీశారు. దాంతో పార్టీల అంతర్గత వ్యవహారాలను తేల్చుకొనేందుకు పార్లమెంటును వేదికగా చేసుకోవద్దని చిదంబరం బదులిచ్చారు. 
 
‘‘ఎన్డీఏ ప్రభుత్వం తన పదవీకాలం ముగుస్తున్న చివరి రోజునే ఉత్తరాఖండ్ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించింది. తర్వాత కొన్నేళ్లకు ఆ రాష్ట్రం ఏర్పాటైంది. అలాగే ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటును 1998 మే 25న రాష్ట్రపతి ప్రకటించగా మొత్తం ప్రక్రియ పూర్తికావడానికి రెండేళ్లు పట్టింది’’ అన్నారు. రాజ్యసభ చర్చలో వ్యక్తమైన అభిప్రాయాలను, సూచనలన్నింటినీ కేంద్ర మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకునే ముందు పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement