ఎం.జె. అక్బర్, సీనియర్ సంపాదకులు
విశ్లేషణ
తొలిదశలో పార్టీ నావ మునకేయకుండా ఉండటానికి పనికొచ్చే బరువుగా సైద్ధాంతిక ఆదర్శవాదం పరిమితమైతే మంచిదని కేజ్రీవాల్ భావించారు. పార్టీని పరిరక్షించడానికిగానీ లేదా ప్రభుత్వాన్ని నడపడానికిగానీ అది పనికిరాదని ఆయన నిర్ణయించారు. అధికారం బుట్టలోంచి ఆయన ప్రతి ఎమ్మెల్యేకు ఓ రొట్టె ముక్కనో లేదా చేపనో వేశారు. వారంతా మంత్రులో లేదా పార్లమెంటరీ కార్యదర్శులో అయ్యారు. ఇక వారు చేసే పనేమిటి? ఎవరికి తెలుసు? తలా ఒక కారూ, కార్యాలయమూ, సొంత డబ్బా కొట్టుకునే హక్కూ లభిస్తాయి.
ఫ్రాయిడియన్ చింతనలోని ఏ ఉప స్రవంతిలోంచి ‘‘సాలా’’ అనే పదం భారత ఉపఖండమంతా దూషణాత్మక అసమ్మతిగా మారింది? ఇదో పెద్ద చిక్కు ప్రశ్న. మనమంతా కులం, జాతి, మతం, దేశం వంటి భిన్న వర్గాలుగా విడిపోయి ఉండొచ్చు. కానీ ‘‘సాలా’’ పదానికి వచ్చేసరికి మన సాంస్కృతిక, భాషాపరమైన నిబద్ధతలో అపూర్వమైన ఐక్యత ఉంది. మీరు, హిందీ, ఉర్దూ, బెంగాలీ, భోజ్‌పురీ, పంజాబీ, గుజరాతీ, మరాఠీ తదితర భాషల్లోనూ లేదా ఆరోగ్యకరంగా స్థానికీకరించిన ఇంగ్లిష్‌లో మాట్లాడినా ‘‘సాలా’’ స్థానం మాత్రం అగౌరవ సూచకాల జాబితాలోనే (బెంగాలీలో ‘‘షాలా’’ అన్నా దాని స్థానం అక్కడే). సర్వవ్యాపితమైన ఆ పదాన్ని రకరకాలుగా ఉచ్చరిం చడంపై యాక్టింగ్ స్కూల్లో ఏకంగా ఒక కోర్సునే నడపొచ్చు. ఎందుకు? నాకు తెలీదు. నిజానికి ఆ పదానికి అర్థం, తనకంటే చిన్నవాడైన బావమరిది అని మాత్రమే. అంతకు మించి అందులో ఉద్రేకాన్ని రేకెత్తించేదేమీ లేదు. అది చాలా కుటుంబాల్లో సర్వసామాన్యంగా కనిపించే బంధుత్వ మే. అయినా ‘‘సాలా’’ మనోవిజ్ఞాన విశ్లేషకులందరి సమష్టి శక్తిసామర్థ్యాలకు సైతం అందని ఏదో లోతైన, చీకటి, మార్మిక అపరాధాన్ని లేదా వాంఛను వ్యక్తం చేస్తోందా?
ఏదేమైనా దానికి బహిరంగంగా ఉన్న అర్థం బావమరిదే. అది మాత్రం సుస్పష్టం. ఆగ్రహం లేదా దౌర్జన్యం వల్ల ఒళ్లు మరచిన ఆవేశం ఆవహించి ఉన్నప్పుడు ఆ పద ప్రయోగం ఒక ప్రత్యేక విద్వేషపూరిత భావాన్ని సంత రించుకుంటుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యతరగతి నైతి కతావాదుల పాలిటి అత్యధునాతన కథానాయకుడు. ఇటీవలి కాలంలో ఢిల్లీలో జీవన భద్రతను కోల్పోయినవారి పాలిటి పవిత్ర ఆశాజ్యోతి. అలాం టాయన ఆ పదాన్ని ప్రయోగించారు. అదీ కూడా నేడాయనకు గిట్టకుండా పోయిన ఒకప్పటి సహచరులు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లకు వ్యతిరేకంగా. పైగా ఆయన తన ఆగ్రహ పదజాలానికి ‘‘కమీనా’’ను (ద్రోహి లేదా నీచుడు) కూడా జోడించారు. తద్వారా వారి సవాలును విషపూరిత విద్రోహంగా కొట్టిపారేశారు. ఆయన గొంతుక నుంచి బుసబుసమంటూ పొంగుకొచ్చిన మాటలు ఎన్నటి నుంచో పేరుకుపోతూ వచ్చి, బద్దలయ్యే అవకాశం కోసం ఎదురు చూస్తున్న లావా.
కేజ్రీవాల్, భూషణ్, యాదవ్‌లు ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటుచేసి, పూర్తిగా స్థానికమైనవైన రెండు ఎన్నికల విజయాలను జాతీయ వార్తలుగా మార్చిన నాయకత్రయం. వారిలో శాంతిభూషణ్ నిశ్శబ్దంగా పనిచేసు కుపోయే సిద్ధాంతవేత్త. కాగా, యోగేంద్ర యాదవ్ ఆ పార్టీ ప్రధాన వ్యూ హకర్త. ఇక కేజ్రీవాల్ బహిరంగ ప్రచారవేత్త కాబట్టి అందరి దృష్టిలో నాయకునిగా గుర్తింపును, విశ్వాసాన్ని చూరగొన్న నేత. భూషణ్, యాదవ్‌ల సహాయం లేనిదే కేజ్రీవాల్ నేడున్న స్థానానికి చేరగలిగేవారే కాదు.
అయితే వైఫల్యం సానుభూతిని రేకెత్తించే చోట విజయం క్రూరమైన దవుతుంది. ఎందుకంటే విజయం అహాన్ని పెంచి పోషిస్తే, ఓటమి ఉద్రే కోద్వేగాలు మొద్దుబారేట్టు చేస్తుంది. ఆందోళనల దశలో కేజ్రీవాల్ తనకు మార్గదర్శకులైన వారితో కలసి బహిరంగ వేదికలను పంచుకోవాల్సివస్తే సంతోషపడేవారు, ఆతురతను సైతం కనబరిచేవారు. అత్యున్నత వేదిక సంగతికి వస్తే అది వేరే కథ. ఆమ్ ఆద్మీకి పొట్టి పేరు‘ఆప్’. అంటే హిందీలో అత్యంత మర్యాదపూర్వకమైన ‘‘మీరు’’ అని అర్థం. ఆనందదాయకమైన ఈ శ్లేషను ఆప్ నేతలు ఓట్లను అభ్యర్థించేటప్పుడు అత్యంత సమర్థవంతంగా ప్రయోగించారు. నేడు అధికారంలో ఉన్న కేజ్రీవాల్ నిర్మొహమాటంగా పంపుతున్న సందేశం ఒక్కటే. ఆప్ ‘‘నేను’’గా మారిపోయింది. ఆమ్ ఆద్మీ ఇక కేజ్రీవాల్ పార్టీ. ఆయన అభీష్టానుసారం ఇతరులంతా పనిచేయాల్సిందే. సమానుల మధ్య ఆయన ప్రథముడు కాడు. ఆయన మాత్రమే ప్రథముడు. ఆపై ఇక ఉండేది ఫుల్‌స్టాప్ గుర్తు మాత్రమే.
ఏ విడాకుల ముచ్చట్లయినా కాసేపే ఉత్సుకతను రేకెత్తిస్తాయి. ఆ తర్వాత మహా విసుగు పుట్టిస్తాయి. చేదు కషాయంలాంటి ఆప్ విడాకుల వ్యవహారం, ఆస్తి హక్కుల వివాదంతో ముడిపడి ఉంది. కాబట్టి ఇంకాస్త ఎక్కవ కాలంపాటూ ఈ ఆసక్తి ఉంటుంది. వివాదాస్పదంగా మారిన ఆప్ ఆస్తుల్లో కపట పవిత్రత కూడా ఒకటి. కాబట్టి వాదోపవాదాలు సైతం ‘నీ కంటే పవిత్రుడను నేనే’ అంటూనే సాగుతాయి. ఆ విషయం ఇప్పటికే కనబడుతోంది కూడా. అయితే నైతికత తమదేనని వాదిస్తున్నది మాత్రం అధికారంలో లేని పక్షమే. కేజ్రీవాల్ పక్షాన ఒక సర్వ సేనాని, 66 మంది సైనికాధికారులు, క్షీణిస్తున్న కాల్బలం ఉన్నాయి. ప్రత్యర్థి వాదనల తిరస్క రణకు నియమ నిబంధనలను అప్పుడే ప్రకటించేశారు. వారి సరికొత్త పవిత్ర ప్రశ్నావళి పేరు ఆచరణతాత్మక రాజకీయాలు.
ఈ మార్పు ఇటీవలి ఢిల్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా రూపు దిద్దుకుంది. నాలుగు రూ. 50 లక్షల చెక్కులను కేజ్రీవాల్, కనీసం ఆ డబ్బు ఎక్కడిదని లేదా వాటి మూలమేమిటని కూడా ప్రశ్నించకుండా పుచ్చు కున్నారు. కేజ్రీవాల్ విహారయాత్ర విడిదిలోకి అవి కనుచూపు మేరలో ఏ ఆధారమూ లేకుండా చూసి మరీ నడచి వచ్చాయి. టికెట్లు కోరే అనుమా నాస్పద వ్యక్తుల నుంచి ఆయన డబ్బు స్వీకరించారు. ఇది బాధ్యతాయు తంగా ఆ సంప్రదాయానికి చేసిన సత్కారం. పోలీసులు కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఆయన పార్టీ అభ్యర్థులు పోలింగ్‌కు ముందు రోజున ఓటర్లకు మద్యం సరఫరా చేశారు.
ప్రశాంత్‌భూషణ్, యోగేంద్రయాదవ్‌లు ఢిల్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయాన్ని దెబ్బతీయడానికి శాయశక్తులా ప్రయత్నించారని కేజ్రీవాల్ కోపంతో వివర్ణమైన మొహంతో పదేపదే నొక్కి చెబుతుండటం ఆసక్తికరం. అందుకే ‘‘కమీనా’’ పదప్రయోగం. ఇంతకూ వారు ఆప్ విజయాన్ని దెబ్బ తీసే పని ఏం చేశారు? ఎలా చేశారు? ఏ ఎన్నికల సభలోనూ లేదా పత్రికా సమావేశంలోనూ భూషణ్‌గానీ, యాదవ్‌గానీ కేజ్రీవాల్‌కు హానికరమైనది ఏదీ మాట్లాడలేదు. వారు తమ భిన్నాభిప్రాయాలను తమలో అలాగే అట్టిపెట్టుకున్నారు. కాబట్టి వారు కేజ్రీవాల్‌తో జనాంతికంగా మాట్లాడి నప్పుడు తామంతా నైతిక నిష్ఠకు, విలువలకు కట్టుబడి ఉండాలని చెప్పి ఉండాలి. పారదర్శకతకు కట్టుబడి ఉంటామని వారు ప్రజలకు వాగ్దానం చేశారు. ప్రశాంత్‌భూషణ్, యోగేంద్ర యాదవ్‌లు పారదర్శకతే తమ పార్టీ విలక్షణత (యూఎస్‌పీ) అని భావించారు. (యూఎస్‌పీ- వినియోగదా రులను విశేషంగా ఆకట్టుకునేలా చేసే తమ ఉత్పత్తి లక్షణం) ఆ ప్రత్యేకత వల్లనే ఓటర్లు తమ పార్టీ పట్ల ఆకర్షితులవుతారని నమ్మారు. కేజ్రీవాల్‌కు కూడా వారంతగానే తమ పార్టీ యూఎస్‌పీని లేదా ప్రత్యేకతను నమ్మారు... కాకపోతే అది కేజ్రీవాల్ మాత్రమేనని భావించారు. ఇక మిగతాదంతా శబ్దార్థ శాస్త్ర వాదోపవాదాలే.
పార్టీ ఢిల్లీ కేంద్రమైనదిగానే ఉండాలా? లేక విస్తరించేదిగా ఉండాలా? అనేది అసంబద్ధమైనది. రంగప్రవేశంతోనే పార్టీ నావ మునక వేయకుండా ఉండటానికి పనికివచ్చే బరువుగా మాత్రమే సైద్ధాంతిక ఆదర్శవాదం పరిమితమైతేనే మంచిదని కేజ్రీవాల్ భావించారు. పార్టీని పరిరక్షించడా నికిగానీ లేదా ప్రభుత్వాన్ని నడపడానికిగానీ అది పనికిరాదని ఆయన నిర్ణ యించారు. అధికారం బుట్టలోంచి ఆయన ప్రతి ఎమ్మెల్యేకు ఓ రొట్టె ముక్క నో లేదా చేపనో ఇచ్చారు. వారు మంత్రులో లేదా పార్లమెంటరీ కార్య దర్శు లో అయ్యారు. ఇదమిత్థంగా ఈ పార్లమెంటరీ కార్యదర్శులు చేసే పనేమిటి? ఎవరికి తెలుసు? ఎవరికి పట్టింది? వారికి మాత్రం తలా ఒక కారూ, కార్యాలయమూ, సొంత డబ్బా కొట్టుకునే హక్కూ లభిస్తాయి.
2014లో కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఆయన దిలీప్ కుమా ర్ సినిమాలోని ‘‘ఇన్సాన్ కో ఇన్సాన్ సే హో భాయ్ చారా, యెహీ పైగాం హమారా’’ (మనిషికి మనిషితో ఉన్నది సహోదర బంధం, అదే మా సందే శం) అనే పాటను పాడారు. 2015లో ఆయన సంగీతం జోలికె ళ్లకుండా నిగ్ర హం చూపారు. కానీ ఆయన ఈ దిలీప్‌కుమార్ పాటను పాడి ఉండా ల్సింది: ‘‘సాలా, మైతో సాహబ్ బన్ గయా’’(సాలా, నే నయ్యా యజ మానిని)...
అరవింద్ కేజ్రీవాల్ సవరించిన నియమ నిబంధనావళిలో బావమరుదుల గతి ప్రవాస విషాదమే. సంప్రదాయకమైన భ్రష్ట సోదరులెవరికైనా సుస్వాగతం.