‘ఆప్’ చాప చుట్టేయాల్సిందేనా?
‘ఆప్’ చాప చుట్టేయాల్సిందేనా?
Published Sat, Apr 29 2017 4:04 PM | Last Updated on Mon, Aug 20 2018 3:46 PM
న్యూఢిల్లీ: కొన్ని సార్లు విజయం కంటే అపజయమే బలమైనది. మొన్న పంజాబ్, గోవా రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురైనది, నిన్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో చవిచూసిన పరాజయం అలాంటిదే. నెపాన్ని ముందుగా ఓటింగ్ యంత్రాలపైకి తోసేసిన ఆప్ వ్యవస్థాపక నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చివరకైనా ఓటమిని అంగీకరించడం ఆనందించాల్సిన అంశం. పార్టీ ఆవిర్భావం అవసరమైన చారిత్రక సందర్భాలను, పార్టీ ప్రాథమిక లక్ష్యాలను పక్కన పెట్టి, వేగంగా ఇతర రాష్ట్రాలకు విస్తరించాలన్న తాపత్రయంతో ఆప్ రాజకీయ మైదానంలో మెల్లగా, సుదీర్ఘంగా ఆడాల్సిన ఇన్నింగ్స్‌ను అతివేగంగా ఆడి అతి త్వరగా మైదానం నుంచి నిష్క్రమించడం నిజమే.
ఆప్ బుడగలా వచ్చి బుడగలా పగిలిపోయిందని, ఇక ఆప్ కోలుకోవడం సాధ్యమయ్యే పని కాదంటూ నేడు ఇంటా, బయటా చర్చ జరుగుతోంది. ఆప్ చాప చుట్టేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పడానికి ఆ పార్టీ కొంత మంది వ్యక్తులు, కొంత మంది నాయకుల కారణంగా ఆవిర్భవించిందీ కాదు. జయ ప్రకాష్ నారాయణ్ సృష్టించిన ఉద్యమం తర్వాత అలాంటి మరో ఉద్యమం కోసం ప్రజలు సుదీర్ఘంగా నిరీక్షిస్తున్న సమయంలో వచ్చిన ఓ కదలిక. లక్షలాది ప్రజల మనసుల్లో పురుడుపోసుకుంటున్న కొత్త ఆలోచనను ముందుకు తీసుకెళతావన్న నమ్మకం నుంచి పుట్టిందే ఆప్.
ప్రత్యక్షంగా ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రజాస్వామ్యానికి నిజంగా పట్టం కడుతుందని, అవినీతి రహిత పారదర్శక ప్రభుత్వాన్ని అందిస్తుందన్న ప్రజల ఆశే ఆప్. భారత రాజకీయ చరిత్ర గమనాన్ని మారుస్తుందన్న ప్రగాఢ విశ్వాసంతోనే ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టారు ప్రజలు. అలాంటి ప్రజల నమ్మకాలను, ఆశలను నిలబెట్టేందుకు నిజాయితీగా కృషి చేయకపోవడం వల్ల కూడా నేడు ఆప్‌కు అపజయం ఎదురై ఉండవచ్చు.
కొత్తగా పుట్టిన ఈ పార్టీ పూర్తిగా రాజకీయ నడత నేర్చుకోకముందే చుట్టుముట్టిన పరిస్థితులను కూడా ఇక్కడ పరిశీలించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం పెడుతున్న కేసుల్లో చిక్కుకుంటూ ఊపిరాడని పరిస్థితుల్లో చుట్టూ ఉన్న మీడియా కూడా విష ప్రచారం చేస్తున్న ప్రతికూల పరిస్థితుల్లో నెట్టుకు రావడం ఆషామాషీ కాదు. అయినప్పటికీ ప్రజలకు అత్యవసరమైన నీరు, విద్యుత్, విద్య, వైద్యం అందించడంలో ఆప్ సాధించిన విజయం తక్కువేమి కాదు. వాస్తవం చెప్పాలంటే ఇలాంటి ప్రజా సమస్యలను పరిష్కరించినందుకు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్‌కే ప్రజలు పట్టం గట్టాలి. పదేళ్లుగా ఢిల్లీ మున్సిపాలిటీని పాలిస్తూ ప్రజా సమస్యలను పట్టించుకోని బీజేపీకే ప్రజలు పట్టం గట్టారు.
ప్రపంచంలో డోనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ ఏలుతున్న నేటి కాలమాన పరిస్థితులు వేరు. ఈ పరిస్థితుల్లో వాస్తవాలకంటే భ్రమలనే ఎక్కువ నమ్ముతారు. నిజానికన్నా అబద్ధాలకే ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ఆప్ చాప చుట్టేయాల్సిన సమయం ఆసన్నమైందనడం కూడా ఇలాంటి ఓ భ్రమే. ఇలాంటి పరిస్థితులను తట్టుకొని నిలబడినప్పుడే అపార శక్తి అంకురిస్తుంది. అందుకే విజయం కన్నా బలమైనది ఈ పరాజయం. పార్టీలో, ప్రభుత్వ పనితీరులో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ మళ్లీ అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ముందుకు సాగితే ‘ఆప్ అప్నా’ అంటూ ప్రజలు పిలిచే రోజులు కచ్చితంగా వస్తాయి. –––ఓ సెక్యులరిస్ట్ కామెంట్
Advertisement