డాక్టర్ ఎ.పి. విఠల్
విశ్లేషణ
ప్రతి సమస్యకు కమ్యూనిస్టులు అంతిమ పరిష్కారం వైపే చూపడం నిర్లిప్త ధోరణిని పెంపొం దింపజేస్తుంది. తక్షణ సమస్యలకు, పరిష్కారాలకు ప్రాధాన్యం ఇచ్చి వారు సామాన్య ప్రజానీకంతో మమేకం కావాలి. ఈ పార్టీ మాది, ఈ నేతలు మా వాళ్లు అని ప్రజలు ఆత్మీయంగా స్వీకరించగలగాలి. ఆప్ విజయ రహస్యాల్లో ప్రధానమైనది ఇదే. నాయకుడు సామాన్యునిగా ఉండటం, సామాన్యులతో మమేకం కావడమే అసామాన్య లక్షణం! దీనిని దృష్టిలో ఉంచుకొని కమ్యూనిస్టులు ఆత్మపరిశీలన చేసుకుంటారని ఆశించవచ్చా?
‘ఒక సూర్యుండు సమస్త జీవులకు ఒక్కొక్కడై తోచు పోలిక’ అన్నట్టు ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన విజయం ఒక్కొక్క తరహా ప్రజలకు ఒక్కొక్క విధంగా కన్పించి ఆహ్లాదపరచి ఉండవచ్చు. ఈ గెలుపుతో తమ జీవితాలు ఇక మరింత సులభతరం, సౌకర్యవంతం కావచ్చని పేద, దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజలు భావిస్తుండవచ్చు. బీజేపీ ప్రత్యేకించి నరేంద్ర మోదీ ప్రేరిత మతత త్వ, విభజన రాజకీయాల వ్యతిరేక విజయమిది అని లౌకిక శక్తులు అనుకోవచ్చు. కృత్రిమ మత ఘర్షణలకు తావే లేని సామా జిక శాంతిని నెలకొల్పగల విజయమని ఉన్నత మధ్యతరగతి, ధనికవర్గాలు సైతం ఈ విజయాన్ని ఆహ్వానిస్తున్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పక్కనబెట్టి వ్యక్తిస్వామ్యంతో ఆర్డినెన్స్‌ల రాజ్ చలాయిస్తున్న మోదీ ‘రోడ్ రోలర్’ పాలనకు ఆప్ అడ్డుకట్ట వేసిందని ప్రజాస్వామికవాదులు అనుకో వచ్చు. పేద, సాద, రైతాంగంపై భారం మోపుతూ కార్పొరేట్ గుత్తాధిపతుల అడుగులకు మడుగులొత్తే కుబేరుల పాలనకు వ్యతిరేకమైన తీర్పుగా దీన్ని వామపక్షాలు భావిస్తుండవచ్చు. అమెరికా అధ్యక్షుని ప్రాపకం కోసం దేశ ఆత్మగౌరవాన్నే కించపరచడానికి వెనుదీయని మోదీ విలాసవంతమైన ఆడంబరానికి, ప్రచార ఆర్భాటానికి ఢిల్లీ ఓటర్లు చెంపపెట్టు పెట్టారని ప్రగతి కాముకులు భావించవచ్చు. వివిధ భాషల, నాగరికతల, సంస్కృతుల ప్రజల సమ్మేళనమైన ఢిల్లీ ‘మినీ భారత్’. అది మన దేశ వైవిధ్యానికి ప్రతీక. ఆ వైవిధ్యాన్ని నిరాకరించి, ఏకశిలాసదృశమైన ఒకే భారత జాతి అనే ధోరణితో పెత్తనం చలాయిస్తున్న అంతర్గత నయా వలసవాదులను ఢిల్లీ ఓడించిందని జాతుల స్వేచ్ఛాప్రియులు ఆనందిస్తుండవచ్చు. పదవీ వ్యామోహానికి, కులమత రాజకీయాలకు, అధికార దుర్వినియోగానికి, అహంకారానికి, డబ్బు దర్పం, మద్యాలకు మారుపేరుగా మారుతున్న రాజకీయ పార్టీలకు విభిన్నమైన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ఆప్ విజయం ముందుకు తెచ్చిం దని మరెందరో ఆశిస్తుండవచ్చు. ఏది ఏమైనా ఈ విజయం సామాన్యుని అసామాన్య విజయం అన్నది వాస్తవం.
‘ఆప్’ పరిమితులు...పాఠాలు
ఆప్ విజయాన్ని మనసారా ఆహ్వానిస్తూనే, ఈ గెలుపునకు ఉన్న పరిమితు లను సైతం దృష్టిలో ఉంచుకోవాలి. ఇదేదో సమూల, శాశ్వత, గుణాత్మక మార్పుగా విశ్లేషించడం తొందరపాటు. అదలా ఉంటే, సాంప్రదాయక పార్టీల సంగతి ఎలా ఉన్నా కమ్యూనిస్టు పార్టీలు ఆప్ విజయం నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలున్నాయి. పార్లమెంటరీ పంథాను, ఎన్నికలను బహిష్కరించే మావోయిస్టుల విషయం ఇక్కడ అప్రస్తుతం. ఉభయ కమ్యూ నిస్టు పార్టీలు, ప్రత్యేకించి కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లో వామపక్షాలకు నాయకత్వ శక్తిగా ఉంటూ తరచుగా ప్రభుత్వాలను సైతం నడుపుతున్న సీపీఎం మరింత నిశితంగా ఆప్ అనుభవం నుంచి నేర్చుకొని ఆచరించదగిన అంశాలను పరిశీలించాల్సి ఉంది. వామపక్ష ప్రజాతంత్ర రాజకీయ ప్రత్యామ్నాయాన్ని దేశ ప్రజల ముందుంచాల్సిన బాధ్యత నేడు ఆ పార్టీపైనే అధికంగా ఉంది.
కమ్యూనిస్టుల కాలం చెల్లిన నిర్మాణం
పేరుకు తగ్గట్టే ఆమ్ ఆద్మీని సామాన్య ప్రజలు సొంతం చేసుకున్నారు. అది వారికి తమకు చెందనిదిగాగానీ, ప్రత్యేక సైద్ధాంతిక, నిర్మాణ స్వరూ పంతో తమకు దూరంగా ఉన్న పార్టీ గాగానీ కనిపించలేదు. కమ్యూనిస్టు పార్టీలు అలా ఉన్నాయా? సామాన్య ప్రజలు తమకు తాముగా స్వచ్ఛందం గా పార్టీలో భాగస్వాములై, దానిని బలోపేతం చేయాలని భావించే విధం గా అవి ఉన్నాయా? కనీసం పార్టీ కార్యకర్తలైనా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పగల అవకాశం ఉన్న దా? ఎవరైనా అలా ధైర్యం చేసినా వాటిని విని ఆలోచించే పరిస్థితి ఆ పార్టీల లో ఉన్నదా? నిందలుగా గాక ఆత్మ విమర్శనా దృష్టితో ఈ ప్రశ్నలను లోతుగా తరచి చూడటం అవసరం. ‘‘పార్టీలో క్రియాశీ లంగా అంకిత భావంతో పనిచేసే కార్య కర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాలే తప్ప, కక్షపూరితంగా వెంటాడి వేధించే ైవె ఖరి తగదని’’ లెనిన్ అన్నాడు. అలాంటి పరిస్థితి కమ్యూనిస్టు పార్టీల్లో ఏ మేరకు ఉందో అవి నిర్భయంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కార్యకర్తలతో నాయకులు, నిరంకుశాధికార బృందం (బ్యురోక్రటిక్) ధోరణితో, అధికార దర్పంతో వ్యవ హరిస్తుంటే, క్రింది కార్యకర్తల అభిప్రాయాలు, సూచనలను తూష్ణీ భావంతో తిరస్కరిస్తుంటే కార్యకర్తలలో భయం తప్ప సృజనాత్మకత, క్రియాశీలత కనిపించదు. ‘‘నాయకుడు ఓ ప్రతిపాదన చేస్తే బల్ల చుట్టూ ఉన్న మిగతా వారంతా చప్పట్లు కొట్టేయడమే తప్ప.. ప్రశ్నించడం, కామ్రేడ్లీగా చర్చించడం అనేదే ఉండదు. కార్యకర్తల ఈ యాంత్రిక భాగసామ్యం, సృజనాత్మకత కొరవడిన వ్యవహార శైలి పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికి, పురోగమనానికి దోహదపడుతుందా?’’ అని లెనిన్ కాలంలోనే రోజా లగ్జెంబర్గ్ ప్రశ్నించారు. నాటి సోవియట్ తరహా పార్టీ నిర్మాణం నేటి మన ఎన్నికల పార్టీలకు సరిపడుతుందా? రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో స్టాలిన్‌కు తప్పనిసరి యైన ఉక్కు క్రమశిక్షణ కలిగిన విప్లవ పార్టీ నిర్మాణం నేటికీ వర్తిస్తుందా? పార్టీ ఎంచుకున్న పార్లమెంటరీ మార్గానికి అనుగుణమైన వెసులుబాటుతనంతో కూడిన సమన్వయం అవసరం లేదా? ఈ విమర్శలు సత్యదూరమైతే సంతోషమే! ఏదిఏమైనా ప్రజలు, కార్యకర్తలు సంతోషంగా, ఉత్సాహంతో పాల్గొనే విధంగా పార్టీ, ప్రజాసంఘాల పునర్నిర్మాణం అవసరం.
నిర్ణయాలు రుద్దడంతో అనర్థమే
కేంద్రీకృత ప్రజాస్వామ్యం పేరిట రాష్ట్ర కమిటీలపై బలవంతంగా నిర్ణయా లను రుద్దడాన్ని నిరోధించడం కోసం పార్టీ నిబంధనావళిని సవరించాలని పుచ్చలపల్లి సుందరయ్య జలంధర్ మహాసభలలోనే సూచించారు. ‘‘రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ పెత్తనం పెరిగిపోయిందని, నిజమైన ఫెడరల్ స్వభావానికి వ్యతిరేకంగా కేంద్రం చేతుల్లో అధికారాలు కేంద్రీకృతమయ్యా యని మనం సబబుగానే విమర్శిస్తాం. కానీ మన పార్టీ నిర్మాణానికి వచ్చేస రికి కేంద్రీకృత ప్రజాస్వామ్యం పేరిట రాష్ట్ర పార్టీలపై అక్కడి పరిస్థితులకు భిన్నమైన విధానాలను రుద్దడం సమంజసం కాదు’’ అని ఆయన వాదించారు. నాడు పార్టీ నాయకత్వం ఆయన సూచనను తిరస్కరించింది. నిజానికి భారతదేశం బ్రిటిష్ పాలనకు ముందు ఒక దేశంగానే లేదు. వివిధ జాతుల సముదాయంగా ఉండేది. ఆ జాతులను విడిగా తమ సొంత రాజ్యాం గాలను రూపొందించుకునే అవకాశం ఉండే నూతన ప్రజాస్వామిక వ్యవస్థ లుగా గుర్తించాలి. కేంద్రం పరిమితాధికారాలు కలిగిన సమన్వయకర్తగా నే ఉండాలి. కేంద్రీకృత ప్రజాస్వామ్యం పేరిట పార్టీలో కేంద్రీకృతాధి కారం అందుకు భిన్నంగా లేదా?
నీళ్లల్లో చేపలుగా మారాల్సిందే
ఎన్నికలు, బహిరంగ సభలు, ర్యాలీలు వంటి రూపాలలో ప్రజాసమీకరణ చేసే కమ్యూనిస్టు పార్టీలు తాము కేవలం తమ కమిటీలకే బాధ్యత వహిస్తామంటే కుదరదు. ప్రజల పట్ల సైతం జవాబుదారీతనంతో వ్యవహరించాలి. పైగా ఇది తక్షణ ప్రజాసమస్యలపైనా, క్రమేపీ సైద్ధాంతిక సమస్య లపైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య ఐక్య కార్యాచరణను సాధించడం కోసం కృషి చేస్తున్న సమయం. కమ్యూనిస్టు పార్టీల ఐక్యకార్యాచరణే సరిపోదు. ఇతర ప్రజాతంత్ర, పురోగామి శక్తులను, వ్యక్తులను కలుపుకుపోవడం అవసరం. ఈ సమయంలో ఆమ్ ఆద్మీ వంటి సామాన్య ప్రజాపార్టీలతో మైత్రి అవసరమని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందుకు కాలాను గుణ్యమైన వెసులుబాటుకు వీలులేని (రిజిడ్) కమ్యూనిస్టు పార్టీల నిర్మాణంగానీ, పడికట్టు పదబంధాలతో కూడిన విసుగు పుట్టించే వాటి ఉపన్యాసరీతులు నేటి దశలో సరిపడవు. సాధారణ ప్రజలు, అభివృద్ధి కాముకులు, అన్నిటికీ మించి ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు కమ్యూ నిస్టులతో కలసి పనిచేయడానికి తటపటాయించడం సహజం. ఏ సమస్య కైనా పరిష్కారంగా అంతిమ పరిష్కారాన్నే చూపడం ప్రజలలో, కార్యకర్తలలో నిర్లిప్త ధోరణిని పెంపొందింపజేస్తుంది. తక్షణ సమస్యలకు, వాటి పరిష్కా రాలకు ప్రాధాన్యం ఇస్తూ సాధ్యమైనంతగా విశాల సామాన్య ప్రజానీకంతో కమ్యూనిస్టులు మమేకం కావాలి. పార్టీ నేతలు, కార్యకర్తలు ‘నీళ్లల్లో చేప’ల్లా ప్రజాబాహుళ్యంలో కలసిపోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పార్టీ మాది, ఈ నేతలు, కార్యకర్తలు మా వాళ్లు అని ప్రజలు ఆత్మీయంగా స్వీకరిం చగలగాలి. ఆప్ విజయ రహస్యాల్లో ప్రధానమైన అంశం ఇదే. నాయకుడు సామాన్యునిగా ఉండటమే, సామాన్యులతో మమేకం కావడమే అసామాన్య లక్షణం! దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ విమర్శను కమ్యూనిస్టులు కామ్రేడ్లీ దృక్పథంతో స్వీకరించి ఆత్మపరిశీలన చేసుకొని, కర్తవ్యోన్ముఖులు కాగలరని ఆశించవచ్చా?
(వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ నం : 9848069720)