డా॥ఎ.పి. విఠల్
విశ్లేషణ
తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న వివక్షకు, అవహేళనలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. కమ్యూనిస్టు ఉద్యమ పునర్వైభవానికి లభించిన ఆ అవకాశాన్ని వారు చేజార్చుకున్నారు. కాగా ఏపీలోని బాబు టీడీపీ ప్రభుత్వం రైతు, శ్రామిక వ్యతిరేకిగా తన గత ‘ప్రతిష్టను’ నిలబెట్టుకుంటోంది. భూసేకరణ పేరిట అది రైతుల భూములను గుత్త పెట్టుబడిదారులకు కట్టబెడుతోంది. కమ్యూనిస్టులే చొరవ చూపి విపక్షాల తో కలసి సమరశీల పోరాటాలు చేపట్టడానికి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో తెలుగు రాష్ట్రాలు రెండయ్యాయి. ఆ చరిత్రను చర్విత చరణంగా చెప్పుకోవడం అనవసరం. అయితే ఆ చరిత్రలో కమ్యూనిస్టు పార్టీలు చూపిన అవగాహన, ఆచరణలను విస్మరిస్తే రెండు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ఉద్యమం నేడు ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కో వడం, ఉద్యమాన్ని పురోగమింపజేయడం అసాధ్యం. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షల నుంచి పుట్టుకొచ్చిన ప్రత్యేక రాష్ట్ర డిమాండు పట్ల సానుకూలంగా స్పందించడంలో కమ్యూనిస్టులు, ప్రత్యేకించి సీపీఎం నేతలు పూర్తిగా విఫలమయ్యారు. కొంత తాత్సారం చేసైనా సీపీఐ ప్రత్యేక రాష్ర్ట ఉద్యమానికి మద్దతునిచ్చింది. ఏదేమైనా ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ, మరి కొన్ని కమ్యూనిస్టు పార్టీలు ఆ ఉద్యమ నేత కేసీఆర్ నిరంకుశ స్వభావాన్నే చూసి తెలంగాణ సామాన్య ప్రజలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, భిన్న సామాజిక వర్గాలు, కవులు, కళాకారులు, మహిళలు ముక్త కంఠంతో వ్యక్తపరుస్తున్న మనోభావాలను గుర్తించి, గౌరవించి అండదండ లందించడంలో విఫలమయ్యాయి.
పుట్టుకతో సంక్రమించిన వ్యాధి
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిస్థితిని ‘అంతర్గత వలసవాదం’గా అభివర్ణిం చడం అతిశయోక్తిగా అనిపించవచ్చు. కానీ నీరు, ఉద్యోగాలు, విద్యా ఉపాధి అవకాశాలు తదితర మౌలిక జీవనాధార రంగాల్లోని వివక్షనే గాక, సంస్కృతి కంగా కూడా దశాబ్దాల తరబడి హేళనను ఎదుర్కొన్న ప్రజలు పడ్డ ఆవేదన తక్కువేమీ కాదు. ఈ వివక్షకు, అవహేళనలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడి ఉండివుంటే పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండేది. తెలంగాణలో కమ్యూ నిస్టు ఉద్యమ పునరుజ్జీవనానికి లభించిన గొప్ప అవకాశాన్ని కమ్యూనిస్టులు చేజార్చుకున్నారు. సీపీఎం క్యాడర్లు, దిగువ స్థాయి నేతలు పలువురు ఈ అంశాన్ని గుర్తించినా కేంద్రీకృత ప్రజాస్వామ్యం పేరిట కేంద్రీకృత నిరంకుశ త్వం వారి చేతులను కట్టేసింది. భాషాప్రయుక్త రాష్ట్రాలనే యాంత్రిక అన్వ యంతో సీపీఎం ఉలిపికట్టెగా మిగలడం విషాదం.
మన దేశంలోని జాతుల సమస్య లోతుపాతులకు వెళ్లడాన్ని ఈ వ్యాస పరిధి అనుమతించదు. అయినా ఒక విషయం మాత్రం చెప్పక తప్పదు. అయితే అటూ, లేకపోతే ఇటూ అంటూ ఏదో ఒక కొసకు కొట్టుకుపోకుండా సమతుల్యంతో వ్యవహరించలేకపోవడం అనే వ్యాధి మన కమ్యూనిస్టు పార్టీలకు పుట్టుకతోనే సంక్రమించింది. లెనిన్ రష్యా పరిస్థితులకు చెప్పిన విడిపోయే హక్కుతో సహా జాతుల స్వయం నిర్ణయాధికారాన్ని మన కమ్యూ నిస్టులు ఒక దశలో మక్కీకి మక్కీగా మన దేశంలోనూ అన్వయిం చారు. ఇక ఇటీవలి కాలంలో ప్రభువుని మించిన ప్రభుభక్తిని ప్రదర్శి స్తూ...‘‘మా దేహం ముక్కలైనా సరే, దేశాన్ని ముక్కలు కానివ్వం’’ అనే వైఖరి చేపట్టారు. ఫలితంగా సామ్రాజ్యవాద అనుకూల గుత్తాధిపతుల పాలనలోని వివిధ ప్రాం తాల, భాషల, ఉపజాతుల, జాతుల న్యాయమైన కోర్కెలను సైతం గుర్తించ లేని అంధత్వం ఆవహించింది. నేటికీ రగులుతున్న ఈశాన్య భారతం, కశ్మీర్ మొదలు తమిళనాట హిందీ వ్యతిరేక ఉద్యమం వరకూ వివిధ రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో ముందుకొస్తున్న జాతుల సంఘర్షణలన్నిటి మధ్య సమకాలిక సమన్వయాన్ని సాధించగల సృజనాత్మకత చింతన కమ్యూనిస్టు నాయకత్వాలకు కొరవడింది. ఇది సమకాలీన భారత భౌతిక వాస్తవిక పరిస్థితులను, వాటి ప్రాధాన్యాన్ని చిన్నచూపు చూస్తూ... ఎప్పుడు దప్పికైతే అప్పుడు బావి తవ్వడానికి పూనుకునే ప్రాప్తకాలజ్ఞతకు చిరునామాగా మన కమ్యూనిస్టు పార్టీలు మారాయి. సీపీఎం 21వ జాతీయ మహాసభల ముసా యిదా తీర్మానం ఇంత స్పష్టంగా కాకున్నా ఈ విషయాన్ని గుర్తించింది.
తెలుగు ఐక్యతలోని భిన్నత్వం
రాష్ట్ర విభజన తర్వాతే రెండు ప్రాంతాల మధ్య భౌతిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితుల్లోని భిన్నత్వం వెలుగులోకి వస్తోంది. ‘జాతి’ నిర్వచనంలో భాష ప్రధానాంశం గనుక సీమాంధ్ర, తెలంగాణ ప్రజలను రెండు జాతులనలేం. ఆంధ్రప్రాంతమంతా ప్రత్యక్షంగా ఆంగ్లేయుల పాలన కిందున్నప్పుడు తెలంగాణ నిజాం సంస్థానంలో భాగంగా ఉంది. సీమాంధ్ర లోని ఆంధ్ర తీరప్రాంతంగా కాగా, తెలంగాణ దక్కన్ పీఠభూమి ప్రాంతం. వ్యవసాయాభివృద్ధిలోని భిన్నత్వానికి అది ఒక ముఖ్య కారణం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేటి తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్య చారిత్రక భూమిక. నాటి పోరాటానికి ఆంధ్ర ప్రాంతం అండదండై నిలిచింది, త్యాగాలు చేసింది. సీమాంధ్రలో ‘సంక్రాంతి’ పెద్ద పండుగైతే, తెలంగాణలో ‘బతుకమ్మ’ గొప్ప పండుగ . ఇరు ప్రాంతాల ప్రజలు మాడ్లాడేది భిన్న మాండలీకాలతో కూడిన తెలుగు భాషే. అయినా ఇటీవలి వరకు తెలంగాణ తెలుగు సినిమాల్లో అవహేళనకు గురైంది. నాకు తెలిసినంతలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సహా ఏ తెలంగాణ నేత విగ్రహమూ సీమాంధ్రలో ఎక్కడా లేదు. కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి తదితర సీమాంధ్ర నేతల విగ్రహాలే కాదు, వారి పేర్లతో పార్కులు సైతం తెలంగాణలో కనిపిస్తాయి. తెలంగాణలోని ఉన్నతోద్యోగాలన్నిటి లోనూ సీమాంధ్రులు సాపేక్షికంగా అధికం. సీమాంధ్రలోని తెలంగాణ ఉద్యోగుల పరిస్థితి అందుకు భిన్నం.
బీజేపీ, టీడీపీ ప్రభుత్వాల వ్యతిరేక ఐక్య పోరు అవశ్యం
ఒకప్పుడు ఉమ్మడి రాష్ర్టంలో ప్రజా వ్యతిరేక పరిపాలనా ప్రభలను వెలిగించిన చంద్రబాబు తెలుగుదేశం నేటి ఏపీలో అధికారం నెరపుతోంది. రైతు, కార్మిక, ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వంగా అది తన గత ‘ప్రతిష్టను’ నిలబెట్టుకుంటోంది కూడా. ‘‘నేనిచ్చిన లేఖ వల్లనే తెలంగాణ ఏర్పడింది’’ అని అక్కడా, ‘‘అన్యాయంగా కాంగ్రెస్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందని’’ ఇక్కడా... ఏ రోటికాడ ఆ పాట పాడగల నీతి చంద్రబాబు సొంతం. కాబట్టి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ, కాంగ్రెస్‌లను కలుపుకొని ఐక్య పోరాటాలను సాగించాలి. అంతేగానీ ‘ప్రత్యేక హోదా’ను కోరుతూ అఖిల పక్షాన్ని తీసుకుని చంద్రబాబు ఢిల్లీ వెళ్లాలంటూ ఆయన వెనుక నిలవాల్సిన అగత్యం లేదు. రుణ మాఫీ, ఇంటింటికీ ఉద్యోగం, నిరుద్యోగ భృతి వంటి ఎన్నికల వాగ్దానాల అమలుకై కమ్యూనిస్టు పార్టీలే చొరవచేసి విపక్షాలతో కలసి సమైక్య పోరాటం చేపట్టడమే అత్యుత్తమం. పైగా భూసేకరణ పేరిట బాబు ప్రభుత్వం నిరంకుశంగా రైతుల భూములను హరించి విదేశీ, స్వదేశీ గుత్తపెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి పూనుకున్న నేపథ్యంలో అలాంటి ఐక్య, సమరశీల పోరాటాలు సాగించే అవకాశాలు, ఆవశ్యకత స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సామాజిక, సాంస్కృతిక ఉద్యమాల సమన్వయం
తెలంగాణ సామాన్య ప్రజానీకంలో టీఆర్‌ఎస్, కేసీఆర్‌లను తెలంగాణ రాష్ట్ర సాధకులుగా ఇంకా బలంగానే గుర్తింపుంది. కేసీఆర్‌పై రైతు వ్యతిరేక ముద్రా లేదు, ఆయన పాలనపట్ల అంత పెద్ద వ్యతిరేకతా లేదు. కాబట్టి కమ్యూని స్టులు కేసీఆర్‌ను తక్షణ లక్ష్యంగా చేసుకొని పోరాడగల పరిస్థితి లేదు. కాబట్టి టీఆర్‌ఎస్ సాధారణ అభిమానులుగా ఉన్నవారు సైతం ఆవశ్యకమైనవిగా భావించే వివిధ సమస్యలపై, రంగాల్లో ఐక్య ఉద్యమాల నిర్మాణానికి తగు రూపాలను ఎంచుకోవాలి. ‘సమైక్య’ వైఖరి వల్ల పార్టీకి, ప్రజలకు మధ్య ఏర్పడ్డ అగడ్తను పూడ్చుకోవడంపై ముందుగా సీపీఎం దృష్టిని కేంద్రీకరిం చాలి. సామాజిక రంగంలో ప్రత్యేకించి వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటా లకు కమ్యూనిస్టులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. నాటి తెలంగాణ సాయుధ పోరాటం, ఆ తదుపరి విప్లవ కమ్యూనిస్టుల కృషి, ఇటీవలి ప్రత్యేక రాష్ట్ర ఉద్య మాలు తెలంగాణలో సాంస్కృతిక రంగానికి అత్యంత శక్తివంతమైన పోరాట ఆయుధంగా మలచాయి. ఆట, పాటా నేటికీ ప్రజలను కదిలించగలుగు తున్నాయి. కమ్యూనిస్టులు సామాజిక పోరాటాలను సాంస్కృతిక పోరాటాల తో సమన్వయించి, వర్గపోరాటాలకు జోడించాలి. ముందుగా ప్రజలను వారు తమ వైపు తిప్పుకోవాలి. తెలంగాణలో సుదీర్ఘకాలంగా కమ్యూని స్టులకున్న పలుకుబడి అందుకు తోడ్పడుతుంది. ఈ అంశాన్ని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కమిటీ గుర్తించినట్టే కనిపిస్తోంది. ఇటీవల అది ‘‘ప్రైవేటు రం గంలో కూడా రిజర్వేషన్ల విధానాన్ని అమలు చేయాలి’’ అనే నినాదం చేపట్టిం ది. అది బలమైన ఐక్య ఉద్యమ నిర్మాణం దిశగా వేస్తున్న ముందడుగనే భావించాలి. అయితే గతంలో మండల్ కమిషన్ సిఫారసుల నేపథ్యంలో పాలకవర్గాలు అగ్రవర్ణాల భావోద్వేగాలను రెచ్చగొట్టిన అనుభవం నుంచి గుణపాఠాలను తీసుకోవాలి. ప్రైవేటు రిజర్వేషన ్లలో అగ్రవర్ణాల, కులాల పేదలకు 5 శాతం రిజర్వేషన్ల కల్పన వంటి పద్ధతులను రూపొందిం చుకోవాలి.
ఏది ఏమైనా కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యతే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వామపక్ష రాజకీయాల పునర్వైభవానికి ముందు షరతని విస్మరించలేం. రెండు రాష్ట్రాల భిన్న భౌతిక వాస్తవికతలకు అనుగుణంగానే కమ్యూనిస్టులు ఎత్తుగడలను రూపొందించుకుని ముందుకు సాగాల్సి ఉంది. రెండు రాష్ట్రాలకు ‘ఇద్దరు చంద్రులు’ ముఖ్యమంత్రులంటూ మీడియా అంటోంది. కానీ ఆ ఇద్దరు చంద్రులలో తిథులననుసరించి వచ్చే ‘కళా కాంతులు’, ‘కాంతి విహీనతల’ను విస్మరించ రాదు. ఈ అసిధారావ్రతంలో ప్రజలతో మమేకమై కమ్యూనిస్టులు విజయం సాధిస్తారని ఆశిద్దాం!
(వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు 98480 69720)