కమ్యూనిస్టు పార్టీల ప్రస్తుత క్షీణ స్థితిని గుర్తుచేసి జాగ్రత్తపడాలని హెచ్చరిస్తే అలాంటి వారిని బీజేపీ అనుకూల మేధావుల సరసన చేర్చి వ్యవహరించే వారిపట్ల కమ్యూనిస్టులు సైతం అప్రమత్తతతో ఉండాలి. కొన్ని పొరపాట్లు జరగకుండా ఉండి ఉంటే కమ్యూనిస్టుల స్థితి మరింత ఆశాజనకంగా ఉండేదన్న సదుద్దేశంతో విమర్శించినంత మాత్రాన వారందరినీ శత్రు శిబిరంలో కలుపడమే కాకుండా ‘కమ్యూనిస్టులదే అంతిమ విజయం’ అనే భావనను సమర్థించకపోవడమే తీవ్ర తప్పిదం అంటే ఎలా?
ఇటీవల రాజస్థాన్‌లో 2 లోక్‌సభా స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఆ మూడు స్థానాల్లో బీజేపీ పరాజయాన్ని చవిచూసింది. ఇంతకు ముందు ప్రధాని మోదీ స్వరాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో గుజరాత్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినా ఆ విజయం బీజేపీకి గానీ, మోదీకి గానీ ప్రత్యేకించి పేర్కొనదగినది కాకపోగా, గతంలో కంటే తక్కువగా పోలైన ఓట్ల శాతంతో భారీగా నష్టపోయింది. ఆమేరకు కాంగ్రెస్ పార్టీ లాభపడింది. అదే విధంగా బెంగాల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్ ఘన విజయమే సాధించింది. ఉపఎన్నికలను కొట్టి పారేయడం కుదరదు. బహుశా గతంలో రెండు సార్లు.. అధికారంలో ఉన్న పార్టీ ఉపఎన్నికలలో ఇలా ఓడిపోవడం జరగలేదు. అది రాజస్థాన్‌లో బీజేపీ మాత్రమే సాధించిన రికార్డు. అలాగే తమిళనాడులో జరిగిన ఇటీవలి ఉపఎన్నికలలో బీజేపీకి నోటాకు వచ్చిన ఓట్లకంటే కూడా తక్కువ వచ్చి, 1300 ఓట్లతో సరిపెట్టుకోవలసివచ్చింది. ఈ 67 ఏళ్ల రిపబ్లిక్ చరిత్రలో ఒక శాసనసభ ఉప ఎన్నికలో ఇంత తక్కువ ఓట్లు సాధించిన ప్రధాన జాతీయ పార్టీ ఏదీ లేదు.
భారతదేశం వివిధ జాతుల సముదాయం అన్న వాస్తవాన్ని గుర్తించకుండా మొత్తం దేశాన్ని ఏకశిలా సదృశమైన అఖండ హిందూరాజ్యంగా మార్చాలన్న ఆర్‌ఎస్‌ఎస్ మతతత్వ ఎజెండాను శాయశక్తులా అమలు జరిపేందుకు తీవ్రకృషి చేస్తోందని ఈ నాలుగేళ్ల బీజేపీ, మోదీజీల వ్యవహార శైలి వలన తేటతెల్లమవుతున్నది. దేశానికి ఈ పరిస్థితి దాపురించడానికి, బీజేపీ ఇంతటి స్థాయికి ఎదగడానికి, కాంగ్రెస్ పార్టీ అవినీతిమయమైన అధ్వాన పాలన కారణమని ఇతర ప్రతిపక్షాలు సహజంగా కాంగ్రెస్‌ను విమర్శిస్తాయి. ఆ విమర్శ వాస్తవమే. కానీ బీజేపీకి లేని బలాన్ని సంతరింపచేయడంలో మిగిలిన బీజేపీయేతర పార్టీల, వ్యక్తుల పాపం కూడా లేకపోలేదు. ఉదా.కు బిహార్‌లో నితీశ్ కుమార్ నిర్వాకం ఏమిటి? లాలూప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీతో కలిసి బిహార్‌లో గత శాసనసభ ఎన్నికల్లో బీజేపీని మట్టిగరిపించి గద్దెనెక్కిన నితీశ్ కుమార్ ఈ మధ్యనే తనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిన ఆర్జేడీకి, లాలూకు వెన్నుపోటు పొడిచి పచ్చి అవకాశవాదంతో బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రిగా నిస్సిగ్గుగా అందలం మీద కులుకుతున్న విషయం మనకు తెలిసిందే కదా.
అవకాశవాదానికి మారుపేరు బాబు
ఇక మన రాష్ట్రంలో చంద్రబాబు తెలుగుదేశం వ్యవహారం తెలిసిందే కదా. వెన్నుపోటు అనే పేరుతో ఎవరైనా సినిమా తీయదల్చుకుంటే అది చంద్రబాబును ఉద్దేశించేనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అపార్థం చేసుకునే అవకాశమూ ఉంది. మోదీ అధికారంలో ఉండగా గుజరాత్‌లో మతకల్లోలాల సందర్భంగా 3 వేలమంది (అత్యధికంగా ముస్లింలు) మారణ హోమానికి గురైనప్పుడు మోదీ మన రాష్ట్రానికి వస్తే కారాగారంలో వేసి శిక్షిస్తానని చంద్రబాబు ప్రగల్భాలు పలికిన విషయం తెలుగు ప్రజలు మర్చిపోలేదు. 2004 ఎన్నికలనాటికి వాజ్‌పేయితో, బీజేపీతో కలిసి ఎన్నికలలో జతకట్టి ఓటమి పాలైన సందర్భంగా ఇక బీజేపీతో ఎన్నికలపొత్తు పెట్టుకోనని రాజకీయ ప్రతిజ్ఞ చేసిన పెద్దమనిషి చంద్రబాబు. కానీ 2014 ఎన్నికల్లో ఆ ఒట్టు తీసి గట్టున పెట్టి మోదీతో, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.
ఇక వామపక్షాల పాత్ర కూడా బీజేపీ నేడు ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడింది. నిజానికి బీజేపీకి, ఆ పార్టీ సైద్ధాంతిక స్ఫూర్తి ఆర్‌ఎస్‌ఎస్‌కు భావజాలపరంగా మార్క్సిస్టు దృక్పథంతోనే ప్రధమ శత్రుత్వం ఉంటోంది. ఈ నేపధ్యంలో మార్క్సిస్టులు పరస్పరం ఆ ఊరికీవూరు ఎంత దూరమో ఈ ఊరుకు ఆ ఊరూ అంతే దూరం అన్నట్లుగా ఉండటం సరైంది కాదు. ఏ కమ్యూనిస్టు పార్టీలోనూ సభ్యత్వం లేనంత మాత్రాన తమకు తెలిసినంతలో మార్క్సిజం పట్ల నిబద్ధత కలిగి ఉంటున్నవారు–కమ్యూనిస్టు పార్టీల ఆచరణ, వాటి ఎత్తుగడల లోపాలపై విమర్శిస్తూ ఉండవచ్చు. అది మన పిల్ల వాడు తప్పు చేస్తుంటే హెచ్చరించడం, సరిదిద్దుకోమని చెప్పడం వంటిది. అలా విమర్శించినంత మాత్రాన ఆ వ్యక్తిని కమ్యూనిస్టు పార్టీకి శత్రువుగా పరి గణించడం సబబు కాదు.
పొత్తు విషయంలోనే విభేదాలు!
ఎవరితో పొత్తు కుదుర్చుకోవాలి, ఎవరిని దూరం పెట్టాలి, విభేదించాలి అనే సూత్రబద్ధతకు సంబంధించి కమ్యూనిస్టు పార్టీల్లోనే అంతర్గతంగా చర్చలు, వాదాలు జరిగి ఓటింగ్ వరకు వెళుతున్న ఘటనలు గతంలోనూ జరిగాయి, ఇప్పుడూ జరుగుతున్నాయి. ఎమర్జెన్సీ అనంతరం కాంగ్రెస్ పార్టీ పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలనే విషయమై పుచ్చలపల్లి సుందరయ్య సీపీఎంలో ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో తీవ్ర చర్చ జరిగింది. 42 ఏళ్ల తర్వాత సీపీఎం పార్టీ అఖిల భారత మహాసభ జరగనున్న సందర్భంగా అలాంటి పరిస్థితే మళ్లీ ఏర్పడింది. మోదీ, షాల బీజేపీ పార్టీ మతతత్వ ధోరణులకు వ్యతిరేకంగా రాజ్యాంగ ఔన్నత్యాన్ని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి అన్న విషయంలో సీపీఎంలో విభేదాలున్నాయనే వార్త వచ్చింది. కాంగ్రెస్ పార్టీతో సహా బీజేపీ వ్యతిరేక, బీజేపీయేతర పార్టీలన్నింటినీ కలుపుకుని కూటమి ద్వారా పోరాడాలనీ, ఆ పార్టీ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం ప్రతిపాదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అలాంటి పోరాటంలో పాల్గొనే అర్హత కోల్పోయిందని అలాగే ఇతర పెట్టుబడిదారీ పార్టీలు కూడా కాంగ్రెస్ లాగే ఉదార ఆర్థిక విధానాలనే అనుసరిస్తున్నాయని, కనీస వామపక్షాలతో తప్ప ఇలాంటి వాటితో కలిసి వేదిక పంచుకునే ప్రశ్న రాదని, గతంలో విశాఖపట్నంలో చేసుకున్న తీర్మానానికే కట్టుబడి ఉండాలని, మునుపటి పార్టీ ప్రధాన కార్యదర్శి, నేటి పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ ప్రతిపాదించారని వార్త. ఈ ఇరువురి వాదనల మధ్య ఓటింగులు జరిగి, ఒక దశలో ప్రకాశ్ వాదన నెగ్గిందని, తర్వాత కేంద్రకమిటీలో ఏచూరి వాదన నెగ్గిందని అయితే మహాసభ చివర జరిగిన కేంద్రకమిటీ భేటీలో తిరిగి ప్రకాష్ వాదనే 8 ఓట్ల తేడాతో నెగ్గిందని హిందూ పత్రికలో వార్త చూశాము.
ప్రకాష్ కరత్ వాదన ప్రకారం, కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ కాదు. కాంగ్రెస్ కూడా బీజేపీ అంత మొరటు మతతత్వ పార్టీ కాకపోయినా, కొంత సున్నితమైన మతతత్వ పార్టీయే అని కరత్ వాదన. ఇదే సమయంలో విజయవాడలో జరిగిన సీపీఐ జాతీయ కౌన్సిల్‌లో, మోదీ మతతత్వ, దోపిడీ పాలనకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధపడిన పార్టీలన్నింటితోపాటు కాంగ్రెస్‌ను కూడా కలుపుకుని పోరాడాలి అని తీర్మానం చేశారు. దానిపై సీపీఎం నుంచి సానుకూల స్పందన లేదు.
కమ్యూనిస్టు పార్టీల సానుభూతి పరులు, సాధారణ కష్ట జీవులు, వర్ణ (కుల) వ్యవస్థ పద ఘట్టన కింద నలిగిపోతున్నవారు, మతోన్మాదంతో పాటు ఉదారవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాల ఫలితంగా దైనందిన జీవనంలో అష్టకష్టాలు పడుతున్నవారు.. వీరందరూ కూడా రెండు కమ్యూనిస్టు పార్టీల మధ్య కానరాని ఐక్యత విషయంలో నిస్పృహకు గురవుతున్నారు. వామపక్షాల ఐక్యత గురించి సీపీఐ, సీపీఎం తరచుగా ప్రబోధిస్తుంటాయి. కానీ ప్రస్తుత కీలక సమయంలో అయినా ఐక్యతకు భిన్నంగా ఉండే ప్రకటనల పట్ల కాస్త సమతుల్యతతో ఉండటం అవశ్యం.
అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండూ ఆర్థిక విధానాల్లో కోటీశ్వరుల కొమ్ము కాస్తూ, నిరుపేదల పట్ల, దిగువ మధ్య తరగతి పట్ల నిర్లక్ష్యం వహించి సాధారణ ప్రజల జీవితం దుర్భరం చేయడం వాస్తవమే. దానికి తోడు బీజేపీ కరడుగట్టిన మతతత్వంతో హిందూ, హిందూయేతర ప్రజల మధ్య వైరుధ్యాన్ని పెంచి హిందూ మత ఓటు బ్యాంకు కోసం పరమత ద్వేషాన్ని రెచ్చగొడుతూ, ప్రజానీకాన్ని మధ్యయుగాల అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ నాలుగేళ్ల పాలనలో అది ఎన్ని దుశ్చర్యలకు పాల్పడిందో తెలిసిందే. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ లౌకికవాద పార్టీ కాదని చెబుతూ దాన్ని బీజేపీతో కలిపి ఒకే గాటన కట్టడం వాస్తవం కాదు. ఆ మాటకొస్తే మైనారిటీల తరఫున నిలబడినందువలన హిందూమతానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్న అపప్రథకు సీపీఎం కూడా గురైంది. అంత మాత్రాన అది నిజమేనా?
మతతత్వ పాలనే ప్రథమ శత్రువు
ఏది ఏమైనా మోదీ, షాల అప్రకటిత నియంతృత్వ పాలనను, దాని ఉన్మత్త ఏకశిలా సదృశ జాతీయతను, దాని శ్రామిక వ్యతిరేక సిద్ధాంతాన్ని, ప్రజల జీవనాన్ని అధోగతిలోకి నెడుతున్న మతతత్వ దుర్మార్గాన్ని వ్యతిరేకించడం ప్రస్తుతం అవసరం. నాడు అత్యవసర పరిస్థితిలో సుందరయ్య కూడా కాంగ్రెస్ నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా జనతాపార్టీతో కలిసి వ్యవహరించడం తప్పు అనలేదు. అలా సాగిస్తూనే, ఉమ్మడి ఎన్నికల కార్యక్రమాలు, ఉపన్యాస వేదికలు పనికిరావని ఆయన హెచ్చరించారు. నేటి పరిస్థితిలో అదే వైఖరి సరైనదవుతుంది. వామపక్ష నాయకత్వాన ఇలాంటి ప్రయత్నం సాగాలి.
ఈ సందర్భంలో ఎన్నో రాజకీయ పార్టీలను, ఉద్యమ సంస్థలను, నేతలను కలుపుకురావాలి. అందుకు ఎంతో సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. తొలి పార్లమెంటులో నెహ్రూ ప్రధాని కాగా, సుందరయ్య ప్రధాన ప్రతిపక్ష నేత. నేడు పార్లమెంటులో పార్టీ స్థాయి ఎలా ఉంది? నేడు ఆంధ్రప్రదేశ్‌లో సీపీఐ కానీ, సీపీఎం కానీ ఒక్క స్థానాన్ని అయినా పొందగల స్థితి ఉన్నవా? అని కొందరు కమ్యూనిస్టులకు, సానుకూల తటస్థులైన మేధావులకూ సందేహాలుండే అవకాశం ఉంది. ఇలా పార్టీల క్షీణ స్థితిని గుర్తుచేసి జాగ్రత్తపడాలని హెచ్చరిస్తే అలాంటి వారిని బీజేపీ మేధావుల సరసన చేర్చి వ్యవహరించే వారిపట్ల కమ్యూనిస్టులు సైతం అప్రమత్తతతో ఉండాలి.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వంటి విప్లవాత్మకత కూడా ఈ పార్టీల నుంచి ఆశించే భౌతిక, స్వీయాత్మక స్థితీ నేడు లేదు. కొన్ని పొరపాట్లు జరగకుండా ఉండి ఉంటే కమ్యూనిస్టుల స్థితి మరింత ఆశాజనకంగా ఉండేదన్న సదుద్దేశంతో విమర్శించినంత మాత్రాన వారందరినీ శత్రుశిబిరంలో కలపటం భావ్యం కాదు. పైగా కమ్యూనిస్టులదే అంతిమ విజయం అనే భావనను సమర్థించకపోవడమే అలాంటి మేధావులు, ప్రజాస్వామ్యవాదుల తీవ్ర తప్పిదమన్నట్లుగా హద్దులు దాటిన విమర్శనాస్త్రాలతో వ్యంగ్యంగా అపహాస్యం చేయబూనడం కమ్యూనిస్టు పార్టీల లక్ష్యాలను, వారి ఓర్పు నేర్పులను బూడిదలో పోసిన పన్నీరు చేస్తాయి. కమ్యూనిస్టులు తమను తాము ఒంటరి చేసుకునే అలాంటి తుంటరి పనులకు, రచనలకు, దూరంగా ఉండి ఆ మహత్తర కర్తవ్యంలో వీలైనంత మంది ప్రజానీకాన్ని రాసిరీత్యా, వాసి రీత్యా కూడా తమ మిత్రులుగా నిలబెట్టుకునే కృషి చేయడం చాలా అవసరం!
- డాక్టర్ ఏపీ విఠల్
వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు ‘ మొబైల్ : 98480 69720
Comments
Please login to add a commentAdd a comment