పాకశాస్త్ర ప్రవీణుని పలాయనం
బైలైన్
ఎం.జె. అక్బర్, సీనియర్ సంపాదకులు
కేజ్రీవాల్ ఒకే సమయంలో వేదిక మీద ప్రధాన తారగానూ, ఆందోళన జరిపే ప్రేక్షకుల్లో ఒకడిగానూ ఉండటం అవసరం. అమరుని దుస్తులు అధికారిక దుస్తులతో తేలిగ్గా కలగలిసిపోవు. ఆమ్ ఆద్మీ అధికారంలోకి రాగలదని కేజ్రీవాల్ ఢిల్లీ ఓటర్‌ను ఒప్పించగలిగాడు. దేశ ఓటర్లకు ఆ నమ్మకాన్ని కలిగింపజేయడం పూర్తిగా భిన్నమైనది. ఆయన సైతం ఆ పని చేయగలనని విశ్వసించలేరు. సార్వత్రిక ఎన్నికల క్యాంపెయిన్‌లో ఆయన నిర్వహించగలిగిన బాధ్యత ఒక్కటే. పార్లమెంటులోని మిగతావారంతా నిజాయితీగా ఉండేలా చూడటం.
అరవింద్ కేజ్రీవాల్ వంట గది వేడిని భరించలేక బయటికొచ్చేశారు. స్వీయ రక్షణ మార్గంగా ఆయన చేసినది సబబే. భోజనానికి వచ్చేవారు కోరినదే పాకశాస్త్ర ప్రవీణునికి కూడా నచ్చినది కావాలని లేదు. అవిశ్రాంత కృషితో మీరే స్వయంగా భోజనం వండి వడ్డించే బాధ్యతలను సాధించుకున్నప్పుడు... వంట గదిలోని వేడి ఓటరు ఆకలికి సాక్ష్యంలాగా అనిపిస్తుంది.
ప్రతి వంట గది వేడిగానే ఉంటుంది. భోజనం తయారు కావాలంటే మంట కావాలి. అందరికంటే బాగా ఈ విషయాన్ని అర్థం చేసుకున్నది కేజ్రీవాలే. కాంగ్రెస్ వంట గదిలో ఆయన ఎంతటి తీవ్రమైన వేడిని రగిల్చారంటే అజేయురాలైన షీలా దీక్షిత్ చర్మం సైతం తీవ్రంగా కాలింది. అయితే వంట గదిలో ఒళ్లు కాల్చుకోడానికి ఆమెకు పదిహేనేళ్లు పట్టింది. నలభై తొమ్మిది రోజులకే కేజ్రీవాల్ తోలు ఊడిపోవడం మొద లైంది.
వంట గదికి కూడా కొన్ని నిబంధనలు అవసరం. రాజ్యాంగంలో నిర్దేశించిన కొన్ని ప్రత్యేకతలు మన దేశ రాజకీయ ఆహార పదార్థాల బాబితాను నియంత్రిస్తుంటాయి. అవి ప్రతి ఒక్కరికీ నచ్చేవి కావు. వాటిలో కొన్ని అస్పష్టమైనవి, మరికొన్ని వివాదాస్పదమైనవి. అయినాగానీ రాజ్యాంగంలో అవి ఉన్నంత కాలం మనం వాటికి అనుగుణంగానే బతకాలి. వెసులుబాటు కూడా ఉంది. ఎప్పుడైనా మనం వాటిని సవరించుకోవచ్చు. కానీ ఆ పని చేయడానికి కూడా మనం ఒక నిర్ణీత క్రమాన్ని అనుసరించాల్సి ఉంటుంది. మీ అభీష్టానికి అనుగుణమైన కార్యక్రమంలో ఇమడనంత మాత్రాన ఒక చట్టాన్ని వదిల్చేసుకోలేరు.
పాకశాస్త్ర సూపర్‌స్టార్‌లు కొందరు విపరీత ప్రవర్తనకు తమకు విశేష హక్కులు కావాలని కోరుతారు. వారి పాకశాస్త్ర కళా ప్రావీణ్యానికి గుర్తింపుగా ప్రజలు దాన్ని అనుమతిస్తుంటారు కూడా. కానీ నాటకీయ విన్యాసాలు భోజనానికి ప్రత్యామ్నాయం కాజాలవు. గందరగోళం కళ కాదు. కళారాహిత్యంగా సైతం దాన్ని అభివర్ణించవచ్చు.
కేజ్రీవాల్ రాజీనామా కథనానికి ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక పెట్టిన శీర్షిక ‘‘నాటకం మొదటి అంకం ముగిసింది, రెండో అంకానికి తెర ఇప్పుడే లేచింది.’’ ఆ శీర్షికే చెప్పాల్సినదంతా చెప్పేసింది. సాధారణంగా రెండో అంకం మొదలయ్యే సరికే ప్రేక్షకులకు తాము చూస్తున్న నాటకం విషాదమా లేక హాస్యభరితమా అనేది తెలిసిపోతుంది. ఈ నాటకం విషయంలో మాత్రం అది తెలుసుకోడానికి మరో అంకం పరిపూర్తి అయ్యేవరకు వేచి చూడాల్సి ఉంది.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనాలనే కోరిక తనకు లేదని కేజ్రీవాల్ ఇటీవల అన్నారు. ఆయన భోజనశాల ఖాతాదారుల్లో చాలా మందికి ఆ మాట చిటికెడు ఉప్పు వేసుకుంటే తప్ప జీర్ణం కాని వంటకం. జాతీయ రంగస్థలిపై ప్రవేశానికి వేదికగా మాత్రమే ఆయన ఢిల్లీలో తాత్కాలిక అధికారాన్ని కోరుకున్నారు. బృహత్తరమైన ఏ స్వప్నానికైనా గానీ ఢిల్లీ చాలా చిన్నది.
గొప్ప ఉద్యమమైన లోక్‌పాల్ బిల్లు నేడు ఒక సంజాయిషీగా రూపాంతరం చెందింది. మరో పక్షం రోజుల్లో ఎన్నికల కార్యక్రమాన్ని ప్రకటిస్తారు. కాబట్టి ఆయన అతి త్వరగా ఈ రాజీనామా ప్రహసనాన్ని ప్రదర్శించాల్సి వచ్చింది. కేజ్రీవాల్ ఒకే సమయంలో వేదిక మీద ప్రధాన తారగానూ, ఆందోళన జరిపే ప్రేక్షకుల్లో ఒకడిగానూ కూడా ఉండటం అవసరం. ఎడతెరిపి లేని ఆయన సందిగ్ధాలలో ఇది ఒకటి. ఒకేసారి నిర్వహించాల్సిన ఈ రెండు పాత్రల డబుల్ యాక్షన్ ఆయన వ్యక్తిత్వం చుట్టూ , రాజకీయాల చుట్టూ మానసిక వైకల్యపు వర్ణాన్ని ఆవిష్కరిస్తోంది. అమరుని దుస్తులు అంత తేలిగ్గా అధికారిక దుస్తులతో కలగలిసిపోయేవి కావు.
అప్పుడే పుట్టిన బిడ్డలాంటి తన ఆమ్ ఆద్మీ పార్టీ దానికదిగానే అధికారంలోకి రాగలదని కేజ్రీవాల్ ఢిల్లీ ఓటర్‌ను ఒప్పించగలిగాడు. ఢిల్లీ వేదిక చిన్నది. అది కేవలం ఏడు లోక్‌సభ స్థానాలకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆయన తనకు 272 సీట్లు వస్తాయని దేశ ఓటర్లను నమ్మింపజేయడం పూర్తి విభిన్నమైన విషయం. ఆయన సైతం దాన్ని విశ్వసించలేరు.
అందువలన సార్వత్రిక ఎన్నికల క్యాంపెయిన్‌లో ఆయన నిర్వహించగలిగిన బాధ్యత ఒక్కటే. పార్లమెంటులోని మిగతావారంతా నిజాయితీగా ఉండేలా చూడటం. ఒక ప్రారంభ స్థానంగా ఆ బాధ్యతలో ఆయనకు కొన్ని సానుకూలతలు ఉన్నాయి.
అయితే అది ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలను నిర్ణయించేదేమీ కాదు. ఐదేళ్ల పరిపాలనారాహిత్యపు అగమ్యగోచర గమనం తర్వాత ఇప్పుడు ఓటర్‌కు కావలసినది ప్రభుత్వమే గానీ గందరగోళం కాదు. ఈ ఎన్నికల సంవత్సరం చిన్న పార్టీలకు మంచిది కాదు. ప్రత్యేకించి తమంతట తాము ఒంటరిగా పయనించే పార్టీలకు అసలే మంచిది కాదు. పరిపాలన విషయంలో ఇతరులతో పోటీ పడే విషయంలో కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో ఆయనకు జరిగిన మంచేమీ లేదు. రాజకీయ నైరాశ్యంతో ఉదారంగా కానుకలను పంచిపెడుతూ, తన రంగంలోనే ఉన్న మిగతా వారందరినీ అపహాస్యం చేసే ప్రధానమంత్రిని, పరమ పవిత్రమూర్తిగా తాను వల్లించే ప్రవచనాలతో విభేదించే దుస్సాహసం చేసినప్పుడల్లా రాజ్యాంగంపైకి కత్తి దూసే ప్రధాన మంత్రిని కోరుకునే ఓటర్లు కొద్ది మందే ఉంటారు.
ఇది ఆర్థిక వ్యవస్థ అంతటా సంక్షోభం వ్యాపించి ఉన్న సంవత్సరం. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ‘డెరైక్టరేట్ ఆఫ్ అడ్వర్ట్టైజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ’ (డీఏవీపీ) పేరిట యూపీఏ జారీచేసిన ధగధగలాడే హోర్డింగ్‌ల ప్రకటనలు అత్యంత ముఖ్యమైన గణాంకాలు కావు (వాటికి చెల్లించే బిల్లుతో మీరు చెల్లించాల్సిన పన్నులు పెరుగుతాయి కాబట్టి వాటికి డబ్బు చెల్లించాల్సింది మీరే). ఇటీవల ఒక ఉదయం మొదటి పేజీలో ఇలా కనిపించి అలా మాయమైన వార్తా కథనం ముఖ్యమైనది. గత పదేళ్లలో ఉద్యోగాలు 2 శాతం మాత్రమే పెరిగాయి. యువతకు సంబంధించి ఆర్థిక సంక్షోభం అంటే ఇదే.
పరిష్కారం కోసం తొందరపెడుతున్న సమస్యలు ఇలాంటివే. అవినీతి కూడా చాలా ముఖ్యమైన సమస్యేననడంలో సందేహం లేదు. అయితే అవినీతిపరులుగా వేలెత్తి చూపలేని వారు పలు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఆర్థిక వ్యవస్థకు కూడా స్వస్థతను చేకూర్చగలిగిన కేంద్ర ప్రభుత్వాన్ని ఓటర్లు కోరుకుంటున్నారు. విస్తట్లో మరింత ఎక్కువ ఆహారాన్ని వడ్డించడానికి తన వద్ద తగు పథకం సిద్ధంగా ఉన్నదని కేజ్రీవాల్ ఓటర్లను నమ్మించగలగడానికి సమయం మించిపోయి ఉండొచ్చు.
ఢిల్లీలాంటి చిన్న రాష్ట్రపు వంట గదే మీకు చాలా వేడిగా ఉన్నదనిపిస్తే కేంద్ర ప్రభుత్వమనే ఆవిరి ఇంజను గదిలోని ఉష్ణోగ్రతలను ముందుగా ఒకసారి కొలిచి చూడ్డం మంచిది. ఆ గది మీకు విడుపు లేకుండా చమటలు పట్టిస్తుంటుంది. గొప్ప వ్యక్తులుగా అధికార ప్రాకారాలలోకి ప్రవేశించి అనామకులుగా ముఖాలు వేలాడేసుకుని నడిచి వచ్చిన వాళ్లతో చరిత్ర నిండిపోయింది.