
అభూత కాల్పనిక ‘దౌత్యం’
పాక్‌లో సున్నీ ఇస్లామిక్ మతతత్వ మిలిటెన్సీ హింసాత్మాకమైన ఒక్కొక్క అడుగూ వేస్తూ ఆ దేశాన్ని మతం పేరిట అరాచకంలోకి ఈడ్చుతోంది. భారత్ దాని లక్ష్యాలలో ఒకటి. భారత, పాక్ ప్రభుత్వాలు కఠోర వాస్తవాలతో కుస్తీలు పడుతున్నట్టు, నాట్యం చేస్తున్నట్టు నటించడం మానేయక తప్పదు.
రుషి పుంగవులను మినహాయిస్తే, రచనా వ్యాపార కార్యకలాపాలలోని ప్రతి ఒక్కరూ... అట్టడుగు భాగాన ఉండే మా బోటి వాళ్లు సహా... కీర్తి ప్రతిష్టల ప్రలోభానికి గురికాకుండా ఉండటం అరుదు.అందులో ఉన్న ప్రమాదం సుస్పష్టమే. ఊహాత్మకత వాస్తవికత సరిహద్దులను దాటిపోగా, మనం ఎవరమో వారిగా గాక ఎవరిలా ఉండాలని ఊహిస్తున్నామో వారిలాగా ప్రవర్తించేట్టు చేస్తుంది. ప్రాయశ్చితం చేసుకోవాల్సిన స్థానానికి చేరుస్తుంది.
ఢిల్లీకి చెందిన సంచార ఇంటర్నెట్ కాలమిస్టు వేద ప్రకాశ్ వైదిక్ గత వారంలో పాకిస్థాన్‌కు వెళ్లి వచ్చి ఓ పదిహేను నిముషాల కీర్తిని ఆర్జించి సంబరపడిపోయారనేది రహస్యమేమీ కాదు. జాతీయవాదపు అసంబద్ధ పరిమితుల నుంచి ఆయన స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. ఫ్రెంచి విప్లవ కాలపు తత్వవేత్త రూసో, కమ్యూనిస్టు మానిఫెస్టో కర్త కార్ల్ మార్క్స్‌ల సరసన ఆయన తనను తానొక అంతర్జాతీయవాదిగా పునఃప్రతిష్టించుకున్నారు. ట్విటర్‌లో వైదిక్ తనను తాను అభివ ర్ణించుకున్న తీరది. కాదని వాదించడానికి మనం ఎవరం? స్వేచ్ఛా సంచారియైన ప్రపంచ పౌరుని పాత్రలో వైదిక్ కాశ్మీర్‌ను సమైక్య స్వతంత్ర దేశంగా మార్చడమే సంక్లిష్టమైన ఆ సమస్యకు పరిష్కారమని సూచించారు.
పాకిస్థాన్ కళ్లకు అది వైదిక్‌ను ఆదర్శ భారతీయుడ్ని చేయగలగడం అర్థం చేసుకోదగినదే. గత పాక్ పర్యటనలో ఇస్లామాబాద్, లాహోర్లలో అయనకు ఘన స్వాగతం పలికారు. మన పొరుగింటి ప్రధాని నవాజ్ షరీఫ్ ఆయనతో కాసేపు ముచ్చటించారు. అంతేకాదు, అత్యంత హేయమైన ఉగ్రవాద రింగ్ లీడర్లలో ఒకడైన హఫీజ్ సయీద్‌తో కలిసి పరమ సంతుష్టికరమైన విందారగించారు. 2008 ఉగ్రవాద దాడులను చేయించిన హఫీజ్ సయీద్ లాహోర్‌లో దర్జాగా రాజాలా బతుకుతూనే ఉన్నాడు. అదీ రహస్యమేమీ కాదు. ఢిల్లీకి తిరిగి వచ్చినప్పటి నుండి ఆ విషయాన్ని వినడానికి తీరిక ఉన్న ప్రతి ఒక్కరికీ వైదిక్ వినిపిస్తూనే ఉన్నారు.
పాత్రికేయులు వార్తలను బట్టబయలు చేయడానికి బదులుగా తామే తయారు చేయడానికి ప్రయత్నించినప్పుడు తయారయ్యేది సీతాకోక చిలుకల్లాంటి వార్తలే. కాసేపవి మిడిసి పడుతూ అటూ ఇటూ ఎగిరి ఓ ఆవలింతతోనో లేదా భుజాల ఎగురవేతతోనో సత్వర మరణ ప్రాప్తి పొందుతాయి. వైదిక్ కథ విషయంలో సరిగ్గా అదే జరిగింది. కాకపోతే కాంగ్రెస్ దానికున్న స్వంత కారణాలతో రాజకీయ ఔచిత్యాన్ని మరచి మరీ దాన్ని కొనసాగించగలనని భావిస్తోంది. దానితో ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని ఓ దెబ్బ తీయవచ్చని ఆశిస్తోంది.
కాంగ్రెస్ చరిత్రలోనే అత్యంత భారీ ఓటమి వల్ల అది ఇంకా సమతూకాన్ని కోల్పోయే ఉన్నట్టుంది. కాబట్టే అది తన మస్తిష్కపు పై మూతను ఇంకా బిగించినట్టు లేదు. ఉగ్రవాదం సమస్యపై ప్రధాని మోడీ పైన దాడి చేయగలమని ఆలోచిస్తున్నదంటేనే ఆ పార్టీ ఇంకా అసమతూకంతోనే ఉన్నదని అర్థం. ఉగ్రవాదంపై నేడు సాగుతున్న జాతీయ యుద్ధంలో మోడీ కంటే మెరుగైన అర్హతలు ఉన్నవారు లేరు. ఆయన గత చరిత్ర, అతి తరుచుగా ఆయన తన సంభాషణల్లో, ఉపన్యాసాల్లో వ్యక్తపరచిన విశ్వాసాలే ఆ విషయాన్ని చెబుతాయి.
పాక్ పర్యటనకు వైదిక్‌తో పాటూ వెళ్లినవారి పేర్లను సరిచూసుకోవాలని కూడా కనీసం కాంగ్రెస్‌కు పట్టకపోవడం విచిత్రం. అది ఆ పని చేసి ఉంటే... సల్మాన్ ఖుర్షీద్, మణిశంకర్ అయ్యర్ వంటి బడా కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారని గ్రహించి ఉండేదే. మోడీపైన అవిశ్రాంతంగా విమర్శలు గుప్పించినందుకు వారంతా కాంగ్రెస్ ప్రభుత్వంలో కోరుకున్న నియామాకాల అనుగ్రహాన్ని పొందినవారే. ఫ్రీ కిక్‌ని సెల్ఫ్ గోల్‌గా మార్చుకున్న ఆ పార్టీ దుస్థితిని ఇది కొంత వరకు తెలియజేస్తుంది.
మన్మోహన్ సింగ్ సోనియాగాంధీలు అధికారంలో ఉన్న దశాబ్ద కాలంలో భారత్-పాక్ సంబంధాలను ట్రాక్ 1. ట్రాక్ 2, ట్రాక్ 3 వంటి అట్టహాసపు పదాడంబరపు ముసుగులతో పనిచేసే సంస్థలకు అప్పగించేశారు. అది వారి అధికార కాలపు విషాదాలలో ఒకటి. శాంతి కపోతాలు పోటీలుపడి మరీ పెట్టిన అరుపుల్లో పడి ట్రాక్ 1 అదృశ్యమైపోయింది.
అది పాక్ ప్రభుత్వానికి అద్భుతంగా సరిపోయింది. ఉగ్రవాదం గురించి, ప్రత్యేకించి పాక్ సైన్యం. ఇంటెలిజెన్స్ సంస్థల్లోని తన మిత్రులతో కలిసి హఫీజ్ సయీద్ ముంబై ఉగ్ర దాడులను రచించి, నిర్వహించాడు. ఆ సమస్యపై బలమైన ప్రశ్నలకు వేటికీ సమాధానాలను చెప్పకుండానే ైద్వైపాక్షిక సంబంధాల్లోని సంఘర్షణను కొనసాగించడం పాక్ ప్రయోజనాలకు సరిపోయింది. మన జాతీయ ప్రయోజనాలను మంత్రివర్గ కమిటీల వంధిమాగధ స్తోత్రాలుగా నిర్వీర్యం చేసే ఈ క్రీడలో ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్ట పూర్వక భాగస్వామి అయింది.
కృత్రిమంగా సృష్టించిన అలాంటి వాతావరణంలో పాక్ తాను చూపదలుచుకున్న మొహాన్నే ప్రదర్శించగలిగింది. భారత సుహృద్భా వపరుల్లో ఎవరికీ తన రెండవ మొహంలో ఆసక్తి లేదని దానికి నమ్మకం కుదిరింది. దాని రెండవ మొహం మరింత హానికరమైనది, అంతకంటే అధ్వానమైనది. ఈశాంతి కపోతాల మధ్యవర్తులు ఉద్దేశపూర్వకంగానే లేదా అనుకోకుండానే పాక్‌లోని సామాజిక శక్తులలో సంభవిస్తున్న పెను మార్పులను గుర్తించలేదు.
పాక్‌లో హఫీజ్ సయీద్ ఎవరూ ముట్టుకోలేని వ్యక్తిగా ఎదగడానికి కారణం ప్రభుత్వం అతనికి రక్షణను కల్పిస్తుండటం మాత్రమే కాదు. రోజురోజుకూ పాక్‌లో సున్నీ ఇస్లామిక్ మతతత్వ మిలిటెన్సీ పెరుగుతూ హింసాత్మాకంగా ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తూ దేశాన్ని మతం పేరిట అరాచకంలోకి ఈడ్చుతోంది. భారత్ దాని లక్ష్యాలలో ఒకటి. పాక్ షియాల పాలిటి గోరీల దిబ్బగా మారింది. తమను తాము జిహాదీలుగా ప్రకటించుకున్న వారు తమ దృష్టికి భిన్నమైనదిగా కనిపించిన ఏ మత విశ్వాసం మీదకైనా ఆయుధాలను ఎక్కుపెట్టే బాపతు. పాకిస్థాన్ జాతిపిత మొహ్మద్ ఆలీ జిన్నా షియా కావడమే వైచిత్రి. కానీ నేడు ఆ విషయాన్ని మరీ గట్టిగా గుసగుసలాడరాదు. సున్నీ ఇస్లామిక్ మతతత్వవాదులు తదుపరి జిన్నా ఫోటోలపైకి తుపాకులు ఎక్కుపెట్టడం మొదలవుతుంది.
ఒక సంక్లిష్ట సమస్యపై అనుసరించిన దివాలాకోరు వైఖరి భారత్-పాక్ సంబంధాలను మూసుకుపోయే దారి చివరికి చేరుస్తుంది. అప్పుడిక ఎక్కడికి పోవాలో ఎవరికీ తెలీదు, నేడు మన సరిహద్దుల్లో స్వల్ప స్థాయి యుద్ధం సాగుతోంది. హఫీజ్ సయీద్ లాంటి వారు మన దేశంలో అంతర్గతంగా మరో కార్చిచ్చును రగల్చడానికి పథకాలు రచిస్తున్నారు.
భారత, పాక్ ప్రభుత్వాలు కఠోర వాస్తవాలతో కుస్తీలు పడుతున్నట్టు, నాట్యం చేస్తున్నట్టు నటించడం మానేయక తప్పదు. కుహనా దౌత్యం, అభూత కల్పనల అమ్మకాలు ఇప్పటికే చాలా నష్టం చేకూర్చాయి.
(వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) ఎంజే అక్బర్