సాక్షి, న్యూఢిల్లీ : ‘బహుత్ హువా నారి పర్ వార్ (మహిళలపై జరిగిన అత్యాచారాలు ఇక చాలు)’ 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ముఖ్య నినాదాల్లో ఒకటి. ఇప్పుడు 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధపడుతున్న బీజేపీని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి ఎంజె అక్బర్‌పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఎన్నికల నేపథ్యంలో ఈ ఆరోపణలన్నీ తనపై జరుగుతున్న రాజకీయ కుట్రగా అక్బర్ అభివర్ణించారు. పరువు నష్టం కేసు వేయాలని కూడా నిర్ణయించారు.
ఎంత హాస్యాస్పదం!
మీడియా మాజీ ఎడిటరైన అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఏకంగా 14 మంది మహిళలు. వారిలో 18 ఏళ్ల యువతి కూడా ఉంది. పైగా వారంతా జర్నలిస్టులు. ప్రియా రమాని, ఘజాల వాహబ్, సబా నక్వీ, మజ్లీ డే పుయ్ కాంప్, శుమా రహా, హరిందర్ బవేజా, శుతాప పాల్, సుపర్ణ శర్మ, అంజు భారతి, మాలిని భూప్తా, కాదంబరి వాడే, కనిక గహ్లాట్, రుత్ డేవిడ్, ప్రేరణ బింద్రా అక్బర్‌పై ఆరోపణలు చేశారు. వారిలో కొందరు తమపై లైంగిక దాడి జరిపినట్లు చెప్పగా, లైంగిక దాడులకు ప్రయత్నించినట్లు మిగతా వారు ఆరోపించారు. పేర్లను బట్టి చూస్తే వారంతా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారని తెలుస్తోంది. వారంతా కలిసి ఎలాంటి ప్రజా పలుకబడి పునాదులు లేకుండా రాజ్యసభ ద్వారా మంత్రి అయిన అక్బర్‌పై రాజకీయ కుట్ర పన్నుతారా? ఎంత హాస్యాస్పదం!
బీజేపీ నేతలు ఏమంటున్నారు?
ఎంజె అక్బర్‌పై వచ్చిన ఆరోణలపై బీజేపీ నేతలు పలు విధాలుగా స్పందించారు. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించాలని సుబ్రమణియన్ స్వామి అన్నారు. అది ఆయనకు, ఆరోపణలు చేసిన వారికి సంబంధించిన సమస్య, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి ఉమా భారతి వ్యాఖ్యానించారు. లైంగిక ఆరోపణలను చేస్తున్న మహిళలను లక్ష్యంగా పెట్టుకోరాదని, అయితే అక్బర్ గురించి మాట్లాడే స్థానంలో తాను లేనని మరో మహిళా కేంద్ర మంత్రి స్మతి ఇరానీ అన్నారు. లైంగిక ఆరోపణలు చేస్తున్న వారిని తాను నమ్ముతున్నానని, ప్రతి ఫిర్యాది వెనకనుండే బాధను, వ్యధను తాను అర్థం చేసుకోగలనంటూ కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ స్పందించారు. ‘మీటూ’ ఆరోపణలన్నింటిని విచారించేందుకు సీనియర్ జుడీషియల్, లీగల్ వ్యక్తులతోని ఓ కమిటీ వేయాలని తాను ప్రతిపాదిస్తున్నట్లు ఆమె చెప్పారు. (చదవండి : మీటూ సంచలనం : ఎంజే అక్బర్‌పై లైంగిక ఆరోపణలు)
మరోసారి వేధించే అవకాశం ఉంది!
అయితే లైంగిక ఆరోపణలు చేసిన మహిళల సమ్మతి ఉన్న కేసుల్లోనే విచారణ జరపాలని రుత్ మనోరమా, అమ్మూ జోసఫ్, గీత లాంటి మహిళా సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు. ఎప్పుడో జరిగిన ఇలాంటి సంఘటలనకు సంబంధించి సరైన ఆధారాలు లభించక పోవచ్చని అలాంటి సందర్భాల్లో విచారణ నుంచి బయటపడే మగవాళ్లు ఫిర్యాదుదారులను వేధించే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి విచారణ కమిటీలకన్నా మహిళల హక్కులను గౌరవించేలా మగవాళ్ల మనస్తత్వాన్ని మార్చే వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా ‘బేటీ బచావో బేటీ పడావో’ నినాదంతోపాటు మహిళలపై జరగుతున్న అన్యాయాలను ఏ నాగరిక ప్రపంచం సహించదంటూ పదే పదే మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గం నుంచి అక్బర్‌ను తొలగించక పోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో?!
Comments
Please login to add a commentAdd a comment