
న్యూఢిల్లీ: జర్నలిస్ట్ ప్రియా రమణి తనపై చేసిన ట్వీట్లు, కథనాలు పని ప్రదేశంలో మహిళలపై జరిగే లైంగిక వేధింపుల సమస్యపై దృష్టి సారించడానికి ఉద్దేశించినవిగా పేర్కొనడం తప్పని కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ అన్నారు. ప్రియా రమణిపై దాఖలు చేసిన పరువునష్టం కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం శనివారం అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రియా రమణిని లక్ష్యంగా చేసుకొని తాను పరువునష్టం కేసు వేయలేదని పేర్కొన్నారు. ఈ కేసులో ఏప్రిల్ 10న కోర్టు విచారణకు హాజరైన ప్రియ రమణి తాను చేసిన ఆరోపణలు సరైనవే అన్నట్లు, ఎటువంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదన్నారు.
మీటూ ఉద్యమం సందర్భంగా ఎంజే అక్బర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన మొదటి మహిళ ప్రియా రమణి. వేధింపులకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణల కారణంగా.. 2018, అక్టోబర్ 17న కేంద్ర మంత్రి పదవికి అక్బర్ రాజీనామా చేయవలసి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment