
సిడ్నీ: పార్లమెంట్ భవనం సాక్షిగా తనపై లైంగిక వేధింపులు జరిగాయని ఆస్ట్రేలియా మహిళా ఎంపీ లిడియా థోర్ప్ గురువారం సంచలన ఆరోపణలు చేశారు. మహిళలు పనిచేసేందుకు పార్లమెంట్ సురక్షితమైన చోటు కాదని పేర్కొన్నారు. పలుకుబడి కలిగిన ఒక నేత తనపట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ, తాకరాని చోట తాకుతూ కోరిక తీర్చాలంటూ వేధించేవారంటూ లిబరల్ పార్టీ ఎంపీ డేవిడ్ వాన్ పేరును ఆమె పార్లమెంట్‌లో ప్రస్తావించారు. బుధవారం పార్లమెంట్‌లో ఇవే ఆరోపణలను థోర్ప్ చేయగా డేవిడ్ వాన్ ఖండించారు.
థోర్ప్ ఆరోపణలతో షాక్‌కు గురయ్యాయనని, అవి పూర్తిగా అవాస్తవమని మీడియాతో అన్నారు. పార్లమెంట్ ఆంక్షలు విధిస్తుందనే భయంతో వాటిని వెనక్కి తీసుకుంటున్న ప్రకటించారు. గురువారం థోర్ప్ ఇవే ఆరోపణలు మరోసారి చేశారు. ‘పార్లమెంట్ భవనంలోని నా ఆఫీసు నుంచి బయటకు ఒంటరిగా రావాలంటేనే భయమేసేది. తోడుగా ఒకరిని వెంటబెట్టుకుని భవనంలో తిరిగేదాన్ని. ఇలాంటి అనుభవాలను చాలామందే ఎదుర్కొన్నా. తమ కెరీర్‌పై ప్రభావం పడుతుందనే ఎవరూ బయటకు రావడం లేదు’అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ ఆరోపణలతో వాన్‌ను లిబరల్ పార్టీ సస్పెండ్ చేసింది. 2019 మార్చిలో బ్రిటనీ హిగ్గిన్స్ అనే పార్టీ కార్యకర్తపై తోటి కార్యకర్త పార్లమెంట్ కార్యాలయం గదిలోనే అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ ఘటనపై విచారణ ఇప్పటికీ ముందుకు పడలేదు. దీనిపై బుధవారం ఎంపీ వాన్ ఖండిస్తూ ప్రసంగిస్తుండగానే స్వతంత్ర ఎంపీ లిడియా థోర్ప్ అడ్డుతగులుతూ ఆయనపై ఆరోపణలు చేశారు. ఆస్ట్రేలియా పార్లమెంట్ మహిళా సభ్యుల్లోని 63 శాతం మంది ఏదో ఒక విధమైన వేధింపులకు గురవుతున్నారంటూ ప్రభుత్వం నియమించిన కమిటీ తేల్చడం గమనార్హం.