
న్యూఢిల్లీ: దశలవారీగా పాఠశాలలు తెరచేందుకు సమయం వచ్చిందని ఎయిమ్స్ డైరెక్టర్ డా. రన్‌దీప్ గులేరియా చెప్పారు. దేశంలోని పిల్లల్లో సరిపడా రోగ నిరోధకశక్తి ఉందని ఆయన పేర్కొన్నారు. కరోనా కేసుల పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువగా ఉన్న జిల్లాల్లో పాఠశాలలు తెరచు కోవచ్చని తెలిపారు. ఒక వేళ కేసులు పెరుగుతున్న ధోరణి కనిపిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకొని పాఠశాలలను మూసివేయవచ్చని పేర్కొన్నారు. పాఠశాలలను రోజుమార్చి రోజు పెట్టడం, దశలవారీగా తెరవడం వంటి ఐచ్ఛికాలను ఆయా జిల్లాలు ఆలోచించవచ్చని అభిప్రాయపడ్డారు.
విద్యార్థి అన్ని విధాలుగా అభివృద్ధి చెందడం ముఖ్యమని, అందుకు పాఠశాల బాగా ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. అంతేగాక సమాజిక అంతరాల వల్ల వర్చువల్ తరగతులను అందరు విధ్యార్థులు సమానంగా పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి విభాగమైన యూనిసెఫ్ కూడా ప్రకటించిందని గుర్తు చేశారు. భారత్‌లో ఇప్పటికే ఉన్న పలు వైరస్‌ల కారణంగా పిల్లల్లో రోగనిరోధక శక్తి సహజంగా పెరిగిందని చెప్పారు.
థర్డ్ వేవ్ పిల్లలపై ప్రతాపం చూపే అవకాశాలు తక్కువేనని స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధలను పాటిస్తూ పిల్లలను స్కూలు వైపు నడిపించాలని అభిప్రాయపడ్డారు. పిల్లలకోసం తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ కోవాగ్జిన్ ప్రాథమిక సమాచారం ఆశాజనకంగా ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment