సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో వస్తే పాఠశాలలు పునఃప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుందని ఆయన తెలిపారు. లేదంటే కోవిడ్ స్వల్ప లక్షణాలు లేక లక్షణాలు లేని పిల్లలు క్యారియర్లుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడటానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని గులేరియా చెప్పారు.
కరోనా వైరస్ ఇప్పటి వరకు పిల్లలను పెద్దగా ప్రభావితం చేయకపోయినా, రాబోయే రోజుల్లో ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ప్రభుత్వాలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవటానికి సిద్దంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. 2 నుంచి 18 ఏళ్ల లోపు వయస్సు వారి కోసం భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ వ్యాక్సిన్.. రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ డేటా సెప్టెంబర్ నాటికి అందుబాటులో వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
కొవాగ్జిన్ కన్నా ముందు ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులో వచ్చే అవకాశముందని అది కూడా పిల్లలకు మేలు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యవసర వినియోగానికి జైడస్ క్యాడిలా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి దరఖాస్తు చేయనుందనే వార్తల నేపథ్యంలో గులేరియా స్పందించారు. జైడస్ క్యాడిలా మరొక ఆప్షన్‌గా ఆయన అభివర్ణించారు.
చదవండి: కోడలిపై పోలీస్ మామ అత్యాచారం..
Comments
Please login to add a commentAdd a comment