
పత్రికలను పణంగా పెట్టకండి!
వార్తా పత్రికలకు ఎక్కడైనా, ఎప్పుడైనా యజమానులు, ప్రచురణకర్తల మధ్య పోటీ ఉంటుంది. అయితే ఈ పోటీ అంతా యజమానుల పరువు, మర్యాదలకు భంగం కలగనంతవరకే!
‘‘వార్తా పత్రికలకు ఎక్కడైనా, ఎప్పుడైనా యజమానులు, ప్ర చురణకర్తలు సంపన్నులే. ఒకే గూటి పక్షులు వారంతా. వారి మధ్య పోటీ ఉండదని కాదు, ఉంటుంది. సర్క్యులేషన్ పెంచు కోవడం కోసం, వార్తా కథనాల కోసం, విశేష కథనాల కోసం వారి మధ్య కర్కశమైనపోటీ ఎప్పుడూ ఉండేదే. అయితే ఈ పోటీ అంతా యజమా నుల పరువు, మర్యాదలకు భంగం కలగనంతవరకే! భంగం కలిగితే కథ కంచికే’’.
ఈ మాట ఏదో కొటేషన్ల పుస్తకం నుంచి సంగ్రహిం చింది కాదు. సత్యం కొటేషన్ల సంకలనంలోకన్నా కాల్పనిక సాహిత్యంలోనే తరచు దర్శనమిస్తుందని చెప్పేందుకు ఈ ఉల్లేఖన ఒక ఉదాహరణ. బుద్ధి సూదంటురాయి అయినా నలిగిన దుస్తులు, మాసిన గడ్డంతో కనిపించే ప్రైవేట్ డిటెక్టివ్ ఫిలిప్ మార్లో పాత్ర సృష్టికర్త, ఆధునిక నవలా సాహిత్యంలో అందె వేసిన చేయి రేమండ్ చాండ్లర్ తన ఒకానొక నవలలో పలికించిన పలుకులవి. లాస్ ఏంజెలిస్‌లో 1950 ప్రాంతంలో సంపదకు, నేరానికి మధ్య అలుముకున్న నీడలలో ప్రత్యక్షంగా జీవించిన రచయిత చాండ్లర్, అతని పాత్ర మార్లో. ప్రత్యక్షంగా చూసినంత మాత్రాన చూసింది చూసినట్లు ఆసాంతం చెప్పేస్తే మొద టికే మోసమని అతనికి తెలుసు. అధికప్రసంగం కూడదని సైతం తెలుసు. తెలిసినా తెగించాడు. సత్యం పలికాడు.
20వ శతాబ్దం నడిమధ్య కాలంలో వార్తాపత్రికలు సంపన్నులను మరింత సంపన్నులను చేశాయి. రాజకీయ పలుకుబడి, అడ్వర్‌టైజింగ్ రంగంలో గుత్తాధిపత్యం కల గలిస్తే సంభవించిన పరిణామం ఇది. 1930ల్లో బ్రిటిష్ ప్రధానమంత్రి వార్తాపత్రికల్ని రాజవేశ్యతో పోల్చాడు. రాజవేశ్య మాదిరే పత్రికలు కూడా బాధ్యత లేకుండా అధి కారాన్ని చలాయిస్తున్నాయని చెప్పడం ఇక్కడ ఆయన ఉద్దే శం. అయితే బ్రిటిష్ ప్రధాని పలుకులు ఉభయ తారకంగా ఉన్నాయనేది గమనార్హం. పత్రికా యజమానులు తమ డ్రాయింగ్ రూంలో సోఫాలో సుఖాసీనులై ప్రధానులకు సలహాలు ఇవ్వడం పరిపాటి. కానీ విశేషం ఏమిటంటే పత్రికాధిపతులను ప్రధానులే స్వయంగా తమ పడక గదు లలోకి ఆహ్వానిస్తుంటారు. అది అలావుంటే పత్రికలు మాధ్యమంగా డబ్బు అధికారాన్ని అన్నివేళలా వెంటాడిం దనేది నిజం. ప్రతి ప్రజాస్వామ్యం ఇందుకు ఇష్టపూర్తిగా అవకాశం కల్పించిందంటే అతిశయోక్తి కాదు.
సంధిదశ అన్ని పరిశ్రమల మాదిరే వార్తారంగ పరిశ్ర మను కూడా అస్థిరం పాలుచేస్తున్నది. పత్రికలు చేతులు మారుతున్న ఫలితంగా కొన్ని పత్రికల యజమానులు బికారులుగా మారిపోతున్నారు. ఇందుకు తాజా నిదర్శ నం ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రికను దాని యాజమాన్యం గ్రాహం కుటుంబం అమెజాన్ యజమాని జెఫ్ బెజోస్‌కు అయినకాడికి అమ్మివేయడం. చాలా మంది భావిస్తున్నట్లు వార్తలకు మార్కెట్‌లో కాలం చెల్లలేదు. ఆ అభిప్రాయానికి ఈ చేతులు మారే ప్రక్రియ ఎంతమాత్రం సూచన కాదు. ఫలానా పత్రిక మార్కెట్ నుంచి తప్పుకుంటున్నదని మాత్రమే దానర్థం. ‘పోస్ట్’ను బెజోస్ ప్యాంటు జేబు అడు గున మిగిలి ఉన్న చిల్లరతో కొన్నాడని చెప్పవచ్చు. పత్రి కను హక్కుభుక్తం చేసుకున్నాక బెజోస్ చిరిగిన జీన్ ప్యాం టు ధరించే దశ నుంచి కోట్లకు పడగెత్తాడు. సమాచారాన్ని వాణిజ్య సరకుగా మలచడం ఎలాగో అతనికి తెలుసు. వార్తాపత్రికలు కాలానుగుణంగా తరచు తమ రూపురేఖ లను మార్చుకోకతప్పదు. కాలం విధించే డిమాండ్‌కు తల వంచి ఈ మార్పులు జరిగినా, సమాచార సాధనాలుగా వాటి ప్రాధాన్యం ఇసుమంతైనా తగ్గలేదు. తగ్గదు కూడా.
వార్తాపత్రిక అనేది ఇద్దరు డ్రైవర్లు ఉన్న కారు లాం టిది. పత్రిక యజమాని ప్రచురణకర్త వేషంలో పాత్రికే యుడి ఆవరణలోకి చొరబడుతుంటాడు. పత్రికా సంపాద కులేమో తమకు స్వతంత్రం ఉందని భావిస్తూ సంతోషప డుతుంటారు. పత్రికలో వాటాదారు ప్రయోజనాన్ని పణం గాపెట్టే శక్తిమంతుడైన సంపాదకుడు అరుదుగా తారస పడవచ్చు. కానీ అది ఒక మినహాయింపు మాత్రమే. సంపాదకుడు తీసుకునే నిర్ణయాలు ఏవీ స్వతంత్రం కావు. ప్రచురణకర్తతో సంప్రదించి కలిసికట్టుగా తీసుకునే నిర్ణ యాలే అవి. ‘వాటర్ గేట్’ కుంభకోణాన్ని వెలికి తెచ్చిన వరుస కథనాల ద్వారా పత్రికారంగ చరిత్రలో సుస్థిర స్థానం సాధించిన ‘వాషింగ్టన్ పోస్ట్’, ప్రజలు ఎన్నికల్లో గెలిపించి రెండోసారి వైట్‌హౌస్‌కు పంపించిన అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్‌ను గద్దె దింపిన సంగతి తెలిసిందే. ‘వాటర్‌గేట్’పై పరిశోధన చేయాలనే విధాన నిర్ణయాన్ని పత్రికాధిపతి కేథరిన్ గ్రాహం, సంపాదకుడు బెన్ బ్రాడ్లీ సమష్టిగా తీసుకున్నారనేది ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
‘పోస్ట్’ను కొనుగోలు చేసిన బెజోస్ తెలివైనవాడు. ‘వాటర్‌గేట్’ కుంభకోణాన్ని వెలికితేవడంలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టుల్లో ఒకడైన బాబ్ ఉడ్‌వర్డ్‌ను ఆయన పత్రికకు మేనేజింగ్ ఎడిటర్‌గా నియమించాడు. పత్రిక ప్రాణం యాజమాన్యం చేతుల్లో ఉండదు, దాని విశ్వసనీ యతలో ఉంటుంది. విశ్వసనీయత కొరవడినప్పుడు పత్రిక చేపముక్కలు లేదా చిప్స్‌ను పొట్లంకట్టే కాగితం కిందో, మురికిని తుడిచే మసిగుడ్డ కిందో మారుతుంది. విశ్వసనీయత ఉన్న జర్నలిస్టులు లేకుండా పత్రికల ప్రచు రణకర్తలకు మనుగడ ఉండదు.
మరి ప్రచురణకర్తలు లేకుండా పాత్రికేయులకు మనుగడ ఉందా? లేదు. ఎందుకంటే జర్నలిస్టులు ఎం తటి జ్ఞానులైనా వ్యాపారం ఒక్కటి మాత్రం వారికి చేత కాదు. వార్తాపత్రిక పరిశ్రమ కూడా ఒక పరిశ్రమే. భారత దేశపు అతి పురాతన పత్రికా సంస్థ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ యాజమాన్యానికి, ఇటీవలి టీవీ ప్రసిద్ధసంస్థ ‘జీ’ యాజ మాన్యానికి లాభాలపై ఆరోగ్యప్రదమైన దృష్టి ఉండటం కాకతాళీయం కాదు. వార్తాసంస్థ పునాదులు దృఢంగా ఉండకుండా పత్రికగానీ టీవీగానీ ప్రభుత్య వ్యతిరేక వైఖరి అవలంబించడం కుదరదనే నిజాన్ని పాత్రికేయులు అంగీ కరించి తీరాలనే అవగాహన ఈ రెండు సంస్థల యాజమా న్యాలకు ఉంది. దేశాన్ని పాలిస్తున్న కుటుంబానికి బాధకలి గించే వార్తా కథనాలను నీళ్లు నమలకుండా ప్రచురించే ధైర్యం పాత్రికేయులకు ఉండాలంటే ఇది తప్పనిసరి.
విశ్వసనీయతతో పాటు చాలినంత నగదు ముఖ్య మనే సంగతిని విస్మరిస్తే ఎంతటి పత్రికాసంస్థ అయినా మనజాలదు. ఈ ప్రాథమిక సూత్రాన్ని మరచిపోయిన వార్తాసంస్థల జాబితా మన దేశంలో దినదినం పెరిగిపో తున్నది. పేరుమోసిన సంస్థలు ఎన్నో పల్చటి తెరల వెను క కూలిపోతున్నాయి. సంస్థలు బీటలు వారుతున్న వైనా న్ని దాచిపెట్టడానికిగాను పైపూతలతో చేసే విఫలయ త్నమే వాటాల, నియంత్రణ బదిలీ. హఠాత్తుగా చరమ దశకు చేరేదాకా అసలు సంగతి బయటి వారికి బోధ పడదు. చివరకు మిగిలేది నాలుకపై ‘చేదు’ మాత్రమే. ‘వాషింగ్టన్ పోస్ట్’ విషయంలో జరిగిందిదే.
అమెరికాలోనైనా, ఇండియాలోనైనా వార్తాసంస్థల యజమానులు బతికి బట్టకట్టకపోవచ్చు కానీ, ప్రచార, ప్రసారసాధనాలు మాత్రం బతికిబట్టకడతాయి. ఏదైతే అర్థవంతమో, అప్రస్తుతం కాదో... దాని సారాంశమే తప్ప, అనునిత్యం జరుగుతూ అందరి దృష్టిని ఆకట్టుకునే సంఘటనల సమాహారం కాదు సమాచారం. అయితే నిరాశావాది రేమండ్ చాండ్లర్ ఘాటుగా చెప్పినట్లుగా యాజమాన్యాల స్వప్రయోజనాలు ఎప్పుడూ ఉండనే ఉం టాయి. వార్తాసంస్థల యజమానులు ఒక సంగతి గ్రహిం చాలి. వారెంతటి కుబేరులైనా తమ పత్రిక అస్తిత్వాన్ని అప్పుడప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలకు కొంత మేర దెబ్బతీస్తే పరవాలేదు కానీ, దానికి నష్టం కలిగించకూ డదు. లేజర్ కత్తుల్లా పనికొచ్చే వార్తాపత్రికలపై తమ ఆధి పత్యం నిరాఘాటంగా కొనసాగాలంటే ఇది తప్పనిసరి.
మంచి వార్తా పత్రిక యజమాని బంగారు గుడ్లు పెట్టే బాతును బాగా సాకాలి. చివరి విందులో వడ్డించే వంట కాలలో దాన్ని చేర్చకూడదు!
-ఎం.జె.అక్బర్, సీనియర్ సంపాదకులు