ఎంజే అక్బర్ , అలోక్‌నాథ్
న్యూఢిల్లీ: సినీ రంగాన్ని కుదిపేస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు రాజకీయాల్ని చుట్టుముట్టాయి. కేంద్ర మంత్రి, మాజీ పత్రికా సంపాదకుడు ఎంజే అక్బర్ రాజకీయాల్లోకి రాకముందు జర్నలిస్టుగా పనిచేస్తున్న సమయంలో తమని వేధించారని ముగ్గురు మహిళా జర్నలిస్టులు సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు గుప్పించారు. మరోవైపు, కేరళ ఎమ్మెల్యే(సీపీఎం), మాజీ నటుడు ముకేశ్ 1999లో ఓ షూటింగ్‌లో తనని వేధించారని బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్ ఆరోపించారు.
ప్రముఖ రచయిత, నిర్మాత వింతా నందా..నటుడు అలోక్‌నాథ్ 19 ఏళ్ల క్రితం తనను రేప్ చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. వెంటనే స్పందించిన సినీ ఆర్టిస్ట్స్ అండ్ టీవీ అసోసియేషన్(సింటా)..అలోక్‌నాథ్‌కు షోకాజ్ నోటీసులు పంపుతామని తెలిపింది. మీడియా రంగంలో లైంగిక వేధింపుల ఆరోపణలు వరుసగా వెలుగుచూస్తున్న నేపథ్యంలో ఎడిటర్స్ గిల్డ్..బాధితురాళ్లకు అండగా నిలిచింది. అన్ని ఆరోపణల్లో నిష్పాక్షిక విచారణ చేపట్టాలని మీడియా సంస్థలకు సూచించింది. రంగంలోకి దిగిన జాతీయ మహిళా కమిషన్.. లైంగిక వేధింపుల ఆరోపణలపై సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమైంది.
అక్బర్...ఓ ప్రిడేటర్
బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలతో మొదలైన ‘మీటూ’ తరహా ఉద్యమం తీవ్రమైంది. అక్బర్ తమని లైంగికంగా వేధించారని ఆయన మాజీ సహచర ఉద్యోగులు ప్రియా రమణి, ప్రేరణాసింగ్ బింద్రా, పేరు తెలియని మరో మహిళా జర్నలిస్టు ఆరోపించారు. ఫస్ట్‌పోస్ట్ అనే వెబ్‌పోర్టల్‌లో రమణి, పేరు తెలియని రచయిత అక్బర్‌ను ఉద్దేశించి పెట్టిన పోస్టుల ఆధారంగా ది టెలిగ్రాఫ్ కథనం ప్రచురించింది. ది టెలిగ్రాఫ్‌కు అక్బర్ వ్యవస్థాపక సంపాదకుడు. 2017లో వోగ్ మేగజీన్‌కు రాసిన ఓ వ్యాసంలోని విషయాలను రమణి ట్వీట్ చేశారు. ఈ వ్యాసంలో అక్బర్‌ను ఆమె ప్రిడేటర్ అని సంబోధిస్తూ..ఆయన ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోలేదని పేర్కొన్నారు.
ఎడిషన్ పూర్తయ్యాక హోటల్‌కు పిలిచారు
రాత్రి ఎడిషన్ ముగిశాక పని గురించి చర్చించడానికి అక్బర్ హోటల్ గదికి పిలిచారని బింద్రా ట్వీట్ చేశారు. అందుకు నిరాకరించినందుకు నరకం చూపాడని ఆరోపించారు. ‘తప్పుడు ఆరోపణల ఫలితాలు ఏంటో నాకు తెలుసు. నేను వేధింపులు భరించి 17 ఏళ్లు గడిచాయి. వాటిని నిరూపించేందుకు ప్రస్తుతం ఆధారాలు లేవు. గొప్పవాళ్లలో లోపాలుంటాయి. ఫీచర్ బృందం మొత్తం సమావేశమైనప్పుడు అక్బర్ బూతు వ్యాఖ్యలు చేశారు.
హోటల్ గదిలో కలవాలని ఆ బృందంలోని వారిని కూడా కోరినట్లు సహచరిణి ఒకరు నాతో అన్నారు. మహారాష్ట్ర సచివాలయంపై వార్తను రాయడానికి వెళ్లినప్పుడు ఓ అధికారి నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఎవరికి ఫిర్యాదుచేయాలో నాకప్పుడు అర్థం కాలేదు. నా ఎడిటర్(అక్బర్) కూ డా అలాంటి వాడే కదా!’ అని ఆమె వాపోయారు. అక్బర్‌పై వచ్చిన ఆరోపణలపై స్పందిచేందుకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నిరాకరించారు.
ఈ వ్యవహారంలో విచారణ చేపడతారా అని విలేకర్లు ప్రశ్నించగా, సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. అక్బర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మౌనం సమాధానం కాదని, ప్రధాని మోదీ, సుష్మా స్వరాజ్ నోరు విప్పాలని కోరింది. ది టెలిగ్రాఫ్, సన్‌డే, ది సండే గార్డియన్, ఏషియన్ ఏజ్, దక్కన్ క్రానికల్ పత్రికలకు అక్బర్ ఎడిటర్‌గా పనిచేశారు.
నా గదినే మార్చేశాడు
1999లో ఓ కార్యక్రమ షూటింగ్ సమయంలో అప్పటి నటుడు, ప్రస్తుత ఎమ్మెల్యే ముకేశ్ తనను వేధించారని బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్ టెస్ జోసెఫ్ ఆరోపించారు. అసలు ఆ కార్యక్రమ షూటింగ్ గురించే తనకు గుర్తులేదని ముకేశ్ కొట్టిపారేశారు. క్విజ్ ప్రోగ్రాం ‘కోటీశ్వర్’ చిత్రీకరణ సమయంలో ముకేశ్..తనను అతని గదికి పిలిపించుకున్నాడని, తరువాత తన గదిని ఆయన గది పక్కకు మార్చారని ట్వీట్ చేశారు.
నాటకం వేస్తుండగా అనుచిత ప్రవర్తన
2001లో ఓ నాటకం వేసేటపుడు ప్రముఖ పాటల రచయిత వరుణ్ గ్రోవర్ తనతో తప్పుగా ప్రవర్తించినట్లు బెనారస్ హిందూ వర్సిటీకి చెందిన పూర్వ విద్యార్థిని ఒకరు ఆరోపించారు. ఆమె మాటలను గ్రోవర్ తోసిపుచ్చారు.
కు‘సంస్కారి’ అలోక్‌నాథ్
సంస్కారవంతమైన పాత్రల్లో నటించే అలోక్‌నాథ్ రెండు దశాబ్దాల క్రితం తనను పలుమార్లు రేప్ చేశాడని ప్రముఖ రచయిత్రి, ‘తారా’ ఫేమ్ వింతా నందా ఆరోపించారు. ఓసారి నందా ఇంటికి పార్టీకి వెళ్లగా మద్యం తాగించి బలాత్కారానికి ఒడిగట్టాడని పేర్కొన్నారు.
‘సాయంత్రం నేను తాగిన పానీయంలో ఏదో మత్తు మందు కలిపారు. రాత్రి 2 తరువాత ఇంటికి బయల్దేరుతుండగా మధ్యలో అలోక్‌నాథ్ వచ్చి తన కారులో ఎక్కించుకున్నారు. ఆ తరువాత మరింత మద్యం తాగించి రేప్ చేశాడు. తెల్లారి లేచేసరికి చాలా నొప్పిగా అనిపిం చింది. ఈ సంగతిని నా స్నేహితులకు చెబితే మౌనంగా ఉండమన్నారు. అలోక్‌నాథ్ తన పలుకుబడితో నన్ను భయపెట్టి, తరువాతా పలుమార్లు వేధించారు’ అని వింతా నందా తాను అనుభవించిన క్షోభను వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment