women Journalists
-
ఇరాన్లో మహిళా జర్నలిస్టులకు ఏడేళ్ల జైలు
దుబాయ్: ఇద్దరు మహిళా జర్నలిస్టులకు ఇరాన్ ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. గతేడాది ఇరానీ మహిళ మహసా అమినీ కస్టడీ మరణం పెను సంచలనం సృష్టించడం, దాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడం తెలిసిందే. ఆ కస్టడీ మరణంపై రిపోరి్టంగ్ చేసినందుకు సదరు మహిళా జర్నలిస్టులు ఆలాహే మొహమ్మది (36), నిలోఫర్ హమెదీ (31)లను దోషులుగా న్యాయ శాఖ నిర్ధారించింది. అలాహేకు ఆరు సంవత్సరాలు, హమెదీకి ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడింది. వారిద్దరూ 2022 సెపె్టంబర్ నుంచీ టెహ్రాన్‌లోని ఎవిన్ జైలులో మగ్గిపోతున్నారు. గత మే నెలలో వారిపై విచారణ మొదలైంది. తాజా తీర్పుపై వారు అప్పీల్‌కు వెళ్లేందుకు అవకాశం కలి్పంచామని న్యాయ శాఖ పేర్కొంది. -
అక్రిడేషన్ లేని మహిళా జర్నలిస్టులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: అక్రిడేషన్ లేని మహిళా జర్నలిస్టులందరికీ మాస్టర్ హెల్త్ చెకప్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచార, పౌర సంబంధాల కమిషనర్ అర్వింద్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఇచ్చిన ఆదేశాల మేరకు మహిళా జర్నలిస్టులకు ఈ మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం.. మాసాబ్ ట్యాంక్‌లోని సమాచార, పౌర సంబంధాల కార్యాలయంలో ప్రారంభించిన విషయం విదితమే. శ్రీరామ నవమి సందర్బంగా గురువారం సెలవు దినం కారణంగా ఈ హెల్త్ చెకప్ పరీక్షలు నిర్వహించలేదని, రేపు(శుక్రవారం) నుండి తిరిగి యథావిధిగా ఈ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు (ఏప్రిల్ 3 వతేదీ ఆదివారం మినహా) నిర్వహించే ఈ మాస్టర్ హెల్త్ చెకప్‌లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన అక్రిడిటేటెడ్ మహిళా జర్నలిస్టులతో పాటు, పత్రికా, న్యూస్ ఛానెళ్లలో పనిచేస్తూ ఆర్గనైజేషన్ గుర్తింపు కార్డులు ఉన్న మహిళా జర్నలిస్టులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని అరవింద్ కుమార్ స్పష్టం చేశారు. చదవండి: నీరసంగా అనిపిస్తోందా..? ఇవి లాగించండి, తక్షణమే శక్తి వస్తుంది..! ఉదయం 7.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు నిర్వహించే ఈ మాస్టర్ హెల్త్ చెకప్‌లో రక్త పరీక్ష (C.B.P), బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, విటమిన్ B12, D3 మొదలైనవి, ECG, ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్ స్మెర్ వంటి రోగనిర్ధారణ పరీక్షలు ఉంటాయి. స్క్రీనింగ్ పరీక్షలు, మెడికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్, ఐ స్క్రీనింగ్, డెంటల్ పరీక్షలు, గైనకాలజీ పరీక్షలు మొదలైనవి ఉంటాయని. ఈ పరీక్షల నివేదికలను అదే రోజున అందజేయనున్నట్టు అర్వింద్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
మహిళాజర్నలిస్టుల కోసం స్పెషల్ యాక్సిలేటరీ ప్రోగ్రాం
ఖైరతాబాద్: మహిళాజర్నలిస్టులను మరింత ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున వి హబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక యాక్సిలేటరీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి కె.తారకరామారావు తెలిపారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మంగళవారం నెక్లెస్ రోడ్డు పీపుల్స్‌ప్లాజాలో మహిళాజర్నలిస్టులను మంత్రి కేటీఆర్, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి సన్మానించారు. కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా జర్నలిస్టులకు మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. మంత్రులు జగదీష్ రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ మహిళా జర్నలిస్టులతో కలిసి మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మహిళా జర్నలిజం అంటే కత్తిమీద సాములాంటిది. అలాంటి వారిని ఈ సందర్భంగా సన్మానించుకోవడం సంతోషంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఎల్రక్టానిక్, ప్రింట్ మీడియాలతో పాటు డిజిటల్ మీడియాలో రాణిస్తున్న మహిళా జర్నలిస్టులను ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరి, మున్సిఫల్ అడ్మిని్రస్టేషన్ అరవింద్ కుమార్, చీఫ్ విఫ్ బాల్కసుమన్, ఎమ్మెల్యే చందర్లతో పాటు అధికారులు పాల్గొన్నారు. కాగా ఈ సందర్భంగా సాక్షి టీవీ తరపున పద్మావతి, సుస్మిత, కావేరి, సాక్షి దినపత్రిక నుంచి కట్ట కవిత, డి.జి.భవానీ, వి.మంజుల, జి.నిర్మల, ఎస్.సరస్వతి రమలను సన్మానించారు. -
మహిళా జర్నలిస్టులపై ‘టెక్ ఫాక్స్’ వేధింపులపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న వేధింపులు దాడిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తమ గళం వినిపించిన మహిళా జర్నలిస్టులపై ‘టెక్ ఫాక్స్’ద్వారా వేధింపులకు పాల్పడుతున్నారని, ఇది ఎవరో తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా బీజేపీపై విమర్శలు చేశారు. రాణా, స్వాతి లాంటి ప్రముఖ జర్నలిస్టులకు వ్యతిరేకంగా లక్షల కొద్దీ ట్వీట్స్ చేసి వేధింపులకు పాల్పడ్డారంటూ కొన్ని గణాంకాలను సభాముఖంగా చదివి వినిపించారు. ప్రశ్నించేవారిని అణచి వేసే ధోరణి దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.. ఈ సందర్భంగా ముఖ్య అతిధులుగా వచ్చిన సీనియర్ జర్నలిస్టులు ధన్యా రాజేంద్రన్ (న్యూస్ మినిట్), మాలిని సుబ్రహ్మణ్యంకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టుల కోసం నిర్వహిస్తున్న రెండు రోజుల వర్క్‌షాప్ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జర్నలిస్టులు ‘కోర్’ విలువలు పాటించాలని . బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టుల కోసం నిర్వహిస్తున్న రెండు రోజుల వర్క్‌షాప్ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యూస్ రాసే జర్నలిస్టులు కోర్ (క్రెడిబిలిటీ, ఆబ్జెక్టివిటీ, రెస్పాన్సిబిలిటీ,ఎథిక్స్) విలువలను పాటించడం ద్వారానే వార్తకు సంపూర్ణత చేకూరుతుందని, సమాజంలోవారికి గౌరవం పెరుగుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మనం తక్కువోల్లం కాదు.. సానా గొప్పోల్లం ఇంతమంది జర్నలిస్టులు ఒక్క చోటికి రావడం అద్భుతం. ఏ రంగమైనా మహిళలకు ఇబ్బందులు తప్పవు. అయినా ఏ మాత్రం వెరవకుండా నిబద్ధతగా ఉండాలన్నారు. మగవారి కన్న మనం 100 శాతం ఎ క్కువ శ్రమ చేయాల్సిందే అన్నారు. మనం తక్కువోల్లం కాదు..సానా గొప్పోల్లం..ఇదే స్ఫూర్తితో పట్టుదలగా విధి నిర్వహణలో సెన్సిటివిటీగా ఉండాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి కొత్తగా నిర్మాణమవుతున్న సెక్రటేరియట్లో మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గదిని కేటాయించేలా కృషి చేస్తానని కవిత హామీనిచ్చారు. అలాగే సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌తో మాట్లాడి మీడియా సంస్థల్లో మహిళలపై వేధింపులు, వివక్షను నిరోధించే కమిటీలు వేయించేందుకు ప్రయత్నిస్తా అన్నారు. అంతేకాదు జర్నలిస్టులకు సంబంధించిన కమిటీలలో ఆడవారి ప్రాతినిధ్యం లేదని అర్థమవుతోందని, ఇకపై వారి ప్రాతినిధ్యం ఉండేలా జాగ్రత్తపడాలని అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణకు సూచించారు. ఏప్రిల్ 23, 24 తేదీల్లో ఈ వర్క్‌షాప్‌లో ముగింపు సమావేశంలో విద్యావేత్త, ఎమ్మెల్సీ వాణీదేవి మాట్లాడుతూ జనాన్ని జాగృతం చేయగలిగే సత్తా ఒక్క జర్నలిస్టులకే ఉందని, ఆ వైపుగా మహిళా జర్నలిస్టులు చేస్తున్న కృషి సంతోషంగా ఉందని కొనియాడారు. -
మహిళా జర్నలిస్టుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తాం
సనత్‌నగర్: జర్నలిజాన్ని సవాల్‌గా స్వీకరించి వృత్తిలో రాణిస్తున్న మహిళా జర్నలిస్టుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. తాను ఎక్కడికెళ్లినా జర్నలిస్టుల పిల్లల ఉచిత విద్యపై వినతులు వస్తున్నాయని, ఈ విషయంపై యూనియన్లు ప్రతిసారీ డీఈవోల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సీఎంతో చర్చించి శాశ్వత పరిష్కారం జరిగేలా చూస్తానని తెలిపారు. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో రెండు రోజుల పాటు జరిగే మహిళా జర్నలిస్టుల వర్క్‌షాప్ శనివారం ప్రారంభమైంది. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సబిత మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక ఒక్కొక్క రంగంలోని సమస్యలను ముఖ్యమంత్రి పరిష్కరించుకుంటూ వెళ్తున్న క్రమంలో మీడియా రంగంలో పనిచేస్తున్న వారి సమస్యల పరిష్కారానికి మీడియా అకాడమీ ప్రత్యేక చొరవ తీసుకోవడం అభినందనీయమన్నారు. సత్యవతి మాట్లాడుతూ.. మహిళా జర్నలిస్టుల సంక్షేమానికి తమ శాఖ నుంచి రూ.5 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మహిళలకు ఏవైనా సమస్యలుంటే ఉమెన్ కమిషన్ దృష్టికి తీసుకురావాలని సునీతాలక్ష్మారెడ్డి సూచించారు. కార్యక్రమంలో సీనియర్ మహిళా జర్నలిస్టులు సుమబాల, స్వేచ్ఛ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నేత మారుతీసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా జర్నలిస్టులకోసం రూ. 5 లక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టుల వర్క్‌షాప్ శనివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఏప్రిల్ 23, 24(శని, ఆది) రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాలను తెలంగాణా ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ అల్లం నారాయణ ప్రారంభించారు. హైదరాబాద్ బేగంపేట, ప్లాజా హోటల్లో ప్రారంభమైన శిక్షణా శిబిరంలో తొలి రోజు మొదటి సెషన్‌కు జర్నలిసులు స్వేచ్ఛ, సుమబాల అధ్యక్షత వహించారు. రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా రెడ్డి హాజరైనారు. తెలంగాణా ఏర్పడిన తరువాత తొలిసారి మహిళా జర్నలిస్టుల కోసం ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, ఇది సంతోషదాయక మని అల్లం నారాయణ వెల్లడించారు. మహిళా జర్నలిస్టుల అస్థిత్వం కోసం, వారికి ఒక స్పేస్‌ను కల్పించడమే దీని ఉద్దేశమన్నారు. వివిధ అంశాలపై సీనియర్ పాత్రికేయుల ప్రసంగాలతోపాటు, మహిళలుగా మీడియాలో ఎదురవుతున్న కష్టనష్టాలను పంచుకునే కలబోత కార్యక్రమం కూడా ఉందని అల్లం నారాయణ వెల్లడించారు. ఈ చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని, అలాగే ఆయా సమస్యలను అర్థం చేసుకుని పరిష్కారంకోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. మహిళా జర్నలిస్టులకోసం రూ. 5 లక్షలు రాష్ట్ర మహొళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జర్నలిస్టులనుద్దేశించి ప్రసంగించారు. మహిళా జర్నలిస్టుల సంక్షేమం కోసం మంత్రిత్వ శాఖ తరపున 5 లక్షల రూపాయలను ఆమె ప్రకటించారు. ఈ సందర్భంగా తన అనుభవాలను పంచుకున్నారు. అనేక సమస్యలను ఎదుర్కొంటూ జర్నలిస్టులుగా రాణిస్తున్నవారికి, ఉన్నత స్థాయిలో తమ ప్రతిభను చాటుకుంటున్న వారిందరికీ మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మహిళా మీడియా సెంటర్ ఏర్పాటుకు కృషి ఈ సందర్బంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఇంతమంది మహిళా జర్నలిస్టులను చూడటం సంతోషంగా ఉందన్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలు ఉన్నత స్థాయికి రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని ముఖ్యంగా మీడియా, పోలీసు రంగంలో మరింత శ్రమించాల్సి ఉంటుందన్నారు. తన దృష్టికి వచ్చిన పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. మీడియా సెంటర్ ఏర్పాటు కోసం కూడా కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమ కాలంలోనూ, ఇపుడు పునర్నిర్మాణంలో కూడా జర్నలిస్టుల పాత్ర అమోఘమని ఆమె కొనియాడారు. ముఖ్యంగా మీడియాలో పురుషులతో సమానంగా ఎదగడం అంటే.. ఎంతో ఒత్తిడి ఉంటుంది, అయినా నిబద్ధతతో రాణిస్తున్నవారిని తాను చాలామందిని చూశానని, ఇది నిజంగా అభినందనీయమని సబితారెడ్డి ప్రశంసించారు. తెలంగాణ తొలి మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి సాక్షి.కామ్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతూ మహిళా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం తమ ప్రభుత్వం తరపున చేయాల్సిందంతా చేస్తామని హామీ ఇచ్చారు . జర్నలిజం అంటే ఒక వినూత్నమైన రంగం. మీడియా రంగాన్ని కేవలం పురుషులకే పరిమితం కాకుండా అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ కూడా తాము ముందుండాలనే లక్ష్యంతో సాగుతున్న మహిళా పాత్రికేయులందరికీ హ్యాట్సాఫ్ అన్నారు. -
మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: బేగంపేటలోని టూరిజం ప్లాజాలో 'మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్' కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఈ వర్క్ షాప్ ప్రారంభ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ఛైర్మన్లు, శాసనమండలి, శాసనసభ సభ్యులు పాల్గొన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ శని, ఆదివారం రెండు రోజులు నిర్వహించనున్నారు. దాదాపు 400 మంది మహిళా జర్నలిస్టులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టుల కొరకు ఒక ప్రత్యేక మీడియా సెంటర్, మీడియా కిట్ సాధించుకోవడంతో పాటు, మహిళా జర్నలిస్టుల సమస్యలు వాటి పరిష్కారాల కొరకు ప్రత్యేక చర్చ ఉంటుందని అల్లం నారాయణ తెలిపారు. ఏప్రిల్ 24వ తేదీన జరిగే ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత, వాణి దేవి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి పాల్గొంటారు. ఈ సెషన్ లో జాతీయ స్థాయి మహిళా జర్నలిస్టులు ధన్యా రాజేంద్రన్, మాలిని సుబ్రహ్మణ్యం, 'మీడియా ధోరణులు, జాతీయ పరిస్థితులు' అనే అంశంపై ప్రసంగించనున్నారు. -
మహిళా జర్నలిస్టులకు రెండ్రోజుల శిక్షణా తరగతులు
సాక్షి, హైదరాబాద్: మహిళా జర్నలిస్టుల కు ఈనెలలో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. హైదరాబాద్‌లో రెండు రోజులపాటు జరిగే ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొనాలనుకునే వారు మీడియా అకాడమీ మేనేజర్ వనజ (7702526489)కు ఫోన్ చేసి, పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాల వారు ఆయా జిల్లాల పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మొదటిరోజు ‘మహిళా జర్నలిస్టులు– ప్రధాన స్రవంతి మీడియా– మహిళల పాత్ర’, ‘పాత్రికేయ రంగంలో మహిళలు– ప్రత్యేక సమస్యలు’అనే అంశంపై తరగతులు ఉంటాయని తెలిపారు. రెండో రోజు ‘మహిళా అస్తిత్వం–జెండర్ సెన్సిటైజేషన్’, ‘ఫీచర్ జర్నలిజం– మెళకువలు’అనే అంశాలపై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో నిష్టాతులైన వారి ప్రసంగాలు ఉంటాయని పేర్కొన్నారు. -
ప్రముఖ మహిళల ఫొటోలు యాప్‌లో వేలానికి
న్యూఢిల్లీ: ప్రముఖ ముస్లిం మహిళల ఫొటోలను యాప్‌లోకి అప్లోడ్ చేసి వేలానికి పెట్టిన దారుణ వికృత చేష్ట ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ అంశంపై భిన్న వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గత జులైలో ‘సలీ డీల్స్’ పేరిట జరిగిన అరాచకాన్ని గుర్తుచేస్తూ ‘బుల్లి బాయ్’ యాప్ ఒకటి తెరమీదకొచ్చింది. దాదాపు 100 మంది ప్రముఖ ముస్లిం మహిళలు, మహిళా పాత్రికేయుల ఫొటోలను వారి ట్విట్టర్ ఖాతాల నుంచి సేకరించి వాటిని బుల్లి బాయ్ యాప్‌లో అప్లోడ్ చేసి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వేలానికి పెట్టారు. దారుణానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు, ముంబై పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. యాప్ కార్యకలాపాలకు వేదికగా వాడుతున్న ‘గిట్‌హబ్’ ప్లాట్‌ఫామ్‌లోని యూజర్ ఐడీని బ్లాక్ చేశామని మంత్రి తెలిపారు. దేశంలోని ప్రభుత్వరంగ సంస్థల ఆన్లైన్ నెట్‌వర్క్‌లోకి హ్యాకింగ్ యత్నాలపై ఆయా సంస్థలను అప్రమత్తం చేసే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్), ఢిల్లీ, ముంబై పోలీసు యంత్రాంగం సంయుక్తంగా ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకుంటాయని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు, బుల్లి బాయ్ వెబ్సైట్లో తన ఫొటోను వాడారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా జర్నలిస్ట్ ఒకరు ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. యాప్ డెవలపర్లు, ట్విట్టర్ హ్యాండిల్ హోల్టర్లపై ముంబై సైబర్ విభాగం మరో కేసు నమోదు చేసింది. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు మహిళా జాతీయ కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ సూచించారు. మహిళలను అవమానించడం, మత విద్వేషంపై ప్రజలు గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. వారికి అధికార అండదండలు: మెహబూబా ముఫ్తీ ఆరోపణ యాప్ ద్వారా ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకున్న వారికి ‘అధికార అండదండలు’ అందుతున్నాయని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. అధికారంలో ఉన్న వారు వెనకుండి నడిపించడం వల్లే ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులు స్వేచ్ఛగా తప్పించుకు తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. -
Oscar Nomination 2022: ఆస్కార్ బరిలో దళిత మహిళా జర్నలిస్టులు
‘రైటింగ్ విత్ ఫైర్’.... ఆస్కార్ 2022 బరిలోమన దేశం నుంచి షార్ట్ లిస్ట్ అయిన బెస్ట్ డాక్యుమెంటరీ మూవీ. అందరూ దళిత మహిళా జర్నలిస్టులు నడుపుతున్న ‘ఖబర్ లెహరియా’ న్యూస్‌పేపర్ (వీక్లీ) గురించి, దాని డిజిటల్ వార్తల గురించి తయారు చేసిన డాక్యుమెంటరీ ఇది. 25 మంది దళిత మహిళా జర్నలిస్టులు ఉత్తర ప్రదేశ్, బుందేల్‌ఖండ్, మధ్యప్రదేశ్‌లలో గ్రామీణ వార్తలను స్త్రీ దృక్కోణంలో అందించడమే ఇక్కడున్న విశేషం. ఆస్కార్ సాధించే సత్తా ఈ డాక్యుమెంటరీకి ఉంది అని భావిస్తున్నారు. ‘మా ప్రాంతంలో దళిత మహిళలు జర్నలిజం గురించి ఆలోచించడం చాలా పెద్ద విషయం. అసలు ఆ పని తాము కూడా చేయొచ్చని వాళ్లు అనుకోరు. కాని ఈ ఇరవై ఏళ్లలో వారిలోని ఆ న్యూనతను చాలా వరకు తీసేశాం’ అంటారు ‘ఖబర్ లహరియా’ మహిళా జర్నలిస్టులు. 2002లో ‘ఖబర్ లహరియా’ వారపత్రిక చిత్రకూట్ (బుందేల్ ఖండ్)లో మొదలైంది. అప్పుడు 6 మంది దళిత మహిళా జర్నలిస్టులు పని చేయడం మొదలెట్టారు. ఇవాళ 25 మంది పని చేస్తున్నారు. ఆ ఆరు మంది ఈ 25 మందిగా ఎలా మారారో... హిందీ, భోజ్‌పురి, బుందేలి, అవధి భాషల్లో వారపత్రికను ఎలా నడిపారో, ఆ తర్వాత సెల్ఫోన్లను కెమెరాలుగా వాడుతూ డిజిటల్ మీడియాలోకి తమ వార్తలను ఎలా అందించసాగారో ఇదంతా అద్భుతంగా చెప్పిన డాక్యుమెంటరీ ‘రైటింగ్ విత్ ఫైర్’. దర్శకురాలు రింతు థామస్ మరో దర్శకుడు సుస్మిత్ ఘోష్‌తో కలిసి ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించింది. వచ్చే మార్చి 27న లాస్ ఏంజలిస్‌లో జరిగే ఆస్కార్ వేడుకలో పోటీకి నిలవడానికి ఈ డాక్యుమెంటరీ అడుగు దూరంలో ఉంది. 2022 సంవత్సరానికి ఆస్కార్ కమిటీ అధికారికంగా ప్రకటించిన డాక్యుమెంటరీల షార్ట్‌లిస్ట్‌లోని 15 చిత్రాలలో ‘రైటింగ్ విత్ ఫైర్’ ఒకటిగా ఎంపికైంది. ఈ షార్ట్‌లిస్ట్ కోసం ప్రపంచ దేశాల నుంచి 138 డాక్యుమెంటరీలు పోటీ పడ్డాయి. వాటి నుంచి 15 షార్ట్‌లిస్ట్‌లోకి వచ్చాయి. ఈ 15 నుంచి మూడో నాలుగో అంతిమ నామినేషన్స్‌గా నిలవడానికి జనవరి 27 నుంచి ఓటింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న అంతిమ నామినేషన్స్ ప్రకటిస్తారు. ఆ నామినేషన్స్‌లో ‘రైటింగ్ విత్ ఫైర్’ ఉంటే ఆస్కార్ వేడుకలో అదృష్టం పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ‘లగాన్’, ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రాల తర్వాత ఆస్కార్ వేడుకలో భారతీయుల పేర్లు వినిపించలేదు. ఈసారి ఫైనల్ నామినేషన్స్‌కు వెళుతుందని భావించిన తమిళ చిత్రం, భారతదేశ అఫీషియల్ ఎంట్రీ ‘కూడంగళ్’ షార్ట్‌లిస్ట్‌లో నిలువలేదు. కాని ‘రైటింగ్ విత్ ఫైర్’ డాక్యుమెంటరీ విభాగంలో నిలిచి ఆశలు రేపుతోంది. ఈ డాక్యుమెంటరీ దేని గురించి? ఢిల్లీలో ఉన్న ‘నిరంతర్‘ అనే ఎన్జిఓ ఉత్తర ప్రదేశ్‌లోని చిత్రకూట్ నుంచి ప్రయోగాత్మకంగా మొదలెట్టిన వారపత్రిక ‘ఖబర్ లహరియా’. పెద్దగా చదువు రాకపోయినా, జర్నలిజం తెలియకపోయినా దళిత మహిళలు తమ ప్రాంత వార్తలను ఎలా చూస్తారో, వాళ్లు చూసిన పద్ధతిలో అచ్చు వేసి పాఠకుల వద్దకు తీసుకువెళ్లడం ఈ పత్రిక ఉద్దేశం. అంతే కాదు... జర్నలిజంకు దూరంగా ఉన్న దళిత మహిళలు కూడా సమర్థంగా వార్తా పత్రికలను నడపగలరని చూపడమూ ఉద్దేశమే. ‘మాలో చాలామంది ఎలిమెంటరీ స్థాయి చదువు కూడా చదువుకోలేదు. ఇంగ్లిష్ అసలు రాదు. అయినా సరే పత్రికలో పని చేయడానికి రంగంలో దిగాం’ అంటుంది మీరా. ఈమె చీఫ్ రిపోర్టర్. ఈమె దృష్టికోణం నుంచే ‘రైటింగ్ విత్ ఫైర్’ డాక్యుమెంటరీ ఉంటుంది. బుందేలి, అవధి వంటి స్థానిక భాషలలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్... ఈ మూడు రాష్ట్రాలలో ఈ పత్రికను అందేలా ఈ దళిత మహిళలు కార్యాచరణ చేశారు. ఈ పత్రిక అచ్చు పని, డిస్ట్రిబ్యూషన్, సర్క్యులేషన్ అంతా మహిళల బాధ్యతే. సవాళ్లు ఎన్నో... దళిత మహిళలు రిపోర్టర్లుగా మారడం ఒక విశేషం అయితే అంటరానితనం ఉన్న ప్రాంతాలలో కూడా వీరు దూసుకుపోవాల్సి రావడం మరో విశేషం. ‘చాలాచోట్ల మొదటగా కులం అడుగుతారు. నేను ఆ ప్రశ్న వేసిన వారి కులం అడుగుతాను. వారు ఏ కులం చెప్తే నేను కూడా ఆ కులమే అంటాను. పని జరగాలి కదా’ అని నవ్వుతుంది ఒక రిపోర్టర్. ‘ఖబర్ లహరియా’ ఎంత జనంలోకి వెళ్లిందంటే చీఫ్ రిపోర్టర్ మీరా భర్త ఒకరోజు ఇంటికి వచ్చి ఆమె మీద ఇంతెత్తున ఎగిరాడు. ‘నువ్వు బతకనిచ్చేలా లేవు’ అన్నాడు. దానికి కారణం ఆమె ఊళ్లోని గూండాల గురించి పత్రికలో రాయడమే. ‘ఇంకో సందర్భంలో అయితే స్త్రీలు పని మానేస్తారు. కాని నా వెనుక పత్రిక ఉందన్న ధైర్యం ఉంది. అందుకే నా భర్తతో నేనేం తప్పు చేయలేదు అని గట్టిగా వాదించాను’ అంటుంది మీరా. ఈ పత్రికకు పని చేస్తున్న దళిత మహిళా రిపోర్టర్లు ముఖ్యంగా పోలీసుల జులుం పైనా, దళితులపైన జరిగే దాష్టికాల పైనా, స్త్రీలపై పురుషుల పీడన పైన వార్తలు రాస్తుంటారు. ‘భయం వేయదా’ అని అడిగితే ‘భయంగానే ఉంటుంది. కాని అంతలోనే ధైర్యం చేస్తాం’ అంటారు వాళ్లు. సెల్ఫోన్లే కెమెరాలుగా పదిహేనేళ్ల పాటు ప్రింట్ ఎడిషన్‌ని నడిపిన ఈ మహిళలు మారిన కాలానికి తగినట్టుగా తాము మారాలని నిశ్చయించుకున్నారు. వార్తలను విజువల్ మీడియాగా జనానికి చూపాలనుకున్నారు. ‘మా అందరికీ ఫోన్లు ఎలా వాడాలో తెలియదు. కాని మారిన పరిస్థితులకు తగినట్టుగా మనం మారకపోతే ఆగిపోతాం’ అంటారు వాళ్లు. అందుకే సెల్‌ఫోన్‌ను కెమెరాగా ఎలా వాడాలో తెలుసుకున్నారు. వార్తలను ఫోన్లో బంధించి యూ ట్యూబ్‌లో బులెటిన్గా విడుదల చేయసాగారు. వారి యూ ట్యూబ్ చానల్‌కు ఐదున్నర లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ‘రైటింగ్ విత్ ఫైర్’కు ఆస్కార్ వస్తే ఈ దళిత మహిళలు ప్రపంచం అంతా చుట్టడం గ్యారంటీ. డాక్యుమెంటరీలోని ఓ దృశ్యం -
ఆ ఇద్దరు మహిళా జర్నలిస్టులను విడిచిపెట్టండి
న్యూఢిల్లీ/అగర్తలా: అసోం పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు మహిళా జర్నలిస్టుల్ని తక్షణమే విడుదల చేయాలని ఇండియన్ వుమెన్స్ ప్రెస్ కార్ప్(ఐడబ్ల్యూపీసీ) డిమాండ్ చేసింది. బాధిత జర్నలిస్టులు సమద్ధి సకునియా, స్వర్ణ ఝాకు సంఘీభావం ప్రకటించింది. హెచ్‌డబ్ల్యూ న్యూస్ నెట్‌వర్క్‌లో పనిచేస్తున్న వీరిద్దరూ త్రిపురలో ఇటీవల చెలరేగిన మతపరమైన అల్లర్లను కవర్ చేశారు. త్రిపురలో కేసు.. అసోంలో అరెస్ట్ అయితే త్రిపుర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలింగించారంటూ ఫాటిక్రోయ్ పోలీస్ స్టేషన్లో ఈ ఇద్దరు మహిళా జర్నలిస్టులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మత విద్వేషాల్ని ప్రేరేపిస్తున్నారని ఆరోపిస్తూ స్థానిక విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కాంచన్ దాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. త్రిపురలోని ఉనకోటి జిల్లా పాల్ బజార్ ప్రాంతంలో ప్రార్థనా మందిరం ధ్వంసమయినట్టు అసత్య ప్రచారం చేశారని మహిళా జర్నలిస్టులపై వీహెచ్‌పీ ఫిర్యాదు చేసింది. దీంతో వీరిని అసోంలోని కరీంగంజ్ ప్రాంతంలో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. గోమతిలోని కక్రాబన్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైనట్టు త్రిపుర డీజీపీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవాలను వక్రీకరించారు త్రిపురలో జరిగిన మత పరమైన అల్లర్ల ప్రభావం మహారాష్ట్రపై పడి, నిరసనలకు దారి తీసిన విషయం తెలిసిందే. అయితే త్రిపురలో ప్రార్థనా మందిరం ధ్వంసం అయిందన్న ఆరోపణల్ని కేంద్ర హోంశాఖ తోసిపుచ్చింది. ‘త్రిపురలోని ఉనకోటి జిల్లా పాల్ బజార్ ప్రాంతంలో మసీదును ధ్వంసం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నకిలీవి.. వాస్తవాలను పూర్తిగా వక్రీకరించాయి’ అని స్పష్టం చేసింది. చట్ట విరుద్దంగా అరెస్ట్ చేశారు కాగా, సిల్చార్కు వెళ్లాల్సిన తమ జర్నలిస్టులను అసోం పోలీసులు చట్ట విరుద్దంగా అరెస్ట్ చేశారని హెచ్‌డబ్ల్యూ న్యూస్ నెట్వర్క్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఆరోపించింది. అసోంలో తమ సిబ్బందిపై ఎటువంటి కేసు లేనప్పటికీ త్రిపుర పోలీసుల ఆదేశాల మేరకు వారెంట్ లేకుండా స్వర్ణ, సమృద్ధిలను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించింది. మీడియా గొంతు నొక్కేందుకు త్రిపుర ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నిరస్తున్నారని విమర్శించింది. కాగా, మహిళా జర్నలిస్టుల అరెస్ట్‌ను ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఖండించింది. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. కాగా, గోమతి జిల్లాలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) కోర్టు సోమవారం వీరికి బెయిల్ మంజూరు చేసింది. (చదవండి: ‘రజా అకాడమీ’ని నిషేధించాలి.. వీహెచ్‌పీ డిమాండ్) -
‘మీ టూ’కు తొలి వికెట్
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల్లోకి రాక ముందు వేర్వేరు మీడియా సంస్థల్లో ఎడిటర్‌గా పనిచేస్తున్న సమయంలో ఆయన లైంగికంగా వేధించారని పలువురు మహిళా జర్నలిస్టులు ఆరోపించడం తెల్సిందే. అక్బర్ రాజీనామాను ప్రధాని మోదీ, ఆ తర్వాత రాష్ట్రపతి కోవింద్ ఆమోదించారు. అక్బర్ రాజీనామా ‘మీటూ’ ఉద్యమ విజయమని మహిళా కార్యకర్తలు అభివర్ణించారు. తాజా పరిణామంలో సత్యం గెలిచిందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. 20 ఏళ్ల కిత్రం తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించిన మహిళా జర్నలిస్టు ప్రియా రమణిపై అక్బర్ దాఖలుచేసిన పరువు నష్టం దావాపై ఢిల్లీలోని పాటియాలా కోర్టులో గురువారం విచారణ ప్రారంభంకానుంది. వ్యక్తిగతంగానే పోరాడుతా.. వ్యక్తిగతంగానే కోర్టులో న్యాయ పోరాటం చేస్తానని అక్బర్ అన్నారు. ‘పదవికి రాజీనామా చేసి నాపై వచ్చిన ఆరోపణల్ని వ్యక్తిగతంగానే కోర్టులో సవాలుచేయడం సరైనదని భావించి రాజీనామా చేశా’ అని అన్నారు. దోవల్‌ను కలిశాకే నిర్ణయం.. ప్రధానికి సన్నిహితుడిగా పేరొందిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశమయ్యాకే అక్బర్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అక్బర్‌పై ఆరోపణలు చేస్తున్న మహిళల సంఖ్య ఇప్పటికే 20దాటిందని, మరింత మంది ప్రియా రమణికి మద్దతుగా నిలబడే అవకాశాలున్నాయని నిఘా నివేదికలొచ్చాయని అక్బర్‌కు దోవల్ తెలిపారు. అక్బర్ వేధింపులకు పాల్పడిన వీడియోలూ బయటికొచ్చే చాన్సుందని తెలుస్తోంది. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్బర్‌పై∙ఆరోపణలు పార్టీకి నష్టంతెస్తాయని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ప్రధాని సూచనతో అక్బర్ రాజీనామా చేసినట్లు సమాచారం. -
ఇది కేంద్రానికి రమణికి మధ్య పోరాటం!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఇది ఎంజె అక్బర్ వర్సెస్ నా భార్య ప్రియ (రమణి)కు మధ్య పోరాటం కాదు. అక్బర్ కేంద్ర మంత్రి కనుక యావత్ కేంద్రానికి, అక్బర్ పేర్కొన్న 97 మంది న్యాయవాదులు, నా భార్య మధ్య జరుగుతున్న పోరాటం. ఎక్కడో ఉంటున్న మా ఇంటి చిరునామాను ఒక్క పూటలో పట్టుకున్నారంటే అక్బర్ పవర్ ఏమిటో నాకు తెలుసు. నా భార్య మొదటిసారి అక్బర్ పేరును వెల్లడించినప్పుడు ఎలా స్పందించాలో నాకు అర్థం కాలేదు. ఎక్కడ మా చిన్న, ప్రశాంత జీవితం బలవుతుందేమోనని భయపడ్డాను. అక్బర్ బాధితులు కూడా ఇలాగే భయపడి ఉంటారు. అప్పుడు, అలా భయపడక పోయి ఉంటే వ్యక్తిగత జీవితాలను పక్కన పెడితే ఎంత మంది వృత్తి జీవితాలు దెబ్బ తినేవో! భారత్ లాంటి పురుషాధిక్య సమాజంలో లైంగిక వేధింపులను ఓ రకంగా తమ హక్కుగా పురుషులు భావిస్తున్నారు. మగవాడు మగవాడే, ఆడది ఎక్కడుండాలో అక్కడ ఉండాల్సిందే అన్నది వారి వాదన. బాధితులెప్పుడూ బలహీనులే, భయపడే వారే. అందుకే దేశంలో మహిళలు, పిల్లలపై జరుగుతున్న అత్యాచారల్లో 70 శాతం సంఘటనలు ఫిర్యాదుచేసే వరకు రావడం లేదు. సమాజం ప్రభావం మహిళలపై కూడా కొనసాగుతోంది. భార్యను భర్త కొట్టడం తప్పేమి కాదని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో 42 శాతం మగవాళ్లు అభిప్రాయపడగా 52 శాతం మంది మహిళలు అభిప్రాయపడ్డారంటే ఆశ్చర్యం. అలాంటి సమాజంలోనే పుట్టి పెరిగింది నా భార్య. తనపై జరిగిన లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదు చేసే ధైర్యం ఆమెకు ఆనాడు లేకపోవచ్చు. మీటూ ఉద్యమం వల్ల ఆలస్యంగానైనా పురుష పుంగవులు లైంగిక ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటికి శిక్షలుండాలన్నదే బాధితుల వాదన. నా భార్య చేస్తున్న పోరాటంలో ప్రతిపక్ష పార్టీలు మద్దతుగా నిలుస్తాయని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే, వారిదంతా ఒక్కటే రాజకీయ కులం. అక్బర్ విషయంలో నా ప్రియ చూపిన ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేక పోయాను. అందుకే ఆమెకు అండగా నిలబడాలనుకున్నాను. ‘నిజం’ ఒక్కటే మాకు కవచం. అదే గెలిపిస్తుందని నమ్మకం. అక్బర్ బాధితులంతా ముందుకొస్తే గెలుపు అంత కష్టం కూడా కాకపోవచ్చు’–––సమర్ హలార్న్‌కర్. (గమనిక: కేంద్ర మంత్రి ఎంజె అక్బర్ తనపై లైంగిక వేధింపు ఆరోపణలు చేసిన ప్రియా రమిణిపై నేరపూరిత పరువు నష్టం దావా వేయడం పట్ల ఆమె భర్త, ‘ఇండియా స్పెండ్ డాట్ కామ్’ ఎడిటర్ సమర్ హలార్న్‌కర్ స్పందన ఇది. ముందుగా ట్విట్టర్లో స్పందించిన ఆయన ఆ తర్వాత తమ డాట్‌కామ్‌లో పెద్ద వ్యాసమే రాశారు. ఆ వ్యాసంలోని సారాంశాన్నే ఇక్కడ క్లుప్తంగా ఇస్తున్నాం) -
ఎంజె అక్బర్ కేసులో గెలుపెవరిది?
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని విదేశాంగ శాఖ సహాయ మంత్రి, మాజీ సీనియర్ జర్నలిస్ట్ ఎంజె అక్బర్ సోమవారం నాడు ప్రియా రమణిపై నేరపూరిత పరువు నష్టం దావా వేసిన విషయం తెల్సిందే. అందులో ఆయన తన తరపున వాదించడానికి 30 మంది మహిళలు సహా 97 మంది న్యాయవాదులను పేరు పేరున పేర్కొనడం గమనార్హం. అక్బర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన 14 మంది మహిళల్లో ప్రియా రమణి మొదటి వారు. 2017, అక్టోబర్ నెలలో ‘వోగ్ ఇండియా’లో ఓ ఎడిటర్ నీచ ప్రవర్తన గురించి ప్రియా రమణి ఓ ఆర్టికల్ రాశారు. అయితే ఆ వ్యాసంలో ఆమె ఆ ఎడిటర్ పేరును ప్రస్తావించలేదు. ఏడాది అనంతరం అక్టోబర్ 8వ తేదీన ఆ ఎడిటరే ఎంజె అక్బర్ అంటూ ట్వీట్ చేశారు. దాంతో మరో 13 మంది మహిళా జర్నలిస్టులు బయటకు వచ్చి తాము కూడా అక్బర్ లైంగిక వేధింపులకు గురయ్యామని ఆరోపించడం తెల్సిందే. అప్పుడప్పుడు మీడియాను వేధించేందుకు రాజకీయ నాయకులు పరువు నష్టం దావాలు వేయడం మామూలే. ఇప్పుడు తనపై వచ్చిన ఆరోపణలకు అక్బర్ ఏకంగా నేరపూరిత పరువు నష్టం దావా వేశారు. దీని కింద దోషికి జరిమానా లేదా రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. అక్బర్ తన పిటిషన్లో ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు. ఒకటి సమాజంలో తన పరువు, ప్రతిష్టను దెబ్బతీయడానికి నిరాధార ఆరోపణలు చేశారని, దీని వెనక రాజకీయ కోణం ఉందన్నది. రెండోది 20 ఏళ్ల క్రితం నిజంగా లైంగిక వేధింపులు జరిగి ఉంటే ఇంతకాలం ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నది. ‘మీటూ’ ఉద్యమంలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మగవాళ్లందరు కూడా ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పటి వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న అంశాన్నే నొక్కి ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు అక్బర్ పెట్టుకున్న 97 మంది న్యాయవాదులకన్నా ఎక్కువ మంది న్యాయవాదులు సమాధానం చెప్పగలరు. ఇందులో ముడివడి ఉన్న మొట్టమొదటి అంశం ‘పవర్ ఈక్వేషన్’. అంటే, ఎవరి అధికారం ఎక్కువ, ఎవరిది తక్కువన్నది. సహజంగా బాధితుల అధికారమే తక్కువుంటుంది. వేధింపుల గురించి ఫిర్యాదు చేస్తే కక్ష సాధింపు చర్యలు ఉంటాయన్న భయం, వ్యక్తిగత, వృత్తి జీవితాలకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందన్న ఆందళన వారిని వెంటాడుతోంది. అందుకనే వారు ఫిర్యాదు చేయడానికి సాహసించలేరు. ఎందుకు కేసు పెట్టరంటే..... ఫిర్యాదు చేయాలన్నా అప్పటికి ‘సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్, రిడ్రెసల్) యాక్ట్’ లేదు. దీన్ని యూపీఏ ప్రభుత్వం 2013లో తీసుకొచ్చింది. ఈ చట్టం రాకముందు లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చే యాలంటే పోలీసుల వద్దకు వెళ్లడం ఒక్కటే మార్గం. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులపై ఫిర్యాదు చేయాలంటే ఎంతో ఒత్తిడి గురికావాల్సి వస్తుంది. వ్యక్తిగత పరువు, ప్రతిష్టలు దెబ్బతీస్తారన్న భయం ఉంటుంది. ఫిర్యాదు చేసిన పెద్దవారిపై చర్యలు తీసుకుంటారన్న నమ్మకం ఉండదు. పలుకుబడిగల వ్యక్తులపై ఫిర్యాదు కోసం పోలీసు స్టేషన్‌కు వెళితే ఫిర్యాదును తిరస్కరించిన ఉదంతాలను ఇప్పటికీ వింటుంటాం. పైగా చట్టానికూడా పరిమితులు ఉన్నాయి. ఫలానా కేసుకు ఫలానా కాల పరిమితిలోగా ఫిర్యాదులు చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. లైంగిక వేధింపుల కేసే తీసుకుంటే సంఘటన జరిగిన నాటి నుంచి మూడేళ్లలోపే ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. జరిగిన సంఘటన నుంచి తేరుకొని, పోరాడే మనస్తత్వాన్ని సంతరించుకొని, ఫిర్యాదు దాఖలుచేసే ధైర్యాన్ని కూడదీసుకునే వరకే ఈ మూడేళ్ల సమయం గడచిపోవచ్చు. కేసు పెట్టక పోవడం కూడా హక్కే! కేసు దాఖలు చేయడానికి కాల పరిమితి ముగిసి పోయినందున తనపై కేసు కొట్టివేయాలన్నది కూడా అక్బర్ పిటిషన్లో ఓ వాదన. కేసు కొట్టివేస్తే ఆయన నిర్దోషన్నమాట. ఇదంతా తప్పుడు వాదనే అవుతుంది. కేసు పెట్టడం, పెట్టకపోవడమన్నది బాధితురాలి ఇష్టమే కాదు, ఆమె హక్కు కూడా. ఆమె జరిగిన సంఘటన గురించి కేసు దాఖలు చేయలేదు కనుక ఆ సంఘటన గురించి ఆమెకు వెల్లడించే హక్కు లేదంటే ఎలా? నేరాన్ని రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనప్పుడు నేరస్థుడు విడుదలవుతాడు, అలాంటప్పుడు తనకు జరిగిన అన్యాయం గురించి బాధితుడు లేదా బాధితరాలు మాట్లాడకూడదంటే ఎట్లా! జరిగిన సంఘటన నిజమైనప్పుడు పరువు నష్టం దావాను శంకించాల్సిందే! గెలుపోటములు అంతిమంగా ప్రియా రమణి లైంగిక ఆరోపణలు నిజమవుతాయా, ఎంజె అక్బర్ పరువు నష్టం దావా నెగ్గుతుందా? అన్నది ప్రశ్న. ఏ కేసులోనైనా సరే నిజా నిజాలు తేల్చాలంటే చట్ట ప్రకారం అందుకు తగిన ఆధారాలు ఉండాల్సిందే. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించిన ఆధారాలు ఆమె చూపించలేకపోవచ్చు. పైగా సకాలంలో ఫిర్యాదు చేయలేదు. అక్బర్ నమ్ముతున్నది కూడా ఇదే. ఆ తర్వాత ఏకంగా 13 మంది మహిళలు ఆయనపై ఆరోపణలు చేయడం చిన్న విషయమేమీ కాదు. వారు కూడా కోర్టు వర కు వచ్చి సాక్ష్యాలిస్తే కేసు బలపడుతుంది. మొట్టమొదటి సారిగా తన పేరు బయటపెట్టి పరువు తీసిందన్న అక్కసుతోపాటు ఇంకెవరు తనకు వ్యతిరేకంగా బయటకు రావద్దనే ఉద్దేశంతో అక్బర్ పరువు నష్టం దావా వేసినట్లు కనిపిస్తోంది. ఆయన పరువు నష్టం దావాను కూడా ఆయనే నిరూపించుకోవాలి కనుక అది నిలబడే అవకాశం లేదు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు, అందులోనూ జర్నలిస్టులు రాజకీయంగా తనను దెబ్బతీయడానికి కుట్రపన్నారని నిరూపించడం అంత సాధ్యమయ్యే పనేమీ కాదు. -
ముదిరిన ‘మీ టూ’ వ్యవహారం
న్యూఢిల్లీ/ముంబై: భారత సినీ, రాజకీయ, మీడియా రంగాల్లో ‘మీ టూ’ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. పనిప్రదేశంలో తమను వేధించినవారి వివరాలను పలువురు మహిళలు ‘మీ టూ’ పేరుతో వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇలా ఆరోపణలు ఎదుర్కొన్నవారిలో మాజీ జర్నలిస్ట్, విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్, నటులు అలోక్‌నాథ్, నానా పటేకర్, బాలీవుడ్ దర్శకులు సాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్ ఉన్నారు. తమను ఎంజే అక్బర్ వేధించాడని జర్నలిస్ట్ ప్రియా రమణి సహా 11 మంది మహిళా జర్నలిస్టులు ఆరోపించగా, సీనియర్ నటుడు అలోక్‌నాథ్ తనపై అత్యాచారం చేశాడని దర్శకురాలు, రచయిత్రి వినతా నందా ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రియా రమణిపై కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ సోమవారం ప్రైవేటు క్రిమినల్ పరువునష్టం దావాను దాఖలు చేశారు. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో దాఖలు చేసిన ఈ పిటిషన్లో అక్బర్ న్యాయవాది సందీప్ కుమార్ స్పందిస్తూ.. ‘అక్బర్ జర్నలిస్టుగా సుదీర్ఘకాలం పనిచేశారు. దేశంలో తొలి రాజకీయ వారపత్రికను ఆయనే ప్రారంభించారు. జర్నలిస్ట్ ప్రియా రమణి ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశంతో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం నా క్లయింట్ తనను వేధించాడని ఇప్పుడు ఆరోపిస్తున్నారు. ఆయన రాజకీయ జీవితాన్ని, పేరు ప్రతిష్టలను దెబ్బతీసేందుకు మీడియాలో ఈ విద్వేషపూరిత ప్రచారం సాగుతోంది. ప్రియా రమణి చర్యలతో అక్బర్ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లడంతో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహచరులతో ఆయన సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అంతేకాకుండా ప్రియా రమణి ఆరోపణలతో నా క్లయింట్ తీవ్ర మానసిక వేదన, ఒత్తిడికి లోనయ్యారు’ అని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా అక్బర్ తరఫున వాదించేందుకు సిద్ధంగా ఉన్న 97 మంది లాయర్ల పేర్లను సందీప్ కుమార్ కోర్టుకు అందజేశారు. మరోవైపు అక్బర్ పరువునష్టం దావా దాఖలు చేయడంపై స్పందించిన ప్రియా రమణి.. తానూ న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. మరోవైపు తనపై అలోక్‌నాథ్ పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపించిన రచయిత్రి వినతా నందాపై సివిల్ పరువునష్టం దావా దాఖలైంది. వినతా నందా తనకు బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు నష్టపరిహారంగా రూ.1 చెల్లించాలని కోరుతూ ముంబైలోని దిన్దోషి సెషన్స్ కోర్టులో అలోక్‌నాథ్ పిటిషన్ దాఖలు చేశారు. గొంతు నొక్కేయాలని చూస్తున్నారు.. లైంగికవేధింపులకు గురైన బాధితుల భయాన్ని, బాధను అక్బర్ ఏమాత్రం పట్టించుకోలేదని ప్రియా రమణి దుయ్యబట్టారు. బెదిరించడం, వేధింపులకు గురిచేయడం ద్వారా బాధితుల గొంతును నొక్కేసేందుకు అక్బర్ యత్నిస్తున్నారని ఆరోపించారు. ఎంజే అక్బర్‌కు వ్యతిరేకంగా గతంలో గళమెత్తినవారు వృత్తి, వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రియా రమణి అన్నారు. మరోవైపు ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకూ అక్బర్ పదవి నుంచి తప్పుకోవాలని ఇండియన్ వుమెన్స్ ప్రెస్ కోర్(ఐడబ్ల్యూపీసీ), ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా(పీసీఐ), ప్రెస్ అసోసియేషన్ అండ్ సౌత్ ఏషియన్ వుమెన్ ఇన్ ఇండియా సంయుక్తంగా డిమాండ్ చేశాయి. నిష్పాక్షిక విచారణ జరిగేందుకు వీలుగా అక్బర్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కోరాయి. లైంగిక వేధింపులపై మహిళా ఉద్యోగులు చేసే ఫిర్యాదులను సీరియఎస్‌గా తీసుకోవాలనీ, వాటిని ఉద్దేశ్యపూర్వక ఫిర్యాదులుగా పరిగణించరాదని విజ్ఞప్తి చేశాయి. కేంద్ర మంత్రి అక్బర్ తక్షణం పదవి నుంచి తప్పుకోవాలని ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఇంటిముందు ఆందోళనకు దిగారు. జర్నలిస్ట్ దువాపై ఆరోపణలు ది వైర్ వెబ్సైట్ కన్సల్టింగ్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా తనను లైంగికంగా వేధించాడని డాక్యుమెంటరీ దర్శకురాలు నిష్టా జైన్ ఆరోపించింది. తాను 1989లో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వినోద్‌కు కలుసుకున్నాననీ, తాను కుర్చీలో కూర్చోకముందే అతను సెక్స్ జోక్ వేశాడని తెలిపారు. ‘‘ఓ రోజు కారు పార్కింగ్ ప్రదేశంలో దువా కనిపించాడు. ‘నీతో మాట్లాడాలి. నా కారులో కూర్చో’ అని కోరాడు. తన ప్రవర్తనకు క్షమాపణలు కోరతాడనుకొని కారులో కూర్చోగానే నా మీద పడిపోయి ముఖమంతా ముద్దులు పెట్టాడు. ఎలాగోలా తప్పించుకున్నా’’ అని తెలిపారు. మిత్రపక్షాల అసంతృప్తి సెగ.. సాక్షి ప్రతినిధి న్యూఢిల్లీ: అక్బర్‌ను తప్పించేందుకు కేంద్రం చొరవ తీసుకోని నేపథ్యంలో మిత్రపక్షాలే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రిగా ఉన్న అక్బర్ వెంటనే పదవి నుంచి దిగిపోవాలనీ, లైంగిక వేధింపు ఆరోపణలపై విచారణను ఎదుర్కోవాలని ఎన్డీయే మిత్రపక్షం జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) డిమాండ్ చేసింది. ‘ఈ విషయంలో అక్బర్ సొంతంగా ఓ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నా. ఒకవేళ తప్పుకోకుంటే ప్రభుత్వమే మంత్రి బాధ్యతల నుంచి తొలగించాలి’ అని∙జేడీయూ నేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. మరోవైపు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళలపై అక్బర్ న్యాయపోరాటానికి దిగడం కేంద్ర ప్రభుత్వానికి ప్రతికూలంగా మారే అవకాశముందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
#మీటూ : పోరుకు సై, సత్యమే రక్ష
సాక్షి, న్యూఢిల్లీ: మీటూ పేరుతో సాక్షాత్తూ కేంద్రమంత్రిపై లైంగిక ఆరోపణలు చేసి జర్నలిస్టు ప్రియా రమణికి దేశవ్యాప్తంగా మహిళా జర్నలిస్టులనుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఏకంగా 97మంది లాయర్ల సహకారంతో క్రిమినల్ డిఫమేషన్ కేసు దాఖలు చేయడంపై మండిపడుతున్నారు. ముఖ్యంగా 14మందికిపైగా మహిళల ఆరోపణలను కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏమీ పట్టించుకోలేదు. మంత్రిపై ఎలాంటి చర్యల్ని ప్రకటించలేదు. కనీస విచారణ చేపడతామన్న మాటకూడా మాట్లాడలేదనీ ఇది శోచనీయమని విమర్శించారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా అక్బర్ తీసుకున్న చర్య విస్తుగొల్పిందని దుయ్యపట్టారు. 14మంది మహిళలు ఆరోపణలు చేస్తే కేవలం ప్రియా రమణిపైనే ఎందుకు కేసులని కామిని జైశ్వాల్ ప్రశ్నించారు. దీని వెనుక పెద్దకుట్ర దాగా వుందని ఆరోపించారు. మరోవైపు పరువు నష్టం దావాపై ప్రియా రమణి కూడా ట్విటర్ లో స్పందించారు. దీనిపై పోరాడడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. సత్యమే తనకు రక్షణ అని పేర్కొన్నారు. అనేక మంది మహిళలు అతడిపై చేసిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో కేవలం తనను మాత్రమే బెదిరించడం వేధింపుల ద్వారా వారి నోరు మూయించాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. పలు మహిళా జర్నలిస్టు సంఘాలు తాజా పరిణామంపై తీవ్ర ఆగ్రహాన్నివ్యక్తం చేశాయి. తక్షణమే అక్బర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ప్రియా మరణి రమణికి మద్దతుగా దేశాధ్యక్షుడు రామ్ నాద్ కోవింద్‌కు, ప్రధానమంత్రి నరేంద మోదీకి లేఖ రాస్తూ ఒక ప్రకటన విడుదల చేశాయి. అక్బర్‌ను పదవినుంచి తొలగించాలని, అలాగే రమణిపై కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసాయి. మరోవైపు మనీ లైఫ్ ఇండియా మేగజైన్ కు ఎడిటర్ గా వ్యవహరిస్తున్న సుచేతా దలాల్... ప్రియరమణితో పాటు 14మంది ఇతర జర్నలిస్టులు కూడా స్థైర్యం కోల్పోరాదని, ఖర్చులకు కూడా వెరువరాదని హితవు పలికారు. జరిగిన అన్యాయంపై పోరాటం చేయాలంటే ఆర్థికంగా కూడా ఎంతో భరించాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ప్రియా రమణి తరఫున వాదించేందుకు ప్రముఖ లాయర్లు చాలా మందే ఉన్నారని, అందుకయ్యే ఖర్చు కూడా తమ శక్తికొద్దీ భరిస్తామని సుచేతా దలాల్ ప్రతిపాదించడంతో... ఆ ట్వీట్ చాలా మంది ఫాలో అవుతూ తాము కూడా మద్దతుగా నిలుస్తామని ప్రకటించడం గమనార్హం. కాగా పలు మహిళా జర్నలిస్టుల లైంగిక ఆరోపణల నేపథ్యంలో కేంద్రమంత్రి ఎంజే అక్బర్ ప్రియా రమణిపై దాదాపు41 పేజీలతో పరువునష్టం దావావేశారు. కరాంజవాలా సంస్థలోని 97మంది లాయర్లు (30మంది మహిళా లాయర్లు) మద్దతుతో ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ దావానునమోదు చేసిన సంగతి తెలిసిందే. Hey @priyaramani and all 14 who have spoke up. Let’s crowd fund your defence. I am sure may top lawyers will help you fight pro bono, but we at @MoneylifeIndia know there are lots of expenses involved! So think about it! Happy to support I am sure thousands of others will too! https://t.co/WmSnOfFKQy — Sucheta Dalal (@suchetadalal) October 15, 2018 My statement pic.twitter.com/1W7M2lDqPN — Priya Ramani (@priyaramani) October 15, 2018 -
అన్నీ అబద్ధాలు.. నిరాధారాలు
న్యూఢిల్లీ: జర్నలిస్ట్‌గా ఉన్న సమయంలో సహచర మహిళా పాత్రికేయులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ స్పందించారు. వారు తనపై చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని, అర్థరహితాలని, అవి తనను అమితంగా బాధించాయని ఆయన పేర్కొన్నారు. విదేశాల్లో అధికారిక పర్యటనలో ఉన్నందువల్లనే ఇప్పటివరకు దీనిపై స్పందించలేదన్నారు. ఆఫ్రికా దేశాల పర్యటన నుంచి తిరిగొచ్చిన కాసేపటికే ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నిరాధార ఆరోపణల కారణంగా తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయబోనని తేల్చి చెప్పారు. తనపై అసత్య ఆరోపణలు చేసినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నానని వెల్లడించారు. త్వరలో సాధారణ ఎన్నికలు జరగబోతున్న కారణంగా, తన ప్రతిష్ట దెబ్బతీసేందుకే ఇలాంటివన్నీ తెరపైకి వస్తున్నాయన్నారు. ’ఎన్నికలు కొన్ని నెలలు మాత్రమే ఉన్న సమయంలో ఈ తుపాను ఎందుకు వచ్చింది?’ అని ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఇప్పుడు వైరల్ జ్వరంగా మారిందని అక్బర్ వ్యాఖ్యానించారు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా హాలీవుడ్లో ప్రారంభమైన ‘మీ టూ’ ఉద్యమం భారత్‌లోనూ ఉవ్వెత్తున సాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఎంజే అక్బర్ జర్నలిస్ట్‌గా ఉన్న సమయంలో వివిధ సమయాల్లో ఆయనతో పాటు జర్నలిస్ట్‌గా పనిచేసిన 11 మంది మహిళలు ఇటీవల ముందుకువచ్చి.. తమపై అక్బర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. వారిలో ప్రియా రమణి, గజాలా వాహెబ్, షుమ రాహ, అంజు భారతి, శుతుపా పాల్ల ఆరోపణలపై అక్బర్ స్పందించారు. ‘ప్రియా రమణి ఏడాది క్రితం ఓ మ్యాగజీన్లో రాసిన ఓ కథనం ద్వారా ఈ దుష్ప్రచారాన్ని ప్రారంభించారు. అందులో నా పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. ఎందుకంటే అది అసత్య కథనమని ఆమెకూ తెలుసు. ఇటీవల ఈ విషయమై అడిగిన ప్రశ్నకు ఆమె.. ఆయన ఏమీ చేయలేదు కాబట్టే, పేరు ప్రస్తావించలేదని సమాధానమిచ్చారు. నేను తనపై చేయి ఎప్పుడూ వేయలేదని శుతుపా పాల్ చెబ్తున్నారు. నిజానికి నేనేం చేయలేదని షుమ అంటున్నారు. స్విమింగ్ పూల్‌లో పార్టీ చేసుకున్నామని అంజు భారతి ఆరోపించారు. కానీ నాకు ఈతే రాదు. రమణి, వాహెబ్‌లు వారు పేర్కొన్న లైంగిక వేధింపుల ఘటన తరువాత కూడా నాతో కలిసి పనిచేశారు. దీన్ని బట్టి ఇవన్నీ అసత్యాలని తెలియడం లేదా?’ అని అక్బర్ వివరణ ఇచ్చారు. ప్రధాని స్పందించాలి: కాంగ్రెస్ మంత్రి ప్రకటనకు కొద్ది సేపటి ముందు కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ విలేకరులతో మాట్లాడుతూ.. సహచర మంత్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ‘ఈ విషయంలో ప్రధాని మోదీ స్పందించాలి. ప్రధాని ఎలాంటి వారనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఈ అంశం ప్రభుత్వ నైతికతకు సంబంధించిందే కాదు, ప్రధానికీ, ఆయన పదవీ గౌరవానికి సంబంధించింది కూడా’ అని అన్నారు. -
మీటూ ప్రకంపనలు.. కేంద్రమంత్రి రాజీనామా?
సాక్షి, న్యూఢిల్లీ : #మీటు ఉద్యమం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ సహాయమంత్రి , బీజేపీ ఎంపీ ఎంజే అక్బర్ తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఆదివారం నైజీరియా పర్యటన నుంచి తిరిగి వచ్చిన ఆయన.. తనపై వచ్చిన లైంగిక వేధింపులపై ఒక ప్రకటన చేస్తానని మీడియాతో చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన ప్రధాన మంత్రి కార్యాలయానికి తన రాజీనామాను ఈమెయిల్ ద్వారా పంపినట్టు సమాచారం అందుతోంది. అయితే, అక్బర్ రాజీనామాను పీఎంవో కార్యాలయం ఇంకా ధ్రువీకరించలేదు. (మీటూ సంచలనం : ఎంజే అక్బర్‌పై లైంగిక ఆరోపణలు) ఎడిటర్‌గా ఉన్న సమయంలో అక్బర్ తమను వేధించాడని పలువురు మహిళా జర్నలిస్టులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఇప్పటివరకు అధికార బీజేపీ స్పందించలేదు. అయితే, విదేశీ పర్యటనలో ఉన్న అక్బర్‌ను హుటాహుటిన దేశానికి రప్పించడం వెనుక #మీటూ ప్రకంపనలు ఉన్నట్టు తెలుస్తోంది. అక్బర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మోదీ నిర్ణయం తీసుకుంటారు..! అక్బర్‌ను మంత్రివర్గంలో కొనసాగించాలా వద్దా అనే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకుంటారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఆయనను పదవిలో కొనసాగించడం కష్టమేనని అంటున్నాయి. మహిళా జర్నలిస్ట్‌లతో ఆయన అసభ్యకరంగా వ్యహరించినట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రియ రమణి అనే జర్నలిస్ట్ తొలుత అక్బర్ ఆకృత్యాలను వెలుగులోకి తీసుకొచ్చారు. అనంతరం ప్రేరణ సింగ్ బింద్రా, మరికొంతమంది మహిళా జర్నలిస్టులు అక్బర్‌పై లైంగిక ఆరోపణలు చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఎంజే అక్బర్, ది టెలిగ్రాఫ్, ఆసియన్ ఏజ్, ది సండే గార్డియన్ వంటి ప్రముఖ వార్తా పత్రికలకు ఎడిటర్‌గా వ్యహరించారు. (‘అక్బర్’పై స్పందించని కేంద్రం) -
ఇలాంటి కథలన్నీ కావాలిప్పుడు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘మన మిద్దరం మోటర్ బైక్ మీద అంతటా తిరిగినప్పుడు, మన సెల్ఫీలు ఫేస్బుక్లో షేర్ అయినప్పుడు మనచుట్టూ ఎన్నో వదంతులు వ్యాపించాయి. అయినప్పటికీ నేను నిన్ను నమ్మాను. కానీ నీవు చాలా దూరం వెళ్లావు. ఆ రోజే నేను లైంగిక దాడి గురించి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేద్దామనుకున్నాను. అలా చేసి ఉంటే నీవు కొంతకాలమైనా జైల్లో గడిపే వాడివి. కానీ నా కెరీర్ మంటకలిసి పోయేది. నా పక్కన నిలబడేందుకు సహచరులుగానీ, కుటుంబ సభ్యులుగానీ ఎవరూ లేరు. అయినా నీవు నిష్కళంకుడిగా మిగిలావు. నాకు ఏమీ మిగలలేదు. నేనిప్పుడు నీకు ఓ వాట్సాప్ జోక్‌ను మాత్రమే......’ ‘నీవెందుకు బ్యూటీ పార్లర్ బిజినెస్‌లోకి అడుగుపెట్టవు? కిరాణ కొట్టు ఎందుకు పెట్టుకోవు? నీకు ఏ టీచరో, నర్సు ఉద్యోగమో దొరకదా! నీవేమైనా కలెక్టర్ అవతాననుకుంటున్నావా? రోజంతా ఎండలో ఇలా తిరిగడం నీలాంటి మహిళకు మంచిదనుకుంటున్నావా? కట్టూబొట్టూ సరిగ్గా ఉండేలా చూస్కో! అవసరమైన చీరకట్టు సింధూరం పెట్టుకో.... నాలో నేను మదనపడ్డ రోజులవి. పొరపాటున మీకేమైనా బ్లూ ఫిల్మ్ పంపించానా? సారీ మేడమ్, గల్తీసే చలాగయా హోగా తోటి జర్నలిస్టుల మాటలు......’ (#మీటూ: బయోపిక్ నుంచి తప్పుకొన్న ఆమిర్) ‘దేశ రాజధాని ఢిల్లీలోని ఓ వార్తా పత్రిక నుంచి నాకు అప్పాయింట్మెంట్ లెటర్ వచ్చింది. దాన్ని తీసుకొని ఆ పత్రిక హెచ్ఆర్ విభాగానికి వెళ్లాను. అక్కడ నాకు కలిసిన వ్యక్తి హోటల్ గదిలో రూమ్ తీసుకోమన్నారు. ఆ రాత్రికి తానొచ్చి కలుస్తానని చెప్పారు. నేను అందుకు తిరస్కరించాను. ఓ పత్రికాఫీసులో పనిచేయాలంటే అన్నీ చేయాల్సి ఉంటుంది మేడమ్! కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. ఏం చేయమంటే అది చేయాలి అని చెప్పారు. నేను వెంటనే ఆ అప్పాయింట్ లెటర్‌ను నిలువునా చింపి ఆయన మొఖం మీదనే విసిరేసి వచ్చాను. నాకప్పుడు ఆ పత్రికా యజమాని ఎవరో తెలియదు. నాపై లైంగిక దాడికి సిద్ధపడిన వ్యక్తి సహచరులూ తెలియదు. తెలిసినా ఆయనపై నేను ఫిర్యాదు చేసుంటే నా పక్కన నిలబడే వారు తక్కువేనన్న సంగతి నాకు తెలుసు. ఆయనపై పోరాడి ఉద్యోగంలో చేరి ఉన్నట్లయితే గొడవలు రోజూ ఉండేవని నాకు తెలుసు......’ (మీటూ : మౌనం వీడిన అమితాబ్) ‘ఆమె నాకు పరిచయం. ఓ ప్రధాన జాతీయ దిన పత్రికలో ఆమెకు ఉద్యోగం వచ్చింది. ఆమె ఇంచార్జి ఆగ్రాలో ఉండేవారు. ఇప్పుడు ఆగ్రాతో ఆమెకేమి సంబంధం ఉందో, వారిద్దరి సంబంధం ఏమిటో కూడా నాకు తెలియదు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారని చెప్పి ఆ ఇంచార్జిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఆమె, ఆయన అలా పడుకున్నారని, ఇలా పడుకున్నారని ఎన్నో పుకార్లు వచ్చాయి. ఆమెను మాత్రం తీసేయలేదు. అయినా ఆమె బాగా ఒత్తిడికి గురయ్యారు. కొత్తగా వచ్చిన ఇంచార్జి ఆమెను బాగా వేధించారని విన్నాను. చివరకు ఆమె మానసికంగా బాగా కృంగిపోయింది. ఆమెది ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ నగరం......’ఈ కథనాలన్నీ వత్తిపరంగా అజ్ఞాత మహిళా జర్నలిస్టులు ఎదుర్కొన్న అనుభవాలు. ‘జిలే కి హల్చల్’ పేరిట 2014లో విమెన్ మీడియా అండ్ న్యూస్ ట్రస్ట్’ ఈ అనుభవాలను ప్రచురించింది. ‘మీటూ’ ఉద్యమం నేపథ్యంలో ఇలాంటి కథనాలన్నీ కావాలిప్పుడు అని మహిళా జర్నలిస్టులు కోరుతున్నారు. ‘మీటూ’ ఉద్యమం మగవారికి ఒక కుదుపు మాత్రమేనని, లైంగిక వేదనలు, బాధల నుంచి మహిళలకు శాశ్వత విముక్తి కల్పించే ఓ బలమైన వ్యవస్థ రావాలని, కావాలని వారు కోరుతున్నారు. (చదవండి : కడలి గర్భంలో కల్లోలాలున్నాయి) -
రాజీనామా బాటలో ఎంజే అక్బర్?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ/ముంబై: ‘మీ టూ’ ప్రచారంలో భాగంగా మహిళా జర్నలిస్టులు పలువురు తీవ్ర లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ రాజీనామాకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. పదవి నుంచి తప్పుకోవడం మినహా మరో మార్గం ఆయనకు లేదని పార్టీ, ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం నైజీరియా పర్యటనలో ఉన్న అక్బర్..పర్యటనను అర్థంతరంగా ముగించుకుని స్వదేశానికి చేరుకుంటారని భావిస్తున్నారు. కాగా, అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళా జర్నలిస్టుల సంఖ్య పదికి చేరుకుంది. వీరంతా 1980ల నుంచి ఎంజే అక్బర్ వద్ద వివిధ పత్రికల్లో వివిధ సమయాల్లో పనిచేసిన వారే. మంత్రి అక్బర్‌పై వచ్చిన ఆరోపణలపై బీజేపీ నాయకత్వం మౌనం వహించగా అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ సైతం సీరియస్‌గా ఉంది. ఆయన పదవికి రాజీనామా చేయాలంటోంది. అసలే ఎన్నికల సమయం..పైగా రాఫెల్ డీల్‌పై పీకల్లోతు వివాదాల్లో కూరుకుపోయిన కేంద్ర ప్రభుత్వం మంత్రి అక్బర్ రూపంలో ప్రతిపక్షాలకు మరో అవకాశం ఇవ్వదలుచుకోలేదు. విదేశీ పర్యటన నుంచి స్వదేశం వచ్చిన వెంటనే మంత్రి రాజీనామా సమర్పించడం మంచిదని పార్టీ వర్గాలు అంటున్నాయి. అలా కాకుండా, ఆయన ప్రత్యారోపణలకు పూనుకుంటే పరిస్థితి మరింత గందరగోళంగా మారుతుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ ప్రధానిని కలిసి నిర్ణయాన్ని ఆయనకే వదిలేస్తానని చెప్పినా కూడా ఆరోపణలను అంగీకరించినట్లే అవుతుందని అంటున్నాయి. ఈ ఆరోపణలపై మంత్రి అక్బర్ ఎలాంటి వివరణ ఇచ్చినా అది సంతృప్తికరం కాబోదు. ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఒకరూ ఇద్దరూ కాదు.. ఏకంగా పది మంది మహిళలు ఆరోపిస్తున్నందున వివరణ పరీక్షకు నిలబడలేదని బీజేపీ నేత ఒకరన్నారు. ఎలాంటి వివరణలు ఇచ్చే ప్రయత్నం చేయకుండా మౌనంగా వైదొలగడమే అక్బర్ ముందున్న ఏకైక అవకాశమని అన్నారు. అదే జరిగితే, పాత్రికేయ వృత్తిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మంత్రి ఎంజే అక్బర్‌కు అవమానకరమైన నిష్క్రమణ అవుతుంది. కాగా,అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై వ్యాఖ్యానించేందుకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నిరాకరించారు. -
‘అక్బర్’పై స్పందించని కేంద్రం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కుంటోంది. ఎంజే అక్బర్ గతంలో పలు పత్రికలకు సంపాదకుడిగా పనిచేస్తున్న కాలంలో తమను లైంగికంగా వేధించాడని పలువురు మహిళా విలేకరులు ఇటీవల ఆరోపించడం తెలిసిందే. అక్బర్‌పై ఈ ఆరోపణలు చేసిన జర్నలిస్టుల సంఖ్య తాజాగా ఎనిమిదికి పెరిగింది. అయినా అటు ఎంజే అక్బర్ కానీ, ఇటు కేంద్ర మంత్రులు లేదా అధికార బీజేపీ ప్రతినిధులు కానీ ఇప్పటివరకు ఈ ఆరోపణలపై తమ స్పందనను కూడా తెలియజేయకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం మంత్రివర్గ సమావేశం అనంతరం ఆ వివరాలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు వివరిస్తుండగా విలేకరులు అక్బర్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రశ్నించారు. సమాధానం చెప్పేందుకు రవి శంకర్ కూడా నిరాకరించారు. ఈ ఆరోపణలు అక్బర్ మంత్రి పదవిలో ఉన్న కాలానికి సంబంధించినవి కాదు కాబట్టి అధికారికంగా స్పందించకూడదని బీజేపీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయంపై మీడియాతో మాట్లాడకూడదని బీజేపీ తన అధికార ప్రతినిధులకు సూచించినట్లు తెలిసింది. రాజీనామా చేయాలి: కాంగ్రెస్ పలువురికి స్ఫూర్తినిచ్చే స్థానంలో ఉన్న సుష్మ, తన జూనియర్ మంత్రిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని కాంగ్రెస్ పేర్కొంది. ‘తనపై వచ్చిన ఆరోపణలపై అక్బర్ సంతృప్తికరమైన వివరణ అయినా ఇవ్వాలి లేదా మంత్రి పదవికి రాజీనామా చేయాలి’ అని పార్టీ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. -
రాజకీయాలకూ ‘మీటూ’ సెగ
న్యూఢిల్లీ: సినీ రంగాన్ని కుదిపేస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు రాజకీయాల్ని చుట్టుముట్టాయి. కేంద్ర మంత్రి, మాజీ పత్రికా సంపాదకుడు ఎంజే అక్బర్ రాజకీయాల్లోకి రాకముందు జర్నలిస్టుగా పనిచేస్తున్న సమయంలో తమని వేధించారని ముగ్గురు మహిళా జర్నలిస్టులు సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు గుప్పించారు. మరోవైపు, కేరళ ఎమ్మెల్యే(సీపీఎం), మాజీ నటుడు ముకేశ్ 1999లో ఓ షూటింగ్లో తనని వేధించారని బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్ ఆరోపించారు. ప్రముఖ రచయిత, నిర్మాత వింతా నందా..నటుడు అలోక్‌నాథ్ 19 ఏళ్ల క్రితం తనను రేప్ చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. వెంటనే స్పందించిన సినీ ఆర్టిస్ట్స్ అండ్ టీవీ అసోసియేషన్(సింటా)..అలోక్‌నాథ్‌కు షోకాజ్ నోటీసులు పంపుతామని తెలిపింది. మీడియా రంగంలో లైంగిక వేధింపుల ఆరోపణలు వరుసగా వెలుగుచూస్తున్న నేపథ్యంలో ఎడిటర్స్ గిల్డ్..బాధితురాళ్లకు అండగా నిలిచింది. అన్ని ఆరోపణల్లో నిష్పాక్షిక విచారణ చేపట్టాలని మీడియా సంస్థలకు సూచించింది. రంగంలోకి దిగిన జాతీయ మహిళా కమిషన్.. లైంగిక వేధింపుల ఆరోపణలపై సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమైంది. అక్బర్...ఓ ప్రిడేటర్ బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలతో మొదలైన ‘మీటూ’ తరహా ఉద్యమం తీవ్రమైంది. అక్బర్ తమని లైంగికంగా వేధించారని ఆయన మాజీ సహచర ఉద్యోగులు ప్రియా రమణి, ప్రేరణాసింగ్ బింద్రా, పేరు తెలియని మరో మహిళా జర్నలిస్టు ఆరోపించారు. ఫస్ట్‌పోస్ట్ అనే వెబ్‌పోర్టల్‌లో రమణి, పేరు తెలియని రచయిత అక్బర్‌ను ఉద్దేశించి పెట్టిన పోస్టుల ఆధారంగా ది టెలిగ్రాఫ్ కథనం ప్రచురించింది. ది టెలిగ్రాఫ్‌కు అక్బర్ వ్యవస్థాపక సంపాదకుడు. 2017లో వోగ్ మేగజీన్‌కు రాసిన ఓ వ్యాసంలోని విషయాలను రమణి ట్వీట్ చేశారు. ఈ వ్యాసంలో అక్బర్‌ను ఆమె ప్రిడేటర్ అని సంబోధిస్తూ..ఆయన ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోలేదని పేర్కొన్నారు. ఎడిషన్ పూర్తయ్యాక హోటల్‌కు పిలిచారు రాత్రి ఎడిషన్ ముగిశాక పని గురించి చర్చించడానికి అక్బర్ హోటల్ గదికి పిలిచారని బింద్రా ట్వీట్ చేశారు. అందుకు నిరాకరించినందుకు నరకం చూపాడని ఆరోపించారు. ‘తప్పుడు ఆరోపణల ఫలితాలు ఏంటో నాకు తెలుసు. నేను వేధింపులు భరించి 17 ఏళ్లు గడిచాయి. వాటిని నిరూపించేందుకు ప్రస్తుతం ఆధారాలు లేవు. గొప్పవాళ్లలో లోపాలుంటాయి. ఫీచర్ బృందం మొత్తం సమావేశమైనప్పుడు అక్బర్ బూతు వ్యాఖ్యలు చేశారు. హోటల్ గదిలో కలవాలని ఆ బృందంలోని వారిని కూడా కోరినట్లు సహచరిణి ఒకరు నాతో అన్నారు. మహారాష్ట్ర సచివాలయంపై వార్తను రాయడానికి వెళ్లినప్పుడు ఓ అధికారి నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఎవరికి ఫిర్యాదుచేయాలో నాకప్పుడు అర్థం కాలేదు. నా ఎడిటర్(అక్బర్) కూ డా అలాంటి వాడే కదా!’ అని ఆమె వాపోయారు. అక్బర్‌పై వచ్చిన ఆరోపణలపై స్పందిచేందుకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నిరాకరించారు. ఈ వ్యవహారంలో విచారణ చేపడతారా అని విలేకర్లు ప్రశ్నించగా, సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. అక్బర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మౌనం సమాధానం కాదని, ప్రధాని మోదీ, సుష్మా స్వరాజ్ నోరు విప్పాలని కోరింది. ది టెలిగ్రాఫ్, సన్డే, ది సండే గార్డియన్, ఏషియన్ ఏజ్, దక్కన్ క్రానికల్ పత్రికలకు అక్బర్ ఎడిటర్‌గా పనిచేశారు. నా గదినే మార్చేశాడు 1999లో ఓ కార్యక్రమ షూటింగ్ సమయంలో అప్పటి నటుడు, ప్రస్తుత ఎమ్మెల్యే ముకేశ్ తనను వేధించారని బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్ టెస్ జోసెఫ్ ఆరోపించారు. అసలు ఆ కార్యక్రమ షూటింగ్ గురించే తనకు గుర్తులేదని ముకేశ్ కొట్టిపారేశారు. క్విజ్ ప్రోగ్రాం ‘కోటీశ్వర్’ చిత్రీకరణ సమయంలో ముకేశ్..తనను అతని గదికి పిలిపించుకున్నాడని, తరువాత తన గదిని ఆయన గది పక్కకు మార్చారని ట్వీట్ చేశారు. నాటకం వేస్తుండగా అనుచిత ప్రవర్తన 2001లో ఓ నాటకం వేసేటపుడు ప్రముఖ పాటల రచయిత వరుణ్ గ్రోవర్ తనతో తప్పుగా ప్రవర్తించినట్లు బెనారస్ హిందూ వర్సిటీకి చెందిన పూర్వ విద్యార్థిని ఒకరు ఆరోపించారు. ఆమె మాటలను గ్రోవర్ తోసిపుచ్చారు. కు‘సంస్కారి’ అలోక్‌నాథ్ సంస్కారవంతమైన పాత్రల్లో నటించే అలోక్‌నాథ్ రెండు దశాబ్దాల క్రితం తనను పలుమార్లు రేప్ చేశాడని ప్రముఖ రచయిత్రి, ‘తారా’ ఫేమ్ వింతా నందా ఆరోపించారు. ఓసారి నందా ఇంటికి పార్టీకి వెళ్లగా మద్యం తాగించి బలాత్కారానికి ఒడిగట్టాడని పేర్కొన్నారు. ‘సాయంత్రం నేను తాగిన పానీయంలో ఏదో మత్తు మందు కలిపారు. రాత్రి 2 తరువాత ఇంటికి బయల్దేరుతుండగా మధ్యలో అలోక్‌నాథ్ వచ్చి తన కారులో ఎక్కించుకున్నారు. ఆ తరువాత మరింత మద్యం తాగించి రేప్ చేశాడు. తెల్లారి లేచేసరికి చాలా నొప్పిగా అనిపిం చింది. ఈ సంగతిని నా స్నేహితులకు చెబితే మౌనంగా ఉండమన్నారు. అలోక్‌నాథ్ తన పలుకుబడితో నన్ను భయపెట్టి, తరువాతా పలుమార్లు వేధించారు’ అని వింతా నందా తాను అనుభవించిన క్షోభను వివరించారు. -
కోర్టుకు శేఖర్
సాక్షి, చెన్నై : మహిళా జర్నలిస్టుల్ని కించపరిచిన కేసులో గట్టి భద్రత నడుమ సినీ నటుడు, బీజేపీ నాయకుడు ఎస్వీ శేఖర్ బుధవారం ఎగ్మూర్ కోర్టుకు హాజరు అయ్యారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయన్ను పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. మహిళా జర్నలిస్టులను కించపరిచే విధంగా వ్యవహరించిన ఎస్వీశేఖర్ మీద నాలుగు రకాల సెక్షన్లతో కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. కేసులు పెట్టి రెండు నెలలు అయినా, ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు. కోర్టు నిరాకరించడంతో డైలమాలో పడ్డారు. శేఖర్ అరెస్టుకు సర్వత్రా డిమాండ్ చేస్తూ వచ్చినా, ఆందోళనలు సాగినా పోలీసులు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ బంధువు కావడంతోనే అరెస్టు చేయడం లేదన్న ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో వ్యవహారం కోర్టుకు సైతం చేరింది. ఎస్వీ శేఖర్ అజ్ఞాతంలో ఉన్నట్టుగా పోలీసులు పేర్కొంటూ వస్తున్నా, రెండురోజుల క్రితం కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్‌తో ఆయన భేటీ కావడం, మంత్రులు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ, అధికార అండదండలతో దర్జాగా తిరుగుతున్నా, పోలీసులు పట్టించుకోకపోవడంపై కోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. 20వ తేదీలోపు హాజరు కావాల్సిందేనని ఎగ్మూర్ కోర్టు ఆదేశాలు జారీచేసింది. కోర్టు కన్నెర్ర చేయడంతో మెట్లు ఎక్కేందుకు బుధవారం ఉదయాన్నే ఎస్వీ శేఖర్ సిద్ధం అయ్యారు. బెయిల్ మంజూరు పది గంటల సమయంలో మైలాపూర్‌లోని ఇంటి నుంచి పోలీసు భద్రత నడుమ శేఖర్ ఎగ్మూర్ కోర్టుకు వచ్చారు. ఆయనకు వ్యతిరేకంగా ఏదేని ఆందోళనలు సాగవచ్చన్న సమాచారంతో పోలీసులు మరీ హడావుడి సృష్టించారు. కోర్టు పరిసరాల్లో గట్టి భద్రత కల్పించారు. పోలీసుల హడావుడి అక్కడి న్యాయవాదుల్లో సైతం ఆగ్రహాన్ని తెప్పించాయి. శేఖర్ అక్కడికి వచ్చిన సమయంలో ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ పలువురు న్యాయవాదులు నినాదాల్ని హోరెత్తించడం గమనార్హం. దీంతో శేఖర్ ముందు గేటు నుంచి కాకుండా వెనుక ఉన్న మరో గేటు ద్వారా భద్రత వలయం నడుమ కోర్టులోకి వెళ్లారు. పదిన్నర గంటలకు న్యాయమూర్తి సమక్షంలో హాజరయ్యారు. విచారణ తదుపరి ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో అదే భద్రత నడుమ ఇంటి బాట పట్టారు. -
ఫేస్బుక్ షేర్: వివాదంలో ప్రముఖ నటుడు
సాక్షి, చెన్నై: మహిళా జర్నలిస్టు పట్ల తమిళనాడు గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ అనుచిత చర్య వివాదం ఇంకా ముగియకుండానే రాష్ట్రానికి చెందిన నటుడు, బీజేపీ నేత ఎస్వీ శేఖర్ (సత్తనాతపురం వరదరాజ శేఖర్) చిక్కుల్లో పడ్డారు. మహిళా పాత్రికేయులపై అసభ్య పదజాలంతో, అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిపోయిన ఓ బీజేపీ అభిమాని ఫేస్బుక్ పోస్ట్‌ను షేర్ చేసి మరో వివాదానికి తెర తీశారు. ‘మదురై యూనివర్సిటీ, గవర్నర్ అండ్ ది వర్జిన్ చీక్స్ ఆఫ్ ఎ గర్ల్’ అనే పేరుతో తిరుమలై.ఎస్ అనే ఫేస్బుక్ యూజర్ ఈ పోస్ట్ పెట్టాడు. మహిళా జర్నలిస్టులపై చాలా అవమానకరమైన పదజాలంతో విరుచుకుపడిన ఫేస్బుక్ పోస్ట్‌ను బీజేపీ నేత షేర్ చేశారు. విశ్వవిద్యాలయాల కన్నా ఎక్కువ లైంగిక వేధింపులు మీడియా సంస్థల్లో ఉన్నాయని ఆ పోస్ట్‌లో ఆరోపించాడు. అంతేకాదు మీడియా పెద్దలతో పడుకోకుండా..ఏ మహిళ రిపోర్టర్ లేదా న్యూస్ రీడర్ కాలేదంటూ రెచ్చిపోయాడు. దీంతోపాటు తమిళనాడు మొత్తం మీడియాపై కూడా తన అక్కసును వెళ్లగక్కాడు. మీడియా మొత్తం నేరస్థులు, రాస్కల్స్, బ్లాక్‌మెయిలర్ల చేతిలో చిక్కి తిరోగమన మార్గంలో ఉందని వ్యాఖ్యానించాడు. అయితే ఈ వివాదంపై స్పందించిన శేఖర్ తానా పోస్ట్‌ను పూర్తిగా చదవకుండానే పోస్ట్ చేశాననీ, ఎవర్నీ కించపరిచే ఉద్దేశం తనకు లేదంటూ శేఖర్ వివరణ ఇచ్చుకున్నారు. అమెరికాకు వెళ్ళినప్పుడు మోదీ అభిమానిగా తిరుమలై తనకు పరిచయమయ్యాడని చెప్పారు. ఇపుడు ఆ పోస్ట్‌ను తొలగించాలనుకున్నా.. ఫేస్బుక్ బ్లాక్ చేయడంతో అది సాధ్యం కావడంలేదని చెప్పొకొచ్చారు. (ప్రస్తుతం ఈ పోస్ట్ డిలీట్ అయింది) కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాగా బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా పాత్రికేయులపై ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు, తాజాగా శేఖర్ చర్యకు నిరసనగా మహిళా జర్నలిస్టులు, ఇతర మీడియా ప్రముఖులు చెన్నైలోని బీజీపీ కార్యాలయం ముందు నిరసనకు దిగనున్నారు. -
నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు - రాజ్యవర్ధన్
న్యూఢిల్లీ: సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహాయమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ తనపై వచ్చిన ఆరోపణలకు ట్విట్టర్ లో్ వివరణ ఇచ్చుకున్నారు. మహిళా జర్నలిస్టులు రిపోర్టర్లుగా బయటికి వెళ్ళకుండా , కార్యాలయంలోనే వివిధ రంగాల్లో ఇంకా బాగా పనిచేయొచ్చన్నమంత్రి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది. దీంతో తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ రాజ్యవర్ధన్ ట్వీట్ చేశారు. జర్నలిస్టుల భద్రత, రక్షణ,వారు పనిచేసే పరిస్థితులు,పనిగంటలు, ఒక తల్లిగా, ఒక సోదరిగా, భార్యగా ఆమె బాధ్యతలను దృష్టిలో పెట్టుకొనే అలా మాట్లాడానే తప్ప అసలు వారు బయటికి వెళ్ళకూడదు అనేది తన ఉద్దేశం కాదన్నారు. మహిళలంటే తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. అంతేకాదు తన భార్య ఒక మాజీ సైనికురాలని, పార్లమెంట్ పై దాడి సందర్భంగా జరిగిన పోరాటంలో ఆమె కూడా పాల్గొన్నారని పేర్కొన్నారు. Controversy over Minister Rajyavardhan Rathore's Remarks on Women Journalists