Oscar Nominations 2022: Writing With Fire Indian Documentary Shortlisted As Official Entry - Sakshi
Sakshi News home page

Oscar Nominations 2022: ఆస్కార్‌ బరిలో దళిత మహిళా జర్నలిస్టులు.. ఈ డాక్యుమెంటరీ దేని గురించి అంటే!

Published Thu, Dec 23 2021 12:15 AM | Last Updated on Thu, Dec 23 2021 4:32 PM

Oscar Nomination 2022: India Writing With Fire Shortlisted As Documentary Feature - Sakshi

సెల్‌ఫోన్‌నే కెమెరాగా ఉపయోగిస్తూ... డాక్యుమెంటరీని చిత్రీకరిస్తూ...

‘రైటింగ్‌ విత్‌ ఫైర్‌’.... ఆస్కార్‌ 2022 బరిలోమన దేశం నుంచి షార్ట్‌ లిస్ట్‌ అయిన బెస్ట్‌ డాక్యుమెంటరీ మూవీ. అందరూ దళిత మహిళా జర్నలిస్టులు నడుపుతున్న ‘ఖబర్‌ లెహరియా’ న్యూస్‌పేపర్‌ (వీక్లీ) గురించి, దాని డిజిటల్‌ వార్తల గురించి తయారు చేసిన డాక్యుమెంటరీ ఇది. 25 మంది దళిత మహిళా జర్నలిస్టులు ఉత్తర ప్రదేశ్, బుందేల్‌ఖండ్, మధ్యప్రదేశ్‌లలో గ్రామీణ వార్తలను స్త్రీ దృక్కోణంలో అందించడమే ఇక్కడున్న విశేషం. ఆస్కార్‌ సాధించే సత్తా ఈ డాక్యుమెంటరీకి ఉంది అని భావిస్తున్నారు.

‘మా ప్రాంతంలో దళిత మహిళలు జర్నలిజం గురించి ఆలోచించడం చాలా పెద్ద విషయం. అసలు ఆ పని తాము కూడా చేయొచ్చని వాళ్లు అనుకోరు. కాని ఈ ఇరవై ఏళ్లలో వారిలోని ఆ న్యూనతను చాలా వరకు తీసేశాం’ అంటారు ‘ఖబర్‌ లహరియా’ మహిళా జర్నలిస్టులు.

2002లో ‘ఖబర్‌ లహరియా’ వారపత్రిక చిత్రకూట్‌ (బుందేల్‌ ఖండ్‌)లో మొదలైంది. అప్పుడు 6 మంది దళిత మహిళా జర్నలిస్టులు పని చేయడం మొదలెట్టారు. ఇవాళ 25 మంది పని చేస్తున్నారు.

ఆ ఆరు మంది ఈ 25 మందిగా ఎలా మారారో... హిందీ, భోజ్‌పురి, బుందేలి, అవధి భాషల్లో వారపత్రికను ఎలా నడిపారో, ఆ తర్వాత సెల్‌ఫోన్లను కెమెరాలుగా వాడుతూ డిజిటల్‌ మీడియాలోకి తమ వార్తలను ఎలా అందించసాగారో ఇదంతా అద్భుతంగా చెప్పిన డాక్యుమెంటరీ ‘రైటింగ్‌ విత్‌ ఫైర్‌’.

దర్శకురాలు రింతు థామస్‌ మరో దర్శకుడు సుస్మిత్‌ ఘోష్‌తో కలిసి ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించింది. వచ్చే మార్చి 27న లాస్‌ ఏంజలిస్‌లో జరిగే ఆస్కార్‌ వేడుకలో పోటీకి నిలవడానికి ఈ డాక్యుమెంటరీ అడుగు దూరంలో ఉంది.

2022 సంవత్సరానికి ఆస్కార్‌ కమిటీ అధికారికంగా ప్రకటించిన డాక్యుమెంటరీల షార్ట్‌లిస్ట్‌లోని 15 చిత్రాలలో ‘రైటింగ్‌ విత్‌ ఫైర్‌’ ఒకటిగా ఎంపికైంది. ఈ షార్ట్‌లిస్ట్‌ కోసం ప్రపంచ దేశాల నుంచి 138 డాక్యుమెంటరీలు పోటీ పడ్డాయి. వాటి నుంచి 15 షార్ట్‌లిస్ట్‌లోకి వచ్చాయి. ఈ 15 నుంచి మూడో నాలుగో అంతిమ నామినేషన్స్‌గా నిలవడానికి జనవరి 27 నుంచి ఓటింగ్‌ జరగనుంది.

ఫిబ్రవరి 8న అంతిమ నామినేషన్స్‌ ప్రకటిస్తారు. ఆ నామినేషన్స్‌లో ‘రైటింగ్‌ విత్‌ ఫైర్‌’ ఉంటే ఆస్కార్‌ వేడుకలో అదృష్టం పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ‘లగాన్‌’, ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ చిత్రాల తర్వాత ఆస్కార్‌ వేడుకలో భారతీయుల పేర్లు వినిపించలేదు. ఈసారి ఫైనల్‌ నామినేషన్స్‌కు వెళుతుందని భావించిన తమిళ చిత్రం, భారతదేశ అఫీషియల్‌ ఎంట్రీ ‘కూడంగళ్‌’ షార్ట్‌లిస్ట్‌లో నిలువలేదు. కాని ‘రైటింగ్‌ విత్‌ ఫైర్‌’ డాక్యుమెంటరీ విభాగంలో నిలిచి ఆశలు రేపుతోంది.

ఈ డాక్యుమెంటరీ దేని గురించి?
ఢిల్లీలో ఉన్న ‘నిరంతర్‌‘ అనే ఎన్‌జిఓ ఉత్తర ప్రదేశ్‌లోని చిత్రకూట్‌ నుంచి ప్రయోగాత్మకంగా మొదలెట్టిన వారపత్రిక ‘ఖబర్‌ లహరియా’. పెద్దగా చదువు రాకపోయినా, జర్నలిజం తెలియకపోయినా దళిత మహిళలు తమ ప్రాంత వార్తలను ఎలా చూస్తారో, వాళ్లు చూసిన పద్ధతిలో అచ్చు వేసి పాఠకుల వద్దకు తీసుకువెళ్లడం ఈ పత్రిక ఉద్దేశం. అంతే కాదు... జర్నలిజంకు దూరంగా ఉన్న దళిత మహిళలు కూడా సమర్థంగా వార్తా పత్రికలను నడపగలరని చూపడమూ ఉద్దేశమే.

‘మాలో చాలామంది ఎలిమెంటరీ స్థాయి చదువు కూడా చదువుకోలేదు. ఇంగ్లిష్‌ అసలు రాదు. అయినా సరే పత్రికలో పని చేయడానికి రంగంలో దిగాం’ అంటుంది మీరా. ఈమె చీఫ్‌ రిపోర్టర్‌. ఈమె దృష్టికోణం నుంచే ‘రైటింగ్‌ విత్‌ ఫైర్‌’ డాక్యుమెంటరీ ఉంటుంది. బుందేలి, అవధి వంటి స్థానిక భాషలలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్‌... ఈ మూడు రాష్ట్రాలలో ఈ పత్రికను అందేలా ఈ దళిత మహిళలు కార్యాచరణ చేశారు. ఈ పత్రిక అచ్చు పని, డిస్ట్రిబ్యూషన్, సర్క్యులేషన్‌ అంతా మహిళల బాధ్యతే.

సవాళ్లు ఎన్నో...
దళిత మహిళలు రిపోర్టర్లుగా మారడం ఒక విశేషం అయితే అంటరానితనం ఉన్న ప్రాంతాలలో కూడా వీరు దూసుకుపోవాల్సి రావడం మరో విశేషం. ‘చాలాచోట్ల మొదటగా కులం అడుగుతారు. నేను ఆ ప్రశ్న వేసిన వారి కులం అడుగుతాను. వారు ఏ కులం చెప్తే నేను కూడా ఆ కులమే అంటాను. పని జరగాలి కదా’ అని నవ్వుతుంది ఒక రిపోర్టర్‌. ‘ఖబర్‌ లహరియా’ ఎంత జనంలోకి వెళ్లిందంటే చీఫ్‌ రిపోర్టర్‌ మీరా భర్త ఒకరోజు ఇంటికి వచ్చి ఆమె మీద ఇంతెత్తున ఎగిరాడు. ‘నువ్వు బతకనిచ్చేలా లేవు’ అన్నాడు.

దానికి కారణం ఆమె ఊళ్లోని గూండాల గురించి పత్రికలో రాయడమే. ‘ఇంకో సందర్భంలో అయితే స్త్రీలు పని మానేస్తారు. కాని నా వెనుక పత్రిక ఉందన్న ధైర్యం ఉంది. అందుకే నా భర్తతో నేనేం తప్పు చేయలేదు అని గట్టిగా వాదించాను’ అంటుంది మీరా. ఈ పత్రికకు పని చేస్తున్న దళిత మహిళా రిపోర్టర్లు ముఖ్యంగా పోలీసుల జులుం పైనా, దళితులపైన జరిగే దాష్టికాల పైనా, స్త్రీలపై పురుషుల పీడన పైన వార్తలు రాస్తుంటారు. ‘భయం వేయదా’ అని అడిగితే ‘భయంగానే ఉంటుంది. కాని అంతలోనే ధైర్యం చేస్తాం’ అంటారు వాళ్లు.

సెల్‌ఫోన్లే కెమెరాలుగా
పదిహేనేళ్ల పాటు ప్రింట్‌ ఎడిషన్‌ని నడిపిన ఈ మహిళలు మారిన కాలానికి తగినట్టుగా తాము మారాలని నిశ్చయించుకున్నారు. వార్తలను విజువల్‌ మీడియాగా జనానికి చూపాలనుకున్నారు. ‘మా అందరికీ ఫోన్లు ఎలా వాడాలో తెలియదు. కాని మారిన పరిస్థితులకు తగినట్టుగా మనం మారకపోతే ఆగిపోతాం’ అంటారు వాళ్లు. అందుకే సెల్‌ఫోన్‌ను కెమెరాగా ఎలా వాడాలో తెలుసుకున్నారు. వార్తలను ఫోన్‌లో బంధించి యూ ట్యూబ్‌లో బులెటిన్‌గా విడుదల చేయసాగారు. వారి యూ ట్యూబ్‌ చానల్‌కు ఐదున్నర లక్షల మంది సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు.
‘రైటింగ్‌ విత్‌ ఫైర్‌’కు ఆస్కార్‌ వస్తే ఈ దళిత మహిళలు ప్రపంచం అంతా చుట్టడం గ్యారంటీ.

డాక్యుమెంటరీలోని ఓ దృశ్యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement