Sherni, Sardar Udham Among 14 Films Shortlisted in Oscar From India - Sakshi
Sakshi News home page

Oscars 2022 : ఆస్కార్‌ ఎంట్రీలో  ఆ నాలుగు సినిమాలు..

Published Sat, Oct 23 2021 8:15 AM | Last Updated on Sat, Oct 23 2021 1:17 PM

Sherni, Sardar Udham Among 14 Films Shortlisted For Indias Entry To Oscar - Sakshi

ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది. ఈ అవార్డుల కోసం ప్రపంచ దేశాల నుంచి పలు విభాగాల్లో సినిమాలు పోటీపడే విషయం తెలిసిందే. ఈ ఏడాది ‘2022 బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ కేటగిరీ’లో భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీ కోసం పలు సినిమాలు పోటీ పడుతున్నాయి. 15 మంది సభ్యులతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యూరీ మన దేశం నుంచి ఆస్కార్‌ నామినేషన్‌కు వెళ్లదగ్గ  సినిమాలను వీక్షించి, ఒక్క సినిమాను ఎంపిక చేస్తుంది.

వచ్చిన ఎంట్రీల్లో 14 చిత్రాలు ఆస్కార్‌కి పంపించే స్థాయి ఉన్నవిగా జ్యూరీ భావించింది.వాటిలో హిందీ నుంచి ‘సర్దార్‌ ఉదమ్‌’, ‘షేర్నీ’, తమిళ చిత్రం ‘మండేలా’, మలయాళ సినిమా ‘నాయట్టు’ కూడా ఉన్నాయి. మరి.. ఈ నాలుగింట్లో ఒక్కటా? లేక లిస్ట్‌లో ఉన్న వేరే భాషల చిత్రాల్లో ఒక్కటా? ఆస్కార్‌ వరకూ వెళ్లే ఆ ఒక్క చిత్రం ఏంటనేది చూడాలి.

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్‌ ఉదమ్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘సర్దార్‌ ఉదమ్‌’. జలియన్‌వాలా బాగ్‌ మారణకాండకు కారణమైన జనరల్‌ డయ్యర్‌ను హతమార్చడానికి లండన్‌లో సర్దార్‌ ఉదమ్‌ పడిన కష్టాలను ఈ చిత్రంలో చూపించారు చిత్రదర్శకుడు సూజిత్‌ సర్కార్‌. ఉదమ్‌ పాత్రను విక్కీ కౌశల్‌ చేశారు. షేర్నీ విషయానికొస్తే.. జనావాసంలోకి వచ్చిన ఓ ఆడపులి నుంచి కాపాడాలని అటవీ గ్రామీణుల అభ్యర్థన. పులిని చంపైనా ఓట్లు కూడగట్టుకోవాలన్నది రాజకీయ నేతల ఆకాంక్ష. ఆ ఆడపులిని కాపాడాలనుకుంటుంది ఫారెస్ట్‌ ఆఫీసర్‌. ప్రకృతి, పర్యావరణం, వన్యప్రాణి సంరక్షణ లాంటి అంశాలతో ఈ సినిమా సాగుతుంది. విద్యాబాలన్‌ కథానాయికగా అమిత్‌ వి. మసూర్కర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 

యోగిబాబు టైటిల్‌ రోల్‌లో నటించిన పొలిటికల్‌ సెటైరికల్‌ మూవీ ‘మండేలా’. ఓ క్షురకుడి ఓటు తమ గెలుపుకి కారణం అవుతుందని తెలిసి, అతన్ని మాయ చేయడానికి పంచాయతీ ప్రెసిడెంట్‌ పదవి కోసం పోటీపడుతున్న ఇద్దరు అన్నదమ్ముల ప్రయత్నమే ‘మండేలా’. మడోన్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. మార్టిన్‌ ప్రక్కట్‌ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘నాయట్టు’. ఇందులో కుంచాకో బోబన్, జోజు జార్జ్, నిమిషా సజయన్‌ ప్రధాన తారలుగా నటించారు. రాజకీయ నాయకుల చేతిలో వ్యవస్థలు ఎలా కీలుబొమ్మలుగా మారాయనే నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement